పల్లె వాసుల నివాస గృహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పల్లె వాసుల నివాస గృహాలు : గుడెసె, పూరిల్లు, గుడిసిల్లు/ చుట్టిల్లు, పెంకుటిల్లు, రేకుల ఇల్లు, మట్టి మిద్దె, బండ్ల మిద్దె,

మిద్దె., మేడ, సపారు ఇలా అనేక రకాలు వుంటాయి.

పూరిల్లు. యాదగిరి వారి పల్లెలో తీసిన చిత్రం

దేశ జనాభాకు తిండి ఉత్పత్తి చేసే వాడు రైతు. వారి జీవన విధానము అతి దుర్బరం. కడుపు నిండా తినలేడు, వంటి నిండా బట్ట కూడా కట్టుకోలేడు., చివరకు తాను నివాసముండే గృహాలు కూడా చింపిరి గూడులే. ఇది యాబై సంవత్సరాల క్రితం పరిస్థితి. వారి నివాస గృహాలు ఎలా వుండేవి అనే అంశం పై ఒక చిన్న పరిశీలన. ఇప్పటికి కూడా ఈ విషయంలో పెద్ద మార్పు లేమి లేవు. అంతటి దుర్బరమైన జీవితంలో కూడా రైతులు తమ సహ వాసులైన ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలతొ సంతోషంగానే సహ జీవనం చేశాడు.

పూరిళ్లు

[మార్చు]

ఇవి మట్టి గోడలపై కర్ర దూలాలుంచి వాటిపై ఏటవాలుగా వాసాలు పెట్టి వాటిని వెదురు బద్దలతో కట్టి దాని పై బోద, రెల్లుగడ్డి, ఇలాంటి వాటితో కప్పు వేస్తారు. ఈ కప్పు ఏటవాలుగా వుండి పైన పడిన వర్షం నీరు క్రిందికి జారిపోవడానికి అనుకూలంగా వుంటుంది. పైన రెండు వైపుల కప్పు కలిసే చోటును "వెన్నుగోడు" అని కప్పు చివరిభాగం క్రింద "చూరు అని అంటారు. ఆ ఇంటిలో రెండు దూలాల మధ్యనున్న భాగాన్ని "అంకణం" అంటారు. సర్వ సాధారణంగా చాల వరకు మూడు అంకణాల ఇండ్లే వుంటాయి. అంతకన్న ఎక్కువగా కొన్ని అరుదుగా వుండొచ్చు. రెండు దూలాల మధ్య అడ్డంగా కర్రలు గాని చెక్కలు గాని పెట్టి దానిపై బస్తాలు గాని, కొన్ని వ్యవసాయ సామానులు గాని పెట్టు కుంటారు. దీన్ని "అటక" అంటారు. దీని పై కూడా పనిముట్లు, ఇతర పరికరాలు పెట్టుకుంటారు. . గోడ మూలలో ఒక బండను పెట్టి దాని పైన కూడా కత్తులు, కొడవళ్లు పెట్టు కుంటారు. దీన్ని మచ్చు అంటారు. ఇంట్లో ఆగ్నేయ దిశగా వున్న ప్రదేశాన్ని వంటకు ఉపయోగిస్తారు. అక్కడ తూర్పు దిశన గోడకు ఒక అడుగు వెడల్పు, ఒక అడుగు ఎత్తు గల దిమ్మను కట్టి దానిలోనే పొయ్యి, మారు పొయ్యిని అమర్చు కుంటారు. పొయ్యి పైభాగాన గోడకు దీర్ఘ చతురస్త్రంగా కన్నాలుంటాయి. ఇవి పొయ్యి లోనుండి వచ్చే పొగ పోవడానికి చేసిన ఏర్పాటు.

