నాలుగు స్తంభాలాట
నాలుగు స్తంభాలాట. దీనికే "గొల్ల చల్లాట" అని కూడా పేరు. పంటలు వేసికొని అందులో ఒకరు దొంగకాగా మిగిలిన నలుగురూ నాలుగు స్థంభాలూ పట్టుకొని ఉంటారు. (సాధారణంగా గుమ్మాల ముందు వేసే పెళ్ళిపందిళ్ళలో ఈ ఆట ఆడేవారు) దొంగ "చల్లోయమ్మ గొల్లచల్ల" అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని ఆ కొసనుండి ఈ కొసకి, ఈ కొసనుండి ఆ కొసకి తిరుగుతుంటే స్తంభాలు పట్టుకున్నవాళ్ళు దొంగను దూరంపోనిచ్చి ఒక స్తంభం నుండి మరో స్తంభానికి అటూ ఇటూ మారుతుంటారు. ఈ మారడంలో తాను వదిలేసిన స్తంభానికి మరొకరుగాని, తిరిగి తానుగాని పట్టుకొనేలోపున దొంగ ఆ స్తంభాన్ని ముట్టుకుంటే ఆ స్తంభం దొంగది. అప్పుడు స్తంభం లేకుండా మిగిలిపోయిన వ్యక్తి దొంగ. ఈ ఆట పిల్లలలో నిశితమైన చూపు, ముందుజాగ్రత్త నేర్పుతుంది. ఈదొంగను ' గొల్లభామ ' అంటారు. ఈ గొల్లభామ చల్లోయమ్మ గొల్లచల్ల అని పాడుతూ -
" నాలుగు స్తంభాలాట నడిమికి తొడిమికి
తానక తప్పక తన పేరేమిటి
ఉట్టిమీద బెల్లం, పొట్టి కాకరకాయ"
అంటూ కూడా పాడుతూ, కాళీ స్తంభం కోసం వెతుకుతూ తిరుగుతుంటుంది.
ఈ ఆట నేటి మ్యూజికల్ ఛైర్సుకి దాదాపు ప్రతిరూపమే.
మూలాలు
[మార్చు]- గోదావరిసీమ జానపద కళలు క్రీడలు వేడుకలు, పడాల రామకృష్ణారెడ్డి, 1991, పేజీ: 399.