Jump to content

పరమశివన్ సుబ్బరాయన్

వికీపీడియా నుండి

పరమశివన్ సుబ్బరాయన్
మహారాష్ట్ర గవర్నర్
In office
17 ఏప్రిల్ 1962 – 6 అక్టోబర్ 1962
అంతకు ముందు వారుశ్రీ ప్రకాశ
తరువాత వారువిజయలక్ష్మి పండిట్
కేంద్ర రవాణా, సమాచార శాఖ మంత్రి
In office
1959–1962
అధ్యక్షుడురాజేంద్ర ప్రసాద్
తిరుచెంగోడు లోక్‌సభ సభ్యుడు
In office
1957–1962
అధ్యక్షుడురాజేంద్ర ప్రసాద్
అంతకు ముందు వారుఎస్. కందస్వామి బేబీ
తరువాత వారుకె. అన్బళగన్
ఇండోనేషియాలో భారత రాయబారి
In office
1949–1951
చక్రవర్తిజార్జ్ VI (26 జనవరి 1950 వరకు)
అధ్యక్షుడురాజేంద్ర ప్రసాద్ (26 జనవరి 1950 నుండి)
గవర్నర్ జనరల్చక్రవర్తి రాజగోపాలాచారి (26 జనవరి 1950 వరకు)
అంతకు ముందు వారుఎవరూ లేరు
తరువాత వారుఅలగప్పన్
పోలీసు, హోం మంత్రి (మద్రాస్ ప్రెసిడెన్సీ)
In office
23 మార్చి 1947 – 1948
Premierఓ. పి. రామస్వామి రెడ్డియార్
గవర్నర్ఆర్చిబాల్డ్ ఎడ్వర్డ్ నై
న్యాయ, విద్యా శాఖల మంత్రి (మద్రాస్ ప్రెసిడెన్సీ)
In office
14 జూలై 1937 – 29 అక్టోబర్ 1939
Premierచక్రవర్తి రాజగోపాలాచారి
గవర్నర్జాన్ ఎర్స్కిన్, లార్డ్ ఎర్స్కిన్
3వ మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి (ఫస్ట్ మినిస్టర్)
In office
4 డిసెంబర్ 1926 – 27 అక్టోబర్ 1930
గవర్నర్జార్జ్ గోస్చెన్, 2వ విస్కౌంట్ గోస్చెన్,
సర్ నార్మన్ మార్జోరీబాంక్స్ (తాత్కాలిక)
అంతకు ముందు వారుపానగల్ రాజా
తరువాత వారుపి. మునుస్వామి నాయుడు
స్థానిక స్వపరిపాలన మంత్రి (మద్రాస్ ప్రెసిడెన్సీ)
In office
4 డిసెంబర్ 1926 – 27 అక్టోబర్ 1930
Premierపి. సుబ్బరాయన్
గవర్నర్జార్జ్ గోస్చెన్, 2వ విస్కౌంట్ గోస్చెన్,
సర్ నార్మన్ మార్జోరీబాంక్స్ (తాత్కాలిక)
అంతకు ముందు వారుపానగల్ రాజా
తరువాత వారుపి. మునుస్వామి నాయుడు
బిసిసిఐ 5వ అధ్యక్షుడు
In office
1938–1946
అంతకు ముందు వారుసర్ కె. ఎస్. దిగ్విజయ్‌సింహ్‌జీ
తరువాత వారుఆంథోనీ డి మెల్లో
వ్యక్తిగత వివరాలు
జననం(1889-09-11)1889 సెప్టెంబరు 11
సేలం జిల్లా, బ్రిటిష్ రాజ్
మరణం1962 అక్టోబరు 6(1962-10-06) (వయసు: 73)
మద్రాసు
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిరాధాబాయి సుబ్బరాయన్
సంతానం పి. పి. కుమారమంగళం,
గోపాల్ కుమారమంగళం,
మోహన్ కుమారమంగళం,
పార్వతి కృష్ణన్
కళాశాల
వృత్తిరాజకీయ నాయకుడు
నైపుణ్యంన్యాయవాది
సంతకందస్త్రం:Subbarayan sign.jpg

