నవులూరు మాలెకొండయ్య
ఈ వ్యాసంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్నాయి. దీన్ని మెరుగుపరచడంలో తోడ్పడండి. లేదా ఈ సమస్యల గురించి చర్చ పేజీలో చర్చించండి. (ఈ మూస సందేశాలను తీసెయ్యడం ఎలాగో తెలుసుకోండి)
|
విద్వాన్, సాహిత్య భూషణ బిరుదుతో గౌరవించబడిన శ్రీ నవులూరి మాలెకొండయ్య పంతులు గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా మానేగుంటపాడులో 4-6-1915న జన్మించారు. తల్లి లక్షమ్మ, తండ్రి వెంకటకృష్ణయ్య, గత శతాబ్దపు నెల్లూరు కవిపండితుల్లో చెప్పుకోదగ్గవారు. పద్యకవిత్వం రాస్తూ, ఉపాధ్య వృత్తికి అర్హత సంపాదించుకొని, నెల్లూరు స్టోన్ హౌస్ పేట ఆర్.ఎస్.ఆర్.ఎం.సెకండరీ స్కూల్లో "గ్రేడ్ టు" తెలుగు పండితులుగా చేరి, సాహిత్యమే జీవితంగా భాషాసేవలో బ్రతుకు సార్థకం చేసుకొన్న వ్యక్తి. మాలెకొండయ్య పంతులు గారు 1970 లో ‘గ్రేడ్ టూ’ పండితులుగానే పదవీవిరమణ చేశారు, కొద్దిపాటి పెన్షన్ మాత్రమే మంజూరు అయింది.
నెల్లూరు ఫతేఖాన్ పేటలో పర్ణశాలవంటి పూరిపాకలో అతి సామాన్యులుగా జీవించినా, ఆయన ఇంటికి ఎక్కడెక్కడి కవులు, విద్వాంసులు వచ్చి, వారితో సాహిత్య విషయాలు చర్చించేవారు. మాలె కొండయ్య గారి ఇంటికి పొద్దున్నే దీపాల పిచ్చయ్య శాస్త్రి "మాలకొండయ్య పంతులూ, ఈ ప్రయోగం చూచావా? " అంటూ వచ్చేవారు. మాలెకొండయ్య పంతులు సాయంత్రం అయ్యేసరికి దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ప్రాంగణంలో వాలేవారు. తిరుపతి వెంకట కవులను అభిమానించే నెల్లూరు కవిబృందానికి పిచ్చయ్య శాస్త్రి గురువు వంటి వారు. సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అందరూ అక్కడ చేరేవారు. ఈ వర్గంలో ముఖ్యులు, కవిగా ప్రసిద్ధులయిన న్యాయవాది, ‘సరసకవి’ మోచెర్ల రామకృష్ణయ్య గారు మాలెకొండయ్య పంతులు గారికి ఆప్తులు.
ఆరోజుల్లో నెల్లూరు పండితులు వేదంవారి శిష్యులని, తిరుపతివెంకటకవుల ఏకలవ్య శిష్యులుగా మరో వర్గం ఉండేవారు. రెండు వర్గాల మధ్య తీవ్రమైన సాహిత్య వివాదాలు సాగేవి. మాలెకొండయ్య పంతులుగారి ఇంటిలో గుమిగూడిన పండితులు ఆ నాటి భాషా వాదాల లోతుపాతులు చర్చించేవారు. అందరూ అవధానాలూ ఉపన్యాసాలూ, ఉగాది కవిసమ్మేళనాలకు కలిసి వెళ్లి, తమ కవితలు వినిపించడం, “ప్రయోగ అపప్రయోగ చర్చలు”, “కావ్యశాస్త్ర విచారణ”లతో గడిపేవారు. భారతి సాహిత్య మాసపత్రికలో, యూత్ కాంగ్రెస్, జమీన్ రైతు వంటి నెల్లూరు పత్రికలలో జరుగుతున్న పండిత వాదాలకు పూర్వకవి ప్రయోగాలు, ఆధారాలు, ప్రమాణాలు చూపడానికోసం వెదకడం వారికి ఒక వ్యాసంగం.
మాలెకొండయ్య పంతులుగారు అనేక ప్రాచీన కావ్యాలు జాగ్రత్తగా భద్రపరిచారు. ప్రతి పుస్తకం వెనకా ఆయన ఆ పూర్వకవి ప్రయోగాలూ, పుట సంఖ్య గుర్తుగా రాసిపెట్టుకొనేవారు. “శబ్దసాధుత్వ నిర్ధారణకు పూర్వకవిప్రయోగాలే” ఆధారం. మాలెకొండయ్య గారు ప్రతి పుస్తకం వెనకా వింత ప్రయోగాల సూచికలు కూడా రాసి పెట్టేవారు.