ఈ ఇంటికి ఒక ద్వారం ఒక తలుపు వుంటుంది. ఆద్వారాని కిరువైపుల బయట గోడకు రెండడుగుల ఎత్తున అరుగులు అమర్చుకుంటారు. దాన్ని కూర్చోడానికి, పడుకోడానికి వాడు కుంటారు. ద్వారాని కిరువైపుల బయట కొంత ఎత్తులో రెండు చిన్న గూడులు పెడ్తారు. వీటిని "దీగూడు" అంటారు. అనగా దీపం పెట్టే గూడు లన్నమాట. అదేవిదంగా ద్వారాని కెదురుగా వున్న ఇంటి లోపలి గోడకు కూడా దీగూడు కళాత్మకంగా దీప స్తంభం లాగ నిర్మిస్తారు. ఇది కొంచెం పెద్ద గూడు. దానిముందు దీపం వుంటుంది. గూడు చుట్టు గోడకు దేవుని పటాలు వుంటాయి. ఇక్కడి దీపం మాత్రం ప్రతి రాత్రి దీపం పెడ్తారు. వంట చేసే ప్రదేశంలో పైన దూలాలకు గాని, దూలాల మధ్య వేసిన కర్రలకు గాని ఉట్టి వేలాడ గట్టి వుంటుంది. ఉట్టి అంటే దారాలతో రెండు మూడు రింగులు చేసి దానికి కొంత పొడవైన మూడు దారాలు కూర్చి దాని పైనున్న దూలానికి వేలాడ గట్టాలి. అందులో, పాలు, పెరుగు, ఇతర ఆహార పదార్థాలున్న పాత్రలను వుంచుతారు. పిల్లులు, కుక్కల బారి నుండి కాపాడు కొనుటకు ఇవి వుప యోగ పడతాయి. ఈ ఉట్టి పద ప్రయోగం చాల పురాతనమైనది. కృష్ణ జన్మాష్టమి రోజున ఉట్టి కొట్టే పండగ జరుగు తుంది. ఈ తరంవారు ఉట్టిని అక్కడ మాత్రమే చూడ గలరు. కాక పోతో ఈనాడు చాలమంది ఇండ్లలో ఇంటి గుమ్మం ముందు. పైన గుమ్మడి కాయను ఉట్టిలో పెట్టి కట్టు తున్నారు. ఉట్టి అంటే అదే. ఉట్టి అందుకోలేనమ్మ స్వర్గాన్ని అందు కో గలదా అనే సామెత కూడా ఉంది. ఇందు తెలిపిన పరికరాల పేర్లు, ఆవాసాల పేర్లు మొదలైనవి వుపయోగం ఒక్కటే అయినా వాటి పేర్లు కొన్ని ప్రాంతాలలో వేరుగా వుండొచ్చు. చుట్ట కుదురు... కుండలు, బిందెలు మొదలగు వాటి క్రింద పెట్టే గడ్డితో చేసిన చక్రాలు. కుండలు పొందికగా వుండడానికి వీటిని పెడ్తారు. ఇంటి పైకప్పుకు తాటాకులు ఎక్కువగా వున్న ప్రాంతాల వారు తమ ఇంటి పై కప్పుకు తాటాకులను వాడు కుంటారు.

తాటాకుల పూరిల్లు (అడ్డాపిల్లు) తాటాకుల గుడిసిల్లు

తాటాకుల ఇళ్ళు

[మార్చు]

తాటాకుల ఇల్లు, అలాంటిదే చిన్న చుట్టిల్లు,కాని ఇది కొంచెం వైవిధ్యం వుంటుంది: ఎలాగంటే దీని పై కప్పు తాటాకులతో వుండి ఆ పైకప్పు ఇంటికి వెనక ముందు భూమికి మూడడుగుల ఎత్తు వరకు వుంటుంది. ముందు భాగం వెనక భాగం ఎత్తు తక్కువగా వున్నందున మనుషులు రాక పోకలు సాగించ డానికి వీలుండదు. అది గాలి వెలుతురు రావడానికి మాత్రమే ఉపయోగ పడుతుంది. ఇందులో ఎత్తు తక్కువగా వున్నది వసారాగాను, ఎత్తు ఎక్కువగా వున్న మధ్య భాగం గదులుగాను ఉపయోగ పడుతుంది. మిగతా రెండు వైపులలో ఒకదానిని, వాస్తు ప్రకారం సరిగా వున్న దానిని రాక పోకలకు ఉపయోగిస్తారు. ఇలాంటిదే పక్కన ఒక చిన్న చుట్టిల్లు ఒకటి వుంటుంది. దీనిని వస్తువువు పెట్టుకోడానికి గాని, లేదా వంటకు గాని వాడు కుంటారు. వీటి పైన వేసిన తాటాకులు గాలికి ఎగిరి పోకుండా ఇనుప తీగలను ఒక పద్ధతి ప్రకారం కప్పు పైన బిగించి కట్టి వుంచు తారు.