పరమశివన్ సుబ్బరాయన్ (11 సెప్టెంబర్ 1889 – 6 అక్టోబర్ 1962) భారతీయ రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దౌత్యవేత్త. ఈయన మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా (ఫస్ట్ మినిస్టర్), ఇండోనేషియాలో భారత రాయబారిగా, జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర రవాణా, సమాచార శాఖ మంత్రిగా సేవలందించారు. భారత సైనిక దళాల ప్రధానాధికారిగా (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్) పనిచేసిన జనరల్ పి. పి. కుమారమంగళం, ప్రముఖ రాజకీయ నాయకుడు మోహన్ కుమారమంగళం ఈయన కుమారులు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుడు, కేంద్ర మంత్రిగా పనిచేసిన రంగరాజన్ కుమారమంగళం ఈయన మనవడు.

సుబ్బరాయన్ బ్రిటిష్ రాజ్ కాలంలో 1889 సెప్టెంబర్ 11న సేలం జిల్లాలోని కుమారమంగళం జమీందారీ కుటుంబంలో జన్మించారు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీ, డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజీ, లండన్ విశ్వవిద్యాలయం, ఆక్స్‌ఫర్డ్‌లోని క్రిస్ట్ చర్చిలలో విద్యాభ్యాసం చేశారు. 1922లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు నామినేట్ అయ్యారు. 1926 డిసెంబర్ 4 నుండి 1930 అక్టోబర్ 27 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేసారు.

1933లో సుబ్బరాయన్ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు. రాజాజీ మంత్రివర్గంలో న్యాయ, విద్యా శాఖల మంత్రిగా, రామస్వామి రెడ్డియార్ మంత్రివర్గంలో హోం, పోలీసు శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. స్వతంత్ర భారత మొదటి ఇండోనేషియా రాయబారిగా, 1959 నుండి 1962 వరకు కేంద్ర మంత్రిగా సేవలందించారు. సుబ్బరాయన్ 1962 అక్టోబర్ 6న 73 ఏళ్ల వయస్సులో మరణించారు. మరణించే సమయానికి ఈయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.

తొలి జీవితం, విద్య

[మార్చు]

సుబ్బరాయన్ 1889 సెప్టెంబర్ 11న నామక్కల్ జిల్లా తిరుచెంగోడు సమీపంలోని కుమారమంగళం ఎస్టేట్‌లో పరమశివ గౌండర్ దంపతులకు జన్మించారు.[1][2][3] ఈయన జమీందారుల కుటుంబానికి చెందినవారు.[4][5] చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పట్టభద్రులయ్యారు.[2][4] ఆక్స్‌ఫర్డ్‌లోని క్రిస్ట్ చర్చి నుండి ఎం.ఎ.,[6][7] డబ్లిన్‌లోని ట్రినిటీ కాలేజ్ నుండి ఎల్.ఎల్.డి. పట్టా పొందారు.[6] 1918లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

1922లో సుబ్బరాయన్ మద్రాస్ ప్రెసిడెన్సీ దక్షిణ-మధ్య విభాగానికి చెందిన భూస్వాముల తరఫున మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ అయ్యారు.[5] కౌన్సిల్ కార్యదర్శిగా సేవలందించారు.[8][9] 1923 నాటి అవిశ్వాస తీర్మానంలో ఈయన సి. ఆర్. రెడ్డి, స్వరాజ్య పార్టీకి మద్దతుగా పానగల్ రాజాకు వ్యతిరేకంగా ఓటు వేశారు.[9]

మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా (1926-1930)

[మార్చు]

1926 నవంబర్ 8న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు.[10] స్వరాజ్య పార్టీ 98 స్థానాలకు గాను 41 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, జస్టిస్ పార్టీ 21 స్థానాలు గెలుచుకుంది.[10] ఇది జస్టిస్ పార్టీకి, నాటి ముఖ్యమంత్రి పానగల్ రాజాకు ఎదురుదెబ్బగా మారింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు సాధ్యపడలేదు.

