నిషా శర్మ వరకట్న వేధింపు వ్యాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిషా శర్మ వరకట్న వేధింపు వ్యాజ్యం (Nisha Sharma dowry case) నిషా శర్మ అనే యువతి తనకి కాబోయే భర్త అయిన మునీష్ దలాల్, వివాహ సమయంలో వరకట్న వేధింపులకి గురిచేశాడని అతనిపై, అతని కుటుంబ సభ్యుల పై 2003 లో ఆమె నమోదు చేసిన వ్యాజ్యం. దేశీయ ప్రసార మాధ్యమాలలోనే కాక అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలలో కూడా ఈ వ్యాజ్యానికి సంబంధించిన ప్రసారాలు జరిగాయి. నిశా శర్మ ప్రపంచవ్యాప్తంగా యువతుల ప్రతినిధిగా (Youth Icon), ఆదర్శ యువతిగా (Role Model), ఉక్కు మహిళగా (Iron Lady) చిత్రీకరించబడింది.[1] 2012 లో ఈ వ్యాజ్యంలో అందరు ముద్దాయిల (వరుడు మునీష్ దలాల్, వరుడి తల్లి విద్యా దలాల్, వరుడి మేనత్త సావిత్రి శర్మ, వధువు ప్రియుడు నవనీత్ రాయ్) నిర్దోషత్వం ఋజువు కావటంతో ఈ వ్యాజ్యం ముగిసినది.[2]

అయితే, ఏ వరకట్న వేధింపులకి తాను గురైనదని నిషా శర్మ అభియోగాలు చేసినదో, అవే అభియోగాలు తన మరదలు (తమ్ముడి భార్య) నిషా శర్మ పై, వారి కుటుంబ సభ్యులపై 2013 లో చేసింది. స్త్రీని కాపాడటానికి రక్షణ కవచంగా (shield) రూపొందించిన చట్టాలనే దుర్వినియోగపరచి ఆయుధంగా (weapon) వాడుకుంటే, ఆ ఆయుధానికి అదే స్త్రీ ఎలా బలిపశువు అవుతుందో తెలుపటానికి నిషా శర్మ ఉదంతమే ఒక కచ్చితమైన ఉదాహరణగా మిగిలిపోయింది.

నేపథ్యం[మార్చు]

సాఫ్టువేర్ ఇంజినీరింగ్ విద్యార్థిని అయిన 21 సంవత్సరాల నిషా శర్మని, పాఠశాలలో కంప్యూటర్ అధ్యాపకుడైన 25 సంవత్సరాల మునీష్ దలాల్ కి ఇచ్చి 2003 మార్చి 11 న నోయిడా పట్టణంలో వివాహం జరపాలని పెద్దలు నిశ్చయించారు. ఒక వార్తాపత్రికలో వరుడు కావలెను ప్రకటనకి మునీష్ స్పందించటంతో ఈ వివాహం ఖరారు అయినది. "కష్టపడే వ్యక్తిత్వం గల వాడని, తెలివైన వాడని, ఇటువంటి వాడే నాకు సరిపోతాడని అప్పట్లో నేను అనుకొన్నాను." అని తర్వాత నిషా ఒక పత్రికా ముఖాముఖిలో అన్నది.

నిషా శర్మ తండ్రి దేవ్ దత్ శర్మ నోయిడాలోని కారు బ్యాటరీ లని ఉత్పత్తి చేసే ఒక కార్మాగారానికి యజమాని. వరకట్నంలో భాగంగా కానుకలన్నీ రెండేసి (ఒకటి వరుడికి, రెండవది అతని సోదరునికి) ఇవ్వాలని ముందే నిర్ణయించబడింది. ఆ ప్రకారంగా రెండు ఫ్రిజ్ లు, రెండు ఏసీలు, రెండు వాషింగ్ మషీన్ లు, రెండు టెలివిజన్ లు, ఒక మైక్రోవేవ్ ఓవెన్, ఒక మారుతి ఎస్టీం కారుని ఇచ్చారు.;