గుడిసె

[మార్చు]

ఇది ఎత్తు తక్కువగా వుండి తాటాకులు, లేదా కొబ్బరి మట్టలు, రెల్లు గడ్డి వంటి వాటి పైకప్పుతో తాత్కాలికంగా పొలాల వద్ద కాపలా కొరకు ఏర్పాటు చేసుకునేవి. వలస పోయే వారు, సంచార జాతులు మొదలగు వారు పల్లెలకు దగ్గరగా గుడిసెలు వేసుకొని తాత్కాలికంగా నివసిస్తుంటారు. పైన చెప్పిన పరికరాలేవి ఇప్పుడు కనీసం ఈ తరంవారి చూపడానికి కూడా వీలు లేక కనుమరుగై పోయాయి.గుడిసిల్లు

గుడిసిల్లు. యాదగిరివారి పల్లెలో తీసిన చిత్రం

ఇవి వృత్తాకారంలో వుండి ఒకే దూలం కలిగి శంకాకారంలో పైకి వుంటాయి. పూరిల్లుకు లాగానే వీటికి పైకప్పు వేస్తారు. చుట్టిల్లు అంత సుఖం లేదు... బోడి గుండంత బోగం లేదూ' అనేది ఒక సామెత. రాతి గోడలు, పైకప్పు బండలతో వేసిన చుట్టిళ్లు కూడా వుంటాయి. ఇవి శాశ్వతమైనవి. ఇలాంటివి ఇప్పుడు కొత్తగా కట్టక పోయినా పాతవి అరుదుగా పల్లెల్లో కనబడుతున్నాయి. ( బొమ్మ చూడుము) దస్త్రం:thumb|right|గుడిసిల్లు|చుట్టిల్లు

పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు.

పెంకుటిల్లు

[మార్చు]

ఇవి రెండు రకాలు. ఒకటి మంగుళూరు పెంకులు, రెండో రకం దేశవాళి పెంకులు వేసి కట్టినవి. ఇటుకల గోడపై సన్నని దూలాలు పెట్టి, గోడల పైనుండి ఏట వాలుగా వాసాలు అమర్చి వాటిపై అడ్డంగా సన్నని చెక్కలను వేసి వాటిపై పెంకులను పరుస్తారు. ఇవి పక్కా గృహాలు.

పై కప్పుగా సిమెంటు రేకుల వేసిన ఇళ్లను రేకుల ఇల్లు అంటారు. ఎండా కాలంలో ఈ ఇండ్లలో వేడి ఎక్కువగా వుంటుంది. కాన నివాసానికి అంతగా వుపయోగించరు. పశువులకు, కోళ్ల ఫారాలకు వీటిని ఎక్కువగా వాడతారు. ఇవి కూడా పక్కా గృహాలె.

మట్టి గోడలపై అడ్డంగా వాసాలను వుంచి వాటిపై అడ్డంగా సన్న కర్రలను/ లేదా కర్ర చక్కలను పేర్చి దాని పై శుద్ద మట్టిని మందంగా వేసి గట్టి పరుస్తారు. ఇల్లు పైభాగం మొత్తం కనబడీ, కనబడనంత ఈశాన్యానికి వాలుగా వుంటుంది. వర్షం నీరు క్రిందికి జారడానికి ఈ ఏర్పాటు. శుద్ద మట్టిలో నీరు ఇంకదు. కనుక ఇక్కడ శుద్ద మట్టిని వాడుతారు. వీటిలో విశాలమైన గదులను ఏర్పాటు చేయ లేరు. కనుక ఇవి కొంచెం ఇరుకుగా వుంటాయి. ఇవి చాల పురాతనమైనవి. ప్రస్తుతం పాతవి కూడా కనబడడం లేదు.

