నరసింహ శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసింహుడు

శ్రీ నరసింహ శతకము తెలుగు శతక సాహిత్యంలో ప్రముఖమైనది . ఈ శతకమును రచించినది కరీంనగర్ జిల్లా ధర్మపురికి చెందిన శేషప్ప కవి. ఈ పద్యాలన్నీ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

అనే మకుటంతో అంతమవుతాయి. దీనర్థం అలంకారాలతో విలసిల్లేవాడా, ధర్మపురి యందు వెలసిన వాడా, దుష్ట సంహారం కావించిన వాడా, పాపములను దూరం చేయువాడా నరసింహా! అని అర్థం.

సీ: శ్రీ మనోహర! సురార్చిత! సింధుగంభీర!

భక్త వత్సల! కోటి - భానుతేజ!

కంజనేత్ర! హిరణ్యకశిపు నాశక! శూర!

సాధురక్షణ! శంఖచక్రహస్త!

ప్రహ్లాదవరద! పాపధ్వంస! సర్వేశ!

క్షీరసాగరశాయి! కృష్ణవర్ణ!

పక్షివాహన! నీలబృమరకుంతలజాల!

పల్లవారుణ పాదపద్మ యుగళ!

తే|| చారు శ్రీ చందనాగరు చర్చితాంగ!

కుందకుట్మలదంత! వైకుంఠ ధామ!

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!

దుష్ట సంహార! నరసింహ! దురితదూర!


సీ|| పద్మలోచన సీసపద్యముల్ నీ మీఁదఁ

జెప్పఁబూనితినయ్య! చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁజూడగ లేదు;

పంచకావ్య శ్లోక పఠన లేదు,

అమరకాండత్రయం బరసి చూఁడగ లేదు,

శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు,

నీ కటాక్షంబున నే రచించెదఁగాని

ప్రజ్ఞ నాయదికాదు ప్రస్తుతింపఁ

తే|| దప్పు గలిగిన సద్భక్తి తక్కువౌనె?

చెఱకునకు వంకపోతేమి జెడునె తీపి! భూ.


సీ|| నరసింహ! నీ దివ్యనామ మంత్రము చేత

దురితజాలము లెల్లఁదోలవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత

బలువైన రోగముల్ బాపవచ్చు,

నరసింహ! నీ దివ్యనామమంత్రము చేత

రిపు సంఘముల సంహరింపవచ్చు,

నరసింహ! నీ దివ్య నామమంత్రము చేత

దండహస్తుని బంట్లఁ దఱుమవచ్చు.

తే|| భళిర! నే నీ మహామంత్ర బలము చేత

దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు! భూ.


సీ|| ఆదినారాయణా యనుచు నాలుకతోడఁ

బలుక నేర్చినవారి పాదములకు

సాష్టాంగముగ నమస్కార మర్పణఁజేసి

ప్రస్తుతించెదనయ్య బహువిధముల

ధరణిలో నరులెంత దండివారైనను

నిన్నుఁగాననివారి నే స్మరింప,

మేము శ్రేష్ఠుల మంచు ముడుకుచుండెడివారి

చెంతఁజేరఁగఁ బోను శేషశయన!

తే|| పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల

దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన, భూ.


సీ|| చిత్తశుద్ధిగ నీకు సేవఁజేసెదఁ గాని,

పుడమిలో జనుల మెప్పులకు గాదు,

జన్మ పావనతకై స్మరణ జేసెదఁగాని,

సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁగాదు,

ముక్తికోసము నేను మ్రొక్కివేడెద గాని,

దండిభాగ్యము నిమిత్తంబుగాదు,

నిన్నుఁబొగడను విద్య నేర్చితినేకాని,

కుక్షి నిండెడు కూటి కొఱకుఁగాదు,

తే|| పారమార్ధికమునకు నేఁబాటుపడితిఁ

గీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ!భూ


సీ|| ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు.

ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు,

కనకమిమ్మని చాలఁ గష్ట పెట్టఁగ లేదు!

పల్లకిమ్మని నోటఁ బలుక లేదు,

సొమ్ము లిమ్మని నిన్ను నమ్మి కొల్వఁగ లేదు,

భూమి లిమ్మని పేరు పొగడ లేదు,

బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగా లేదు,

పసుల నిమ్మని పట్టు బట్టలేదు,

తే|| నేను గోరిన దొక్కటే నీలవర్ణ!

చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు, భూ.


సీ|| మందుడనని నన్ను నిందఁజేసిన నేమి?

నా దీనతను జూచి నవ్వనేమి?

దూరభావములేక తూలనాడిననేమి?

ప్రీతి సేయక వంక బెట్టనేమి?

కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి?

తీవ్రకోపముచేతఁ దిట్టనేమి?

హెచ్చుమాటలచేత నెమ్మెలాడిన నేమి?