[3] కుమార్తె వివాహం కోసం 10 సంవత్సరాలుగా శర్మ దాచుకొన్న ధనంతో ఈ కానుకలని కొన్నారు. వరుడు ఊరేగింపుతో కళ్యాణ వేదికకి చేరుకొన్నాడు. శుభముహూర్తం కాసేపట్లో ఉండగనే వరుడి తల్లి రూ.12 లక్షల అదనపు కట్నాన్ని కోరినది అని ఆరోపణ. అప్పటికే 2000 మంది అతిథులు కళ్యాణ వేదికకి చేరుకొన్నారు. తన సోదరుని ద్వారా, తమ కుటుంబం, వరుని కుటుంబం మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకొన్నదని, వారి కుటుంభాల మధ్య వాగ్వాదం నడుస్తోన్నదని నిషా (వధువు) తెలుసుకోగనే ఆమె పోలీసులకి కబురు పంపినది.[4] ఊరేగింపు వెనక్కి పంపబడింది. ఆ తర్వాతి రోజే వికాస్ పురి లోని తన స్వగృహం లోనే మునీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పరారీలో ఉన్న ఇతర బంధువుల కోసం గాలించారు. మునీష్ తల్లి విద్యా దలాల్ ని 15 మే న పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

I am glad I did not get married to Munish. They could have done anything to me later on.
(మునీష్ నన్ను పెళ్ళాడకపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. తర్వాత వారు నన్ను ఏమయినా చేసి ఉండవచ్చు.)

కొంత కాలానికి నిషా సహ విద్యార్థి అయిన నవనీత్ రాయ్ నిషాతో తనకి గడచిన ఐదేళ్ళుగా సంబంధమున్నదని, వారు రహస్యంగా పెళ్ళి కూడా చేసుకొన్నాడని ముందుకు వచ్చాడు. దేవ దత్ కుటుంబానికి మచ్చ తేవటానికే రాయ్ అబద్ధాలు చెబుతున్నారని నిషా తండ్రి వాపోయారు. తొలుత నిషా రాయ్ ని ఇష్టపడినది వాస్తవమేనని, కానీ రాయ్ నిరుద్యోగి కావటంతో ఈ వివాహంతో తన జీవితాన్ని స్థిరపరచుకోవాలని చూస్తున్నాడని దేవ దత్ వ్యతిరేకించాడని తెలిపాడు. దీనితో నిషా రాయ్ తో సంబంధాలని రద్దు చేసుకొన్నదని, దాని తర్వాత రాయ్ నిషాతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకు నిషా కళాశాలలో లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా, అతనిని కళాశాల నుండి తొలగించారని తెలిపారు.

ఇది ఇలా ఉంటే, మరొక ప్రక్క వరుడి కుటుంబం తాము ఎటువంటి అదనపు కట్నం కోరలేదని, వరుడు ఊరేగింపుగా వచ్చినపుడు అతడిని ఆహ్వానించే దిక్కే లేకపోవటం, పైగా వధువు తండ్రే వరుని తల్లిపై దాడికి పాల్పడ్డటంతో, పోలీసులని పిలిపించింది తామే నని, వధువు కాదని తెలిపారు. ఘర్షణకి కారణం తాము కాదని, నవనీత్ రాయ్ అని వారు తెలిపారు. తన స్నేహితులతో రాయ్ కళ్యాణ వేదికకి వచ్చాడని, వధువు తల్లితో అది వరకే వారికి జరిగిన వివాహం గురించి తెలిపాడని అన్నారు. వధువు తండ్రేమో ఇవి నిరాధార నేరారోపణలని, తన ఆరోపణలకి సాక్ష్యాలుగా వీడియో రికార్డింగులు ఉన్నవని తెలిపారు.

