పంతులమ్మ (1978 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పంతులమ్మ 1978 లో విడుదలైన తెలుగు చిత్రం.రంగనాథ్, లక్ష్మీ, జంటగా నటించిన ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం నిర్వహించాడు . నవత ఆర్ట్స్ కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.సంగీతం రాజన్ నాగేంద్ర సమకూర్చారు. ఉత్తమ నటి అవార్డుకు లక్ష్మీ ఈ చిత్రం నుండి ఎంపికైంది.

పంతులమ్మ
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం రంగనాథ్,
లక్ష్మి
సంగీతం రాజన్ - నాగేంద్ర
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

చిత్రకథ[మార్చు]

బి.ఎ. చదివిన శారద ఉద్యోగాన్వేషణలో కాకతాళీయంగా తన అన్న స్నేహితుడైన రాజేష్ కుమారునికి పంతులమ్మగా కుదురుతుంది. తల్లి లేని ఆ బాలుడి పట్ల అనురాగం పెంచుకుని, అతడి ఆలనా పాలనా చూస్తూ, అతడిని క్రమశిక్షణతో పెంచుతున్న పంతులమ్మ శారద అంటే రాజేష్‌కు కూడా అభిమానం ఏర్పడుతుంది. సినీకళాకారుడైన రాజేష్ నిర్విరామంగా షూటింగులలో పాల్గొంటూ నెలలో ఏవారం రోజులు మాత్రమే ఇంటిపట్టున ఉండగలగడం వల్ల తన కుమారుని మంచి చెడ్డలు సరిగా చూడలేక పోతున్నానన్న తపన, లోగడ తన మనస్తాపానికి కారణం కాగా, పంతులమ్మ అతని ఇంటికి వచ్చి అతని కుమారుని విషయంలో అతని ఆందోళన పోగొట్టడమే కాక భార్య సీతను పోగొట్టుకుని అనురాగం, ఆప్యాయత కరువై నిస్సారమైన జీవితం గడుపుతున్న రాజేష్ జీవితంలో మళ్లీ చైతన్యం కలుగజేస్తుంది. రాజేష్, శారదల పరిచయం క్రమంగా పెరుగుతుంది. శారద ప్రతి కదలికా రాజేష్‌కు తన భార్య సీతను గుర్తుకు తెప్పిస్తుంది. శారదలేని ఆ ఇంటిని ఊహించడానికి భయపడే స్థితికి చేరుకుంటాడు రాజేష్. ఇది ఇలా ఉండగా దీర్ఘవ్యాధి పీడితురాలైన రాజేష్ అక్కకు చికిత్స కోసం ఆ ఇంటికి రోజూ వచ్చే డాక్టర్ కన్ను పంతులమ్మ శారదపై పడుతుంది. ఒక రోజు డాక్టర్ శారదను బలాత్కారం చేయబోగా ఆ సమయానికి రాజేష్ వచ్చి ఆ డాక్టర్‌ను తన్ని తరిమివేస్తాడు. రాజేష్‌పై పగబట్టిన డాక్టర్ అతనిపై కక్ష తీర్చుకోవడానికి పన్నాగం పన్నుతాడు. తాను, రాజేష్ భార్య సీతతో కలిసి తీయించుకున్నట్టు ఒక ఫోటో స్థానిక పత్రికలో ప్రకటింపజేసి రాజేష్‌ను అపఖ్యాతి పాలు చేస్తాడు. అనురాగవతి అయిన తన భార్యను కళంకితురాలిగా చూడలేక ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసిక వ్యధను అనుభవిస్తున్న రాజేష్‌కు శారద ధైర్యం చెబుతుంది. ఆ ఫోటో వెనుక రహస్యాన్ని కనుక్కోవడానికి పూనుకుంటుంది. లోగడ సీతవద్ద ఉండే ఆయా వద్దకు వెళ్లి సీత గురించి తెలుసుకుని ఆమె నిప్పులాంటిదన్న విషయాన్ని గ్రహిస్తుంది. సీత ఆయాకు ఇచ్చిన డైరీని తీసుకువస్తుంది. ఆ డైరీని బట్టి సీతను డాక్టర్ ఒకరోజు మంచి మాటలతో తన ఇంటికి తీసుకువెళ్లి బలాత్కారం చేయబోయాడని, ఆ సమయంలో ఫోటో తీయబడిందన్న విషయం తెలుస్తుంది. ఆ ఫోటోను చూపి డాక్టర్ సీతను బ్లాక్ మెయిల్ చేస్తాడన్న భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని కూడా ఆ డైరీ ద్వారా తెలుస్తుంది. ఆ డైరీని శారద రాజేష్‌కు చూపుతుంది. ఈ విషయాలు తెలిసి రాజేష్ కుమిలిపోతాడు. డాక్టర్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి వెడతాడు. ఈ లోగా పోలీసులు వచ్చి రాజేష్‌ను అరెస్ట్ చేస్తారు. పంతులమ్మ శారద రాజేష్ భాగస్వామిని అవుతుంది[1].

నటీనటులు[మార్చు]

 • లక్ష్మి
 • రంగనాథ్
 • దీప
 • గిరిజ
 • నిర్మల
 • శరత్ బాబు
 • రావి కొండలరావు
 • బేబి రాణి
 • అవార్డులు
 • 1977: లక్ష్మి ఉత్తమ నటి అవార్డు.

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు
 • ఛాయాగ్రహణం: బాలు మహేంద్ర
 • సంగీతం : రాజన్-నాగేంద్ర
 • నిర్మాత: ఎన్.కృష్ణంరాజు

పాటలు[మార్చు]

పాట రచన సంగీతం పాడిన వారు
మానసవీణ మధుగీతం....మన సంసారం సంగీతం.... వేటూరి సుందరరామమూర్తి రాజన్-నాగేంద్ర ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
పండగంటి ఎన్నెలంత.... సందరయ్య ..దండగయ్యిపోయింది సందరయ్య...... వేటూరి సుందరరామమూర్తి రాజన్ - నాగేంద్ర ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల
సిరిమల్లె నీవే...విరిజల్లు కావే...వరదల్లే రావే..వలపంతి నీవే.... వేటూరి సుందరరామమూర్తి రాజన్ - నాగేంద్ర ఎస్.పి.బాలసుబ్రమణ్యం
ఎడారిలో కోయిలా...తెల్లారనీ రేయిలా..పూదారులన్నీ గోదారి కాగా... వేటూరి సుందరరామమూర్తి రాజన్ - నాగేంద్ర ఎస్.పి.బాలసుబ్రమణ్యం
తేనెటీగ కుడుతుంటే.... తీపిగుంటదా...అయినా నువ్వు కన్నుకొడుతుంటే ఎన్నెలొస్తది... వేటూరి సుందరరామమూర్తి రాజన్ - నాగేంద్ర
మనసెరిగిన వాడు మా దేవుడు...శ్రీ రాముడు.... వేటూరి సుందరరామమూర్తి రాజన్ - నాగేంద్ర

మూలాలు[మార్చు]

 1. గాంధి (18 March 1978). "చిత్రసమీక్ష పంతులమ్మ". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 64, సంచిక 339. Retrieved 9 January 2018.[permanent dead link]