చేరి దాపట గేలి సేయనేమి?

తే|| కల్పవృక్షంబువలె నీవు కల్గ నింకఁ

బ్రజల లక్ష్యంబు నాకేల! పద్మనాభ! భూ...


సీ|| శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగడంగ

లేశ మానందబు లేనివాఁడు

పుణ్యవంతులు నిన్నుఁౠజ సేయ గ జూచి

భావమందుత్సాహ పడనివాఁడు

భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ

దత్పరత్వములేక తలఁగువాఁడు

తన చిత్తమందు నీ ధ్యాన మెన్నఁడు లేక

కాలమంతయు వృధా గడపువాఁడు

తే|| వసుధలోనెల్ల వ్యర్ధుండు వాఁడె యగును;

మఱియుఁజెడుఁగాక యెప్పుడు మమతనొంది; భూ


సీ|| గౌతమీస్నానానఁ గడతేరుదమటన్న

మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను;

దీర్ధయాత్రలచేఁ గృతార్ధు డౌదమటన్న

బడలి నీమంబులె నడపలేను;

దానధర్మముల సద్గతినిఁ జెందుదమన్న

ఘనముగా నాయొద్ద ధనములేదు;

తపమాచరించి సార్ధకము నొందుదమన్న

నిమిషమైన మనస్సు నిలుపలేను;

తే|| కష్టములకోర్వ నాచేతఁగాదు: నిన్ను

స్మరణఁజేసెద నా యధాశక్తి కొలఁది; భూ.


సీ|| అర్ధివాండ్రకు నీక హానిఁజేయుటకంటెఁ

దెంపుతో వసనాభిఁ దినుటమేలు;

ఆఁడుబిడ్డలసొమ్ము లపహరించుటకంటె

బండఁగట్టుక నూతఁబడుట మేలు;

పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె;

బడబాగ్ని కీలలఁ బడుటమేలు;

బ్రతుక జాలక దొంగపనులు సేయుటకంటెఁ

గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు;

తే|| జలజదళనేత్ర! నీ భక్త జనులతోడి

జగడమాడెడు పనికంటెఁ జావుమేలు; భూ.


సీ|| గార్ధభంబున కేల కస్తూరి తిలకంబు?

మర్కటంబున కేల మలయజంబు?

శార్దూలమున కేల శర్కరాపూపంబు?

సూకరంబులకేల చూతఫలము?

మార్జాలమున కేల మల్లెపువ్వులబంతి?

గుడ్లగూబల కేల కుండలములు?

మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్?

బకసంతతికి నేల పంజరంబు?

తే|| ద్రోహచింతనఁ జేసెడి దుర్జనులకు

మధురమైనట్టి నీ నామ మంత్రమేల? భూ


సీ|| పసరంబు పంజైనఁ బసులకాపరితప్పు,

ప్రజలు దుర్జనులైనఁ బ్రభుని తప్పు,

భార్య గయ్యాళైనఁ బ్రాణనాధుని తప్పు,

తనయుఁడు దుడుకైన దండ్రి తప్పు,

సైన్యంబు చెదరిన సైన్యనాధుని తప్పు,

కూతుఁరు చెడుగైన మాతతప్పు,

అశ్వఁబు దురుసైన నారోహకుని తప్పు,

దంతి మదించ మావంతు తప్పు,

తే|| ఇట్టి తప్పు లెఱుంగక యిచ్చవచ్చి

నటుల మెలఁగుదు రిప్పు డీ యవని జనులు; భూ.


సీ|| కోఁతికి జలతారు కుళ్ళాయి యేటికి?

విరజాజి పూదండ విధవకేల?

ముక్కిడి తొత్తుకు ముత్తెంపు నత్తేల?

నద్దమేమిటికి జాత్యంధునకును?

మాచకమ్మకు నేల మౌక్తిక హారముల్?

క్రూరచిత్తునకు సద్గోష్ఠు లేల?

ఱంకుఁబోతుకు నేల రమ్యంపు నిష్ఠలు?

వావి యేటికి దుష్ట వర్తనునకు?

తే|| మాట నిలకడ సుంకరి మోటు కేల?

చెవిటివానికి సత్కథా శ్రవణమేల? భూ.


సీ|| మాన్యంబులీయ సమర్ధుఁ డొక్కఁడు లేఁడు;

మాన్యముల్ చెఱుప సమర్ధులంత;

యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ;

బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత;

యితఁడు పేద యటంచు నెఱిఁగింపఁడెవ్వఁడు;

గలవారి సిరులెన్నఁగలరు చాలఁ;

దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ

బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత;

తే|| యిట్టి దుష్టుల కథికార మిచ్చినట్టి

ప్రభువు తప్పులటంచును బలుకవలెను; భూ.