ప్రసార మాధ్యమాల స్పందన[మార్చు]

మునీష్ తల్లిని అదుపులోకి తీసుకోవటంతో జాతీయ అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు రంగంలోకి దిగాయి. పలు వార్తాపత్రికలలో ఈ వార్త మొదటి పేజీలో ప్రచురించబడింది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా నిషాని వివాహమాడటానికి పలువురు యువకులు ముందుకు వచ్చారు. ఆమెతో ముఖాముఖి కోసం పలువురు ఆమె ఇంటి ముంగిట వాలారు. స్త్రీ హక్కుల కార్యకర్తలు, ఇరుగు-పొరుగు వారు, ఇతర శ్రేయోభిలాషులు ఆమెని అభినందించారు. ఒక రాజకీయ పార్టీ స్థానిక ఎన్నికలలో ఆమెని పోటీ చేయమని ఆహ్వానించింది. తనకి ఆ ఉద్దేశం లేదని, తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తానని, భవిష్యత్తులో తాను చేసుకోబోయే పెళ్ళి పెద్దలు కుదిర్చినదే అయి ఉండాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపినది.

అంతర్జాతీయ వార్తాపత్రికలు, భారతదేశంలో వరకట్న జాడ్యం చాప క్రింద నీరు వలె ఎలా నిగూఢమై ఉన్నదో ప్రస్తావించినవి. ఇక్కడి వరకట్న వ్యవస్థ, వరకట్న వ్యతిరేక చట్టాలు, సతీ సహగమనము, భ్రూణ హత్య లని వేలెత్తి చూపినవి. మొదట అధిక కట్నానికి ఒప్పుకోవటమే తప్పు అని, తర్వాత కట్నం మొత్తం పెరిగినపుడు పెళ్ళినే రద్దు చేసుకోవటం మరొక తప్పని కొన్ని ప్రసార మాధ్యమాలు విమర్శించాయి. ఒక వాణిజ్య ప్రకటనలో దీన్ని హాస్యాస్పదంగా వాడుకోవటం జరిగింది.

ఔట్ లుక్ ఇండియా గడచిన మూడు సంవత్సరాలలోనే 7,000 స్త్రీల జీవితాలని వరకట్న వేధింపులు బలి తీసుకున్నాయని ఒక లెక్క వేసింది. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా ఇలా ఎందరో అబలలు క్షోభకి గురవుతున్నారని తెలిపినది.

మహిళా సంఘాల వ్యాఖ్యలు-

  • ఆదిలోనే అధిక కట్నానికి ఒప్పుకొని వధువు తల్లిదండ్రులు తప్పుడు సంకేతాలు పంపారు
  • నేను వివాహాలకి హాజరు కాను. దాదాపు అన్ని వివాహాలలోనూ వరకట్న మహమ్మారి నిగూఢమై ఉంటుంది. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేకనే, జన్మించబోయేది ఆడశిశువు అని తెలియగనే మన దేశంలో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి [5]
  • ఈ ఒక్క నిరసన స్త్రీజాతికి కొండంత అండని ఇచ్చినది

అనూహ్యమైన ఈ స్పందనని చూచి నిషా నివ్వెరపోయింది. ఆ సందర్భంలో ఈ విధంగా అన్నది.

I want to become a symbol for the girls. Dowry is a black spot on our country or I can say on the earth.
(నేను యువతుల ప్రతినిధిగా నిలబడదలచుకొన్నాను. వరకట్న జాడ్యం ఈ దేశానికే, ఆ మాటకొస్తే ఈ ప్రపంచానికే మాయని మచ్చ.)

వివాహం[మార్చు]

