పల్లెల్లో వినోద కార్యక్రమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమ్మిరెడ్డి గారి పల్లె వద్ద అసంపూర్ణంగా ఉన్న పాండవుల ఆలయం. మహాభారతం జరిగేది ఇక్కడే. కొమ్మిరెడ్డి గారి పల్లెలో తీసిన చిత్రం

పల్లెవాసుల వినోద కార్యక్రమాలు గా బుర్రకథ, హరికథ, జాతరలు, సర్కస్, మోడి, మహా భారత నాటకము, వీధి నాటకాలు, భజనలు, కోలాటము మొదలైనవి ఉన్నాయి. పల్లెవాసులకు గతంలో, అనగా టి.వి.లు పూర్తిగాను, సినిమాలు పెద్ద పట్టణాలలో తప్ప పల్లెల్లో లేని కారణంగా, ఆకాలంలో ఇటువంటి కార్యక్రమాలే పల్లె ప్రజలకు వినోద కార్యక్రమాలుగా ఉండేవి.

కథా కాలక్షేపం[మార్చు]

బుర్ర కథ[మార్చు]

"బుర్రకథ" అనే వినోద కార్యక్రమంలో కథా కారులు ముగ్గురు ఉంటారు. ప్రధాన పాటగాడు, ఇద్దరు వంత పాట గాళ్లు ఉంటారు. వీరి వేషధారణ సాధారణమే. కాని పాట పాడుతూ కథ చెప్పుతుంటే ప్రజలకు వారు అయా పాత్రల రూపంలోనే కనిపించి మైమరచిపోతారు. వీరిని ఒక్కో ఊరి వారు ఆ రాత్రికి కథ చెప్పడానికి ఒప్పించు కుంటారు. వారు ఎక్కువగా బాలనాగమ్మ కథ, కావమ్మ కథ, కాటమరాజు కథ, మొదలగు కథలను చెప్పేవారు. ప్రధాన కథకుడు, వినరా భారత వీర కుమారా విజయము నీదేరా...... అంటే మిగతా ఇద్దరు తందాన తానా.... అని వంత పాడుతారు. బాలనాగమ్మ కథ చెపుతుంటే ఆ కథలో బాలనాగమ్మ పడే కష్టాలను పాటలతో వాళ్లు వర్ణించి చెపుతుంటే కంట నీరు పెట్టని వారుండరు. అలాగే మాయల పకీరు బాల నాగమ్మను పెట్టే కష్టాలను వర్ణిస్తుంటే వీక్షకులు కోపంతో ఊగి పోతుంటారు. కావమ్మ కథ మరీ దుఖఃపూరితమైనది. కథ వింటూ బోరున ఏడ్చే వారు ఆడవారు. ఇది సుమారు రెండు గంటలు సాగేది. ఎవరికి వారు వారి ఊర్లో నడి వీధిలో జరిగే ఈ బుర్ర కథను వీక్షించి ఆనందించే ప్రక్రియ ఇది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలోనూ.... ఆ తర్వాతి కొన్ని సంవత్సరాల పాటు.... ఈ బుర్ర కథలో సుభాష్ చంద్రబోసు కథను అనేక సార్లు వినిపించారు. అది చాలా ప్రాచుర్యం పొందింది. స్వతంత్ర భారతంలో మొదటి సారి జరిగిన ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ వారు ఈ బుర్ర కథ ప్రక్రియ ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. అంతకు ముందే ఈ ప్రక్రియ ఉన్నా ఆ తర్వాతనే ఇది మరింత బహుళ ప్రజాదరణ పొందింది. ఆ రోజుల్లో సుభాష్ చంద్ర బోస్ పై అనేక బుర్రకథలు వెలువడ్డాయి. అప్పటి నుండే... బుర్ర కథలో మొదటి పాదం..... వినరా భారత వీర కుమార విజయము మనదేరా... అనే పాదం ప్రచారంలోనికి వచ్చింది. స్వాతంత్ర్య సంగ్రామంలో మనం విజయం సాధించినా ఇప్పటికీ ఆ పాదమే. ఈనాటికి కూడా అన్ని కథలకు ఈ మొదటి పాదామే పాడుతారు. ఈ బుర్ర కథకు ఇంతటి గొప్పతనాన్ని కలిగించిన వారు పద్మశ్రీ బిరుదాంకితుడైన షేక్ నాజర్. ఇతను ఇస్లాం మతానికి చెందిన వాడైనా అతను చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ పురాణాలకు చెందినవే. అతను శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలి యుద్ధం కథను బుర్ర కథగా చెప్పమని కోరారు. దానితో నాజర్ తానే కథా రచనకూ పూనుకొని సాధించాడు. ఇతను, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, భక్తప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం, బెంగాలు కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలి లోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది. కొంత తేడాతో జంగం కథ, పంబల కథ, జముకుల కథ, పిచ్చుకుంట్ల కథ మొదలగునవి కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో ఉండేవి. ఇటువంటి కథలు పామరులను కూడా చాల బాగా ఆకట్టుకునేవి. కాని ఇవేవీ ప్రస్తుత కాలంలో పెద్ద ప్రచారంలో లేవు. ప్రస్తుతం ఈ కథకులు వారి ప్రావీణ్యాన్ని కేవలం భిక్షాటనకే ఉపయోగించు కుంటున్నారు. కొంత కాలానికి ఇలాంటి కళలు అంతరించి పోయే అవకాశమున్నది.

హరికథ[మార్చు]

హరి కథను చెబుతున్న హరికథాకారిణి

హిందూ ఆలయాలలో అప్పుడప్పుడు హరికథను ఏర్పాటు చేసేవారు ఆలయ నిర్వహకులు. దానిని చూడడానికి చుట్టుపక్కల పల్లెల నుండి జనం వచ్చేవారు. ఇలాంటి కథల వలననే నిరక్షరాస్యులైన పల్లె వాసులు పురాణాలలోని విషయాలను అవహగాహన చేసుకునేవారు. ఈ హరికథకుడు ఒక్కడే ఉన్నా పక్కవాయిద్య కారులు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇందులో ఉపయోగించే వాయిద్యాలు తబల, వయొలిన్, హర్మోనియం, వంటివి ఉంటాయి. వాటికి తోడు ప్రధాన కథకుడు చేతిలో చిడతలు పట్టుకొని, కాళ్లకు గజ్జెలు కట్టుకొని సందర్భాను సారంగా నర్తిస్తూ కథ చెపుతుంటాడు. అప్పుడప్పుడు మధ్యలో పిట్టకథలు, హాస్య సంభాషణము కథను రక్తి కట్టిస్తుంటాయి. ఈ హరికథ కూడా ప్రజలకు చాలా వినోదాన్ని పంచేది. చదువు రాని పల్లె ప్రజలకు పురాణ విజ్ఞానము కలగడానికి ఈ హరికథలే ముఖ్య కారణం.

హరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన "హరికథా పితామహుడు" అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు నారాయణదాసు సమకాలికులు బి.బాలజీదాసు, చేవూరి ఎరుకయ్య దాసు, పాణ్యం సీతారామ భాగవతార్‌, ప్రయాగ సంగయ్య, కోడూరు భోగలింగదాసు వంటి వారు సుప్రసిద్ధులు. దాసుగారి శిష్యుల్లో పసుమర్తి కృష్ణమూర్తి, వాజపేయాజుల వెంకటసుబ్బయ్య, నేతి లక్ష్మీనారాయణ, పుచ్చల భ్రమరదాసు, మైనంపాటి నరసింగరావు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు, ముసునూరి సూర్యనారాయణ, పరిమి సుబ్రహ్మణ్యశాస్త్రి, ములుకుట్ల పున్నయ్య, అద్దేపల్లి లక్ష్మణదాసు వంటి వారెందరో ఉన్నారు. ఆ శిష్యులకు శిష్యులు, ప్రశిష్యులు హరికథాగానాన్ని సుసంపన్నం చేశారు. ఆర్‌.దుర్గాంబ, బెజవాడ నాగరాజ కుమారి వంటి భాగవతారిణుల ప్రేరణతో ఇప్పుడు అనేకమంది భాగవతారిణులు హరికథాగానం చేస్తున్నారు.

జాతరలు[మార్చు]

జాతర : అక్కడక్కడా గ్రామ దేవతల ముందు జాతర జరిగేది. ఇది కూడా జనానికి వినోదాన్ని పంచేదే. అన్ని జాతరలలోను పూజా విధానము వేరుగా ఉంటుంది. ఈ పూజలలో వేపాకుకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని భీకర దృశ్యాలుంటాయి. ఆడవారికి పూనకం వచ్చి విపరీతంగా ఊగుతూ పాటలు పాడుతారు. భవిష్యత్తు చెప్పుతారు. వింత వింత నృత్యాలు చేస్తుంటారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది గంగమ్మ జాతర. పంట కాలం పూర్తయి పంటలన్ని ఇంటికి చేరిన సమయాన వచ్చే గంగపండుగ అటు రైతులకు, ఇటు రైతుల పై ఆధారపడిన వారికి చాల పెద్ద పండుగ. ప్రస్తుతం పల్లెల్లో ఈ పండుగ చాల వరకు కనుమరుగైనది. కొన్ని కులాలకు వారి కుల దేవత ఉంటుంది. ఉదాహరణకు, చిత్తూరు జిల్లా ప్రాంతంలో కమ్మ కులానికి చెందిన గొర్రె పాటి వారి వంశస్తులకు సంబంధించిన కుల దేవత "ధనుకొండ గంగమ్మ" ప్రతి ఏడాది ఈ దేవతకు జాతర జరుగుతుంది. అదే విధంగా కొన్ని కులాల వారిగా కొంతమంది కుల దేవతలు ఉంటారు. ఆయా కులాలలోని వర్గం వారు ఆయా కుల దేవతల ఉత్సవం ప్రతి ఏడాది జరుపు తారు. ఇదొక సాంప్రదాయం. ఇలా చాల ప్రసిద్ధి గాంచిన జాతరలు.... తిరుపతి లోని గంగమ్మ జాతర, చిత్తూరు దగ్గర బాట గంగమ్మ జాతర, తెలంగాణాలో సమ్మక్క సారక్క జాతర . ఈ సమ్మక్క సారక్క జాతర అంతర రాష్ట్రీయ స్థాయి జాతర. వాటి గురించి సంక్షిప్తంగా:......

సమ్మక్క సారక్క జాతర

సమ్మక్క సారక్క జాతరలో జన సందోహం

తెలంగాణా ప్రాంతలో వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో, తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారం దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, యావదాంధ్ర దేశములోనే గాక, అఖిల భారతదేశములోనే వనదేవతలుగా పూజ లందుకుంటున్నారీ సమ్మక్క-సారక్కలు. దేశములోనే అతి పెద్ద గిరిజన జాతరగా గణుతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిసా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996 లో ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర పండుగగా గుర్తించింది . జాతర మొదటి రోజున 'కన్నెపల్లి ' నుంచి సారక్కలను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యథా స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము (బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు. ఈ జాతరకు వచ్చే ప్రజలు ఇక్కడ రెండు మూడు రోజులు బస చేయడానికి సర్వ సిద్ధంగా వస్తారు. వారు ఇక్కడ తాత్కాలికంగా గుడిసెలు, పందిళ్లు, గుడారాలు వేసుకొని బసచేసి తమ మొక్కులను తీర్చుకొని వెడతారు. ప్రభుత్వం వైపు నుండి మంత్రి వర్యులు ఈ జాతరకు వచ్చి తమ నిలువెత్తు బంగారాన్ని (బెల్లాన్ని) సమర్పించు కుంటారు.

తిరుపతి గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గది. తెలంగాణలో సమ్మక్కసారక్క జాతర లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైంది. తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజల ఆచార వ్యవహారాలనూ వారి జీవన విధానాలనూ అచ్చంగా ప్రతిబింబించే అపురూపమైన జాతర ఇది. తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు ఎనిమిది రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ గంగమ్మతల్లి తిరుమల వేంకటేశుడికి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో తితిదే నుంచి గంగమ్మకు సారె అందుతుంది. జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు-కుంకుమలూ.. శేషవస్త్రాలూ గంప, చేట తదితర మంగళద్రవ్యాలను మేళ, తాళాలతో తీసుకొచ్చి, పుట్టింటి సారెగా అందజేస్తారు. పూర్వం తిరుమల వచ్చే భక్తులు ముందుగా గంగమ్మను పూజించిన తరువాతే స్వామివారి దర్శనానికి వెళ్లేవారట. ఈ విషయం తెలిసినవారు ఇప్పటికీ అదే తరహాలో గంగమ్మ తల్లిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం చేసుకుంటారు.

