పళముదిర్చోళై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పళముదిర్చోళై (Palamuthircolai) తమిళనాడులో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 19 కిలోమీటర్ల దూరంలో కలదు . ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములలో (ఆరు పడై వీడు) ఈ క్షేత్రం మూడవదిగ చెబుతారు. సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కొండపైన ఉంటుంది. కొండ క్రింద ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన “అళగర్ కోయిల్ ఉంది. ఈ అళగర్ కోయిల్ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటి. కొండ క్రింద నుండి పైన సుబ్రహ్మణ్యుని ఆలయం వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పై వరకు కార్లతో వెళ్ళవచ్చు. ఆలయం వాళ్ళు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు; ఉచితం కాదు .

ఆలయగోపురం
అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షిస్తున్న చిత్రం
స్వామి వారిని ఊరేగించడానికి కొత్తగా చేసిన తంగ (బంగారు) రథం

స్థల పురాణము

[మార్చు]

ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తులలో ఒకరైన అవ్వయ్యార్ ని సుబ్రహ్మణ్యుడు పరీక్షించిన స్థలం ఈ క్షేత్రం. తమిళనాట అవ్వయ్యార్ అని ఒక తల్లి ఉండేది. ఒకనాడు ఆమె చాలా దూరం ప్రయాణించి అలసి పోయింది. బాగా ఎండగా ఉండడం వలన, నీడ కోసం ఒక పళ్ళ చెట్టు క్రిందకి వచ్చింది. ఆమె అప్పటికే చాలా ఆకలి, దప్పికలతో ఉంది. ఆ చెట్టు మీద ఒక చిన్న పిల్లవాడు అవ్వయ్యార్ ని చూసి పళ్ళు కావాలా అని అడుగుతాడు. ఆమె కావాలి అనగానే, ఆ పిల్ల వాడు “నీకు వేయించిన పళ్ళు కావాలా, లేక వేయించకుండా కావాలా?” అని అడుగుతాడు. ఇతనెవరో మరీ తెలియని వాడిలా ఉన్నాడు, పళ్ళు వేయించినవి కావాలా అంటాడేమిటి అనుకొని, పిల్లాడితో మాట్లాడే ఓపిక లేక, వేయించిన పళ్ళు ఇమ్మంటుంది అవ్వయ్యార్. వెంటనే ఆ పిల్లవాడు చెట్టును బలంగా కుదిపితే కొన్ని పళ్ళు క్రింద మట్టిలో పడతాయి. అవి తీసి ఆమె మట్టి దులపడం కోసం నోటితో ఊదుతూ ఉంటే అవి నిజంగా వేడిగా, వేయించినట్లు భావం కలుగుతుంది ఆమెకు. అప్పుడు వాటిని ఊదుకుంటూ (మట్టి తొలగడానికి) పళ్ళను తింటుంది. ఈ లీల చేసినది మామూలు పిల్లవాడు కాదు, ఎవరో మహాత్ముడు నాకు పాఠం చెప్పడానికే ఈ లీల చేశాడు అని అనుకుని పైకి చూడగానే, ఆ పిల్లవాడు మాయమై సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అవుతారు. ఆమె జ్ఞాన భిక్ష పెట్టమని స్వామిని ప్రార్థిస్తుంది.

ఈ క్షేత్రమును చేరే మార్గములు:

[మార్చు]
  • రోడ్డు ద్వారా*: చెన్నై - 450 కి.మీ., బెంగళూరు – 470 కి.మీ. దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి.
  • రైలు ద్వారా*: చెన్నై నుంచి మదురైకి ఎన్నో రైళ్ళు నడుస్తాయి. (ఉదాహరణకి వైగై ఎక్స్ ప్రెస్. చెన్నైలో మధ్యాహ్నం 12.45 కి బయలుదేరి మదురై రాత్రి 8.50 కి చేరుకుంటుంది.)
  • విమానము ద్వారా*: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (470 కి.మీ.), అది కాక జాతీయ విమానాశ్రయము మదురై లోనే మీనాక్షీ అమ్మ వారి ఆలయం నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

వసతి సదుపాయము:

[మార్చు]

ఈ క్షేత్రము మదురైకి దగ్గరగా ఉండడం వల్ల, వసతి ఏర్పాటు మధురైలోనే చూసుకోవచ్చు. మధురైలో ఎన్నో హోటళ్ళు ఉన్నాయి.

ఆలయంలో ఆర్జిత సేవలు

[మార్చు]

ప్రతి రోజూ స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం జరుగుతుంది. దీనికి కొంచెం ధరలో టికెట్టు ఉంటుంది, మనం కూడా పాలు, తేనె మొదలైన వస్తువులు తీసుకువెడితే, వాటితో కూడా స్వామి వారి శక్తి ఆయుధానికి అభిషేకం చేస్తారు.

చిత్రమాలిక

[మార్చు]

సూచికలు

[మార్చు]