19 నవంబరు 2003 లో నిషా, అశ్విన్ శర్మ అనే కంప్యూటర్ ఇంజినీరుని కేవలం 75 మంది అతిథులతో నోయిడా లోనే వివాహమాడినది. ఒక బంగారు నెక్ల్సెస్ ని మాత్రం నిషా తండ్రి దేవ దత్ బహూకరించారు. వివాహ విషయం గురించి ముందే తెలుసుకొన్న మునీష్, రాయ్ లు నిషా చట్టపరంగా తమతమ భార్య అని, ఈ వివాహాన్ని ఆపు చేయమని న్యాయస్థానానికి విన్నవించుకొన్నారు. నిషా తల్లిదండ్రులు ఆ రోజు సాయంత్రం జరగవలసిన వివాహాన్ని చట్టపరమైన ఇబ్బందుల బారిన పడకుండా ఉండటానికి తెల్లవారు ఝామున గం. 3 కే అవగొట్టారు. ఈ సందర్భంగా దేవ దత్ శర్మ "తన కుమార్తెకి వివాహం జరిపించటమే ప్రతి తండ్రి ప్రథమ కర్తవ్యం. దానిని నిర్వర్తించగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.[6] తమకి ఎటువంటి కోర్టు నోటీసులు అందలేదని చట్టం ఏ విధమైన నిర్ణయం తీసుకొన్నా, నిషా కున్న కోట్లాది అభిమానులు ఆమె వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండాలని కోరుకొంటున్నారు.

ఓప్రా విన్ఫ్రీ షో[మార్చు]

జనవరి 2004 లో నిషా, తన భర్త, సోదరుడు ప్రపంచవ్యాప్తంగా వీక్షించబడే ఓప్రా విన్ఫ్రీ షోకి ఆహ్వానించబడ్డారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల లో జన్మించటం తమ అదృష్టమని ఓప్రా వీక్షకలకి తెలిపారు. "చీకటి యుగం నుండి బయటపడే హక్కు"గా ఈ ఘటనని వారు పేర్కొన్నారు.[7]

పాఠ్యాంశం గా ఈ ఘటన[మార్చు]

2004 లో, ఇంకా ఈ వ్యాజ్యం విచారణ దశలోనే ఉండగా న్యూ ఢిల్లీకి చెందిన రాష్ట్ర విద్యాబోధన పరిశోధన, శిక్షణ పరిపాలక సంస్థ (State Board of Educational Research and Training) ఆరవ తరగతి ఆంగ్ల పాఠ్యపుస్తకంలో ఈ ఘటనని Man in Jail over Dowry Demand అనే పేరుతో పాఠ్యాంశంగా ప్రచురించింది. 2003లో ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ పాఠ్యాంశం రూపొందించబడింది. పెళ్ళిపందిరి నుండే వరుడిని అదుపులోకి తీసుకొన్నట్లు ఒక కార్టూనుని కూడా ఇందులో చేర్చారు.[8] మునీష్ దీనిపై పరువునష్టం వ్యాజ్యాన్ని కూడా వేశారు.[9]

మునీష్ తల్లి విద్యా దలాల్, తను పూర్వం పనిచేసిన పాఠశాలలో ఈ పాఠ్యం బోధించబడుతోందని, తనకున్న మంచి పేరుని ఇది భ్రష్టు పట్టించినదని తెలిపినది. వారి తరపు న్యాయవాది ఢిల్లీ ప్రభుత్వాన్ని, విద్యా విభాగాన్ని చట్టపరంగా సవాలు చేస్తున్నట్లు తెలిపారు. మునీష్ తల్లికి పెన్షన్, ఇతర పదవీవిరమణ భత్యాలు అందటం లేదని న్యాయవాది వాపోయారు.

విచారణ, తీర్పు[మార్చు]

Judiciary of India
భారతదేశ న్యాయవ్యవస్థ

మునీష్, అతని తల్లి విద్యా, మేనత్త సావిత్రి శర్మ ల పై నోయిడాలో వ్యాజ్యం నమోదయినది. విచారణలో భాగంగా జైలు జీవితం గడుపుతున్న మునీష్ ని ఇతర ఖైదీలు "దురాశపరుడి"గా సంబోధించటంతో అక్కడ స్వల్ప ఘర్షణ చోటు చేసుకొన్నది.[10] దీంతో మునీష్ కి గాయాలయ్యాయి. ఈ ఘటన పై జాతీయ మానవ హక్కుల అధికార వర్గానికి వారి తరపు న్యాయవాది విజ్ఞప్తి చేసుకొన్నారు. మునీష్ తనని వివాహేతర సంబంధాలున్నాయని, తనకి ఇద్దరు భర్తలున్నారని దూషించాడు అన్న నిషా వ్యాజ్యం పై ప్రతివ్యాజ్యం వేశారు.