బోయ కొండ గంగమ్మ బోయ కొండ గంగమ్మ చిత్తూరు జిల్లాలోని చౌడే పల్లి సమీపాన ఉన్న కొండపై వెలసిన దేవత. ఈ ఆలయం పురాతనమైనా, ఈ మధ్యనే ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. జంతు బలులు ఇక్కడి నిత్యకృత్యం. భక్తులు కుటుంబ, బంధు, మిత్ర సమేతంగా వచ్చి వేటను తెచ్చుకొని, ఇక్కడే కోసి వంట చేసుకొని, తిని, ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకొని నిదానంగా ఇళ్లకు వెడతారు. ఇక్కడ భక్తులకు వంట చేసుకోడానికి పాత్రలు, గుడారాలు వంటివి అద్దెకు కూడా ఇస్తారు. ఇతర పూజా సామాగ్రి కూడా అందు బాటులో ఉంటుంది. ఇది కర్ణాటక, తమిళ నాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా ఉన్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు.

నాటకాలు[మార్చు]

మహా భారత నాటకాలు ఇది సుమారు ఇరవై రోజులు జరుగు తుంది. ( భారతంలోని ఘట్టాలు 18 రోజులే జరుగు తాయి. మిగతా రెండు రోజులు వేరే నాటకాలు జరుగు తాయి) పగటి పూట మహాభారతంలో ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్పి, అదే ఘట్టాన్ని రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. ఇది బహు జనాదరణ పొందింది. ఇది అన్ని పల్లెల్లో జరగదు. ద్రౌపదీ సమేత పంచ పాండవుల ఆలయం ఉన్న ఊళ్లలోనే రెండు మూడు ఏండ్ల కొక సారి జరుగుతుంది. ఆ సందర్భంగా అక్కడ జరిగే తిరునాళ్లు ప్రజలకు పెద్ద వినోదం. ఈ ఇరవై రోజుల్లో మూడు నాలుగు ప్రధాన ఘట్టాలుంటాయి. ద్రౌపది వస్త్రాపహరణం, బకాసుర వధ, అర్జునుడు తపస్సు మాను ఎక్కుట, కృష్ణ రాయ బారం, చివర ధుర్యోధన వధ. వీటిలో పగలు కూడా జరిగే ఘట్టాలు మూడు. అవి.... 1. బకాసుర వధ, 2. అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. 3. దుర్వోధనుని వధ.

ప్రతి రోజు పగలు భారతంలోని ఒక ఘట్టాన్ని హరికథ రూపంలో చెప్తారు. అదే ఘట్టాన్ని ఆ రాత్రికి నాటక రూపంలో ప్రదర్శిస్తారు. బకాసుర వధ నాడు., భీముని వేషధారి, అలంకరించిన ఒక ఎద్దుల బండి పై కూర్చొని ఆ చుట్టు ప్రక్కల నున్న పల్లెల్లో మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తిరుగు తాడు. పల్లెల్లోని ప్రతి ఇంటి వారు ఇందు కొరకు తయారు చేసిన ఫలహారాలను ఆ బండిలో వేస్తారు. అలా తిరిగి సాయంకాలానికి ఆ బండి భారతం మిట్టకు చేరు కుంటుంది. బండి పైనున్న భీమ వేషధారి, దా దారి పొడుగునా బండి లోని ఆహారపదార్థాలను తింటూ, లేదా తిన్నట్టు నటిస్తూ ఉంటాడు. చివరకు ఆ బండి మైదానానికి చేరిన తర్వాత అందులోని అహార పదార్థాలను అక్కడ ఒక కొత్త బట్టపై కుప్పగా పోసి అక్కడున్న వారందరికి పంచు తారు. ఆ రాత్రికి బకాసుర వధ నాటకం ప్రదర్శిత మౌతుంది. ఈ మహాభారత నాటకాలు ఈ రోజుల్లోను జరుగుతున్నాయి.

అర్జునుడు తపస్సు మాను ఎక్కుట. మొగరాల గ్రామంలో జరిగిన భారతంలో ఒక ఘట్టం
అర్జునుడు తపస్సు మాను ఎక్కుట; ఇది పగటి పూట జరిగే ఒక ఘట్టం
ఒక పొడవైన మానును భారత మిట్టలో పాతి ఉంటారు. దానిని ఎక్కడానికి కర్ర మెట్లను ఏర్పాటు చేసి, బాగా అలంకరించి ఉంటారు. అర్జున వేష ధారి తన వెంట పెద్ద జోలెలను మెట్లకు తగిలించు కొని, పద్యాలు పాటలు పాడుతూ మెట్లను ఎక్కుతుంటాడు. ఆ తపస్సు మాను చుట్టు పిల్లలు కలగని తల్లులు తడి బట్టలతో సాష్టాంగ ప్రమాణ ముద్రలో వరానికి పడి ఉంటారు. వారు దోసిళ్లను పట్టుకొని ఉంటారు. అర్జునుడు మెట్లు ఎక్కుతూ పాటలు పాడుతూ తన జోలిలో ఉండే, విభూతి పండ్లను, నిమ్మకాయలను, అరటి పండ్లను పూలను విసురుతుంటాడు. ఆ విసిరినవి క్రింద 'వరానికి' పడి ఉన్న వారి చేతిలో పడితే వారి కోరిక నెరవేరి నట్లే. చుట్టు అనేక మంది ప్రేక్షకులు కూడా ఉంటారు. వారు కూడా అర్జునుడు విసిరే ప్రసాదం కొరకు ఎదురు చూస్తుంటారు. అర్జునుడు చివరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వేదిక పై ఆసీనుడై, విల్లంబులు చేత బూని కొన్ని పద్యాలు పాడతాడు. ఈ ఉత్సవానికి కూడా ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఈ కార్యక్రమం సుమారు రెండు మూడు గంటలు సాగు తుంది.
దుర్యోధన వధ నాటకానికి సిద్ధంచేయ బడ్డ భారీ దుర్యోధన విగ్రహం
దుర్యోధన వధ నాటకానికి సిద్ధంగా ఉన్న భీమ దుర్యోధన వేషధారులు