గవర్నర్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని స్వరాజ్య పార్టీని ఆహ్వానించినప్పటికీ ఆ పార్టీ తిరస్కరించింది.[10] జస్టిస్ పార్టీకి తగినంత బలం లేదు. దీంతో గవర్నర్ ఏ పార్టీతోనూ సంబంధం లేని సుబ్బరాయన్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు ఎంపిక చేసి, ఆయనకు మద్దతుగా మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు 34 మంది కొత్త సభ్యులను నామినేట్ చేశారు.[3][11] ఎ. రంగనాథ ముదలియార్, ఆర్. ఎన్. ఆరోగ్యస్వామి ముదలియార్‌లను రెండు, మూడో మంత్రులుగా నియమించి స్వతంత్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంది.[12]

సుబ్బరాయన్ మంత్రివర్గం
శాఖ మంత్రి
విద్య, స్థానిక స్వపరిపాలన పి. సుబ్బరాయన్ (ముఖ్యమంత్రి కూడా) (1926–1930)
ప్రజారోగ్యం, ఎక్సైజ్ ఎ. రంగనాథ ముదలియార్ (1926–1928)
ఎస్. ముత్తయ్య ముదలియార్ (1928–1930)
అభివృద్ధి ఆర్. ఎన్. ఆరోగ్యసామి ముదలియార్ (1926–1928)
ఎం. ఆర్. సేతురత్నం అయ్యర్ (1928–1930)
మూలం: ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ పొలిటికల్ పార్టీస్

సుబ్బరాయన్ పాలన గవర్నర్ ద్వారా నియమించబడి, ఆయన నియంత్రణలోనే నడవడంతో జస్టిస్ పార్టీ, స్వరాజ్య పార్టీల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.[12] 1927 మార్చిలో జస్టిస్ పార్టీకి చెందిన పి. మునుస్వామి నాయుడు ప్రభుత్వ మంత్రుల వేతనాల్లో కోత విధించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, అది 41 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[12] 1927 ఆగస్టు 23న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది, కానీ గవర్నర్, ఆయన నామినేట్ చేసిన సభ్యుల మద్దతుతో 56కి ఎదురుగా 67 ఓట్లతో ఆ తీర్మానం ఓడిపోయింది.[13]

మాంటేగ్యూ-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల పురోగతిపై నివేదిక ఇవ్వడానికి 1927లో బ్రిటిష్ పార్లమెంట్ సైమన్ కమిషన్‌ను నియమించింది.[13] కమిషన్‌ను బహిష్కరించాలని స్వరాజ్య పార్టీ ఒక తీర్మానాన్ని తీసుకురాగా, అది 61-50 ఓట్లతో ఆమోదం పొందింది (12 మంది తటస్థంగా ఉన్నారు).[14] సుబ్బరాయన్ ఈ తీర్మానాన్ని వ్యతిరేకించగా, ఆయన మంత్రివర్గంలోని రంగనాథ ముదలియార్, ఆరోగ్యస్వామి ముదలియార్‌ మద్దతు తెలిపారు.[14] దాంతో సుబ్బరాయన్ రాజీనామా చేయడంతో పాటు తన మంత్రుల చేత కూడా బలవంతంగా రాజీనామా చేయించారు.[14] స్వరాజ్య పార్టీ-జస్టిస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండటంతో, గవర్నర్ ప్రతిపక్షంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారు. పానగల్ రాజా మద్దతు పొందడం కోసం జస్టిస్ పార్టీ ప్రముఖ నాయకుడు కృష్ణన్ నాయర్‌ను తన లా మెంబర్‌గా నియమించారు.[14] పానగల్ రాజా నాయకత్వంలో జస్టిస్ పార్టీ వైఖరి మార్చుకుని సుబ్బరాయన్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. వెంటనే సైమన్ కమిషన్‌కు స్వాగతం పలుకుతూ జస్టిస్ పార్టీ తీర్మానం చేసింది.[15] సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 28,[15] 1929 ఫిబ్రవరి 18 తేదీల్లో మద్రాస్‌ను సందర్శించగా,[16] స్వరాజ్య పార్టీ, కాంగ్రెస్ పార్టీలు దానిని బహిష్కరించాయి. జస్టిస్ పార్టీ, సుబ్బరాయన్ ప్రభుత్వం కమిషన్‌కు ఘన స్వాగతం పలికాయి.[16]

