నెలవంక (1983 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెలవంక
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం ఎ ఎస్ ఆంజనేయులు
ఎం నరసింహా రావు
రచన జంధ్యాల
తారాగణం రాజేష్ ,
తులసి,
జె.వి.సోమయాజులు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సుత్తివేలు,
సుత్తి వీరభధ్రరావు
సంగీతం రమేష్ నాయుడు
ఛాయాగ్రహణం ఎస్ గోపాల రెడ్డి
కళ తోట తరణి
కూర్పు గౌతమ్ రాజు
నిర్మాణ సంస్థ శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ 1983
దేశం భారత్
భాష తెలుగు

నెలవంక జంధ్యాల దర్శకత్వం వహించగా, గుమ్మడి, జె.వి.సోమయాజులు ముఖ్యపాత్రల్లో నటించగా 1983లో విడుదలైన తెలుగు సాంఘిక చిత్రం. సినిమా హిందూ-ముస్లిం వివాదాలు, ఐక్యత నేపథ్యంలో తీసిన సందేశాత్మక చిత్రమిది. జమీందారీ గ్రామం నేపథ్యంలోని ఈ సినిమాని జమీందారీ గ్రామమైన ముక్త్యాలలో చిత్రీకరించారు. సినిమా ఆర్థికంగా పరాజయం మూటకట్టుకోవడమే కాక పురస్కారాలను కూడా దక్కించుకోలేక నిరాశపరిచింది.

చిత్ర కథ

[మార్చు]

శ్రీరామరాజు (గుమ్మడి) ఛాందసుడైన క్షత్రియుడు, జమీందారు. దానధర్మాలకు ఆస్తి కరిగిపోయినా హోదా, భవంతి మాత్రం మిగిలిపోయాయి. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కుమార్తె సావిత్రి (రాజ్యలక్ష్మి) మూగ అమ్మాయి, చిన్న కుమార్తె లలిత (తులసి) చాలా చురుకైనది. రహీం (జె.వి.సోమయాజులు) ముస్లిం, ఖురాన్ తో పాటుగా పురాణాలు కూడా చదివిన వ్యక్తి. జమీందారు టాంగా తోలడం ఆయన వృత్తి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. పక్కన వేరెవరూ లేకుంటే ఏరా ఒరే అంటూ పిలుచుకునేంత సాన్నిహిత్యం ఉన్నవారు. అంతటి సన్నిహితుల మధ్య చెలరేగిన గొడవలు, చివరకు ఆ గ్రామంలో హిందూ ముస్లిం మతకల్లోలాలుగా మారతాయి. చివరకు మానవత్వాన్ని మించిన మతం లేదని, వ్యతిరేక శక్తులను ఎదిరించి మతసామరస్యాన్ని తిరిగి నెలకొల్పడం ముగింపు.

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

నటీనటుల ఎంపిక

[మార్చు]

సినిమాలో జమీందారు పాత్ర, ఆయన దగ్గర పనిచేసే రహీం పాత్ర ప్రధానమైనవి. వాటిలో జమీందారుగా క్యారెక్టర్ నటునిగా దశాబ్దాల పాటు వెలిగిన గుమ్మడి నటించగా, రహీం పాత్రను శంకరాభరణం శంకరశాస్త్రిగా ప్రసిద్ధికెక్కిన జె.వి.సోమయాజులు నటించారు. అప్పటివరకూ శంకరాభరణం ప్రభావంతో బ్రాహ్మణ పాత్రలనే ధరించాల్సివస్తూన్న జె.వి.సోమయాజులుకు నెలవంకలో అందుకు భిన్నంగా ముస్లింగా రహీం పాత్ర లభించింది. దీనికి న్యాయం చేసేందుకు సోమయాజులు సినిమా పర్యంతం నిజంగా గడ్డం పెంచారు. అప్పటికే పూర్తైన పెళ్ళీడుపిల్లలు సినిమాకి ప్యాచ్ వర్క్ కోసం పనిచేయాల్సి వచ్చింది, అయితే సోమయాజులు అందులో నటించిన పాత్రను బట్టి గడ్డాన్ని తీసేయాల్సివచ్చింది. దాంతో గడ్డం మళ్ళీ పెరిగేంతవరకూ వారంరోజుల పాటు సినిమా చిత్రీకరణ ఆపేశారు.
కథానాయకునిగా పనిచేసిన అమర్ నాథ్ కుమారుడు రాజేశ్, రాజమండ్రికి చెందిన కిరణ్ ఈ సినిమా ద్వారా తొలిగా పరిచయమయ్యారు. అమర్ నాథ్ కీ, ఈ సినిమా ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాలరెడ్డికీ మంచి స్నేహం ఉండడంతో నెలవంక కథ వినగానే అమర్ నాథ్ కొడుకు రాజేశ్ ని సినిమాలో హీరో పాత్రకి సూచించారాయన. మరో ముఖ్యపాత్ర రాజ్యలక్ష్మి (శంకరాభరణం ఫేం) తల్లి, ఒకనాడు నాటకాల్లో ప్రముఖ నటి సభారంజనికి లభించింది.[1]

