పంచరాత్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంచరాత్రము భాసుడు రచించిన నాటకము. మహాభారతంలో విరాటపర్వం చివరన జరిగే దుర్యోధన-ద్రోణ సంవాదం, ఆపై విరాటరాజు కొలువులో పాండవులున్నారనే అనుమానంతో కౌరవులు విరాట రాజు ఆవులను బంధించడం, ఉత్తర కుమారుడు బృహన్నలతో వచ్చి ఓడించి ఆవులను తీసుకుపోవడం అనే మూడు అంకాల్లో ఈ నాటకం నడుస్తుంది.[1]

నాటకం సారం[మార్చు]

మొదటి అంకం

కౌరవుల రాజయిన దుర్యోధనుడు ఒక గొప్ప మేధ యాగం (బలినిచ్చే యాగం) సలుపుతాడు. ఎందరో యాగంలో పాల్గొన్న బ్రాహ్మణులు దుర్యోధనుణ్ణి పలువిధాల పొగుడుతారు. యాగపు పరిసమాప్తి తరువాత జరిగే బలి తాలూకు ప్రక్షాళనలు ఇంకా మిగిలి ఉండగానే కౌరవ సోదరుల్లో కొందరు ఆకతాయిగా ప్రాగ్వంశమును, ఇతర యాగశాలలను కాల్చివేస్తారు. ముగ్గురు బ్రాహ్మణులు ఈ విధముగా జరిగిన అపచారమును పూర్తి స్థాయిలో వివరిస్తారు, ఇది పెద్ద అనర్ధమనీ తెలుపుతారు. కానీ వీరు దుర్యోధనుడ్ని సమీపించకుండానే వెళిపోతారు. దుర్యోధనుణ్ణి కర్ణుడు ఇంకా ఇతర కౌరవులు, ద్రోణుడు, భీష్ముడు. కృపాచార్యుడు, శకుని ఇత్యాదులు పలు విధాల అభినందిస్తారు.కర్ణుణ్ణి దుర్యోధనుడు ఆలింగనం చేసుకుంటాడు. దుర్యోధనుడు పాల్గొన్న రాజులకూ, స్నేహితులకూ, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాడు. ఆఖరున తనకి ధర్మము, ధనుర్విద్య నేర్పిన ద్రోణుణ్ణి గురుదక్షిణగా ఏమయినా కోరుకోమని అడుగుతాడు. ద్రోణుడు సంకోచిస్తుంటే అర్ఘ్యం అందించి మాటతప్పనని చెబుతాడు. అప్పుడు ద్రోణుడు అర్ధ రాజ్యాన్ని పాండవులకొసగమని అడుగుతాడు.శకుని సహకారంతో అది అధర్మమని నిరూపించటానికి ప్రయత్నిస్తాడు దుర్యోధనుడు. ద్రోణుడి ఆగ్రహానికి గురి కాకూడదని శకునితో పాటూ కుటిలంగా ఆలోచించి ఒక ఉపాయం చేసుకుని అది ద్రోణుడికి చెబుతాడు దుర్యోధనుడు. ఆ సంవాదం ప్రకారం ఐదు రాత్రులలోపు పాండవుల జాడ కనుక ద్రోణుడు తెలిపితే పాండవులకు అర్ధరాజ్యమిచ్చేస్తానంటాడు దుర్యోధనుడు. కానీ అప్పటికే వనవాసం పూర్తిచేసుకుని అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన పాండవుల జాడ గనుక దుర్యోధనుడికి తెలిస్తే మరలా అరణ్యాజ్ఞాతవాసాలు తిరిగిచేయాల్సి ఉంటుంది. ఆ మాట విని ద్రోణుడు మరింత కోపగిస్తాడు. భీష్ముడు దుర్యోధనుడికి సర్ది చెప్పి ధర్మాచరణలో మోసముండకూడదనిచెబుతాడు. అప్పుడే కీచకుని మరణవార్త తెలుస్తుంది. అది కచ్చితంగా భీముడు మాత్రమే చేయగల పని అని నిర్ణయించుకుని విరాట రాజ కొలువులో ఉన్న పాండవులను కనిపెట్టి, వారికి తిరిగి అరణ్యాజ్ఞాతవాసాలు శిక్షించాలని దుర్యోధనుడు విరాటపురానికి వెళ్తాడు. అక్కడ రాజ్యసీమలలో ఉన్న ఆవులను బంధిస్తాడు.

