పాండవ వనవాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాండవ jవనవాసం
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు
తారాగణం నందమూరి తారక రామారావు,
సావిత్రి,
ఎస్వీ రంగారావు,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రాజనాల,
కాంతారావు,
ముదిగొండ లింగమూర్తి,
బాలయ్య,
మిక్కిలినేని,
హరనాధ్,
ప్రభాకరరెడ్డి,
కైకాల సత్యనారాయణ,
ముక్కామల,
రమణారెడ్డి,
పద్మనాభం,
ధూళిపాళ,
అల్లు రామలింగయ్య,
ఎల్.విజయలక్ష్మి,
సంధ్య,
వాణిశ్రీ,
సవితాదేవి,
వీణావతి,
సరస్వతి,
బేబీ లత,
రాజ సులోచన,
చిత్తూరు నాగయ్య,
ఋష్యేంద్రమణి,
అజీత్ సింగ్,
హేమామాలిని,
మాలతి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల,
పి.బి.శ్రీనివాస్,
పి.లీల,
మాధవపెద్ది సత్యం,
ఎస్.జానకి,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ,
ఎల్.ఆర్.ఈశ్వరి
నృత్యాలు పసుమర్తి కృష్ణమూర్తి
గీతరచన సముద్రాల రాఘవాచార్య,
ఆరుద్ర,
కొసరాజు
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం సి.నాగేశ్వరరావు
కళ ఎస్.కృష్ణారావు
నిర్మాణ సంస్థ మాధవీ ప్రొడక్షన్స్
నిడివి 188 నిమిషాలు
భాష తెలుగు

పాండవ వనవాసం 1965లో నిర్మించబడిన పౌరాణిక తెలుగు సినిమా. ఈ చిత్రరాజాన్ని మాధవీ ప్రొడక్షన్స్ అధినేత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, "పౌరాణిక బ్రహ్మ"గా ప్రసిద్ధిచెందిన కమలాకర కామేశ్వరరావు దర్శకులుగా తెరకెక్కించారు. మహాభారతం లోని పాండవులు మాయాజూదంలో ఓడి వనవాస కాలంలో జరిగిన విశేషాల్ని సముద్రాల రాఘవాచార్య రచించారు.

పరిచయం[మార్చు]

పౌరాణికాలు తెలుగువారి సొత్తు. అలాగే పౌరాణిక పాత్రలను సమర్ధవంతంగా పోషించగల నటులు మన దగ్గరే ఉండటం నిజంగా మనకు గర్వ కారణమే. ఎన్ టి ఆర్ వంటి మహా నటుడు తెలుగువాడు కావడం జాతి చేసుకున్న అదృష్టమైతే, అనితరసాధ్యమైన రీతిలో ఆయన పౌరాణికాలను పోషించి తెలుగువారి స్థాయిని పెంచారు. అందుకే పౌరాణిక చిత్రం అనగానే అందులో ఎన్ టి ఆర్ ఉన్నారా అని ప్రశ్నించేవారు సగటు ప్రేక్షకులు. తన నటనతో పౌరణిక పాత్రలకు అంత ప్రతిష్ట తీసుకొచ్చారు ఎన్ టి ఆర్. ఆయన నటించిన పాండవ వనవాసం చిత్రం పౌరాణికాలలో తలమానికం అని చెప్పవచ్చు. తెలుగువారు మాత్రమే ఇలాంటి పౌరాణికాలను గొప్పగా తీయగలరు అనే భావనను చూసిన ప్రతీసారీ కలిగించే ఆ చిత్ర విశేషాలు:-