1930 ఎన్నికలలో కాంగ్రెస్, స్వరాజ్య పార్టీలు పోటీ చేయకపోవడంతో జస్టిస్ పార్టీ భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. సుబ్బరాయన్ తర్వాత మునుస్వామి నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.[17]

విధానాలు

[మార్చు]

పానగల్ రాజా ప్రభుత్వం 1921లో కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్ (G.O. No. 613) ద్వారా ప్రెసిడెన్సీలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది.[18] అయితే ఈ ఉత్తర్వులు 1927 వరకు అమలులోకి రాలేదు. సుబ్బరాయన్ ప్రభుత్వం 1921 నాటి ఆర్డర్‌ను అమలు చేయడం కోసం కమ్యూనల్ G.O. Ms No. 1021ని తీసుకొచ్చింది.[18][19][20] ఈ చట్టాన్ని సుబ్బరాయన్ కేబినెట్‌లోని విద్యాశాఖ మంత్రి ఎస్. ముత్తయ్య ముదలియార్ 1927 ఏప్రిల్ 11న ప్రవేశపెట్టారు.[19] ఈ చట్టం దళితులకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు భారతీయ క్రైస్తవులు, ముస్లింలకు ప్రాతినిధ్యం పెంచింది.[21] అదే సమయంలో బ్రాహ్మణుల రిజర్వేషన్లను 22% నుండి 16%కి, బ్రాహ్మణేతరుల రిజర్వేషన్లను 48% నుండి 42%కి తగ్గించింది.[21] ఈ చట్టం 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు అమలులో ఉంది.

సుబ్బరాయన్ తన పదవీకాలంలో మద్రాస్ డిస్ట్రిక్ట్ మునిసిపాలిటీస్ యాక్ట్, లోకల్ బోర్డ్స్ యాక్ట్‌లను ప్రవేశపెట్టారు.[20] రాజా సర్ అన్నామలై చెట్టియార్ స్థాపించిన అన్నామలై విశ్వవిద్యాలయాన్ని 1929లో చెట్టినాడులో సుబ్బరాయన్ ప్రారంభించారు.[22] మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏర్పాటు చేయబడిన మొదటి నివాసిత (రెసిడెన్షియల్) విశ్వవిద్యాలయం అన్నామలై విశ్వవిద్యాలయం.[22]

లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా (1930-1937)

[మార్చు]

1930లో సుబ్బరాయన్ మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు స్వతంత్ర సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. శాసనసభ సభ్యుడిగా 1930లో సేలం జిల్లాలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయడంలో సుబ్బరాయన్ కీలక పాత్ర పోషించారు. 1943లో బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసే వరకు సేలంలో మద్యపాన నిషేధం అమలులో ఉంది. 1932లో సి. ఎస్. రంగా అయ్యర్ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో అస్పృశ్యత నిర్మూలన బిల్లును ప్రవేశపెట్టారు.[23] 1932 నవంబర్ 1న సుబ్బరాయన్ దేవాలయ ప్రవేశ బిల్లును ప్రతిపాదించారు. ఇది నిమ్న వర్గాల ప్రజలు, దళితులు హిందూ దేవాలయాలలోకి ప్రవేశించడానికి అనుమతించింది, వారి ప్రవేశాన్ని నిరోధించడాన్ని శిక్షార్హమైన నేరంగా పేర్కొంది.[24][25][26] జైలులో ఉన్న మహాత్మా గాంధీకి ఈ తీర్మానం కాపీని పంపించారు.[27] అయితే వైస్రాయ్ ఆలయ ప్రవేశం అనేది అఖిల భారత సమస్య అని, ప్రాంతీయ ప్రాతిపదికన చేపట్టకూడదని తెలుపుతూ అనుమతి నిరాకరించారు.[28] 1937లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు దేవాలయ ప్రవేశ బిల్లు ఆమోదం పొందలేదు.[24] సుబ్బరాయన్ మొదటి నుంచీ మహాత్మా గాంధీ అనుచరుడిగా ఉంటూ 1933లో అధికారికంగా భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరారు.[25] తమిళనాడు హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.[25]