ఇండియన్ ఎక్స్ప్రెస్ తో 2012లో మునీష్ -

The next nine years, I watched the woman who ruined me and my family become the darling of the country. She appeared on talk shows, won awards, documentaries were made on her. I lost my friends, job prospects and peace of mind. There is much she has to answer for.[11]
(తర్వాతి తొమ్మిది సంవత్సరాలు, నా జీవితాన్ని నాశనం చేసిన ఒక స్త్రీ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొనడం నేను చూశాను. ఈ విషయాన్ని తాను కార్యక్రమాలలో చర్చించినది, బహుమానాలు గెలుచుకొన్నది, తన పై లఘుచిత్రాలు తీయబడ్డవి. నా స్నేహితులని, ఉద్యోగావకాశాలని, మానసిక ప్రశాంతతని నేను కోల్పోయాను. తన నుండి వీటన్నిటికీ నాకు సమాధానం కావాలి.)

29 ఫిబ్రవరి 2012 లో నేరారోపణలకి ఋజువులు లేని కారణాన మునీష్ ని అతని కుటుంబ సభ్యులని విడుదల చేశారు. పెళ్ళి రోజున మునీష్ దలాల్ 12 లక్షల అదనపు కట్నం అడిగినట్లు నిరూపించటానికి తగినన్ని సాక్ష్యాధారాలు లేకపోవటంతో ఛీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ (CJM) ఈ నిర్ణయానికి వచ్చారు. ప్రవేశపెట్టబడిన సాక్షులు ఎవరి సంబంధీకులు కారని తేల్చారు. నిషా శర్మకు నవనీత్ రాయ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని, అతనిని వివాహమాడదలచుకొన్నదని, అయితే, ఇరువురి వైపు పెద్దలు దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయారని, అందుకే నిషాను మునీష్ కు ఇచ్చి వివాహం చేయాలని దేవదత్ నిర్ణయించుకొన్నాడని, కానీ ఈ నిర్ణయం నిషా అభీష్టాలకు వ్యతిరేకం కావటంతో తానే ఈ కట్టుకథ అల్లినది అని CJM తన ఆర్డర్ లో పేర్కొన్నారు.[12] తప్పుడు వివాహ దస్తావేజులని సృష్టించాడు అని నిషా ఆరోపించిన నవనీత్ రాయ్ ని కూడా న్యాయస్థానం విడుదల చేసింది. దస్తావేజులు నకిలీవి అనే ఋజువులు లేకపోవటంతో న్యాయస్థానం ఈ నిర్ణయానికి వచ్చింది.[13]

హిందుస్తాన్ టైంస్ తో దీనిపై మునీష్ స్పందన-

I have suffered a lot in these nine years. But as the judge read the acquittal lines, the first thing that came to my mind was that truth has won.
(ఈ తొమ్మిది సంవత్సరాలు నేను పడ్డ బాధలు వర్ణనాతీతం. న్యాయమూర్తి మమ్మల్ని నిర్దోషులుగా తేల్చినపుడు మాత్రం సత్యమే గెలిచినదని నాకు అనిపించినది.)

నిషా తండ్రి దేవదత్ "కేవలం ఋజువులు లేని కారణాన మాత్రమే వారిని విడుదల చేశారని గమనించండి. ఇది వారి విజయం ఎంత మాత్రం కాదు. మేము పై కోర్టుకి వెళతామన్నది మాత్రం నిజమే." అని తెలిపారు.[14][15]

అనంతర పరిణామాలు[మార్చు]

"I was to get married on the evening of May 11, 2003. The next morning I was in jail. You can well imagine my state of mind.[16]"

("11 మే 2003 న పెళ్ళికని బయలుదేరిన నేను, ఆ తర్వాతి రోజునే కటకటాల పాలయ్యాను. నా మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరు.)"