పగటి పూట జరిగే మహాభారత ఘట్టాలలో చివరిది.... అత్యంత ప్రజాదరణ కలిగినది దుర్యోధన వధ: దీనికొరకు మైదానం మధ్యలో మట్టితో దుర్యోధనుడు వెల్లకిలా పడుకొని ఉన్నట్లున్న అతి భారీ విగ్రహాన్ని మట్టితో తయారు చేసి ఉంచుతారు. దానికి తొడ భాగంలో ఎర్రని కుంకుమ కలిపిన కుండను గాని గుమ్మడి కాయను గాని పాతి ఉంటారు. దుర్యోధన పాత్ర దారి గదను చేత బూని ఆ విగ్రహంపై తిరుగుతూ పాట పాడుతుంటాడు. భీమ వేష ధారి ఆ విగ్రహం చుట్టూ తిరుగుతూ పాటలు పద్యాలు పాడుతుంటాడు. భీముడు..... దుర్యోధనుని విగ్రహం పైకి ఎక్కరాదు. దుర్యోధనుడు అప్పుడప్పుడు క్రిందికి దిగుతాడు. అప్పుడు ఇద్దరు కొంతసేపు యుద్ధం చేస్తారు. ఇలా సుమారు రెండు మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరించి చివరి ఘట్టానికి వస్తారు. అప్పుడు భీమ వేషధారి దుర్యోధనుని విగ్రహానికి తొడలో దాచిన గుమ్మడి కాయను పెద్ద కర్రతో పగల కొడతాడు. దుర్యోధన వేషధారి అ విగ్రహంపై పడిపోతాడు. నాటకం సమాప్తం. అంత వరకు ఏకాగ్రతతో నాటకాన్ని వీక్షిస్తున్న వందలాది ప్రజలు ఒక్కసారిగా దుర్యోధనుని విగ్రహం మీద పడి రక్తంతో తడిసిన ఆ మట్టిని, అందంగా అలంకరించిన తల భాగంలోని రంగు మట్టిని తలా కొంత పీక్కొని వెళ్లి పోతారు. ఆ మట్టిని తమ గాదెలలో వేస్తే తమ గాదె ఎన్నటికి తరగదని వారి నమ్మకం. అలాగే ఆ మట్టిని తమ పొలాల్లో చల్లితే, తమ పంటలు సంమృద్ధిగా పండుతాయని ప్రజల నమ్మకం.

దస్త్రం:A scene of Srikrishna raayabaaram..JPG
శ్రీకృష్ణ రాయబారము నాటకములో ఒక దృశ్యము. శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, అర్జునుడు.
భీమునికి వేషధారణ చేయుచున్న కళా కారుడు
వీధి నాటకాలు ఉత్సాహ వంతులైన కొంతమంది ఊరివారు వేషాలు కట్టి, ఊరి మధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి, దానికి తెరలు కట్టి నాటకాన్ని తమ హావ భావాలతో రక్తి కట్టిస్తారు. ఈ నాటకాలను నేర్పే ఒక గురువు కూడా ఉంటాడు. నాటకం వేయడానికి ముందు ఒక నెల నుండి వేషాలు లేకుండా పాటలు, పద్యాలు, మాటలు గురువు గారి సమక్షంలో శిక్షణ పొందుతుంటారు. దానిని చూడడానికి కూడా ఆ ఊరి జనం వస్తుంటారు. దానిని వద్దిక అంటారు. అందరు బాగా శిక్షణ పొందిన తర్వాత ఆ నాటకాన్ని ఆడడానికి ఒక రోజును నిర్ణయించి, దానికొరకు ఆ పల్లె మధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి, దానికి తెరలు కట్టి నటులందరు వేషాలు కట్టి నాటకాన్ని రక్తి కట్టిస్తారు. ప్రధాన నాటకాన్ని చూడడానికి, చుట్టు ప్రక్కల పల్లెల నుండి జనం చాల మంది వస్తుంటారు. ఎక్కువగా ద్రౌపదీ వస్త్రాపహరణ నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ రోజుల్లో నాటకానికి కావలసిన సరంజామా అనగా తెరలు, బట్టలు, ఆయుధాలు, రంగులు మొదలగు వాటిని అద్దెకు ఇచ్చేవారు చిన్న పట్టణాలలో ఉండేవారు. నాటకానికి కావలసిన వాయిద్య కారుల బృందాలు కొన్ని పల్లెల్లో ఉండేవారు. వారి సహకారంతో ఈ నాటకాలు వేసేవారు. ప్రస్తుతం పల్లెల్లో స్వంతంగా నాటకాలు వేసే ఉత్సాహ వంతులుగాని, వాయిద్య బృందాలు గానీ, నాటక సామగ్రిని అద్దెకిచ్చే వారు గాని ఎవ్వరు లేరు. కానీ వృత్తిరీత్యా నాటకాలు వేసే వారు అరుదుగా ఉంటున్నారు. వారి వద్ద తమకు కావలసిన అన్ని పరికరాలు ఉంటాయి.

భజనలు, కోలాటం : కొన్ని ఊళ్లలో రామ భజనలు ప్రతి రోజు జరుగుతుంటాయి. సుమారు రెండు మూడు గంటలు జరిగే ఈ భజన కార్యక్రమంలో చాలామందే పాల్గొంటారు. చూసే వాళ్లు వస్తుంటారు. అప్పుడప్పుడు కోలాటం కూడా ఆడుతారు. కోలాటంలో పాడే పాటలు కూడా భజన పాటలే. కోలాటం ఆడడము ప్రస్తుతము అంత విస్తారముగా లేదు. కానీ కొన్ని పల్లెల్లో ఈ కోలాటము ఆడనేర్చిన వారు బృందాలుగా ఏర్పడి ఎవరైనా పిలిస్తే, వారి వద్దకు వెళ్ళి ఆడి, డబ్బులు తీసుకుంటారు. ముఖ్యంగా, గంగ జాతర సందర్భాలలోను, ఎవరింట్లో నైనా పెద్ద కర్మ జరిగితే వారి పిలుపు మేరకు వెళ్ళి ఆడి వస్తారు. రామ భజనలు అక్కడక్కడా జరుగుతున్నాయి. ఈ విధంగా పల్లె వాసులు తాము ఏర్పాటు చేసుకున్న వినోద కార్యక్రమాలు కాకుండా, పండుగల రూపంలో నిర్ణీత సమయానికి వచ్చే వినోదం ఉండనే ఉంది.

