నాయుడుగారి అబ్బాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయుడుగారి అబ్బాయి
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బి.వి.ప్రసాద్
రచన దాసరి నారాయణరావు
తారాగణం కృష్ణ,
అంబిక,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
భాష తెలుగు

నాయుడు గారబ్బాయి దాసరి నారాయణరావు కథ, చిత్రానువాదం, మాటలు సమకూర్చగా, బి. వి. ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణ, రావు గోపాలరావు, అంబిక, కవిత ప్రధాన పాత్రల్లో నటించగా ఎన్. రామలింగేశ్వరరావు, బి. వి. ఆర్. ఎ. గోపీనాథ్ నిర్మించిన 1981 నాటి తెలుగు చలన చిత్రం. చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా, లక్ష్మణ్ గోరె సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
సంపన్నుడైన రాఘవనాయుడిని అతని వద్ద పనిచేసే కుటుంబరావు బావమరిది నాగరాజు మోసం చేసి చంపి, అతని కొడుకు రాజశేఖరాన్ని బావిలో పడేసి తన మేనల్లుడు సూరిబాబును ఆ స్థానంలో ప్రవేశపెడతాడు. నాటకాల గుంపు నాయకుడి పెంపకంలో చంద్రంగా రాజశేఖర్ పెరిగి మాధవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే మాధవి గురించి రాజశేఖరంగా పెరుగుతున్న సూరిబాబుతో గొడవ కాగా, చంద్రం సన్నిహితురాలైన గౌరిని రాజశేఖరం అత్యాచారం చేస్తాడు. అనేక మలుపుల తర్వాత చంద్రం తానే రాజశేఖరాన్ని అని తెలుసుకుని, తన స్థానం తీసుకుని, గౌరికి సూరిబాబుతో పెళ్ళి చేసి, తాను మాధవిని పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

కథ[మార్చు]