There was no limit to my humiliation. I went to get married and found myself in jail. It was unbelievable.[17]
(నేను పడ్డ అవమానాలకి, సంఘం నుండి ఎదుర్కొన్న చిన్నచూపుకి అంతే లేకుండా పోయింది. వివాహానికి అని వెళ్ళిన నేను, నమ్మశక్యమే కాని విధంగా ఊచలు లెక్కపెడుతున్నాను.)

పలు ముఖాముఖి లలో మునీష్, "నిషా తండ్రి దేవ దత్ కి తన కుమార్తె వివాహం చేసుకొనుట ముందే తెలుసు. అయినా ఆయన వార్తాపత్రికలో వివాహ ప్రకటన ని చేశారు. నిషా అది వరకే రాయ్ ని 14 ఫిబ్రవరి 2003 న రహస్యంగా ఒక గుడిలో పెళ్ళి చేసుకొన్నది. 11 మే 2003 న ఊరేగింపుగా వచ్చిన నన్ను వారు తిరస్కరించారు. మేము తిరిగి వెళ్తుండగా మా మీద ఫిర్యాదు చేయబడినదని తెలుసుకొన్నాము. విధవరాలైన నా 68 ఏళ్ళ తల్లి, 75 ఏళ్ళ నా మేనత్త 75 కి.మీ దూరంలో ఉన్న న్యాయస్థానానికి దాదాపు 320 మార్లు ప్రయాణించవలసి వచ్చినది. నిషా కేవలం పది మార్లు వచ్చినది. 31 మే 2003 లో పదవీవిరమణ చేయవలసిన నా తల్లి యొక్క ఉద్యోగం ఈ ఘటన వలన ఊడటమే కాక, ఆమెకి ఎటువంటి పదవీ విరమణ భత్యములు అందలేదు. 2008లో నేను వివాహం చేసుకొన్నను, కానీ పైసా కట్నం లేకుండా ఆదర్శ వివాహం చేసుకొన్నాను. విచారణ సమయంలో Save Indian Family Foundation లో నేను చురుకుగా పాల్గొన్నాను. అక్కడ నా లాంటి యువకులని చాలా మందిని కలిశాను. తేడా అంతా, నా గురించి ప్రసార మాధ్యమాలు చిత్రీకరించాయి, వారిపై చిత్రీకరించలేదు. అంతే " అని తెలిపాడు.

I faced humiliation for nine years. People used to taunt and say, ‘Kitna dahej maanga tha?’ I was about to get a government job, but that was taken away and even my mother’s retirement benefits were withheld. My brother had a shop, but people took the media there as well. So, his work stopped. At that point in time, my sister-in-law was the only earning member in the family.
(తొమ్మిది ఏళ్ళు నేను అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రజలందరూ నన్ను రెచ్చగొట్టేలా, 'ఎంత కట్నం అడిగావేంటి?' అనేవారు. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి ఉండేది, కానీ దీనివల్లే అది రాలేదు. నా తల్లి పదవీవిరమణ భత్యాలు కూడా ఆగిపోయాయి. మా అన్నకు ఒక దుకాణం ఉండేది, కానీ ప్రసార మధ్యమాలు ఆయనను కూడా వదలకపోవటంతో, ఆయన పని మానేయవలసి వచ్చినది. అప్పట్లో ఇక మా ఇంట్లో ఎవరయినా సంపాదిస్తూ ఉన్నారంటే, అది మా తమ్ముడి భార్యే.)[18]

వ్యాజ్యాలకి కారణాలు తెలుపుతూ, ఇలా అన్నారు.

She didn’t want to marry me but was scared of her parents. By accusing me falsely, she was trying to get out of the marriage without incurring their anger.[19]
(ఆమెకి నన్ను వివాహాం చేసుకొనటం ఇష్టం లేదు కానీ ఆమె తన తల్లిదండ్రులకి భయపడినది. వారి కోపానికి గురి కాకుండా, ఈ వివాహాన్ని తప్పించే ప్రయత్నంలోనే భాగంగానే నాపై తప్పుడు నేరారోపణలు చేసినది.)