కోలాటం[మార్చు]

ఒక రకమైన సాంప్రదాయక నృత్యము. కోల, ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం అనే పదం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట. సుమారు రెండు జానల పొడవున కర్ర ముక్కలను కోలలు అంటారు. ఈ కర్రలను ప్రత్యేకమైన చెట్టునుండి సేకరిస్తారు. పెడమల చెట్టు కర్రలు వీటికి శ్రేష్టము. అది ఒక చిన్న ముళ్ల చెట్టు. దాని కర్రలు చాల గట్టిగా ఉండి, మంచి శబ్దాన్నిస్తాయి. ఇలాంటి వే మరికొన్ని కర్రలుంటాయి. అలాంటి చెట్టు కర్రలతోనే ఈ కోలలు తయారు చేసుకుంటారు. ఈఆటలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కోలలను పట్టుకొని పాట పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి కోలలను వేరొకరి కోలలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు విజయనగర శిధిలా లపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. దీనిని బట్టి ఈ కోలాటము అతి ప్రాచీనమైనదిగా తెలుస్తున్నది. కోలాటం గ్రామదేవతలైన ఊరడమ్మ, గడి మైశమ్మ, గంగాదేవి, కట్టమైసమ్మ, పోతలింగమ్మ, పోలేరమ్మ, ధనుకొండ గంగమ్మ బాటగంగమ్మ మొదలగు గ్రామ దేవతల/ కులదేవతల జాతర సందర్భంగా ఆడతారు.

కోలాటం ఆడే విధానం కోలాటం ఆడే వారు అందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి, ఇష్ట దేవతా ప్రార్థన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుడిని పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కాళ్ళకు గజ్జెలతో చూడ ముచ్చటగా ఉంటారు. ఆట ఆడుతున్న వారి మధ్యలో నాయకుడు నిలబడి పాట పాడుతుండగా, ఇద్దరు మద్దెలను వాయిస్తుండగా, మరొకరు తాళం వేస్తుంటారు. పంతులు పాడే పాటను మిగతా ఆడే వారు అనుకరించి పాడుతూ కోలాటం ఆడుతారు. ఇది చాల ఉత్సాహ భరితమైన ఆట. ఈ కోలాటంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఒకటి ఉంది. దాన్ని జడ కోలాటం అంటారు. దాన్ని చాల నేర్పరులు మాత్రమే ఆడగలరు.

జడ కోలాటం కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక, కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచెట్టు క్రింద ఆడతారు. ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని రంగుల తాళ్లు కడతారు. అన్నీ సరి సంఖ్యలో మాత్రమే ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును తమ నడుంకు కట్టుకొని లేదా ఒక చేతితో పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి, ఒకరి తర్వాత మరొకరు వరుస క్రమంలో మారుతూ తిరుగుతూ కోలాటం ఆడుతుండగా ..... ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్ధతిలో అల్లబడిన జడ లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్యతిరేక దిశలో ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్ధతిలో అల్లిన ఆ జడలో తెలిసి పోతుంది ఎవరు తప్పుచేశారని. తిరిగి విడ దీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి, ఆ జడను విడగొట్టాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. తప్పు జరిగిన సమయం అతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ జడను విడదీసేటప్పుడు అదే తప్పును చేస్తే (వ్యతిరేక దిశలో) ఆ జడ విచ్చుకుంటుంది. అలా చేయకపోతే ఆ జడ అనేక దారాలు కలిగి ఉన్నందున చిక్కుబడి పోతుంది. ఆటలో తడబడకుంటే జడ చాల అందంగా తయారవుతుంది. ఆ తర్వాత దానిని వ్వతిరేక దిశలో ఆడి విడదీస్తారు. అది అద్బుతమే. కాని మొదట ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే .... ఎవరు తప్పు చేసారని ఆ దారం పట్టుకున్న వ్వక్తి అని తెలిసి పోతుంది. కాని ఆ తప్పు చేసిన వ్వక్తి ఆ జడను విడదీసేటప్పుడు వ్వతిరేక దిశలో ఆడు తునప్పుడు, మొదట చేసిన తప్పును అదే సమయానికి చేస్తే ఆ జడ సులభంగా విడి పోతుంది. లేకుంటే ఆ జడ ఆ తర్వాత అనేక చిక్కుముడులు పడిపోతుంది. ఇందులో విశేషమేమంటే...... తప్పును చేయడం మానవ సహజం.... 'తప్పులు అందరు చేస్తారు దాన్ని సరిదిద్దుకున్న వాడే గొప్ప అనే సందేశం ఉన్నది. దానికి ఇది మంచి ఉదాహరణ. తప్పటడుగు వేసినవాడు ఏ సమయంలో తప్పటడుగు వేశాడో గుర్తుపెట్టుకొని అదే సమయానికి అదే తప్పుచేసి సమం చేస్తే ఆ అల్లబడిన జడ సులభంగా విడిపోతుంది. లేదా..... మొదట తప్పుచేసి తిరిగి సక్రమంగా చేస్తే ఆ జడ అనేక చిక్కు ముడులతో తయారయి ప్రేక్షకుల దృష్టిలో అవమానము పాలవుతారు. కనుక తప్పడడుగు వేసి, జడను సరిగా అల్లక పోయాడనే నిందకన్నా, దాన్ని అదే తప్పు చేసి విడదీసేటప్పుడు అదే విధంగా ఆడితే అది విడిపోతుంది. ఇలా చేయడం అంత సులభం కాదు. కాని కొందరు నిష్ణాతులు కావాలని తప్పు చేసి .... వ్వతిరేక దిశలో అదే తప్పును చేసి ఆటను సరి చేసి తమ గొప్ప తనాన్ని నిలబెట్టుకుంటారు. అదే గొప్ప విషయం. ఎలాగైతేనేమి ఈ జడ కోలాటము అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనిని చూసి తరించ వలసినదే. ఆటలు, భజనలు, నాట్యాలు వంటి అనేక విధానాలలో అత్యంత సంక్లిస్టమైనది ఈకోలాటమే. సాధారణ కోలాటాలు ..... మామూలే... చాల నృత్యాల లాగ ఉంటాయి. ఈ జడకోపు కోలాటం మాత్రమే అత్యంత క్లిస్టమైనది....... అసాధారణమైనది,.