సినిమా పేరు

[మార్చు]

నెలవంక అనే పేరును సినిమాకి సంకేతాత్మకంగా పెట్టారు. దర్శకుడు జంధ్యాల ఈ విషయాన్ని వివరిస్తూ శివుని జటాజూటంలో ఉన్నదీ, ముస్లిముల జండాపై ఉన్నదీ ఒకే నెలవంక అనీ, అందుకే నెలవంక అన్ని మతాలూ ఒక్కటే అనే సందేశానికి రూపమని పేర్కొన్నారు. సినిమాలోని ఒక పాటలోనూ - శివుని జటను వెలసినది, మా జండా నిలిపినది ఒకటే నెలవంక, ఇక మన చూపులేల నేలవంక అన్న చరణం ఉంది. అలాగే రంజాన్ ఉపవాసాలు ముగిసి ముస్లిములకు అత్యంత ముఖ్యమైన రంజాన్ పండుగ రావడానికి కూడా నెలవంక కనిపించడమే ముఖ్యమైన గుర్తు కావడమూ ప్రస్తావనార్హం.[1]

చిత్రీకరణ

[మార్చు]

నెలవంక సినిమా చిత్రీకరణ ముక్త్యాలలో జరుపుకుంది. సినిమాలో మతసామరస్యం, జమీందారీ నేపథ్యం ప్రముఖంగా ఉంటాయి. అలానే ముక్త్యాల జమీందారీ గ్రామం, అంతేకాక ముక్త్యాలలో హిందూ ముస్లింలు చాలా సామరస్యంతో జీవిస్తూంటారు. మొహర్రం, వైకుంఠఏకాదశి ఒకేరోజు వచ్చినప్పుడు ముస్లిములు పీర్ల ఊరేగింపుతోనూ, హిందువులు పొన్నవాహనం ఊరేగింపుతోనూ ఎదురై ఒకరినొకరు అభినందించుకుంటారు. ఈ పోలికలతో పాటుగా ముక్త్యాల రాజా వారి రథసారథిగా ఓ ముస్లిం ఉండేవారు, ఆ సినిమా తీసేనాటికి గ్రామమంతా మతసామరస్యం వెల్లివిరిసవుండడంతో ముక్త్యాలనే నేపథ్యంగా తీసుకోవడమే కాక అక్కడే సినిమా అంతా తీశారు.
సినిమా చిత్రీకరణ జూన్ 23, 1983లో వేదాద్రిలో నెలవంక కనిపించిన నెలపొడుపు రోజున నెలవంక సినిమాని ప్రారంభించారు. ఆగస్టు 5, 1983 వరకూ ముక్త్యాలలోనే 43 రోజులపాటు జరిగిన సింగిల్ షెడ్యూల్లో సినిమా చిత్రీకరణ జరుపుకుంది. సినిమాలో జమీందారు నివాసంగా జరిగిన సన్నివేశాలన్నీ ముక్త్యాల రాజా వారి కోటలోనే తీశారు.[1]

విడుదల, స్పందన

[మార్చు]

సినిమా 1983లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సినిమా విజయం సాధించలేదు. అయితే సినిమాకు రాష్ట్ర స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ పురస్కారాలు లభిస్తాయని విమర్శకులు, చిత్రబృందం ఊహించారు. కానీ ఆ ఊహలు కూడా ఫలించలేదు. ఈ సినిమాలోని ఏది మతం పాటకు జాతీయ అవార్డు వస్తుందని రమేష్ నాయుడు ఆశించారని, అయితే అవార్డుల పరిశీలనకు పంపే సమయానికి ప్రింట్ మిస్సవడంతో ఆ అవకాశం చేజారిపోయిందని సినిమాకు పాటలు రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పేర్కొన్నారు. తను ఇష్టపడి, కష్టపడి తీసిన మంచి సందేశాత్మకమైన చిత్రం ప్రేక్షకాదరణ పొందకపోవడంతో జంధ్యాల చాన్నాళ్ళు బాధపడ్డారు.[1]

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

అన్ని పాటల రచయిత ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. ఈ

చిత్రంలోని అన్ని పాటలుస్వరపరచి సంగీతం

అందించింది రమేష్ నాయుడు

1: మేహ ఫిల్ మే ఆజ్ ధూమ్, గానం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , ఎస్ జానకి

2: సుత్తి పాట , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ప్రకాశ రావు

3: సొగసరి బొమ్మ కోయిలల్లో, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4: కనుబొమ్మల పల్లకి పైన కన్నేసిగ్గు వదువైంది, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి

5:గో గుమ్మడి గో గుమ్మడి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, జిత్ మోహన్ మిత్ర

6: ఎంత చెప్పినా వినవేమిరా, గానం. రమొలా, జిత్ మోహన్ మిత్ర, ప్రకాశ్ రావు

7: ఏది మతం ఏది హితం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 పులగం, చిన్నారాయణ (ఏప్రిల్ 2005). జంధ్యా మారుతం (I ed.). హైదరాబాద్: హాసం ప్రచురణలు.

బయటి లింకులు

[మార్చు]