మునీష్ తరపు న్యాయవాది, రాయ్ తండ్రి నష్టపరిహారాలని కోరతాం అని తెలిపారు. ఈ తీర్పుని సవాలు చేస్తామని నిషా తండ్రి తెలిపారు. విచారణలో కోర్టు నిషా పెళ్ళికి ముందే నవనీత్ తో ప్రేమ వ్యవహారం నడిపినదని తెలుసుకొన్నది. నిషా కూడా దీనికి ఒప్పుకొన్నా, వివాహ దస్త్రాలలో సంతకం మాత్రం తనది కాదని తెలిపినది.

I never spoke to the media before because I don’t want to become an iron man, like the iron lady, Nisha Sharma. I had a love cum arranged marriage in 2008..even then I didn’t speak about it.
(ఇప్పటి వరకూ నేను ప్రసార మాధ్యమాలతో ఎందుకు మాట్లాడలేదంటే, నిషా శర్మ ఉక్కు వనిత అయినట్లు, నేను ఉక్కు మనిషిని కాదలచుకోలేదు. 2008 లో నేను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకొన్ననూ, దాని గురించి కూడా నేను మాట్లాడలేదు.)

నిషా శర్మ పై వరకట్న వేధింపు ఆరోపణలు[మార్చు]

జనవరి 2013 లో తమ్ముడి జ్ఞానేశ్వర్ శర్మ భార్య మనీషా శర్మ, నిషా పై, తన తమ్ముడి పై ఫిర్యాదు చేసింది. అప్పటికే సంతానం కలిగిని మనీషా శర్మని పన్నెండు లక్షల అదనపు కట్నాన్ని కోరారని అది సమకూర్చకపోవటంతో శారీరకంగా హింసించారని వ్యాజ్యం వేశారు. ఎఫ్ ఐ ఆర్ ప్రకారం దేవదత్ శర్మ, అతని భార్య హేమలతా శర్మ, జ్ఞానేశ్వర్ శర్మ, ఆడపడుచు నిషా శర్మ ఈ వేధింపులకు పాల్పడ్డారు. మనీషాను గెంటివేసి ఇప్పుడు వారు రెండవ వివాహం చేసుకొనేందుకు సిద్ధపడ్డారు. దీంతో వారిపై 498ఏ, 506 (చంపుతామని బెదిరించటం), 504 (దుర్భాషలాడటం) 406 (ఆస్తులను కబ్జా చేసుకొనటం) సెక్షనుల క్రింద కేసు కట్టారు. 2013 జనవరి 8 న పోలీసులు జ్ఞానేశ్వర్ శర్మను అదుపులోకి తీసుకొన్నారు. మిగతా ముగ్గురు ముద్దాయిలు పరారీలో ఉన్నందున, పోలీసులు వారి కొరకు గాలిస్తున్నారు. మనీషా తండ్రి విజయ్ శర్మ నవభారత్ టైంస్ పత్రికతో -