బండ మిద్దె

బండ్ల మిద్దె

[మార్చు]

చుట్టు రాతి గోడ కలిగి మధ్యలో రాతి కూసాలు ఏర్పాటు చేసి ఆ రాతి స్థంబాల మధ్యన రాతి దూలాలను అమర్చి వాటిపై పై రెండడుగుల వెడల్పు కలిగి నాలుగంగుళాల మందం కల రాతి బండలను వరుసగా పేర్చి వాటి సందులలో సిమెంటు చేసి బండల పైన అంతా సిమెంటు వేస్తారు. ఇవి చాల పక్కా గృహాలు. కాని వీటిలో విశాలమైన గదుల ఏర్పాటు చేయలేరు. ఎందుకంటే క్రింద ఏ ఆధారం లేకుండా పొడవాటి బండలను పైకప్పుకు వేయడం ప్రమాదకరం. ప్రస్తుతం వీటి కాలం కూడా తీరి పోయింది. పాతవి మాత్రం అలాగే ఉన్నాయి.

చిన్న రాతి బండలను పై కప్పుగా కట్టిన ఇళ్లు

[మార్చు]

కొన్ని ప్రాంతాలలో పదడుగుల పొడవున్నరాతి బండలు దొరకవు. వారు ఆయా ప్రాంతాలలో స్థానికంగా దొరికే బండలను ఇంటి పైకప్పుకు వాడతారు. కడప జిల్లాలో ఎక్కువగా నల్లని కడప బండలు ఎక్కువగా దొరుకుతాయి. అవి సుమారు ఒక అంగుళం మందం వుండి నాలడుగుల చదరంలో ఎక్కువగా వుంటాయి. అప్రాంతాల వారు అటు వంటి బండలను ఇంటి పైకప్పుకు వాడతారు. క్రింద కర్రలను ఆధారంగా వుంచి వాటిపై బండలను ఒకదాని ప్రక్కన ఒకటి కాకుండా పెంకులను పేర్చి నట్టు బండ చివరి భాగం ఒక అంగుళం మేర మరొక దాని క్రిందకి వుండేటట్లు అమర్చు తారు. దాని వలన పైన పడిన వర్షం నీరు ఒక బండపై పడిన నీరు మరొక బండపైకి జారి ఏట వాలుగా వున్న ఆకప్పు నుండి జారి క్రిందికి వస్తుంది. ఈ నిర్మాణము చూడ చక్కగా వుంటుంది. అటు వంటి ఇళ్లకు ప్రహరి గోడకు కూడా ఆ విరిగి పోయిన బండ్ల ముక్కలు ఒక పద్ధతి ప్రకారం పేర్చి ఆ బండ్ల మధ్యన ఎటువంటి మట్టిగాని, సిమెంటు గాని వేయకుండా అలా సుమారు నాలుగైదు అడుగుల ఎత్తు వరకు కట్టు కుంటారు. ఆ గోడ సుమారు రెండడుగుల వెడల్పు వుంటుంది. ఇది కూడా చూడ ముచ్చటగానే వుంటుంది.