ఉట్టి కొట్టడం

ఆటపాటలు[మార్చు]

ఆట.. పాటలు... (ఇందులో చిన్న పిల్లలు ఆడే ఆటలు, పెద్ద పిల్లలు ఆడే ఆటలు, పెద్ద వారు ఆడే ఆటలు ఉంటాయి)

గతంలో పల్లెల్లోని చిన్న పిల్లలు అనేక విధాల ఆటలు ఆడేవారు. ప్రాంతాల వారీగా కొన్ని ఆటల పేర్లు వేరుగా ఉండొచ్చు. అటు వంటి ఆటలు:-- 1. చిన్న పిల్లలు ఆడే ఆటలు: వామన గుంతలు, వెన్నెల కుప్పలు, గుచ్చు గుచ్చు పుల్ల, వత్తొత్తి వారొత్తి, గోలీలాట, బొంగరాలాట, ముట్టాట, దొంగ- పోలీసు, నేల బండ, తోలుబొమ్మలాట, కుంటాట,

2. పెద్ద పిల్లలు ఆడే ఆటలు:...బిల్లంగోడి, (జిల్లంగోడి,) ఉప్పర పట్టి, చెడుగుడు, ముట్టాట, గచ్చకాయలాట, , కోతి కొమ్మచ్చి, పులి మేక, నాలుగు స్తంభాలాట, ఈత కొట్టడం, ఉట్టి కొట్టడం, తోలు బొమ్మలాట, 3. పెద్దవారు ఆడే ఆటలు:..... పులి మేక, చింత పిక్కలాట, మొదలగునవి ఆడే వారు. వాటి గురించి వివరణ క్లుప్తంగా:----

వత్తొత్తి... వారొత్తి ఆట ఎలా ఆడతారు.

కొంత మంది పిల్లలు గుండ్రంగా కూర్చొని తమ రెండు అరచేతులను వెనకకు పెట్టి ఉంటారు. మధ్యలో ఒకరు తన చేతులతో కళ్లు మూసుకొని నిలబడి ఉంటాడు. మరొక పిల్లవాడు ఒక చిన్న చేతి గుడ్డను పట్టుకొని కూర్చున్న వారి వెనక తిరుగుతూ ప్రతి ఒక్కరి వద్దా వంగుతూ వారి చేతిలో ఆ చేతి గుడ్డను పెట్టినట్లు నటిస్తూ వత్తొత్తి... వారొత్తి... చూసినోళ్ల కళ్లల్లో సూరొత్తి".. అని పాట పాడుతూ, తిరుగుతూ చివరికి ఎవరి చేతిలోనో ఆ చేతి గుడ్డను పెట్టేసి ధనా ధన్ ఘల్ బీగాల్. అని తన పాటను ముగిస్తాడు. అప్పుడు మధ్యలో నిలబడిన పిల్లవాడు కళ్లు తెరిచి అందరి వైపు పరిశీలనగా చూసి, ఎవరి చేతిలో ఆ గుడ్డ ఉన్నదో కనిపెట్టాలి. అలా కనిపెట్ట గలిగితే మధ్యలో నిలబడే వంతు ఆ అబ్బాయికి వస్తుంది. అలా కనిపెట్టలేనంత వరకు... ఆ పిల్లవాడు మధ్యలోనే నిలబడాలి. ఇదీ ఈ ఆట ఆడే పద్ధతి. అప్పట్లో ఈ ఆటను ఎక్కువగా ఆడపిల్లలే ఆడే వారు.

వామన గుంతలు.

ఇది ఎక్కువగా ఆడపిల్లలు ఆడే ఆట. వరుసగా ఆరు చిన్న గుంతలు, సమాంతరంగా క్రింద ఆరు గుంతలు ఉంటాయి. నాలుగు చింత పిక్కలు అరచేతిలోకి తీసుకొని, వాటిని పైకి ఎగుర వేసి అవి కిందపడే లోపున అరచేతిని తిరగేసి వాటిని పట్టుకోవాలి. ఎన్ని పట్టుకోగలిగితే వాటిని ఆ గుంతలలో పెట్టాలి అలా కొన్ని సార్లు ఆడిన తర్వాత ఏ గుంతలో నాలుగు పిక్కలు చేరుతాయో వాటిని గెలుచు కున్నట్టు. వాటిని తీసుకుంటారు. ఇలా పలు మార్లు ఆడి, ఎవరు ఎన్ని చింత పిక్కలు గెలుచుకున్నారో చూసి, వారు నెగ్గినట్లు నిర్ణయిస్తారు. ఇదే ఆటను వివిధ విధాలుగా ఆడుతారు. దీనికి కావలసిన గుంతలు పల్లెల్లో వుండే రచ్చ బండమీద శాశ్వత పద్ధతి మీద చెక్కి ఉంటాయి. మడిచి ఇంట్లో పెట్టుకోడానికి వీలుగా చెక్కలతో చేసిన వామన గుంతలు కొన్ని ఇళ్లలో ఉండేవి. వాటితో పెద్ద ఆడ వారు కూడ ఆడేవారు. ప్రస్తుతం ఈ ఆట పూర్తిగా కనుమరుగైనది.

'వెన్నెల కుప్పలు"

ఇది చిన్న పిల్లల ఆట. ఆడపిల్లలు, మగపిల్లలు కలిసి ఆడే ఆట. వెన్నెల రాత్రులందు మాత్రమే ఆడే ఆట. ఒక పిల్లవాడు ఒక చోట కళ్లు మూసుకొని ఒకటి నుండి వంద వరకు లెక్క పెడుతుంటాడు. లేదా కొన్ని పాటలుండేవి... ఒక్క పాటను ఇన్ని సార్లు పాడాలనే నియమం ఉండేది. ఇంతలోపల మిగతా పిల్లలు తలో దారిలో వెళ్లి మట్టితో వెన్నెల నీడలో చిన్న చిన్న కుప్పలు పెట్టే వారు. గోడ నీడలందు, బండల పైన, కొంత మరుగ్గా వుండే చోట ఎన్ని వీలైతే అన్ని కుప్పలను పెట్టే వారు. సమయం అయి పోగానే కళ్లు మూసుకున్న పిల్లవాడు... కళ్ళు తెరిచి... మిగతా పిల్లలు పెట్టిన మట్టి/ఇసుక కుప్పలను చెరిపి వేయాలి. అలా చెరప లేక పోయిన కుప్పలను లెక్క పెట్టుకొని... వాటిని తాము గెలిచిన పాయింట్లుగా లెక్కించు కుంటారు. తర్వాత మరొక పిల్ల వాని వంతు. చివరగా లెక్కించి ఎవరికి ఎక్కువగా చెరపలేని కుప్పలుంటాయో వారు ఓడినట్లు. ఈ ఆట ప్రస్తుతం వాడుకలో లేదు.