నా కుమార్తెని మానసికంగా, శారీరకంగా చిత్రవధ చేశారు. ఎన్నో మార్లు మేము సర్దిచెప్పటానికి చూసినా వారు మా మాటని పెడచెవిన పెట్టారు. చివరకు నా కుమార్తెని ఇంటి నుండి గెంటి వేశారు. చేసేది లేక తనని నా ఇంటికి తెచ్చుకొన్నాను. న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాము.[20]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. రోల్ మాడల్ అయిన నిషా శర్మ (ఔట్ లుక్ ఇండియా - 02 జూన్ 2003)
  2. సాక్ష్యాధారాలు లేకపోవటంతో ముద్దాయిలను వదిలి వేసిన గౌతం బుద్ధ్ నగర్ డిస్ట్రిక్ట్ కోర్టు (ఐబీఎన్ లైవ్ 01 మార్చి 2012
  3. కట్నకానుకలు, లాంఛనాల వివరాలు (ట్రిబ్యూన్ ఇండియా - 25 మే 2003)
  4. వరుడు అదనపు కట్నాన్ని అడుగుతున్నాడని సోదరుని ద్వారా తెలుసుకొన్న నిషా పోలీసులను పిలిపించినది (బిబిసి - 14 మే 2003)
  5. వరకట్నాలను చూడలేక వివాహ వేడుకలకి అసలు హాజరు కావటమే మానుకొన్న మహిళా సంఘ కార్యకర్త (సిబియస్ న్యూస్ - 03 అక్టోబరు 2003)
  6. ఎట్టకేలకు కుమార్తె వివాహమైనందుకు సంతోషించిన దేవదత్ శర్మ (బిబిస్ - 19 నవంబర్ 2003)
  7. ఓప్రా విన్ఫ్రీ షో కు ఆహ్వానించబడ్డ నిషా శర్మ (టైమ్స్ ఆఫ్ ఇండియా - 9 జనవరి 2004)
  8. స్కూలు పాఠ్యాంశంగా నిషా శర్మ ఉదంతం (బిబిసి - 29 సెప్టెంబరు 2004)
  9. (ద టెలిగ్రాఫ్ - 18 సెప్టెంబరు 2004)
  10. మునీష్ తో కయ్యానికి దిగిన ఇతర ఖైదీలు (ట్రిబ్యూన్ ఇండియా - 21 మే 2003)
  11. నా ప్రశ్నలకు నిషా సమాధానం చెప్పాలి (ఇండియన్ ఎక్స్ప్రెస్ - 2 మార్చి 2012)
  12. ఇష్టం లేని వివాహాన్ని తప్పించటానికే నిషా కట్టు కథ అల్లినది అని తెలిపిన Chief Judicial Magistrate (టైమ్స్ ఆఫ్ ఇండియా - 1 మార్చి 2012)
  13. "నవనీత్ రాయ్ వద్ద నిషాతో తనకు వివాహం జరిగినట్లు ఋజువు చేసే దస్త్తావేజులు నకిలీవి అనటానికి ఋజువు లేదు అని తెలిపిన Chief Judicial Magistrate (హిందుస్తాన్ టైమ్స్ - 01 మార్చి 2012)". Archived from the original on 2015-04-02. Retrieved 2015-07-22.
  14. యూట్యూబ్ లంకె:మేము పై కోర్టుకు వెళతామన్న దేవదత్ శర్మ (ఐబీఎన్ 01 మార్చి 2012)
  15. [1] స్త్రీ సంరక్షణ చట్టాలే అమాయక పురుషులకు విరుద్ధంగా ఉన్నాయా అన్న అనుమానాన్ని వెలిబుచ్చిన ఇండియా టుడే (1 మార్చి 2012)
  16. వివాహం చేసుకోవలసిన నేను, జైలు పాలయ్యాను. (డెయిలీ మెయిల్ - 2 మార్చి 2012
  17. నాకు జరిగిన అవమానానికి అంతే లేకుండా పోయింది (సిడ్నీ మార్నింగ్ అవర్ - 10 ఏప్రిల్ 2012)
  18. "ఈ వ్యాజ్యం వల్లే మా కుటుంబం ఛిద్రమైనది - హిందుస్తాన్ టైమ్స్ తో మునీష్ దలాల్". Archived from the original on 2015-05-24. Retrieved 2015-09-11.
  19. ఈ వివాహం జరగాకూడదు, తన తల్లిదండ్రుల ఆగ్రహానికీ నిషా గురి కాకూడదు. అందుకే తను ఈ దారి ఎంచుకొన్నది. (సిడ్నీ మార్నింగ్ అవర్ - 4 జూలై 2014)
  20. నిషా పై వరకట్న వేధింపు వ్యాజ్యం (నవభారత్ టైమ్స్ - 10 జనవరి 2013)