పచ్చి రొట్ట ఎరువు
పచ్చిరొట్టె ఎరువును అందించే పచ్చిరొట్ట పైర్ల పెంపకం, వినియోగం చాలా సులభమే కాకుండా తక్కువ ఖర్చుతో భూమికి ఎక్కువ పోషకాలను అందిస్తుంది. జనుము, జీలుగ, పెసర, పిల్లి పెసర, అలసంద వంటి పైర్లను పూ మొగ్గ దశ వరకు పెంచి భూమిలో కలియ దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువుగా పరిగణిస్తారు. పచ్చిరొట్ట పైరు సాగులో జీలుగ, జనుము ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి తక్కువ సమయంలో ఎక్కువ రొట్టె పెడతాయి. భూమిలో కలియ దున్నిన తరువాత త్వరగా చివుకుతాయి. ఆకులలో ఎక్కువ నత్రజని శాతం కలిగివుంటాయి. రొట్ట ద్వారా నత్రజనిని ఎక్కువగా పొందుతాయి. ఈ మొక్కలు లెగ్యుం జాతికి చెందినందువలన ఇవి వేర్లలోని బుడిపెలలో నత్రజనిని స్థీరీకరిస్తాయి. మరలా మొక్కకు అందేలా తోడ్పడతాయి. పచ్చిరోట ఎరువులు స్థూల సేంద్రియ ఎరువులే ఇవి నేలకు సేంద్రియ పదార్ధంతో పాటు నత్రజనిని ఇస్తాయి. కానుగ వంటి చెట్ల ఆకులను లేత కొమ్మలను కోసి పొలంలో వేసి కలియ దున్నటం చేయుట వలన తగిన మోతాదులో నత్రజనిని అందజేయవచ్చు. జనుము, జీలుగ, పిల్లి పెసర, పెసర, అలసంద పచ్చిరొట్టె పైర్లగా పూతకు రావడానికి 40 నుండి 50 రోజులు పడుతుంది. వీటిని లేత పూత సమయంలో భూమిలో వేసి కలియదున్నాలి. ఈ విధంగా పచ్చిరొట్టను కలియ దున్నడం వలన భూమి సారవంతం కావడంతో పాటు పంటల దిగుబడులు కూడా అధికంగా ఉంటాయి. పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనిక ఎరువుల ఖర్చు, వినియోగితలు తగ్గుతాయి. నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి.