నరసింహదేవర వేంకటశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసింహదేవర వేంకటశాస్త్రి
జననం1828
మరణం1915
వృత్తికవి, సభాపతి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
విచిత్ర రామాయణము
తల్లిదండ్రులు
  • ఉమామహేశ్వరశాస్త్రి (తండ్రి)
  • సీతమాంబ (తల్లి)

నరసింహదేవర వేంకటశాస్త్రి (1828-1915) ప్రముఖ తెలుగు కవి.

జీవిత విశేషాలు[మార్చు]

వీరి తల్లి సీతమాంబ. తండ్రి ఉమామహేశ్వరశాస్త్రి. వీరి జన్మస్థానము: తాడేపల్లిగూడెము, నివాసము: తణుకు తాలూకాలోని వెలగదుర్రు వీరు సా.శ. 1828- సర్వజిత్తు నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వితీయ రోజు విశాఖ నక్షత్ర చరుర్థ చరణమున జన్మించారు. ఇతడు క్రీ. శ 1915 - రాక్షస నామ సంవత్సర శ్రావణ బహుళ పంచమి రోజున పరమపదించారు.

ఇరువదియేండ్లు వచ్చువరకును వేంకటశాస్త్రిగారు కవిగాని, పండితుడు కాని కాడు. అష్టపదులు, తరంగములు, కృతులు, మృత్యుంజయ విలాసము, అధ్యాత్మరామాయణ కీర్తనలు చెప్పుకొని పాడుకొనే ఒకానొక భక్తుడు. దానికి తోడు వీరు మృదంగము కూడా చక్కగ వాయించేవారు. వెలగదుర్రు గ్రామమునకు సభాపతియై పెత్తనము నిర్వహించుచుండెను. అటువంటి సమయంలో నెవరో ఒక శాస్త్రులుగారు ఆ ఊరు వచ్చి మన వేంకటశాస్త్రిగారితో సంస్కృతమున మాటాడ నారంభించిరట. వీరి సంస్కృతభాష బొత్తిగా రాదు. దానితో నభిమానము పుట్టి నాడు మొదలు వేంకటశాస్త్రిగారు సంస్కృతాంధ్ర భాషలు పట్టుదలతో సాధించిరి. 28 వ యేట రచించిన వేంకటేశ్వర శతకము వీరి తొలికబ్బము. తరువాత ' గౌరీశతకము ' రచించిరి. ముప్పదవయేట " విచిత్రరామాయణము " రచించుట కారంభించి మూడేండ్లలో నారుకాండములును బూర్తిచేసిరి. ఇది శ్రీరామాంకితము. ఈ కవివరుని కీర్తిని శాశ్వత మొనరించునది యీ యొక్క కావ్యమే.

రచనలు[మార్చు]

వీరు రచించిన గ్రంథములు:

విచిత్ర రామాయణము[మార్చు]

గోపీనాథకవి వచనమున నీ విచిత్రరామాయణము తొలుత రచించెను. అదిచూచి గద్యపద్యకావ్యముగా వేంకటశాస్త్రిగారిది వ్రాసిరి. ఇందు లాక్షణికు లంగీకరింపని ప్రయోగములు కొన్ని యున్నను కవిత్వము మాత్రము ధారావాహి. ఆనాడు పెద్దపండితులైన కొక్కొండ వేంకటరత్నం, బహుజనపల్లి సీతారామాచార్యులు నీగ్రంథము మీద మంచి యభిప్రాయములిచ్చిరి. "...దండికావ్యము కంటెను అభినవ దండికావ్యముకంటెను జాలమేలనియెన్న దగియున్నది " అని వేంకటరత్నశర్మగారును, "...ఆధునిక గ్రంథస్థములని తెలియక యిందలి గద్యపద్యములను విన్నవారు అవి పూర్వగ్రంథస్థములేయని నిస్సందేహముగ దలంతురు " అని సీతారామాచార్యులుగారును విచిత్ర రామాయణమును గొండాడిరి.

శాస్త్రిగారు తమ 78 వ యేట విచిత్రరామాయణమున నుత్తర కాండము సంపూర్తిపరిచి వారే ముద్రింపించుకొనిరి. తరువాత వారి కుమారులు 1937 లో నీగ్రంథము సమగ్రముగ వెలువరించిరి.

కొన్ని పద్యాలు[మార్చు]

ఇందలి కవిత్వపు మచ్చునకు రెండు పద్యములు:

గుంపులుగూడి సీత మనకు న్మనసివ్వదు గాని చన్మొనల్
సొంపపు శక్రనీల మణిసోయగము న్వహియించి యున్న వీ
చంపకగంధి మోముజిగి చందురుతేటకు సాటిరా దగున్
దంపతులేమి నోచిరొకొ తథ్యము గర్భిణియందురందరున్.

లలితేందీవర కైరవాకృతజ కల్హరాదిపుష్పౌఘ సం
చలదిందిందిర బృందగానలహరీ సంయుక్తమంద క్రమా
నిలసంచారకృతార్భకోర్మియుత పానీయౌఘముంగల్గి ని
ర్మలమై యొప్పు సరోవరంబుగని రా క్ష్మాపుత్రికాలక్ష్మణుల్.


మూలాలు[మార్చు]