రాష్ట్ర కేబినెట్, స్వాతంత్ర్య ఉద్యమం (1937-47)

[మార్చు]

సుబ్బరాయన్ కాంగ్రెస్ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారి (రాజాజీ) అభిమాని.[25] ఆస్తి కేసులలో రాజాజీ ఈయనకు వ్యక్తిగత న్యాయవాదిగా వ్యవహరించారు. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో కాంగ్రెస్ విజయం సాధించి రాజాజీ ప్రధానిగా (ప్రీమియర్) బాధ్యతలు స్వీకరించినప్పుడు, సుబ్బరాయన్‌ను న్యాయ, విద్యా శాఖల మంత్రిగా నియమించారు.[2][3][29][30][31][32] 1939లో రెండో ప్రపంచ యుద్ధంలో భారత్‌ను చేర్చడాన్ని నిరసిస్తూ రాజాజీ కేబినెట్‌తో పాటు సుబ్బరాయన్ కూడా రాజీనామా చేశారు.[3] 1937-38 నుండి 1945-46 వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడిగా పనిచేశారు.[33]

క్విట్ ఇండియా ఉద్యమంలో సుబ్బరాయన్ చురుగ్గా పాల్గొని సత్యమూర్తి, ఎం. భక్తవత్సలం వంటి నాయకులతో కలిసి అరెస్టు అయ్యారు.

1947లో మద్రాసులోని రామస్వామి రెడ్డియార్ కేబినెట్‌లో హోం, పోలీసు శాఖల మంత్రిగా పనిచేశారు.[2][3] భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా సేవలందించారు.[2][34] ప్రాంతీయ రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు.[35]

దౌత్య సేవలు (1949-1951)

[మార్చు]

1949 నుండి 1951 వరకు సుబ్బరాయన్ స్వతంత్ర భారత మొదటి ఇండోనేషియా రాయబారిగా సేవలందించారు.[3][36] 1951 మార్చి 3న ఇండోనేషియా విదేశాంగ మంత్రి మహమ్మద్ రోమ్‌తో మైత్రీ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు.[37][38] 1951లో ఈయన పదవీకాలం ముగియడంతో అలగప్పన్ ఈయన స్థానంలో నియమితులయ్యారు.[36]

తరువాతి సంవత్సరాలు (1952-1962)

[మార్చు]

భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[39] 1954 నుండి 1957 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.[3] 1955 జూన్ 7న బి. జి. ఖేర్ నాయకత్వంలో ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన మొదటి అధికార భాషా కమిషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఈ కమిషన్ 1956 జులై 31న నివేదిక సమర్పించింది. ఆంగ్లం స్థానంలో హిందీని ఏకైక అధికార భాషగా చేయాలని అది సిఫార్సు చేసింది. సుబ్బరాయన్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన సునీతి కుమార్ ఛటర్జీ ఈ సిఫార్సులతో విభేదించి తమ విభిన్న అభిప్రాయాలను (డిసెంటింగ్ నోట్స్) నివేదికకు జోడించారు.[40][41] తరువాత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ హిందీని ఏకైక అధికార భాషగా చేయడంపై సుబ్బరాయన్ అభిప్రాయాన్ని కోరగా, ఆయన దానిని వ్యతిరేకించారు.[42][43]