రెండవ అంకం

విరాట మహారాజుకు ఆ విధంగా దుర్యోధనుడు ఇంకా ఇతర కౌరవ సైన్యం ఆవులను బంధించినట్టూ తెలుస్తుంది. ఆ విషయమై అతను దీర్ఘంగా భగవాన్ (ధర్మరాజు) తో చర్చిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక సైనికుడు వచ్చి భీష్ముడు, ద్రోణుడు మొదలగు వీరులతో సహా కౌరవులను ఉత్తర రాజకుమారుడు జయించినట్టు చెబుతాడు.ఆరా తీయగా బృహన్నల రథసారథిగా ఉత్తర కుమారుడు యుద్ధం చేయగా అందరూ విస్మయం చెంది పారిపోయారని, ఒక్క అభిమన్యుడు మాత్రమే యుద్ధం సలుపుతున్నాడని చెబుతాడు. ఇంకాస్సేపట్లో మళ్ళీ అదే సైనికుడు యుద్ధం ముగిసిన వార్త తీసుకుని వస్తాడు. రాజు వెంటనే ఉత్తర కుమారుణ్ణి కలవాలనుకుంటాడు. అప్పటికే ఉత్తర కుమారుడు చరిత్రకారులకు తన విజయగాథను వినిపిస్తూ, గ్రంథస్థం చేయిస్తూ వ్యస్తంగా ఉంటాడు. అందువలన రాజు బృహన్నలను పిలిచి అసలు వార్త గురించి ఆరా తీస్తాడు. ఇంతలో సైనికులు అభిమన్యుని బంధించిన వార్తను వర్తమానం తెస్తారు. అప్పుడు విరాట రాజు బృహన్నలను పంపి అతిథి మర్యాదలతో అభిమన్యుని తీసుకురమ్మంటాడు. బృహన్నల భీముడితో పాటు కలిసి అభిమన్యును సమీపించి చిత్ర విచిత్రంగా ప్రశ్నలు అడుగుతారు, పేరు పెట్టి పిలుస్తారు (ఒక రాజ్యంలో మరో రాజ్యం నుండి వచ్చిన వారిని నేరుగా పేరు పెట్టి పిలువరాదు, పైగా అభిమన్యు అనే పదానికి తన సొంత అభిమానం లేదా గర్వం గల వాడని అర్ధం వస్తుంది). అప్పటికి విరాటరాజు, ఉత్తర కుమారుడు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉత్తర కుమారుడు బృహన్నల అర్జునుడే అని ప్రకటన చేస్తాడు. అప్పుడు భగవాన్ రూపంలో ఉన్న ధర్మరాజు కూడా తమ అజ్ఞాఅతవాసం వీడిందనీ, ఇక తమ అసలు స్వరూపాల్లోకి వచ్చేయవచ్చని చెబుతాడు. విరాట రాజు సంతోశ్హించి అర్జునునికి తన కూతురు ఉత్తరను వివాహమాడ చూస్తాడు. అప్పుడు అర్జునుడు కాదని, తన కొడుకయిన అభిమన్యుడుకి ఉత్తరనిచ్చి వివాహం చేయమని చెబుతాడు. అందరూ సంతోషిస్తారు, వెంటనే వివాహం నిశ్చయించి ఆ కబురును కౌరవులకు ఉత్తర కుమారుడే స్వయంగా వర్తమానం తీసుకుని వెళ్ళాలని నిర్ణయం జరుగుతుంది.

మూడవ అంకం

కౌరవులు యుద్ధానంతర సమాలోచనలో ఉంటారు. అభిమన్యుణ్ణి రథంతో సహా ఎత్తుకుపోయారన్న విషయమై మాటలు జరుగుతూ ఉంటాయి. అంతటి బలశాలి కేవలం భీముడే అని భీష్ముడనగా, ప్రపంచంలో ఇంకా వేరే ఎవరూ బలవంతులు లేరా అని శకుని అంటాడు. "అలానే ఉత్తర కుమారుడి స్థానంలో యుద్ధం చేసింది కూడా అర్జునుడే అని అంటారా" అని శకుని ఎద్దేవా చేస్తాడు. అప్పుడు భీష్ముడు బాణాలలో ఒకదానిని చూపిస్తూ దీనిపై అర్జునుడు అని ఉంది. ఆ మాట నిజమే అంటాడు. అప్పుడు శకుని ఇంకెవరూ వీరులు అర్జునుడు అని పేరు పెట్టుకో గూడాదా అంటాడు. అదే సమయానికి అక్కడికి ఉత్తర కుమారుడు చేరి అసలు విషయం చెబుతాడు. అది విని శకుని మరింత ఆగ్రహిస్తాడు. ద్రోణుడు ఐదు రాత్రుల గడువు ఇంకా అయిపోలేదనీ, తన గురుదక్షిణ ఇవ్వమనీ అడుగుతాడు. అలాగే ఇస్తాను అని దుర్యోధనుడు చెప్పడంతో నాటకం ముగుస్తుంది.

నాటకానికి ఆధార గ్రంథాలు[మార్చు]

నాటకం మహాభారతం నుండి గ్రహించబడిందని తెలుస్తోంది. పాత్రలు మినహా సన్నివేశాలన్నీ రచయిత కల్పనలు. మహాభారతం ప్రకారం దుర్యోధనుడెలాంటి యాగం చేయలేదు.

మూలములు[మార్చు]

  1. శ్రీభాస ప్రణీత పంచరాత్రం, విత్ ఇంట్రొడక్షన్ బై విద్యారత్న పండిత్ ఎస్. రంగాచార్, సంస్కృత సాహిత్య సదన, మైసూరు 1943. పుట 19