నువ్వా నేనా (1962 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువ్వా నేనా
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆమంచర్ల శేషగిరిరావు
నిర్మాణం ఎస్.భావనారాయణ,
పి.సి.బాలకృష్ణరాజు
గీతరచన ఆరుద్ర
సంభాషణలు ఆరుద్ర
నిర్మాణ సంస్థ మహేశ్వరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

కౌసల్యా ప్రొడక్షన్స్ పతాకంపై ఆమంచర్ల శేషగిరిరావు దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా నువ్వా - నేనా?. ఈ జానపద సినిమా 1962, సెప్టెంబర్ 28న విడుదలయ్యింది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఆమంచర్ల శేషగిరిరావు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • మాటలు, పాటలు: ఆరుద్ర

శ్రీపురం సంస్థానాధిపతి ప్రతాపచంద్ర భూపతి యువకుడు. అతనికి తల్లిపట్ల అంతులేని గౌరవం.స్నేహపాత్రుడు, ఆనంద్ అనే నిరుపేద అతని ఆప్తమిత్రుడు. ఇద్దరూ ప్రతి శుక్రవారం ఒకే ఆకులో భుజించేవారు. శరీరాలు వేరైనా హృదయమొక్కటే అని భావించేవారు. ప్రతాప్ తల్లి మాతామహారాణి వీరిద్దరినీ తన రెండు కళ్ళుగా పరిగణించేది. తన కుమారునికి, చిన్నాపురం జమీందారిణి రాజ్యలక్ష్మీదేవితో వివాహం జరిపించాలని ఆమె సంకల్పం.

ప్రతియేటా జరిగే శ్రీపురం దసరావేడుకలు ఆ సంవత్సరం రాజ్యలక్ష్మీదేవి అధ్యక్షతన జరపదలచారు. వేడుకలు రక్తి కట్టడం కోసం ఆనంద్, ప్రతాప్‌లు ఇద్దరూ పోటీలలో పాల్గొంటున్నారు.

తుపాకీ పోటీకోసం అడవిలో సాధన చేస్తున్న ఆనంద్‌ను ఒక అల్లరిపిల్ల గేలి చేసింది. సాధన చేసి గెలవటం నేతిబీరకాయలో నెయ్యి తాగినట్టేనన్నది. ఆనంద్ పందెం వేశాడు. గెలుస్తానన్నాడు. శ్రీపురం సంస్థానాధిపతి ప్రతాప్ కూడా యాదృచ్ఛికంగా కలుసుకున్నాడు. తుపాకీ పోటీలో తానే గెలుస్తానన్నాడు. అందుకు పందెం వేశాడు కూడా. ఆ పిల్లపేరు పద్మ. సుబేదారు సుందర్రావు కూతురు. సొగసరి. గడుసరి.

పద్మతో పందెం వేసిన ఇద్దరిలో ఆనందే గెలిచాడు. అతనికి తన హృదయాన్నే కానుకగా బహూకరించింది పద్మ. ఓడిపోయిన ప్రతాప్ పద్మకు తన హృదయాన్ని బహూకరించనెంచాడు. అయితే పద్మ నిరాకరించింది. గులాబీ కోసం ఆశించేవాడు ముళ్ళబాధను సహించాలని ప్రతాప్ నిర్ణయించుకున్నాడు.

ఈ విధంగా ఆప్తమిత్రులిద్దరూ ఒకే యువతిని ప్రేమించటం ప్రారంభించారు. ఆ విషయం వారికి తెలియదు. మాతా మహారాణి గారి అభిమతం ప్రకారం ప్రతాప్ రాజ్యలక్ష్మీదేవినే పెళ్ళాడబోతాడని ఆనంద్ అభిప్రాయం.

కాని రాజ్యలక్ష్మీదేవి పోటీలలో గెలుపొందిన ఆనంద్‌ను వరించింది. అతనిని తన హృదయేశ్వరుడుగా చేసుకోవాలని ఆమె వాంఛ. అందుకే ఆనంద్‌కు తన సంస్థానంలో ఉన్నతపదవిని ఇచ్చి గౌరవించటానికి నిర్ణయించింది.

పద్మను మనసారా కోరుతున్న ప్రతాప్ ఆమె తనపట్ల ప్రదర్శించే నిరసన భావాన్ని సహించలేకపోయాడు. అధికారం చేతిలో ఉందికదా అని బలత్కరించటానికి పూనుకున్నాడు. చెంపదెబ్బ కొట్టి పారిపోతున్న పద్మకు ఆనంద్ ఎదురయ్యాడు. ఒక కామాంధునికి బుద్ధిచెప్పి వస్తున్నానని పద్మచెప్పింది. ఆ కామాంధుడు తన మిత్రుడు ప్రతాపేనని ఆనంద్‌కు తెలియదు. ఆమెను సమర్థించాడు. వారి మాటలు చాటున ఉండి విన్న ప్రతాప్ మండిపడ్డాడు. ఆనంద్‌ను మిత్రద్రోహి అని దూషించాడు. తన అధికారంతో పద్మను వశం చేసుకుంటానని గర్జించాడు.

