Jump to content

నెల్లూరు జిల్లాలో జైనమత అవశేషాలు

వికీపీడియా నుండి

భారత దేశంలోని అతి ప్రాచీన మతాలలో జైన మతం ఒకటి. “జైనులు” అనే పదం ‘జిన’అనేపదంనుంచి పుట్టింది. జైనమతం ప్రకారం ఈ మతాన్ని అభివృద్ధి పరచిన వారు 24మంది తీర్థంకరులు. తీర్థంకరులు అంటే మోక్షాన్ని పొందినవారు కాబట్టి తీర్థంకరుడు పరమాత్ముడు. ఆంధ్రదేశంలో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో జైనం ప్రవేశించిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. “హరి బద్రియ వృత్తి” అనే గ్రంథం ప్రకారం మహావీరుడు దేశాటనలో జైన ధర్మాన్ని కళింగ దేశంలో, మోసల (నేటి మసుల -మచిలీపట్నం)రాజ్యలోనూ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. క్రీస్తు పూర్వం 3-2శతాబ్దులలో నెల్లూరు జిల్లా సరిహద్దులలోని మాలకొండ గుహలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహలు జైన మునుల నివాస ప్రదేశాలుగా చెబుతున్నారు. క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకూ జైన మతం వ్యాప్తికి సంబంధించిన శాసనాలు, స్తూపాలు తవ్వకాల్లో కనుగొనబడినవి. తూర్పు చాళుక్య రాజుల కాలంలో, ఆంధ్రదేశంలో పలుచోట్ల జైన దేవాలయాలు నిర్మించబడినవి‌. మధ్య చారిత్రక యుగంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన చాళుక్యులు, నోలంబ పల్లవులు, విజయనగర రాజులు, వారి సామంతులు, ప్రజలు జైన మతాన్ని ఆచరించి, ఆదరించారు. ఆంధ్రదేశంలో బెజవాడ, రామతీర్థం, కొలనుపాక, పెదకొడుమూరు, వర్ధమాన పురం, తెనాలి, దానవులపాడు, చందోలు మొదలైనవి ప్రముఖ జైన మత క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.

నెల్లూరు జిల్లాలో జైనమత అవశేషాలు

[మార్చు]

జిల్లా వ్యాప్తంగా జైనమతం వ్యాపించింది.‌ లభించిన ఆధారాలను బట్టి క్రీం.శ.10వ శతాబ్దం నుంచి క్రీం.శ.15వ శతాబ్దం వరకూ పల్లవ, చాళుక్య,చోళ, తెలుగు చోళ, విజయనగర రాజుల కాలంలో జైనం వర్ధిల్లినట్లు తెలిసింది. నెల్లూరు పట్టణం ఒక జైన ముఖ్య స్థావరం. తవ్వకాలలో జిల్లాలో అనేక జైన తీర్థంకరుల విగ్రహాలు, జైన మత అవశేషాలు లభ్యమయ్యాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి పునాదులు తవ్వుతుంటే చక్కని నల్లరాతితో మలచిన మహావీరుని విగ్రహం లభించింది. ఇది నెల్లూరు దండువారివీధిలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో “కోనేటి రాయుడు” పేరుతో ప్రతిష్ఠిచబడింది. 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుని విగ్రహాలు నెల్లూరు ఫతేఖాన్ పేటలోని మల్లెతోటలోనూ, పాత జడ్జి బంగళాలోను, మద్రాసు బస్ స్టాండు వద్ద కోనేరులోను లభించాయి. వీటిలో ఒకటి-నెల్లూరు టౌన్ హాల్ ఆవరణలో నిలబెట్టి ఉండగా, రెండోది నెల్లూరు పురావస్తు ప్రదర్శన శాలలో జాగ్రత్త చేయబడింది. ఈ విగ్రహం పైన ఉన్న ఒక లఘు శాసనం ప్రకారం నెల్లూరు పట్టణంలో ఒక అధిపతి భార్య ,‘లక్ష్మి’అనే భక్తురాలు ‘కొట్టడ బసది’ అనే జైన వసతికి దానమిచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విగ్రహం క్రీస్తు శకం 11-12శతాబ్దుల కాలం నాటిది. మద్రాసు బస్సుస్టాండు దగ్గర కోనేరును, కలెక్టర్ కార్యాలయం వద్ద ఉండి పూడ్చబడిన కోనేరును జైన పుష్కరిణులుగా చరిత్రకారులు గుర్తించారు. నెల్లూరు పట్టణం తూర్పు చాళుక్య రాజుల కాలంలో జైన క్షేత్రంగా, విద్యా కేంద్రంగా విలసిల్లింది. నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడు గ్రామంలో ‘కరికాల జినాలయ’ అనే జైన దేవాలయానికి ప్రమీలాదేవి అనే భక్తురాలు మెట్లు కట్టించినట్లు ఒక శాసనంలో ఉంది. కొడవలూరు సమీపంలో దంపూరు గ్రామంలో శిరసులేని ఒక జైన తీర్థంకరుల విగ్రహం లభించింది. జిల్లా వ్యాప్తంగా అనేక జైన విగ్రహాల అవశేషాలు లభించాయి. సైదాపురం సమీపంలో సిద్దులయ్య కొండ పదవ శతాబ్దం నుండి జైనమునుల నెలవు. నెల్లూరులో జైన మతస్థులు 1996వ సంవత్సరం కాకుటూరు సమీపంలో 24 వతీర్థంకరులకు తీర్థంకరధామ్ నిర్మించారు. ఈ ధామ్‌లో నిత్యపూజలు జరుగుతున్నాయి. నెల్లూరు జైనమతస్థులకు ఇదొక పవిత్ర క్షేత్రం.

మూలాలు

[మార్చు]
  1. విక్రమసింహపురి మండల సర్వస్వం, సంపాదకులు: నేలనూతల శ్రీకృష్ణమూర్తి, నెల్లూరు జిల్లా పరిషత్ ప్రచురణ,1964., నెల్లూరు జిల్లాలో జైనమతం వ్యాసం,
  2. నెల్లూరు జిల్లా జైనమత చరిత్ర, రచయిత, కొల్లూరి సాయిభక్త కేశవ, సాంకేతిక సహాయకులు, పురావస్తు ప్రదర్శనశాలల శాఖ, నెల్లూరు. ప్రచురణ కర్త: జేట్.మల్.జైన్, శాంతి జ్యూయలరి, నెల్లూరు, ఆగస్టు, 2001.