మిద్దె

[మార్చు]

ఇటుకల గోడలపై మంచి దూలాలను వుంచి వాటిపై అడ్డంగా సుమారు నాలుగంగుళాల ఎత్తు, రెండంగుళాల మందం ఆరు, ఏడు అడుగుల పొడవు గల కర్రలను (వీటిని దంతులు అంటారు.) అమర్చి., దానిపై చదునైన పల్చని చక్కలను వేసి వాటిపై సన్నని ఇటుకలు (ఈ ఇటుకలు ప్రత్యేకంగా దీని కొరకే తయారు చేస్తారు. ఇవి సుమారు ఆరు అంగుళాల పొడవు మూడు అంగుళాల వెడల్పు ఒక అంగుళం మందం వుంటాయి) ఒకదాని ప్రక్కన ఒకటి పేర్చి మధ్య మధ్యలో గానుగ సున్నం వేసి ఇటుకలను అతికించి కప్పు వేస్తారు. ఇవి పక్కా గృహాలు. ప్రస్తుతం ఇటువంటి పైకప్పు గల ఇళ్లను ఎవ్వరూ కట్టడం లేదు గనుక అటువంటి ఇటుకలు తయారు చేయడం లేదు. ఇపుడంతా ఇనుప చువ్వలు పరచి అందు ఇసుక, కంకర, సిమెంటు కలిపిన గచ్చుని వేసి కడ్తున్నారు.బండ్ల మిద్దె

మిద్దె పై మరో మిద్దె కట్టిన దాన్ని మేడ అంటారు. మిద్దె పై పెంకు టిల్లు కట్టినా అది కూడా మేడ గానే పిలువ బడుతుంది.

కొట్టము

[మార్చు]

పశువుల కొరకు కట్టినది కొట్టము, అది రేకులతో వేసినది గాని, గడ్డితో కప్పినది గాని దాన్ని కొట్టమే అంటారు. రాతి కూసాల పై దూలలను పెట్టి వాటి మధ్యన అడ్డ కర్రలు పెట్టి దాని పైన వరి గడ్డిని వామి వేస్తారు. దీనికి చుట్టు గోడలు వుండవు. దీనిక్రింద పశువులను, ఎద్దులను కట్టి వుంచుతారు. ఎద్దులు గడ్డి తినడానికి ఒక గాడిని ఒక అడుగు ఎత్తున్న బండలను నిలబెట్టి చేస్తారు. అందులో గడ్డి వేస్తారు.

  • పెంకుటిల్లు
  • పందిరి

ఇంటి ముందు వెదులురు కర్రలు పాతి వాటిపై అడ్డంగా సన్న వెదులురు వేసి దానిపైన కొబ్బరి ఆకులు వేసినదే పందిరి. ఇంటి ముందు చల్లదనానికి దీన్ని అమర్చు కుంటారు. పెళ్ళిల్లు మరియి శుభ కార్యాల సందర్భంగా తప్పని సరిగా పందిళ్లలు వేస్తారు. ఈ ఆచారం ప్పటికి కూడా కొనసాగుతున్నది.