రాఘవనాయుడు (కాంతారావు) ధనవంతుడు, మంచివాడు. ఆయన కుమారుడు రాజశేఖర్. తనవద్ద పనిచేసే కుటుంబరావు (అల్లు రామలింగయ్య), అతని భార్య తాయారమ్మ (సూర్యకాంతం)లను తన వద్దే ఉంచి చూసుకుంటూ, వారి పిల్లాడు సూరిబాబునూ తన కొడుకుతో సమానంగా చూసుకునేంత మంచి మనిషి. తాయారమ్మ తమ్ముడు, జైలుపక్షి నాగరాజు (రావు గోపాలరావు) ఆ ఇంటికి వచ్చి సంపద చూసి, తన అక్కకి నూరిపోసి రాఘవనాయుణ్ణి ఎవరికీ తెలియకుండా చంపేస్తారు.
చనిపోయిన నాయుడు గారి అస్థికలు పుణ్యనదుల్లో కలపడానికి అంటూ తీర్థయాత్రకు బయలుదేరి, నాయుడు గారి అబ్బాయి రాజశేఖర్ ని శ్రీశైలం దగ్గర పాడుబడ్డ బావిలో పడేసి, తన అల్లుడు సూరిబాబు చనిపోయినట్టు, బ్రతికివున్న సూరిబాబే రాజశేఖరమైనట్టు జనాన్ని నమ్మిస్తాడు. రాజశేఖరాన్ని నాటకాలు ఆడే శరభయ్య కాపాడి చంద్రం అన్న పేరుతో పెంచుకుంటాడు.
పెరిగి పెద్దవాడైన చంద్రం (కృష్ణ) నాటకాల కంపెనీకి నాయకుడై మంచి పేరు తెచ్చుకుంటాడు. అతని వెంట బావా అంటూ గౌరీ అనే పిల్ల తిరుగుతూంటుంది. అనుకోని విధంగా పరిచయం అయిన మాధవి అనే డబ్బున్న అమ్మాయితో చంద్రానికి సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
విదేశాల్లో ఉన్నత విద్య పూర్తిచేసుకున్న సూరిబాబు (రంగనాథ్) నాయుడి గారి వారసుడు రాజశేఖరంగా తిరిగివస్తాడు. మాధవి తల్లి నందివర్ధనం ఏదోలా రాజశేఖరానికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేసే ప్రయత్నం చేస్తూంటుంది. రాజశేఖరం వచ్చిన సందర్భంగా ఏర్పాటైన వేడుకల్లో చంద్రం బృందం నాట్యప్రదర్శన చేస్తారు. ఓ పార్టీలో మాధవిని రాజశేఖర్ అత్యాచారం చేయబోగా చంద్రం అడ్డుకుని, తన్ని ఆమెను కాపాడతాడు. ఆ క్రమంలో నందివర్ధనం అతన్ని అవమానించినా, మాధవి, చంద్రం ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
రాజశేఖరాన్ని మాధవికిచ్చి చేసేందుకు ఏర్పాటైన పెళ్ళిచూపుల్లో చంద్రం, మాధవి తాగుబోతుల్లా నర్తించి పాడుచేస్తారు. చంద్రం చేసిన అవమానానికి కక్ష తీర్చుకునేందుకు అంటూ రాజశేఖర్ గౌరిపై అత్యాచారం చేస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న చంద్రం ఆవేశంతో వెళ్ళి అతనితోనే గౌరికి తాళి కట్టిస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
రాజశేఖర్ ఆటకట్టించేందుకు మాధవి-చంద్రంల పెళ్ళి గౌరి చేయబోగా నాగరాజు అంతకుముందే చంద్రంకు పెళ్ళయిందన్న దొంగసాక్ష్యంతో చెడగొడతాడు. మందు లేకపోబట్టి మతిపోయి రోడ్డుమీద పడిపోయిన కుటుంబరావును నందివర్ధనం భర్త కాపాడి తీసుకువెళ్తాడు. అతని ద్వారా తనే నాయుడుగారబ్బాయి రాజశేఖరాన్ని అన్న సంగతి తెలుసుకుంటాడు చంద్రం. చంద్రం మారువేషంలో సూరిబాబును అంటూ వచ్చి రాజశేఖరానికి మాధవిని ఇచ్చి పెళ్ళిచేయిస్తానని అతని వద్ద చేరతాడు. మరోవైపు మాధవిని పెళ్ళికి ఒప్పుకొమ్మని చివరకు తానే అదే ముహూర్తానికి చేసుకుంటానని చెప్పి ఒప్పిస్తాడు సూరిబాబు. మరోవైపు ఇతను మారువేషంలో ఉన్న చంద్రం అని కనిపెట్టిన నాగరాజు దొంగదెబ్బ తీసి బంధిస్తాడు. తన గుర్రం సాయంతో తప్పించుకుని రాజశేఖర్ ఆటకట్టించి, తానే అసలు రాజశేఖరాన్ని అని బయటపెట్టి తన పెళ్ళి మాధవితో, రాజశేఖరంగా చెలామణి అవుతున్న సూరిబాబు పెళ్ళి గౌరితో చేయించడంతో కథ సుఖాంతం అవుతుంది.[1]

పాత్రధారులు-పాత్రలు[మార్చు]

  • కృష్ణ - చంద్రం (అసలు పేరు రాజశేఖర్)
  • రంగనాథ్ - రాజశేఖర్ (అసలు పేరు సూరిబాబు)
  • రావుగోపాలరావు - నాగరాజు
  • అల్లు రామలింగయ్య - కుటుంబరావు
  • కాంతారావు - రాఘవరావు నాయుడు
  • మిక్కిలినేని -
  • అంబిక -
  • కవిత -
  • సూర్యకాంతం - తాయారమ్మ
  • సుకుమారి -
  • నాగేష్ -

సాంకేతిక వర్గం[మార్చు]

సినిమా సాంకేతిక వర్గం ఇలా ఉంది:[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రభూమి, విలేకరి (2 January 1982). "నాయుడుగారబ్బాయి". ఆంధ్రభూమి సినిమా పత్రిక: 42–45.