1957లో తిరుచెంగోడు నుండి లోక్‌సభకు ఎన్నికై 1962 వరకు ఎంపీగా ఉన్నారు.[44][45] 1959 నుండి 1962 వరకు కేంద్ర ప్రభుత్వంలో రవాణా, సమాచార శాఖల మంత్రిగా సేవలందించారు.[46][47][48][49] 1962లో తిరిగి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.[45]

ఇతర ఆసక్తులు

[మార్చు]

సుబ్బరాయన్‌కు క్రీడల పట్ల మక్కువ ఎక్కువ. క్రికెట్‌పై అనేక వ్యాసాలు రాశారు.[50] మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతీయ క్రికెట్ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి సంస్థ 'ఇండియన్ క్రికెట్ ఫెడరేషన్' వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బిసిసిఐ (BCCI) అధ్యక్షుడిగా సేవలందించారు.[33] 1936 ఇంగ్లాండ్ పర్యటన నుండి లాలా అమర్‌నాథ్ వెనక్కి పంపబడటంపై విచారణ జరిపిన కమిషన్‌లో సర్ జాన్ బ్యూమోంట్, సికందర్ హయాత్ ఖాన్‌లతో పాటు ఈయన సభ్యుడిగా ఉన్నారు. మద్రాస్ ఒలింపిక్ అసోసియేషన్, మద్రాస్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.[51]

మరణం

[మార్చు]

సుబ్బరాయన్ 1962 అక్టోబర్ 6న 73 ఏళ్ల వయస్సులో మరణించారు.[52]

కుటుంబం, వారసత్వం

[మార్చు]
1989 భారత తపాలా బిళ్ళపై సుబ్బరాయన్

సుబ్బరాయన్ తన ప్రెసిడెన్సీ కాలేజీ సహచరి, మంగళూరు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాధాబాయి కుల్ముడ్‌ను కుటుంబ సభ్యుల వ్యతిరేకతను ఎదుర్కొని బ్రాహ్మో సమాజ్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.[3][9][53] రాధాబాయి సుబ్బరాయన్ మహిళల హక్కుల కోసం చురుగ్గా పోరాడారు, పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించారు.

సుబ్బరాయన్ పెద్ద కుమారుడు మోహన్ కుమారమంగళం ఇందిరా గాంధీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.[11] రెండో కుమారుడు జనరల్ పి. పి. కుమారమంగళం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు, భారత సైనిక దళాల ప్రధానాధికారిగా సేవలందించారు. మూడో కుమారుడు గోపాల్ కుమారమంగళం ప్రభుత్వ రంగ సంస్థలకు అధిపతిగా వ్యవహరించారు. మోహన్ కుమారుడు, సుబ్బరాయన్ మనవడు రంగరాజన్ కుమారమంగళం కాంగ్రెస్, ఎన్డీఏ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు.[11] సుబ్బరాయన్ కుమార్తె పార్వతి కృష్ణన్ కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకురాలు. ఈమె 1954 నుండి 1957 వరకు రాజ్యసభ సభ్యురాలిగా, మూడుసార్లు కోయంబత్తూరు నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు.[54]

1989 అక్టోబర్ 16న భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సుబ్బరాయన్ తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించారు.[25][55]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • రాజకీయ కుటుంబాల జాబితా