గోలీలాట

ఈ ఆటను కొంచెం పెద్ద పిల్లలు ఎక్కువగా ఆడే వారు. గోలీలను కుప్పలు కుప్పలుగా పెట్టి అనగా ముందు మూడు గోలీలను పెట్టి దాని మీద మరొక్క గోలీను పెడతారు. ఆ కుప్పను ఉడ్డ అంటారు. అలా ఒక్కొక్కరు ఒక ఉడ్డను పెట్టి ఒక నిర్ణీత దూరం నుండి ఒక్కొక్కరు ఒక్క పెద్ద గోలీతో ఆ కుప్పలను కొట్టాలి. దాంతో ఆ కుప్పలు పడి పోతాయి. తన వాటాగా ఉన్న ఒక కుప్పను తప్ప పడిపోయిన గోలీలను ఆతడు గెలుచుకున్నట్లు, ఆ తర్వాత మరొకని వంతు. ఇలా చివరన ఎవరెన్ని గోలీలను గెలుచుకున్నారో లెక్కించు కుంటారు. ఆ తర్వాత పెద్ద గోలీలతో ఆట మొదలవుతుంది. ఒకతను పెద్ద గోలీని కొంత దూరంలో వేస్తాడు. మిగిలిన వారు ఒక్కొక్కరుగా గురి చూసి ఆ గోలీని కొట్టాలి. అలా కొట్టగలిగితే ఆ గోలీని వాడు గెలుచుకున్నట్టే. ఈ గోలీలాటలో చాల విధానాలున్నాయి.

బొంగరాలాట

ఈ ఆటను పెద్దపిల్లలే ఆడగలరు. దీనిలో కొంత నేర్పరి తనముండాలి. చిన్న పిల్లలు బొంగరాలను వేయలేరు. శంఖాకారంలో ఈ కర్ర బొంగరము క్రింది భాగాన చిన్న ములుకు ఉంటుంది. ఆ ములుకు దగ్గరనుండి ఒక సన్నని దారం చుట్టి దాన్ని చేతిలో వాటంగా పట్టుకొని ఒక ఉడుపున విసిరి నేల పైకి వేస్తే అది ములుకు ఆధారంగా అతి వేగంగా తిరుగుతుంటుంది. అలా తిరుగుతున్న బొంగరాన్ని మరొకడు తన బొంగరంతో గురి చూసి కొట్టాలి. ఒక్కోసారి... ఆ బొంగరం పగిలి పోతుంది. సంతల్లో రంగు రంగు బొంగరాలు అమ్మేవారు. అవి అందంగా ఉండి చాల తేలికగా ఉంటాయి. చాల వేగంగా తిరుగుతాయి. ఇవి పోటీలకు పనికి రావు. పెద్ద పిల్లలు తమ పెద్ద వారితో మంచి కర్రతో స్వంతంగా పెద్ద బొంగరాలను చేయించుకునే వారు. అవి బరువు ఎక్కువగా ఉండి బలంగా ఉండేవి. ఇలాంటివి పోటీలకు మాత్రమే వాడేవారు. నేర్పరులు బొంగరాలతో చాలా విన్యాసాలు కూడా చేసే వారు. బొంగరానికి దారం చుట్టి గాల్లోకి విసిరి వేసి అది కింద పడకుండా గాల్లోనే దాన్ని ఒడుపుగా తన అరచేతిలో పడేటట్లు పట్టుకుంటారు. అలా అర చేతిలో తిరుగు తుండగానే, అతడు వెనక్కి వంగి, తన నుదిటిమీద తిరుగు తుండగానే పెట్టుకుంటాడు. బొంగరాలకు సంబంధించిన ఒక సామెత ఉంది. అది........ వాడు తాడు బొంగరము లేని వాడు. ఎవరైనా పని చేయకుండా గాలికి తిరుగు తుంటే ఈ సామెత వాడతారు.

చింతపిక్కలాట.

ఇది పెద్దవారు మాత్రమే ఆడే వారు. అది కూడా జాతరలపుడు, మహాభారత నాటకాలు జరిగే సందర్భంలోను డబ్బులు పెట్టిఆడే వారు. ఆడే విధానము:\ సుమారు ఒక అడుగు చదరములో సమానమైన వంద గడులు గీసి అందులో నున్న మధ్య గడిలో వరుసలో అనగా ఒకటి, రెండు, మూడు, నాలుగు..... ఇలా సుమారు ఇరవై గడులు ఉంటాయి. ఆ సంఖ్య ఆ చదరము యొక్క సంఖ్యను తెలియ జేస్తుంది. మిగతా గడులలో అంకెలను ఆ ఇరవై చదరాలలో ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను వ్రాసి ఉంచుతారు. అనగా ఏ చదరములో ఉన్న అంకెలు యథా తథంగా మరొక చదరంలో ఉండవు. ఈ ఇరవై చదరాలను ఇరవై మంది ముందు పెట్టుకొని వృత్తాకారంలో కూర్చుంటారు. మధ్యలో ఆట నిర్వాహకులుంటారు. ఒక డబ్బాలో ఒకటి నుండి వంద వరకు అంకెలు వ్రాసి ఉన్న చిన్న బిళ్లలుంటాయి. వాటిని కలిపి ఒక్కోసారికి ఒక్క నెంబరు తీసి దాన్ని గట్టిగా అరిచి చెప్తారు. ఆట ఆడేవారు తమ చదరంలో ఉన్న ఆ అంకెకు సంబంధించిన చిన్న గడిలో ఒక చింత పిక్కను పెట్టాలి. ఇలా ఆట కొనసాగుతుండగా..... ఎవరి చదరంలో నైనా చింత పిక్కలు అడ్డంగా గాని, నిలువుగా గాని, లేదా మూలలకు గాని ఉన్న చిన్న గడులలో చింత పిక్కలు అమరితే..... ఆ వ్వక్తి గెలిచానని చెప్పి తన చదరం నెంబరు కూడా చెప్తాడు. నిర్వహకులు కూడా తమ ముందు ఒక చదరంలో వారు చెప్తున్న అంకెల ప్రకారము చింత పిక్కలను పెడ్తారు. గెలిచిన వ్వక్తి తాను పూర్తి చేసిన గడులలోని అంకెలను బిగ్గరగా అరిచి చెప్తాడు. నిర్వహకులు తమ ముందున్న చదరంలో సరిచూసుకొని గెలుపును నిర్థారిస్తారు. ఈ విధానంలో ఒకరికన్న ఎక్కువ మంది ఆటను గెలుస్తారు. ఆట ప్రారంభానికి ముందు, ఆడే ప్రతి ఒక్కరి వద్ద ఒక నిర్ణీతమైన సొమ్మును వసూలు చేస్తారు. అందులో కొంత భాగాన్ని నిర్వాహకులు ఉంచుకొని మిగతా దాన్ని గెలిచిన వారికి ఇస్తారు. ఒక్కరికన్నా ఎక్కువ మంది గెలిస్తే వారికి ఆ సొమ్మును సమానంగా పంచుతారు. ఇందులో మోసం ఏమీ ఉండదు. ఇది చింత పిక్కలాట. కొన్ని రోజుల పాటు జాతరలు, తిరుణాళ్లు మొదలగు వినోద కార్యక్రమాలు జరిగే సందర్భంలో మాత్రమే ఆడేవారు. ఇప్పుడు ఈ ఆట పూర్తిగా కనుమరుగైనది.