ఆకస్మికంగా సంభవించిన ఈ పరిణామం ఆనంద్‌ను కల్లోలపరిచింది. తన మిత్రుని తప్పుదారినుంచి మరలించడానికి ఎంతో ప్రయత్నించాడు. అధికారంతో కాదు అనురాగంతోనే దేనినైనా సాధించవచ్చు అని నచ్చజెప్పబోయాడు. కానీ ప్రతాప్ హృదయంలో చెలరేగిన దురభిప్రాయ జ్వాలలు చల్లారకపోగా మరింత జ్వలించినాయి. అధికారమా - అనురాగమా? నువ్వా - నేనా? అని ఆనంద్‌ను సవాల్ చేశాడు. ప్రతాప్ నాటి నుండి ఆనంద్‌ను అష్టకష్టాల పాలు చేశాడు. హత్యాభియోగాన్ని అన్యాయంగా ఆరోపించి ఖైదు చేశాడు. కానీ పందెం వేసి మరీ తప్పించుకుపోయాడు ఆనంద్. అడవుల వెంట నలుదిశలా తరిమితరిమి వేధించాడు ప్రతాప్. వారి బారి నుండి తప్పించుకు పారిపోతున్న ఆనంద్ గుర్రంమీదనుంచి పడి స్పృహకోల్పోయాడు.

అతనికోసమే అన్వేషిస్తూ వస్తున్న రాజ్యలక్ష్మీదేవి ఆనంద్‌ను కాపాడి తన శిబిరానికి తీసికొని వెళ్ళుతుంది. ఇంతకాలంగా తన మనసులో దాచుకున్న ప్రేమను రాజ్యలక్ష్మీదేవి ఆనంద్‌కు వెల్లడించింది. కానీ పద్మను తప్ప వేరెవరినీ ప్రేమించలేనన్నాడు ఆనంద్.

ఆనంద్‌ను వెదుకుతూ వచ్చిన పద్మను రాజ్యలక్ష్మీదేవి అడ్డగించింది. ఆనంద్ కష్టాలన్నిటికీ పద్మే కారణమని, అతను సుఖపడాలంటే అతనికి తాను దూరం కావాలని పద్మకు హితోపదేశం చేసింది.

పద్మకోసం ఆమె ఇంటికి వెళ్ళిన ఆనంద్‌ను ప్రతాప్ బంధించాడు. ఆనంద్ ప్రాణం దక్కాలంటే నన్ను పెళ్ళాడటానికి ఒప్పుకోమని పద్మను బెదిరించాడు. పద్మ తల్లడిల్లిపోయింది. రాజ్యలక్ష్మి చేసిన హితోపదేశం ఆమె హృదయంలో మారుమ్రోగింది. తన ప్రేమను త్యాగం చేయడమే ఆనంద్ సుఖపడటానికి మార్గమని నిర్ణియించుకున్నది.

కొండచెరలో బంధించబడి ఉన్న ఆనంద్‌ను రాజ్యలక్ష్మి విడిపించింది. పద్మ ప్రతాప్‌ను పెళ్ళాడటానికి అంగీకరించిందని తెలియజేసింది. ఆనంద్ ఆ మాటలు నమ్మలేకపోయాడు. తన పద్మ ఇంకొకరిని వివాహం చేసుకొనదని చెప్పి ఆమెను ప్రతాప్ బారినుండి కాపాడటానికి వెళ్ళాడు. పెళ్ళిపీటల మీదకు పోబోతున్న పద్మను తీసుకుని పారిపోయాడు.

అంతవరకూ ఆనంద్ ఆప్తుడూ, నిర్దోషి అని భావించిన ప్రతాప్ తల్లి మనసు ఈ సంఘటనతో మారిపోయింది. పీటలమీద పెళ్ళిని చెడగొట్టిన పాపిని కనిపించినవెంటనే కాల్చిపారేయవలసిందని ఆజ్ఞాపించింది. ఆనంద్‌ను ఎదుర్కోవటానికి పరివారంతో ప్రతాప్ బయలుదేరుతాడు. నువ్వా - నేనా? అని ప్రాణమిత్రులిద్దరూ తలపడ్డారు. చివరకు అనురాగశీలి అయిన ఆనంద్ విజయం సాధిస్తాడు[1].

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు కె.వి.మహదేవన్ బాణీలను కూర్చాడు.[2]

  1. కొరడా పట్టిన మారాజా కోటి దండాలు మీ గొప్ప గుణాలు - పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
  2. మసక మసక చీకటిలో మల్లెపూల వాసనలొ వేచియుంటా - పి.సుశీల, రచన:ఆరుద్ర
  3. మెరిసే వెండిబంగారం అవి కానేకావు బహుమానం - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర
  4. కుహూ కుహూ కోయిలమ్మా నా కోరిక నీవు వినుమా - పి.సుశీల, రచన: ఆరుద్ర
  5. నీ కొరకే నిను నేను వీడాలి నీ మేలే తలపోసి మెలగాలి - పి.సుశీల, రచన: ఆరుద్ర
  6. మేల్ భళారే మేల్ భళా.. ఓహోహో మేల్ భళారే - పి.బి.శ్రీనివాస్, రచన: ఆరుద్ర.

మూలాలు

[మార్చు]
  1. వెంకట్ (3 October 1962). "చిత్ర సమీక్ష - నువ్వా-నేనా?". ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక. 11 (8): 22–24. Retrieved 26 February 2020.[permanent dead link]
  2. కొల్లూరు భాస్కరరావు. "నువ్వా - నేనా - 1962". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Archived from the original on 24 February 2020. Retrieved 24 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)