దొడ్డి

[మార్చు]
గొర్రెలమంద

ఇది కూడా కొట్టం లాంటిదే. కాని ఇందు గొర్రెలు, మేకలు మొదలగు చిన్న జీవాల కొరకు ఉపయోగిస్తారు. వాటిని గొర్రెల దొడ్డి, మేకల దొడ్డి అని అంటారు.ప్రతి దొడ్డిలో ఒక గిడుగు వుంటుంది. వెదురు బద్దలతో అల్లి; పై బాగాన పెద్ద పెద్ద సందులు పెట్టి అల్లిన అతి పెద్ద గంపనే గిడుగు అంటారు. మేకలు/ గొర్రెలు మేతకు బయటకు వెళ్లితే వాటి పిల్లలను ఈ గిడుగు కింద మూసి వుంచు తారు. ఒక్కో గిడుగు కింద సుమారు పది పిల్లలను వుంచవచ్చు. (ఉత్తరాంద్ర ప్రాంతలలో తాటాకులతో చేసిన గొడుగును గిడుగు అంటారు. గొర్రెలు ఇతరుల కంటికి ఒకే లాగ కనిపిస్తాయి. వాటి కాపరికి మాత్రం కొన్ని గొర్రెలను గుర్తు పట్టగలడు. కాని వాటి పిల్లలు తమ తల్లులను కచ్చితంగా గుర్తు పట్ట గలవు. దీనికి రుజువేమంటే సాయంకాలం వెళ గొర్రెల మంద ఇంటి కొచ్చే వేళ తల్లి గొర్రెలు తమ పిల్లల కొరకు ఊరి బయటనుండే పిల్లలను పిలుస్తూ అంత వరకు మందలో ఒకటిగా వస్తున్న గొర్రెలు ఊరు దగ్గర పడగానే మందను వదిలి తమ పిల్లలను పిలుస్తూ ముందుకు పరుగెడుతాయి తమ పిల్లల కొరకు. అప్పటికే గిడుగు నుండి బయటకు వచ్చిన పిల్లలు తమ తల్లుల గొంతు విని పిల్లలు కూడా అరుస్తూ అనగా తమ తల్లులను పిలుస్తూ బయటకు పరుగెడతాయి. అలా పరుగెత్తిన పిల్లలు ఊరి బయట గాని, వీధిలో గాని, అవి ఇంకా దొడ్లోకి రాక ముందే తమ తల్లులను గుర్తించి వాటిని పట్టుకొని పాలు తాగుతాయి. ఇలా అవి తమ తల్లులను కచ్చితంగా గుర్తు పడతాయి. ఒక వేళ పిల్లలు తెలియక తమ తల్లి గాక ఇంకొక గొర్రె వద్దకు పాలు తాగ డానికి వెళ్లితే ఆ తల్లి గొర్రె తప్పించు కుంటుంది. ఆ పిల్ల తన తప్పును గ్రహించి తన తల్లి గొర్రె వద్దకు వెళ్లీ పాలు తాగు తుంది. ఈ తతంగ మంతా చూడ డానికి చాల అత్మీయంగా వుంటుంది. గొర్రెలు చాల మంద జీవులు. అనగా మేకల లాగ చలాకిగా వుండవు. తమ దారిలో ఏదేని సన్నని కాలువ అడ్డు వచ్చినా దానిని దాటడానికి గొర్రెలు సందే హిస్తాయి. అప్పుడు గొర్రెల కాపరి ఒక గొర్రెను ఆ కాలువను దాటిస్తాడు. ఇక అంతే మిగతా గొర్రెలన్నీ పొలోమని దాన్ని దాటేస్తాయి. అందుకే గొర్రె దాటు అనే మాట పుట్టింది. మేకలు ఆవులు కూడా తమ పిల్లలను గాని లేదా పిల్లలు తమ తల్లులను గాని సులభంగానే గుర్తు పడ్తాయి. ఇది ప్రకృతి నియమం. మానవుల్లోను ఈ ప్రకృతి నియమం తప్పదు.

