నరాల రామారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరాల రామారెడ్డి

నరాల రామారెడ్డి సుప్రసిద్ధ అవధాని.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు 1949, మే 18వ తేదీన కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, బొల్లవరం గ్రామంలో బాలిరెడ్డి, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు.[1] స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని 6వ తరగతి నుండి ఎస్.ఎస్.ఎల్.సి వరకు ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణ గీర్వాణ పాఠశాలలో చదువుకున్నాడు. ఈ కాలంలో ఇతడు అమరకోశం, రఘువంశం, కుమార సంభవములోని కొన్ని సర్గలు, శ్రీహర్ష నైషదము, భానుని కాదంబరి, చంపూ రామాయణము, ఇతర కావ్యాలలోని కొన్నిభాగాలు పఠించాడు. 1964లో ఎస్.ఎస్.ఎల్.సి ఉత్తీర్ణుడైన తర్వాత తిరుపతి శ్రీవేంకటేశ్వర ఓరియంటల్ కళాశాలలో చేరి 1968లో తెలుగు, సంస్కృతం ప్రధానాంశాలుగా విద్వాన్ ఏ పట్టా పొందాడు. ఇతనికి హైస్కూలులో కొండూరు నరసింహాచార్యులు, కాలేజీలో గౌరిపెద్ది రామసుబ్బశర్మ గురువులుగా ఉన్నారు. విద్వాన్ పూర్తి చేశాక 1968లో ప్రొద్దుటూరులోని ఓరియంటల్ కాలేజీలో లెక్చరర్‌గా ప్రవేశించి 1994లో ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందాడు.

అవధాన పర్వం[మార్చు]

1965లో తిరుపతిలో జరిగిన బులుసు వేంకటరామమూర్తి అష్టావధానం చూసి ప్రేరణ్ పొంది కాలేజీ హాస్టల్‌లో తన 16 యేట మొట్టమొదటి అవధానం చేశాడు. ఆ తర్వాత తిరుపతిలోను, చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలలోను, ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలలోను, పెద్ద పెద్ద నగరాలలోను, జంషెడ్‌పూర్, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు తదితర నగరాలోను అనేక అష్టావధానాలు, శతావధానాలు చేశాడు. 1992లో అమెరికన్ తెలుగ్ అసోసియేషన్ (ఆటా) ఆహ్వానం పై అమెరికా వెళ్లి న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్‌కో, లాస్ ఏంజెల్స్, హ్యూస్టన్, అట్లాంటా, వాషింగ్టన్, చికాగో, డెట్రాయిట్ వంటి చోట్ల అవధానాలు చేశాడు. ఇతడు ఇప్పటి వరకు 1000కి పైగా అవధానాలు పూర్తి చేశాడు.

గీతరచయితగా[మార్చు]

కార్తీకదీపం చిత్రంలో చిలకమ్మ పలికింది చిగురాకు కులికింది అనే గీతం వ్రాశాడు.

బిరుదులు, సత్కారాలు[మార్చు]

ఇతడు “కళా వాచస్పతి”, “అవధానకంఠీరవ”, “అవధానశిరోమణి”, “అవధానకిశోర”, “అవధానకేసరి” వంటి బిరుదులతో అనేక సత్కారాలు పొందాడు. మద్రాస్ తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ వంటి సంస్థల నించి సన్మాన సత్కారాలను అందుకున్నాడు.

అవధానాలలో కొన్ని పూరణలు[మార్చు]

సమస్యాపూరణ

  • జమునను చూడగా విజయశాంతి లభించె జయప్రదమ్ముగన్
చం|| సమరము చేయనంచు రభసమ్మున చాపము క్రింద వైచి సం
భ్రమమున క్రుంగి పోయితివి బంధువులన్ హతమార్చనంచు నీ
భ్రమలు తొలంగె;నేడు భగవంతుని రూపము నీదు హృత్సరో
జమునను చూడగా విజయ! శాంతి లభించె జయ ప్రదమ్ముగన్
  • కుందనమును కోమలాంగి కోరదుసుమ్మీ!
కం|| మందస్మితముల జిమ్ముచు,
చందన చూర్ణంబు మేన జల్లిన రీతిన్
చిందింపుము వలపుల, కఱ
కుందనమును కోమలాంగి కోరదు సుమ్మీ!

దత్తపది

  • రామా, రామా, రామా, రామా - ఈ శబ్దాలను రాముడు, స్త్రీ అర్థాలతో కాకుండా రామాయణార్థం
శా|| రా! మాకంద మనోజ్ఞమూర్తి! ప్రణయ ప్రాణీశ! నీ నందనా
రామాలోకన శీతచంద్రికలు నా రాగమ్ము పండించులే-
రా! మాధ్వీక హృదంత సౌధమ్మున నీ రమ్యాకృతిన్ కాంతి ధా
రా మాహాత్మ్యము చూపరా! రఘువరా! రమ్మన్నది సీతరా!
  • దోసె, పూరీ, వడ, సాంబారు - పార్వతీ కళ్యాణం
మ|| జడలో దోసెడు కొండమల్లికలతో, సౌరభ్యముల్ చిమ్మివ
చ్చెడు పూరీతిగ హాస చంద్రికలతో సింధూర సీమంతయై
వడకుంగుబ్బ ముద్దుపట్టి యెదుటన్ వాసంతియై నిల్వ ఆ
పడతిన్ పత్నిగ స్వీకరించితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా!

వర్ణన

  • వ్యవసాయాన్ని నమ్ముకొన్న రైతుల దుస్థితి సీసంలో
సీ|| ఒకసారి అతివృష్టి ఉప్పెనగా పొంగి
పొంగిన పంటను పాడుచేయు
ఒకసారి నిర్వృష్టి ఉత్పాతముగ వచ్చి
నీటి యెద్దడి తెచ్చి నిప్పులుమియు
ఒకసారి ధరలేక ఉన్న దమ్మగ లేక
తీవ్రనష్టమ్మును తెచ్చుపెట్టు
ఒకసారి బిడ్డల ఉద్వాహములు వచ్చి
ఉన్న సొమ్మంతయు ఊడ్చివేయు
కొనగ పోవునప్పుడు కొరివిగా మారును
అమ్మ బోవునపుడు అడవి యగును
అప్పు బాధలన్ని ఆత్మ హత్యల దారి
కర్షకుండు సతము కలత చెందు
  • సీతాకళ్యాణము
తే||గీ|| ధనువు వంగెను సీతకు తనువు పొంగె
గుండె లోపల వెన్నెల పండిపోయె
రామ కంఠాన మందార రమ్యమాల
సీత దేహాన రోమాంచ చిత్రలీల

మూలాలు[మార్చు]

  1. రాపాక, ఏకాంబారాచార్యులు (2015). అవధాన సర్వస్వము (1 ed.). హైదరాబాద్. pp. 523–531.{{cite book}}: CS1 maint: location missing publisher (link)