మూలాలు

[మార్చు]
  1. ↑ Kohli, A. B. (1988). Directory of Union Ministers, 1947–1987. Reliance Pub. House. p. 122.
  2. 1 2 3 4 5 Dictionary of Indian Biography. Indian Bibliographic Centre. 200. p. 438. ISBN 978-81-85131-15-3. {{cite book}}: ISBN / Date incompatibility (help)
  3. 1 2 3 4 5 6 7 8 "Rajya Sabha Who's Who". Rajya Sabha. Archived from the original on 18 ఆగస్టు 2007. Retrieved 4 జనవరి 2009.
  4. 1 2 The Times of India Directory and Year Book, Including Who's who. Bennett, Coleman & Co. 1965. p. 775.
  5. 1 2 3 The Congress in Tamilnad: Nationalist Politics in South India, 1919–1937. Manohar. 1977. p. 236. ISBN 978-0-908070-00-8.
  6. 1 2 The Social Service Quarterly. Bombay: Social Service League. 1961. p. 32.
  7. ↑ Panikkar, Kavalam Madhava (1954). Sardar K.M. Panikkar: Shashtyabdapoorthy Souvenir. Mathrubhumi Press. p. 92.
  8. ↑ The India Office and Burma Office List. Harrison and Sons, Ltd. 1922. p. 78.
  9. 1 2 3 South Indian Celebrities, Pg 101
  10. 1 2 3 Encyclopedia of Political Parties, Pg 189
  11. 1 2 3 "Kumaramangalam family's role in development remembered". The Hindu. 17 అక్టోబరు 2004. Archived from the original on 19 జనవరి 2005.
  12. 1 2 3 Encyclopedia of Political Parties, Pg 190
  13. 1 2 Encyclopedia of Political Parties, Pg 191
  14. 1 2 3 4 Encyclopedia of Political Parties, Pg 192
  15. 1 2 Encyclopedia of Political Parties, Pg 193
  16. 1 2 Encyclopedia of Political Parties, Pg 194
  17. ↑ Encyclopedia of Political Parties, Pg 196
  18. 1 2 "Tamil Nadu swims against the tide". The Statesman. Archived from the original on 29 సెప్టెంబరు 2007. Retrieved 5 జనవరి 2009.
  19. 1 2 Murugan, N. (9 అక్టోబరు 2006). "RESERVATION (Part-2)". National. Archived from the original on 8 జనవరి 2009. Retrieved 5 జనవరి 2009.
  20. 1 2 South Indian Celebrities, Pg 107
  21. 1 2 Jaffrelot, Christophe (2003). India's silent revolution: Rise of lower castes in North India. C. Hurst & Co. Publishers. p. 175. ISBN 978-1-85065-670-8.
  22. 1 2 "About University". Annamalai University. Archived from the original on 25 నవంబరు 2012. Retrieved 5 జనవరి 2009.
  23. ↑ Keer, Dhananjay (1971). Dr. Ambedkar: Life and Mission. Popular Prakashan. p. 225. ISBN 978-81-7154-237-6.
  24. 1 2 Mohan, Pullam Ethiraj (1993). Scheduled Castes, History of Elevation, Tamil Nadu, 1900–1955: History of Elevation, Tamil Nadu, 1900–1955. New Era Publications. p. 132.
  25. 1 2 3 4 5 Bakshi, Sri Ram; Om Prakash Ralhan (2008). Madhya Pradesh Through the Ages. Sarup & Sons. p. 136. ISBN 978-81-7625-806-7.
  26. ↑ South Indian Celebrities, Pg 108
  27. ↑ Thangavelu, G.; K. Veeramani (1990). Social Justice in Tamilnadu. Fest[s]chrift Committee for Prof. G. Thangavelu, School of Historical Studies, Madurai Kamarajar University. p. 8.
  28. ↑ Keer, Dhananjay (1971). Dr. Ambedkar: Life and Mission. Popular Prakashan. p. 232. ISBN 978-81-7154-237-6.
  29. ↑ Parthasarathi, R. (1982). K. Kamaraj. Publications Division, Ministry of Information and Broadcasting, Govt. of India. pp. 22.
  30. ↑ Kesavan, C. R. (2003). Unfolding Rajaji. Madras: East West Books. p. 33.
  31. ↑ Ramanujam, K. S. (1967). The big change. Higginbotham's. p. 218.