పల్లెల్లో ఇళ్ళవద్ద పెంచుకునే కోళ్ళు

ఆరోజుల్లో ప్రతి ఇంటిలోను కోళ్లు వుండేవి. వాటిని రాత్రులందు భద్ర పరచడానికి గూళ్లు, గంపలు వంటివి వుండేవి. ఈ ఇళ్లలో వందలాది కోళ్లు పెంచే వారు కాదు. పది, పదిహేను కోళ్లు వుంటే ఎక్కువ. ఇవన్నీ దేశవాళి కోళ్లు. అనగా నాటు కోళ్లు. వాటికి ప్రత్యేకించి మేత వేయ నవసరం లేదు. ఇంటి చుట్టు పక్కల తిరిగి చిన్నపురుగులు, గడ్డి వాముల్లొ రాలిని గింజలు మొదలగు వాటిని తిని పెరుగుతాయి. వాటి గుడ్లను తగు మాత్రం అమ్ముకునేవారు. మిగతావాటిని పొదగేసే వారు. పందెం పుంజులకు మాత్రం ప్రత్యేక ఆహారం పెట్టెవారు. సంక్రాంతి సందర్భంలో కోళ్ల పందేలు ఎక్కువ జరుగుతాయి. తమ అవసరాలకు పోను అరుదుగా అమ్మేవారు. పండగలకు, చుట్టాలొచ్చినప్పుడు కోళ్లను కోసి వండి పెట్టడం ఒక ఆనవాయితీ. జాతర సందర్భాలలో గ్రామ దేవతల ముందు కోళ్లను కోసేవారు. తమకు పంటలు బాగా పండాలని దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలి ఇచ్చేవారు. అగ్గార్లకు, అమ్మవారికి, ఇలా గ్రామ దేవతలకు తమ కోరికలు నెరవేరితే ఏటను గాని కోడిని గాని బలి ఇస్తామని ముందుగానే మొక్కుకునే వారు. కాటమ రాజుకు తమ పశువులు అభివృద్ధి చెందితే కోడిని బలి ఇస్తామని ముందుగానే మొక్కు కునే వారు. ఈ బలి ఇచ్చేది తప్పని సరిగా కోడి పుంజు. అంతే గాని కోడి పెట్టను బలి ఇవ్వరు. పర్షాలు బాగా పండి చెరువులు నిండితే చెరువు కట్టమీద గంగమ్మ తల్లికి ఏటను బలి ఇచ్చి పొలాల్లో పొలి చల్లే వారు. పొలి అంటే ఏటను బలి ఇచ్చి ఆ రక్తంలో కలిపిన అన్నాన్ని పొలాల్లో చల్లే వారు. కోళ్లను ఫారాలలో పెంచినట్లే కుందేళ్లను, కౌజులు, మొదలగు వాటిని ఈనాడు ఫారాలల్లో పెంచుతున్నారు గాని ఆరోజుల్లో అలాంటి వాటిని పెంచే వారు కాదు. ఈ మధ్యన ఈము పక్షుల పెంపకం అభివృద్ధి చెందుతున్నది. రైతు పశు పక్ష్యాదులతో పాటు కుక్కలను కూడా పెంచు తాడు. అవి ఏ ఉన్నత జాతి కుక్కలు కాదు. ఊర కుక్కలు మాత్రమే. వాటిని గొలుసులు వేసి తన ఇంట్లో బంధించడు. అవి వూరంతా తిరుగుతాయి. చివరికి తన యజమాని ఇంటికే వస్తాయి. అతని మాటనే వింటాయి. అతనితోనే తిరుగు తాయి. అతని ఇంటినే కాపలా కాస్తాయి. ఇది రైతులకు అతని జంతువులకు వున్న ఆప్యాయత. ఈ మధ్యన శాస్త్రవేత్తలు పరిశోధనలో తేల్చిన విషయ మేమంటే పిల్లి, కుక్క లాంటి జంతువులను పెంచే వారికి మానసిక ప్రశాంతత కలిగి గుండె జబ్బులు లాంటివి వారికి తక్కువగ వస్తాయని. చాలి చాలని తిండి, గుడ్డ, గూడు వున్నా రైతుల మనస్సులు చాల విశాలము. ఆ విశాల నిర్మల హృదయంలో ఆప్యాయతకు, అనురాగానికి, కొదువ లేదు. ఒక పల్లెలోనికి ఎవరైనా ఒక కొత్త వ్వక్తి వచ్చాడంటే.. అతను ఎవరిచేత పలకరించ బడకుండా, విచారించ బడకుండా వీధిలో నడవ లేడు. ఆ పలక రింపులో ఎంతో ఆప్యాయత. పలకరించ బడిన వాడి మదిలో ఎంతో ఆనందము.. పలకరింపే గాదు.. అతని కనీసవసరాలను కూడా తీర్చ గలరు. ఎండన పడి వచ్చావు.. మంచి నీళ్లు తాగతావా నాయనా... మజ్జిగ తాగతావా బిడ్డా... అనే పలకరింపులో ఎంతటి ఎంతటి ఆప్యాయతో.... దానికి వెలకట్ట గలమా

గ్యాలరి

పెంకుటిల్లు
సిమెంటు రేకుల ఇల్లు

ఇవి కూడా చూడండి

[మార్చు]