ఈత

గతంలో పల్లెల్లోని పిల్లలందరు ..... ఆడ మగ తేడాలేకుండా అందరు ఈత నేర్చుకునే వారు. నదులు, కాలవలు ఉండే ప్రాంతాలలో, బావిలు వంటివి ఉన్న ప్రాంతాలలో పిల్లలు ఈతను తప్పక నేర్చుకునే వారు. బావులలో ఈత కొట్టే విధానము, నేర్చుకునే విధానము : ఎండా కాలంలో మాత్రమే ఈ కార్యక్రమము ఉండేది. పిల్లలకు మొదటగా ఈత నేర్చుకునేటప్పుడు వారి నడుముకు బెండు లాంటి కర్ర ముక్కలను కట్టి బావులలో వదిలే వారు. ఈ కర్రలు ఎక్కువ కలబంద చెట్టు కర్రలై ఉంటాయి. అవి మూరెడు పొడగున్నవి రెండు చాలు ఒక పిల్లవాడిని నీటిపై తేల్చడానికి. వాటిని తుండ్లు అంటారు. ఇలా ఈ తుండ్లతో కొంత కాలం ఈత నేర్పి.... రెండోదశలో ఆ తుండ్లను తీసేసి ఒక పొడవైన దారాన్ని పిల్ల వాని నడుముకు కట్టి బావిలో వేస్తారు. వాడు మునిగి పోతుంటే గట్టు మీద ఆ దారాన్ని పట్టుకున్న పెద్ద వారు దారాన్ని పైకి లాగి వాడు ఈత కొట్టడానికి అనువుగా దారాన్ని వదులు చేస్తారు. ఇప్పుడు ఈత నేర్చిన పెద్ద పిల్లలు పక్కన చేరి, నేర్చుకునే పిల్లవానికి సహాయ పడుతుంటారు. ఈ విధంగా పిల్లలకు ఈత నేర్పుతారు.

ఈత బాగా నేర్చిన పిల్లల ప్రావీణ్యత

ఈత బాగా నేర్చిన పిల్లలు ఈతలో వారి ప్రావీణ్యతను ఎలా ప్రదర్శిస్తారంటే:......... ఎత్తైన ప్రదేశం నుండి బావిలోనికి దూకడానికి కపిలి పైనుండి బావిలోకి దూకే వారు. 1.గడ్డపార దూకుడు. అనగా... పిల్లవాడు పైనుండి దూకేటప్పుడు నిట్టనిలువుగా దూకాలి. ఆ దూకుడుకు నీళ్లలో ఎంత తక్కువ అలజడి జరిగితే అతడు అంత బాగా దూకినట్టు. 2.మొగ్గ:.. ఈ విధానములో పిల్లవాడు దూకడానికి పైకెగరగానే, తన రెండు చేతులతో మడిచిన తన రెండు కాళ్లను గట్టిగా పట్టుకొని బావి మధ్యలోకి దూకాలి. దూకిన వెంటనే ఒడుపుగా గట్టుకు చేరుకుంటాడు. తర్వాత రెండు నిముషాలకు ఆ నీళ్లలో అలలు లేచి, బావి మధ్యలో ఒక మొగ్గ లాగ నీటి అల వస్తుంది. అలా ఎవరు పెద్ద మొగ్గను సృష్టిస్తారో వారు గొప్ప. 3.పాము దూకుడు:..... పిల్లవాడు తన రెండు చేతులను తలకిరువైపుల పైకి చాపి... తలక్రిందులుగా నీళ్లలోకి దూకి .... నీళ్ల లోపలే ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్లి అక్కడ పైకి తేలాలి. ఎవరు ఎంత దూరంలో పైకి తేలతారు ఆ దూరాన్ని బట్టి అతని ప్రావీణ్యతను గుర్తిస్తారు. 4. పూడు తేవడము: బావులలో సుమారు ఇరవై అడుగుల లోతు వరకే నీళ్లుంటాయి. అడుగుకు వెళ్లి అక్కడున్న మట్టిని కొంచెం పైకి తేవాలి. ఆ మట్టినే పూడు అంటారు. ఎవరు ఎంత సేపట్లో పూడు తెస్తారో వారు అంత గొప్ప అన్న మాట. 5. బావి అంచు వెంబడి ఈదుతూ ఎవరెన్ని చుట్లు చుడుతారో వారంత గొప్ప. కొన్ని బావులు అతి విశాలమైనవిగా ఉంటాయి. వాటిని ఒక చుట్టు ఈత కొట్టడమే గొప్ప. 6. గట్టు పైనున్న ఒక పిల్లవాడు ఒక చిన్న రాయిని నీటిలో వేస్తాడు. ఇంకొకడు వెంటనే బావిలోకి దూకి ఆ రాయి అడుక్కు చేరక ముందే దానిని పట్టుకొని పైకి రావాలి. ఇదొక ఆట. ఈ విధంగా ఎండాకాలంలో పిల్లలందరు మిగతా ఆటలను పక్కన పెట్టి, బావులలో ఈత ఆడటానికి వెళ్లే వారు. ప్రస్తుతము ఈ దిగుడు బావులలో నీరు అడుగంటడంతో బావులలో ఈత కొట్టడం అనే ఆట పూర్తిగా కనుమరుగైనది. ఈ ప్రాంతంలో ఉన్న ఈ తరం పిల్లలకు ఈత పూర్తిగా రాదు.

ఇవి కూడా చూడండి[మార్చు]

https://www.youtube.com/watch?v=l-65NSzu6jk

https://www.youtube.com/watch?v=l-65NSzu6jk