మాలెకొండయ్య గారు శిష్యులకు భారతం, కళాపూర్ణోదయం, నన్నెచోడ కుమార సంభవం వంటి కావ్యాలు నిత్యమూ బోధించారు. తమవద్ద ఉన్న పుస్తకాలు ఇతరులకు పనికొస్తాయని విలువైన గ్రంథాలు ఇచ్చేవారు. నెల్లూరు టౌన్ హాల్ లో జరిగే పండితసభలకు మాలెకొండయ్య గారు వెళ్ళేవారు . జక్కా వేంకటేశ్వరుడు, దువ్వూరి రామలింగారెడ్డి, కనకరత్నాచారి, వైద్యులు రమణారెడ్డి తరచు వారి ఇంటికి వచ్చి, ఆ గోష్ఠులలో పాల్గొనేవారు. ఆరుద్ర 'సమగ్రాంధ్ర సాహిత్యం' రచిస్తున్నసమయంలో మాలకొండయ్య గారు ఆయనకు అనేక పూర్వ ముద్రణ ప్రతులిచ్చి సహాయపడ్డారు. విశ్వ విద్యాలయాల ఆచార్యులు కూడా ఆయన అపురూప గ్రంథాలు సంప్రదించడానికి నెల్లూరు వచ్చేవారు. నవులూరు మాలెకొండయ్య షుమారు 70 ఏళ్లు జీవించి, 1990 ప్రాంతంలో చనిపోయారు.
మాలెకొండయ్య పంతులు గారి రచనలు. 1.ఏకాంతశయ్య(కావ్యం) 2.సర్వశరణ్య శాతకర్ణి 3.దీన సంరక్షణాంజలి శతకం 4.కాలచక్రం-నాటిక 5.రాజశేఖరోద్వాహ రాయబారం -నాటిక 6.ప్రణయబలి (ఖండకావ్యం) 7.నెలవంక ఆయన రచనల్లో 1950 లో రచించిన తొలి కావ్యం ఏకాంతశయ్య మాత్రమే అచ్చయింది. వృద్ధాప్యంలో కావలిలో నివాసం ఉంటున్న సమయంలో కలుగోళమ్మ శతకం రాసి ప్రచురించారు.
మాలకొండయ్య పంతులు గారు పుష్పగిరి తిమ్మన రచించిన మూడు అలభ్య శతకాల రాత ప్రతులను తిమ్మన వంశీయుల వద్ద సంపాదించి, పోలూరి హనుమజ్జానకీరామ శర్మ గారి చేత శిధిలమైన తిమ్మన తిరువడాంబ శతకాన్ని సంస్కరింపించి తి.తి. దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో 1983లో అచ్చువేశారు. పంతులు గారు కోవూరు పట్టాభిరామ శర్మగారి రచన "భగవద్గీతార్థమంజరి"ప్రచురించి ఉచితంగా పంచిపెట్టారు.
తరిగొండ వెంగమాంబ కీర్తన "కృష్ణ మంజరి "(ద్విపద ) "భక్తజనులలో పారాయణలో ముఖస్థమై" ఉన్నదాన్ని ప్రచురించి పంచిపెట్టారు. మాలెకొండయ్య శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి వీరాభిమాని. టి. అంజనాద్రి గారనే కవి పంతులు గారికి ఆత్మీయులు. వీరిని ప్రొఫెసర్ అంజన్ అని అనేవారు. తనకు మిత్రులైన అంజన్ జీవితం చిన్న గ్రంథంగా రాశారు. విక్రమ సింహపురి మండల సర్వస్వం తయారు చేయడంలో నేలనూతుల శ్రీ కృష్ణమూర్తి గారికి సహకరించిన వారిలో మాలెకొండయ్య ముఖ్యులు. ఈ సర్వస్వంలో మాలెకొండెయ్య నెల్లూరు "ప్రాచీనాంధ్ర కవులు" సుదీర్ఘ వ్యాసం ప్రామాణిక ఆకరగ్రంథమైంది. ఇందులో శ్రీనాథుడు నెల్లూరివాడు అనే అభిప్రాయాన్ని వీరు సమర్థించారు. అవధానం పాపయ్య, పూండ్ల వెంకటప్పయ్యలతో 47 మంది కవుల పరిచయంతో ఈ వ్యాసం ముగిసింది.
మూలాలు: విక్రమ సింహపురి మండల సర్వస్వం(1964)లో విద్వాన్ బడి గురవారెడ్డి గారి వ్యాసం.