Jump to content

పల్లె రామారావు

వికీపీడియా నుండి

డాక్టర్ పల్లె రామారావు భారత దేశ అత్యుత్తమ శాస్త్రవేత్తలలో ఒకరు. ఇతడు అణుభౌతిక శాస్త్రంలోను, మెటలర్జీ విభాగంలో విశేషమైన కృషి చేశాడు. భారత ప్రభుత్వం ఇతనిని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.ఇతడు డి ఆర్ డి ఓ, కేంద్ర అణు ఇందన సంస్థలలో కీలక పాత్ర నిర్వహించాడు. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటీరియల్స్ (ఎ.ఎస్.ఎం), ఇతనికి "విశిష్ట జీవిత సభ్యత్వ" పురస్కారం అందించింది. ఇతడు ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయుడు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

పల్లె రామారావు 1937, జూన్ 30న[2] కర్నూలులో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి కర్నూలులో ప్రముఖ న్యాయవాది. కుటుంబ వాతావరణం వల్ల ఇతనికి క్రమశిక్షణ చిన్న తనం నుండి అలవాటైంది. కర్నూలు మునిసిపల్ హైస్కూలులో తెలుగు మాధ్యమంలో ఇతని ప్రాథమిక విద్య గడిచింది. తన పదనాల్గవ ఏడు నిండకండానే ఇతడు ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలు ఉతీర్ణుడై, బెంగళూరు లోని సెయింట్ జోసెఫ్ కాలేజిలో చేరాడు. ఇది ఇతని జీవితానికి ఒక దిశామార్గం ఇచ్చింది. తరువాత మద్రాసులోని ప్రెసిడెన్సి కాలేజిలో బి.ఎస్.సి (భౌతిక శాస్త్రం) పట్టా సాధించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రప్రథముగా (1956) లో ప్రారంభమైన ఎం.ఎస్.సి - అణుభౌతిక శాస్త్రం (న్యుక్లియర్ ఫిజిక్స్) చదివి స్నాతకోత్తర పట్టాను పొందాడు. ఆ తర్వాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి 1964లో డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. అమెరికా పెన్సల్వేనియా విశ్వవిద్యాలయలో మెటీరియల్ సైన్స్‌లో పోస్ట్ డాక్టరల్ రిసర్చ్ నిర్వహించాడు. ఈ తరుణంలో ఎల్ ఆర్ ఎస్ ఎం (థిన్ ఫిల్మ్‌స్) లో ప్రయోగాలు చేశాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ధాతుసాధనా శాస్త్ర ఆచార్యుడిగా ఉన్న టి.ఆర్.అనంతరామన్‌తో ఏర్పడ్డ పరిచయం ఇతని జీవితానికి ఓ కొత్త మలుపునిచ్చింది.

ఉద్యోగం

[మార్చు]

ఇతడు కొంత కాలం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) లో పనిచేశాడు. తరువాత వారణాశిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ధాతుసాధనా విభాగంలో 1975 నుండి 1982 వరకు ఆచార్యుడిగా పనిచేశాడు. ఇక్కడ ఇతడు ఫిజిక్స్ ఆఫ్ మెటల్స్, డిస్లొకేషన్ థీరీ, మెకానికల్ బిహేవియర్ ఆఫ్ మెటల్స్ అండ్ మెటల్ ఫామింగ్ అంశాలు బోధించాడు. అటుపిమ్మట హైదరాబాదులోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసర్చ్ లాబొరేటరీ (డి.ఎం.ఆర్.ఎల్) సంస్థ సంచాలకుడిగా పనిచేశాడు. ఆ తరువాత భారత ప్రభుత్వ సాంకేతిక కార్యదర్శిగా పనిచేశాడు. అటామిక్ ఎనర్జి రెగ్యులేటరీ సంస్థ అధ్యక్షుడిగా, హైద్రాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఉప-కులపతిగా సేవలను అందించాడు. ఇస్రో - విక్రం సారాభాయి విశిష్ట ఆచార్యుడిగా ఉన్నాడు. ఇంటర్ నేషనల్ అడ్వాన్స్డ్ రిసర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యు మెటీరియల్స్ (ఏ.ఆర్.సి.ఐ) కార్యనిర్వాహక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాడు.