సీ|| తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు,

వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు,

లక్షాధికారైన లవణ మన్న మెకాని,

మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,

విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,

కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు,

పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి

దానధర్మము లేక దాఁచి దాఁచి,

తే|| తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?

తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు? భూ.


సీ|| లోకమం దెవఁడైన లోభిమానవుఁడున్న

భిక్షమర్ధికిఁ జేతఁ బెట్టలేఁడు,

తాను బెట్టకయున్నఁ దగవు పుట్టదుకాని

యొరులు పెట్టఁగజూచి యోర్వలేఁడు,

దాతదగ్గఱఁ జేరి తన ముల్లె పోయినట్లు

జిహ్వతోఁ జాడీలు చెప్పు చుండు

ఫలము విఘ్నంబైనఁబలు సంతసము నందు,

మేలుకలిగినఁ జాల మిణుఁకుచుండు,

తే|| శ్రీరమానాధ ! యిటువంటి క్రూరునకును

భిక్షుకుల శత్రువని పేరు బెట్టవచ్చు, భూ.


సీ|| తనువులోఁ బ్రాణముల్ తరలిపోయెడివేళ

నీ స్వరూపమును ధ్యానించునతఁడు

నిమిషమాత్రములోన నిన్నుఁ జేరునుగాని,

యమునిచేతికిఁ జిక్కిశ్రమలఁబడఁడు;

పరమసంతోషాన భజనఁ జేసెడి వాని

పుణ్య మేమనవచ్చు భోగిశయన !

మోక్షము నీ దాస ముఖ్యుల కగు గాని

నరక మెక్కడిదయ్య నళిననేత్ర !

తే|| కమలనాభుని మహిమలు కానలేని

తుచ్ఛులకు ముక్తి దొరకుట దుర్లభంబు; భూ


సీ|| నీలమేఘశ్యామ ! నీవె తండ్రివి మాకు,

కమలవాసిని మమ్ముఁగన్న తల్లి,

నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్,

నీ కటాక్షము మా కనేకథనము,

నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు.

నీ సహాయము మాకు నిత్యసుఖము,

నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య,

నీ పద ధ్యానంబు నిత్య జపము

తే|| తోయజాతాక్ష ! నీ పాద తులసిదళము

రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత ! భూ.


సీ|| బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని,

మరణకాలమునందు మఱతునేమో?

యావేళ యమదూత లాగ్రహంబున వచ్చి

ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

కఫ వాత పైత్యముల్ కప్పఁగా భ్రమచేతఁ

గంప ముద్భవమంది, కష్టపడుచు

నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచుఁ

బిలుతునో! శ్రమచేతఁ బిలువలేనొ?

తే|| నాటికిప్పుడె చేసెద నామభజనఁ

దలఁచెదను జేరి వినవయ్య ! దైర్యముగను, భూ.


సీ|| పాంచభౌతికము దుర్భరమైన కాయం బి

దెప్పడో విడుచుట యెఱుకలేదు,

శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,

నమ్మరాదామాట నెమ్మనమున

బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక

ముదిమియందో, లేక ముసలియందొ,

యూరనో, యడవినో, యుదకమధ్యముననో,

యెప్పుడో యేవేళ నే క్షణంబొ?

తే|| మరణమే, నిశ్చయము, బుద్ధిమంతుఁడైన

దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు, భూ.


సీ|| తల్లిదండ్రులు భార్య తనయు లాప్తులు బావ

మఱఁదు లన్నలు మేన మామగారు,

ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనఁ

దాను దర్లగ వెంటఁ దగిలి రారు,

యమునిదూతలు ప్రాణ మపహరించుక పోఁగ

మమతతోఁ బోరాడి మాన్పలేరు,

బలగమందఱు దుఃఖపడుట మాత్రమె కాని,

యించుక యాయుష్య మీయలేరు,

తే|| చుట్టములమీఁది భ్రమఁదీసి చూరఁ జెక్కి,

సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు, భూ.


సీ|| ఇభరాజవరద ! నిన్నెంత పిల్చిన గాని

మాఱు పల్కవదేమి మౌనితనమొ,

మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినఁగాని

కనుల!జూచి వదేమి గడుసుదనమొ?

చాల దైన్యమునొంది చాటు జొచ్చినఁగాని

భాగ్యమీయ వదేమి ప్రౌఢతనమొ?

స్ధిరముగా నీపాద సేవఁ జేసెదనన్న

దొరకఁజాల వదేమి ధూర్తతనమొ?

తే|| మోక్షదాయక! యిటువంటి మూర్ఖజనునిఁ

గష్టపెట్టిన నీకేమి కడుపునిండు ? భూ.