  32. ↑ Bakshi, Sri Ram (1992). V.V. Giri: The Labour Leader. p. 259. ISBN 978-81-7041-493-3.
  33. 1 2 "Presidents of the Board of Control for Cricket in India (BCCI)". Archived from the original on 7 ఫిబ్రవరి 2009. Retrieved 11 డిసెంబరు 2008.
  34. ↑ Rao, B. Shiva; V. K. N. Menon; Subhash C. Kashyap; N. K. N. Iyengar (1966). The Framing of India's Constitution. Bombay: Indian Institute of Public Administration. p. 302.
  35. ↑ Rao, B. Shiva; V. K. N. Menon; Subhash C. Kashyap; N. K. N. Iyengar (1960). The Framing of India's Constitution. Indian Institute of Public Administration. p. 453.
  36. 1 2 "Previous Indian Ambassador's to Indonesia". Embassy of India, Jakarta. Archived from the original on 17 ఆగస్టు 2007. Retrieved 11 డిసెంబరు 2008.
  37. ↑ "TREATY OF FRIENDSHIP BETWEEN INDIA AND THE REPUBLIC OF INDONESIA". India's Ministry of External Affairs. 1951. Archived from the original on 10 ఏప్రిల్ 2009. Retrieved 18 డిసెంబరు 2008.
  38. ↑ "India and Indonesia: Treaty of Friendship" (PDF). United Nations Treaty Collection. United Nations. Retrieved 18 డిసెంబరు 2008.
  39. ↑ Nalanda Year-book & Who's who in India: An Indian and International Annual of Current Statistics, Events and Personalities. 1951. p. 738.
  40. ↑ Simpson, Andrew (2007). Language and national identity in Asia. Oxford University Press. p. 71. ISBN 978-0-19-926748-4.
  41. ↑ Kumar, Virendra (1993). Committees and commissions in India. Concept Publishing Company. pp. 53–66. ISBN 978-81-7596-312-2.
  42. ↑ Prasad, Rajendra; Valmiki Choudhary (1992). Dr. Rajendra Prasad: Correspondence and Select Documents : Presidency Period. Allied Publishers. p. 125. ISBN 978-81-7023-343-5.
  43. ↑ Amarjit, S. Narang (1995). Ethnic Identities and Federalism. Indian Institute of Advanced Study. p. 154.
  44. ↑ "Statistical Reports of the general elections 1957 to the First LokSabha" (PDF). Election Commission of India. Retrieved 4 జనవరి 2009.
  45. 1 2 Singh, H. D. (1996). 543 Faces of India: Guide to 543 Parliamentary Constituencies. Newmen Publishers. p. 248.
  46. ↑ Eminent Indians who was Who, 1900–1980, Also Annual Diary of Events. Durga Das Pvt. Ltd. 1985. p. 329.
  47. ↑ The Europa Year Book. Europa Publications Limited. 1961. p. 573.
  48. ↑ Great Britain Office of Commonwealth Relations (1960). The Commonwealth Relations Office List. H. M. Stationer Office. p. 175.
  49. ↑ C.P. 1959. p. 33.
  50. ↑ Natesan, G. A. (1939). The Indian Review. G.A. Natesan & Co. p. 276.
  51. ↑ Bakshi, Sri Ram; Om Prakash Ralhan (2008). Madhya Pradesh Through the Ages. Sarup & Sons. p. 137. ISBN 978-81-7625-806-7.
  52. ↑ The Social Service Quarterly. Bombay: Social Service League. 1961. p. 32.
  53. ↑ Rajannan, Busnagi (1992). Salem Cyclopedia: A Cultural and Historical Dictionary of Salem District, Tamil Nadu. Institute of Kongu Studies. p. 140.
  54. ↑ "Biographical sketch of Rajya Sabha members". Rajya Sabha. Archived from the original on 8 జూలై 2015. Retrieved 4 జనవరి 2009.
  55. ↑ The Journal of Parliamentary Information. India Parliament. Lok Sabha. 1989. p. 481.

ఇతర లింకులు

[మార్చు]

మూస:Presidents of BCCI