పండితారాధ్యుల మల్లికార్జున శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండితారాధ్యుల మల్లికార్జున శర్మ

పండితారాధ్యుల మల్లికార్జున శర్మ (1910 - 1950) గుంటూరు జిల్లా తెనాలి తాలూకా ఈమని గ్రామములో ఒక సనాతన ఆరాధ్య కుటుంబానికి చెందిన వీరభద్రయ్య, లింగమాంబ గార్లకు 1910 సంవత్సరంలో జన్మించాడు. చిన్నతనములోనే తల్లిని కోల్పోయిన శర్మ పినతల్లి భ్రమరాంబ వద్ద పెరిగాడు[1]..

తెలుగులో పంచకావ్యాలు చదివిన శర్మ హిందీలో రాష్ట్రభాష అధ్యయనం చేశాడు. యుక్తవయసులో జాతీయోద్యమానికి ఆకర్షించబడి 1931-32లో ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని 6 నెలలు రాజమండ్రి జైలులో మరో 6 నెలలు రాయవేలూరు జైలులో శిక్ష అనుభవించాడు. జైలునుండి తిరిగివచ్చి నెత్తిన ఖద్దరు మూటతో ఊరూరా తిరుగుతూ ఖద్దరు అమ్మకముతో బాటు జాతీయోద్యమము ప్రచారము చేస్తున్న శర్మకు సత్యాగ్రహ విరమణ నచ్చలేదు. అదే సమయములో రష్యాలో విప్లవము, అచట స్వాతంత్ర్యాన్ని సాధించిన విధానము మున్నగు విషయాలు చదివి ప్రభావితుడయ్యాడు. శర్మలాంటి యువకులంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతాల చర్చలతో సంఘటితమైనారు. పార్టీ నిషేధకాలములో కార్మిక సంఘాలను, వ్యవసాయ కూలీ సంఘాలను ఊరూరా నిర్మించాడు. శర్మ పట్టుదల, చొరవ, ఓపిక, సమస్యలు పరిష్కరించె విధానం, కలుపుగోలుతనం, వ్యవసాయ కూలీలకు, బీదప్రజలకు దగ్గర చేశాయి. భుజాన సంచితో, వక్కపొడి నములుతూ, నిత్యం చిరునవ్వుతో గ్రామాల వెంట వ్యవసాయ కూలీల మధ్య తిరుగుతూ, వారి సమస్యల పరిష్కారము కొరకు పోరాడుతూ ఉద్యమాన్ని నిర్మిస్తూ దోపిడీ లేని సామ్యవాద రాజ్యాన్ని నెలకొల్పడానికి కృషి చేశాడు. రైతులకు అవసరమైన కృష్ణ కాలువ పనులలో స్వయంగా కూలీలతో బాటు కష్టపడి పనిచేశాడు. 1943లో తన వంతు ఆస్తి పంచుకొని, దానిని అమ్మి పార్టీ నిధికి జమకట్టి తన విప్లవదీక్షను నిరూపించాడు.

స్వాతంత్ర్యానంతరము ప్రజల ఆకాంక్షలు నెరవేరక, పెరిగిన ధరలు, పన్నులు, నల్లబజారులకు వ్యతిరేకముగా రైతు కూలీలను ఐక్యపరిచి ముందుండి పోరాడాడు. తెనాలి తాలూకా అమృతలూరులో పెద్ద ఎత్తున సమ్మె పోరాటము సాగింది. 1950 సెప్టెంబరులో శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాలు చిత్రహింసలు పెట్టారు. ఏ విధమైన రహస్యాలు రాబట్టలేని పోలీసులు చేసిన హింసలకు శర్మ అక్టోబరు 9న మరణించాడు. గుంటూరు కాంప్ మేడపై నుండి దూకి చనిపోయాడని ప్రకటన వెలువడింది.

మూలాలు[మార్చు]

  1. గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట 240