సీ|| నీమీఁద కీర్తనల్ నిత్యగానముఁజేసి

రమ్యమొందింప నారదుఁడ గాను;

సావధానముగ నీ చరణపంకజసేవ

సలిపి మెప్పింపంగ శబరిఁగాను;

బాల్యమప్పటినుండి భక్తి నీయందునఁ

గలుగను బ్రహ్లాద ఘనుఁడఁగాను;

ఘనముగా నీమీఁద గ్రంధముల్ కల్పించి

వినుతిసేయను వ్యాస మునిని గాను;

తే|| సాధువును, మూర్ఖమతి, మనుష్యాధముఁడను;

హీనుఁడను, జుమ్మి; నీవు నన్నేలు కొనుము: భూ.


సీ|| అతిశయంబుగఁ గల్లలాడ నేర్చితిఁ గాని

పాటిగా సత్యముల్ బలుకనేర;

సత్కార్య విఘ్నముల్ సలుపనేర్చితిఁగాని

యిష్ట మొందఁగ నిర్వహింపనేర;

నొకరిసొమ్ముకు దోసిలొగ్గనేర్చితిఁగాని

చెలువుగా ధర్మంబు సేయనేర;

ధనము లియ్యంగ వద్దనఁగ నేర్చితిఁగాని

శీఘ్రమిచ్చెడునట్లు చెప్పనేర;

తే|| పంకజాతాక్ష ! నే నతి పాతకుఁడను

దప్పులన్నియు క్షమియింపఁ దండ్రివీవె; భూ.


సీ|| ఉర్విలో నాయుష్యమున్న పర్యంత్మంబు

మాయ సంసారంబు మరగి, నరుఁడు

సకల పాపములైన సంగ్రహించునుగాని

నిన్ను జేరెడి యుక్తి నేర్వలేఁడు,

తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱువచ్చి

గుంజుక చనివారు గ్రుద్దుచుండ,

హింస కోర్వఁగలేక యేడ్చి గంతులు వేసి

దిక్కులేదని నాల్గు దిశలు చూడఁ,

తే|| దన్ను విడిపింప వచ్చెడి ధన్యుఁడెవడు?

ముందె నీ దాసుఁడైయున్న ముక్తిగలుగు; భూ.


సీ|| అధిక విద్యావంతుల ప్రయోజకులైరి,

పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి,

సత్యవంతులమాట జనవిరోధంబాయె,

వదరుపోతులమాట వాసికెక్కె,

ధర్మవాసనపరుల్ దారిద్ర్య మొందిరి,

పరమలోభులు ధన ప్రాప్తులైరి,

పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి,

దుష్ట మానవులు వర్ధిష్టులైరి,

తే|| పక్షివాహన! మావంటి భిక్షుకులకు

శక్తిలేదాయె, నిఁక నీవె చాటు మాకు, భూ.


సీ|| భుజబలంబునఁ బెద్దపులులఁ జంపగవచ్చు,

పాముకంఠముఁ జేతఁ బట్టవచ్చు,

బ్రహ్మరాక్షస కోట్ల బాఱఁద్రోలఁగ వచ్చు,

మనుజుల రోగముల్ మాన్పవచ్చు,

జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగఁగ వచ్చు,

బదను ఖడ్గము చేత నదుమవచ్చుఁ,

గష్టమొందుచు ముండ్ల కంపలోఁ జొరవచ్చుఁ,

దిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చుఁ,

తే|| బుడమిలో దుష్టులకు జ్ఞానబోధఁ దెలిపి

సజ్జనుల జేయలేఁడెంత చతురుఁడైన, భూ.


సీ|| అవనిలోఁగల యాత్రలన్ని చేయఁగవచ్చు,

ముఖ్యుడై నదులందు మునుఁగవచ్చు,

ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వఁగవచ్చుఁ,

దిన్నగాఁ జపమాల ద్రిప్పవచ్చు,

వేదాల కర్ధంబు విఱిచి చెప్పఁగవచ్చు,

శ్రేష్ఠయాగములెల్లఁ జేయవచ్చు,

ధనము లక్షలు కోట్లు దానమీయఁ

నైష్ఠికాచారముల్ నడుపవచ్చు,

తే|| జిత్త మన్యస్ధలంబునఁ జేరకుండ

నీ పదాంభోజములయందు నిలుపరాదు; భూ.


సీ|| కర్ణయుగ్మమున నీ కథలు సోఁకినఁ జాలు

పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు

చేతు లెత్తుచుఁ ౠజ సేయఁగల్గినఁ జాలు

తోరంపుఁ గడియాలు తొడిగినట్లు,

మొనసి మస్తకముతో మ్రొక్కఁగల్గినఁ జాలు

చెలువమైన తురాయి చెక్కినట్లు,

గళము నొవ్వఁగఁ నామస్మరణ గల్గినఁ జాలు,

వింతగాఁ గంఠీలు వేసినట్లు,

తే|| పూని నినుఁ గొల్చుటే సర్వ భూషణంబు,

లితర భూషణముల నిచ్చగింపనేల? భూ


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము