Jump to content

పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు

వికీపీడియా నుండి

పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గొప్ప కవి, పండితుడు, అవధాని. ఆంధ్ర సంస్కృత భాషలలో ప్రవీణుడు.[1].

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1897, జూన్ 15కు సరియైన హేవళంబ నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ పాడ్యమి నాడు నెల్లూరు జిల్లా సంగంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు జగన్నాథాచార్యులు. తల్లి కావేరమ్మ. ఇతడు కాశ్యప గోత్రుడు. ఇతడు 1905 నుండి 1915 వరకు నాటకాలంకార శాస్త్రాలను కాశీ కృష్ణాచార్యుల వద్ద, వ్యాకరణము పేరి పేరయ్యశాస్త్రి, నోరి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేదుల సూర్యనారాయణశాస్త్రుల వద్ద, తర్కశాస్త్రాన్ని వేమూరి రామబ్రహ్మశాస్త్రి, దెందుకూరి పానకాలశాస్త్రులవద్ద సంప్రదాయ గురుకుల పద్ధతిలో అధ్యయనం చేశాడు. 1916 నుండి 1936 వరకు గుంటూరు టౌన్ హైస్కూలులో తెలుగు పండితుడిగా, 1936 నుండి 1958 వరకు హిందూకళాశాలలో సంస్కృతాంధ్ర పండితుడిగా, తరువాత కొంతకాలం గుంటూరు కె.వి.కె. సంస్కృత కళాశాలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తరువాత శేషజీవితాన్ని పురాణ ప్రవచనము, గ్రంథరచనలలో గడిపాడు. ఇతడు 1977, ఫిబ్రవరి 2వ తేదీ అనగా నల నామ సంవత్సర మాఘ శుద్ధ చతుర్దశి నాడు గుంటూరులోని తన స్వగృహంలో మరణించాడు.[2]

రచనలు

[మార్చు]

ఇతడు స్తోత్రములు, సుప్రభాతములు, ప్రబంధములు, కావ్యములు, నాటకములు, మహాపురుషుల జీవితచరిత్రలు మొదలైన స్వతంత్ర, అనువాద రచనలను తెలుగు, సంస్కృత భాషలలో శతాధికంగా రచించాడు.వాటిలో సగానికిపైగా ముద్రణకు నోచుకొన్నాయి[2]. ఇతడు వ్రాసిన రచనలలో కొన్ని:

  1. శ్రీ రామకల్యాణము
  2. ఆంధ్ర కాదంబరి [3]
  3. ద్విపద మేఘదూతము[4]
  4. హంససందేశము
  5. హైమవతీ విలాసము
  6. శ్రీమదాంధ్ర రుక్మిణీశ విజయము (రుక్మిణీశ విజయము వాదిరాజ యతి వ్రాసినమహాకావ్యము),
  7. శ్రీ పాదుకాప్రభావము
  8. హర్షప్రబంధము
  9. గాంధీకథా (సంస్కృత కావ్యము)
  10. లకష్మీమాలా
  11. ప్రతిజ్ఞా యౌగంధరాయణము
  12. ఆత్మసమర్పణము
  13. శ్రీమదాంధ్ర మహాభారతము - విరాటపర్వము లఘుటీక
  14. కైకేయీ సౌశీల్యము
  15. శతలక్షిణి
  16. విజయపంచకము
  17. ద్వాదశ స్తోత్రము
  18. శ్రీ జయతీర్థ స్తోత్రము
  19. దశావతార స్తోత్రము
  20. భీష్మ స్తవరాజము
  21. ఉషా హరణము
  22. శ్రీ పురుషోత్త వైభవము
  23. చారుదత్తము
  24. దూత ఘటోత్కచము
  25. ఆంధ్ర ప్రతిమా నాటకము
  26. సాధుశీల శతకము
  27. ముకుందమాల
  28. శ్రీ విశ్వేశ్వర వైభవము
  29. శ్రీ లక్ష్మీనృసింహ సుప్రభాతము
  30. శ్రీ శివవిలాస కావ్యము (సంస్కృతము)
  31. రామాష్టకమ్‌ (సంస్కృతము)
  32. శ్రీ సత్యధ్యాన గురు స్తుతిః (సంస్కృతము)
  33. శ్రీ సత్యధ్యాన గురు స్తోత్రరావళిః (సంస్కృతము)
  34. శ్రీ కనకదుర్గాష్టకమ్‌ (సంస్కృతము)
  35. శ్రీ హయగ్రీవాష్టకమ్‌ (సంస్కృతము)
  36. శ్రీ మన్వధ్వ గురుస్తోత్రమ్‌ (సంస్కృతము)
  37. ప్రాతఃస్మరణీయ రమేశ స్తుతి (సంస్కృతము)
  38. శ్రీ సంజీవరాయాష్టకమ్‌ (సంస్కృతము)
  39. ఆస్థాన కవులు

అవధానాలు

[మార్చు]

ఇతడు గుంటూరు, తెనాలి, సంగం, సంగం జాగర్లమూడి, బందరు, అవనిగడ్డ మొదలైన చొట్ల 30కి పైగా అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.

అవధానాలలోని కొన్ని పూరణలు

[మార్చు]
  • సమస్య: మేకను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్

పూరణ:

ఏక శతంబు వ్యాఘ్రముల నిర్వదియొక్క గజంబులన్ ద్రుటిన్
వే కబళించితిన్ వ్రతము వీడన మ్రింగమి నొక్క సింగమున్
బోకుమటంచుఁ బై దుముకుపోఁ యను గడ్డము మీసములున్న యా
మేకను జూచి సింగమది మ్రింగునొ! యంచుఱికెన్ భయంబునన్

  • సమస్య: అఱ గజముకన్న గజము తానడుగు చిన్న

పూరణ:

పప్పులో నడ్గువేయగా వలయునంచు
నిచ్చినారేమి కష్టమో యీ సమస్య
వసుధ సార్థద్విపాదసంపన్నమైన
యఱ గజము కన్న గజము తానడుగు చిన్న

  • ఆశువు: తేటగీతలో దశావతారములు

మీనకూర్మవరాహ లక్ష్మీనృసింహ
వామన పరశ్వధా యధరామచంద్ర
యాదవ కులావతంస మాయా కుమార
కల్కిరూపా! నతుల్ రమాకాంత! నీకు

  • వర్ణన: సూర్యాస్తమయము

 ప్రొద్దున మేయుటకుఁబోయిన పక్షులు చేరె గూండ్రేకున్
సద్దొనరించు కొంచుఁబశుజాలము నింటికి దారివట్టె నా
ప్రొద్దును గుంకు పంపునును బొట్టుగఁ బశ్చిమదిక్పురంధ్రికిన్
దద్దయుఁ దోచె బాడబవతంసులు సంధ్యకు జేరి రేటికిన్

సన్మానాలు, బిరుదులు

[మార్చు]
  • ఇతనికి తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
  • ఇతనికి కవిశేఖర, మహోపాధ్యాయ, విద్యాలంకార, సాహిత్యరత్న మొదలైన బిరుదులు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. గుంటూరు మండల సర్వస్వము - పేజీ 459[permanent dead link]
  2. 2.0 2.1 రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 214–223.
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో పుస్తక ప్రతి