సాధించిన విజయాలు

[మార్చు]

పల్లె రామారావు శాస్త్ర, సాంకేతిక సంస్థలకు తన వంతు సహాయం అందిస్తున్నాడు. హైద్రాబాదులో "టి.ఆర్.అనంతరామన్ ఎడ్యుకేషనల్ అండ్ రిసర్చ్ ఫౌండేషన్" అనే సంస్థ నెలకొల్పి దాని అభివృద్ధికి పాటుపడుతున్నాడు. ఐదు దశాబ్దాల పాటు ఇతడు చేసిన అవిరళ కృషితో భారతదేశం కీలకమైన మిశ్ర ధాతుసాధనా శాస్త్ర క్షేత్రాలలో ఎంతో ముందజ వేసింది. ఇతడు నెలకొల్పిన సంస్థలు:

  • హెవీ అల్లోయ్ పెనిట్రేటర్ ప్లాంట్ (తిరుచునాపల్లి, తమిళనాడు) - స్వదేశ సాంకేతిక నైపుణ్యంతో ప్రారంభించిన ఆర్డినెన్స్ కర్మాగారం.
  • ఇంటర్నేష్నల్ అడ్వాన్స్డ్ రిసర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెట్లర్జీ అండ్ న్యు మెటీరియల్స్ (ఏ.ఆర్.సి.ఐ), హైదరాబాద్
  • నాన్-ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్.ఎఫ్.టి.డి.సి), హైదరాబాద్
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై
  • సేఫ్టీ రిసర్చ్ ఇన్‌స్టిట్యూట్, కల్పక్కం
  • టెక్నాలజీ డెవలప్ మెంట్ బోర్డ్ (టి.డి.బి), కొత్త ఢిల్లీ

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
పద్మశ్రీ పురస్కారం

దాదాపు ఐదు దశాబ్దాలు విస్తరించిన క్షేత్రానుభవంతో ఇతడు 240 పత్రాలను సమర్పించాడు. అనేక జాతీయ, అంతర్జాతీయ పత్రికలకి సంపాదకుడిగా వ్యవహరించాడు. ఇతడు తన సుదీర్ధ ప్రవాసంలో అనేక అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

వీటిలో కొన్ని:

  • ఫెలో ఇన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (బ్రిటన్)
  • ఫెలో ఇన్ థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఇటలీ)
  • ఫెలో ఇన్ యుక్రేన్ అకాడమి ఆఫ్ సైన్సెస్
  • ఫెలో ఇన్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి
  • ఫెలో ఇన్ ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్
  • ఫెలో ఇన్ నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్
  • అధ్యక్షుడు, ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్
  • అధ్యక్షుడు, ఇండియన్ నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్
  • అధ్యక్షుడు, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (1997-98)
  • అధ్యక్షుడు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ (1990-91)
  • అధ్యక్షుడు, మెటీరియల్ రిసర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (1992-94)
  • అధ్యక్షుడు, భారత అణు సంస్థ
  • ఉపాధ్యక్షుడు, ఇంటర్నేష్నల్ యూనియన్ ఆఫ్ మెటీరియల్స్ రిసర్చ్ సొసైటీస్ (2002-03)
  • శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం[2] (1979)
  • భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం (1989)
  • భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం (2001)
  • భారత ప్రభుత్వంచే పద్మ విభూషణ్ పురస్కారం (2011) [3]
  • భారత ఉక్కు మంత్రిత్వ శాఖ, " లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు" (2009)
  • గుజర్ మల్ మోడి ఫౌండేషన్ నుండి జి ఎం మోడి ఇన్నొవేటివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు
  • ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్, ప్లాటినం పతకం (1994)
  • టాటా బంగారు పతకం (1992)
  • హోమి బాబా పురస్కారం (1986)
  • ఇండియన్ నేష్నల్ సైన్స్ అకాడమి (1996) " మెటీరియల్ సైన్స్ " పురస్కారం
  • భారత ఉక్కు మంత్రిత్వ శాఖ, " నేషనల్ మెట్లర్జిస్ట్ " పురస్కారం
  • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ " మిలీనియం ప్లాగ్ ఆఫ్ హానర్ " గౌరవం
  • ఇండియన్ నేష్నల్ సైన్స్ అకాడమి " మేగ్ నాద్ సాహా మెడల్ " (2004)
  • అమెరికన్ సొసైటీ ఆఫ్ మెటీరియల్స్ (ఏ ఎస్ ఎం), " విశిష్ట జీవిత సభ్యత్వ " పురస్కారం
  • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, " అషుతోష్ ముఖర్జీ మెమొరియల్ అవార్డు "
  • యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప వారిచే గౌరవ డాక్టరేట్ (2012) [4]

కుటుంబం

[మార్చు]

పల్లె రామారావుకు భార్య రేఖ, కొడుకు నరేంద్ర, కూతురు సుమన్ ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. ఈరంకి, వెంకట కామేశ్వర్ (2011). "తెలుగు తేజోమూర్తులు". సుజన రంజని. Retrieved 14 November 2016.
  2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "Brief Profile of the Awardee". Shanti Swarup Bhatnagar Prize. Retrieved 14 November 2016.
  3. విలేకరి (2011). "128 మందికి 'పద్మ' పురస్కారాలు". సూర్య దినపత్రిక. Retrieved 14 November 2016.[permanent dead link]
  4. విలేకరి (14 November 2016). "ఆచార్య రామారావుకు డాక్టరేట్". ఆంధ్రభూమి దినపత్రిక. Archived from the original on 14 నవంబరు 2016. Retrieved 5 November 2012.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)