మహా భారతంలోని అజ్ణాతవాస ఘట్టంతో నర్తనశాల చిత్రం రూపు దిద్దుకోగా (11-10-1963 విడుదల), వనవాస వృత్తాంతంతో (కొంత వరకూ సభా పర్వం కలిపి) పాండవ వనవాసం సినిమా తయారైంది. ఈ రెండు చిత్రాలకూ కమలాకర కామేశ్వర రావు గారు దర్శకులు కావడం గమనార్హం. ఆ సినిమాలో విజయుడిగా నటించిన ఎన్ టి ఆర్ ఇందులో భీమసేనుడిగా నటించారు. అంతకుముందు అనేక పౌరాఇక పాత్రలను పోషించిన ఎన్ టి ఆర్ ఈ సినిమాలో తన అభినయంతో భీముని పాత్రకు వన్నె  చేకూర్చి పాండవ వనవాసం చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలిచిపోవడానికి కారకులయ్యారు. అన్నమాట జవదాటని అనుంగు సోదరుడిగా నడకలో, చేతల్లో, మాటల్లో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అనితర సాధ్యమైన రీతిలో నటించారు ఎన్ టి ఆర్. ముఖ్యంగా మాయా జూద సన్నివేశం, ద్రౌపదీ వస్త్రాపహరణం సన్నివేశాల్లో ఎన్ టి ఆర్ రౌద్ర రసాన్ని అభినయించిన తీరు అభినందనీయం.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర భీముడిదే. అంతకుముందు రాముడు భీముడు  (21-05-1964 విడుదల) చిత్రంలో ఒక అంతర్నాటకం లో భీముడి పాత్రలో కనిపించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ చిత్రంలో ఫుల్ లెంత్ గా అదే పాత్ర ధరించి తన ముచ్చటను తీర్చుకోగలిగారు. వీర, రౌద్ర, శృంగార రసాల సమ్మేళనంగా సీనియర్ సముద్రాల రూపకల్పన చేసిన భీమసేనుని పాత్రలో  ఎన్ టి ఆర్ చక్కగా ఒదిగి పోయారు. ఆయన శరీర విగ్రహం ఈ పాత్రకి బాగా నప్పింది. హావ భావ ప్రకటన విషయంలో రంగస్థల నటనను ఒజ్జ బంతిగా గ్రహిస్తూ, కొంత మేరకి స్టైలైజ్ చేశారు ఎన్ టి ఆర్. ద్రౌపదిని నిండు సభలో దుర్యోధనుడు తన తొడల మీద కూచోమని సైగ చేసినప్పుడు భీముడొక్కడే ఆమె అవమానానికి స్పందిస్తూ ప్రతిజ్ణ చేస్తాడు. ఈ సన్నివేశం లో ఎన్ టి ఆర్ నటన అపూర్వం.

అంతవరకూ పెద్ద పెద్ద వస్తాదులే భీముడి పాత్ర వేస్తూ వచ్చారు. కానీ భీముడి పాత్రకు కూడా ఓ సున్నిత స్పందనని తీసుకు రావడం ఎన్ టి ఆర్ గొప్పదనమే.   

భీమసేనుడు పాత్రలో ఎన్ టి ఆర్ ప్రళయకార రుద్రుడిలా చెలరేగిపోయారు. భీకరాకారుడయిన భీముని పాత్రకోసం వజ్రకఠిన సదృశంగా తన శరీరాన్ని మార్చుకున్న ఎన్ టి ఆర్ కృషిని, అంకిత భావాన్ని ఎంతైనా అభినందించి తీరాలి. ద్రౌపదిని సభకు ఈడ్చుకు వచ్చిన సందర్భంలో ఆమెకు దాపురించిన నికృష్ట పరిస్థితికి చలించి గద్గద స్వరంతో ద్రౌపదిని గురించి ఎన్ టి ఆర్ చెప్పే సంబాషణలు అనితర సాధ్యాలు.

ఆ సందర్భంలో ధర్మరాజు పై నిష్టుర వాక్యాలతో ఆగ్రహాన్ని ప్రదర్శించినప్పటి ఎన్ టి ఆర్ చర్య అనన్యసామాన్యం. అడ్డు చెప్పవచ్చిన అర్జునుని చూచి నిర్లక్ష్య ధోరణితో చేతిని అలవోకగా కదిలించడం ఎన్ టి ఆర్ మాత్రమే చేయగల నట విన్యాసం.

ధారుణి రాజ్య  సంపద, కురు వృద్ధుల్ అంటూ అక్కడ ప్రతిజ్ణలు చేసిన రెండు పద్యాలకూ ఎన్ టి ఆర్ చేసిన రౌద్రాభినయం వంద ఏళ్ళ తర్వాత కూడా ఎవ్వరూ చేయలేని అపురూపాభినయం. ఘోషయాత్ర సందర్భంలో గంధర్వునికి బంధీగా చిక్కిన దుర్యోధనుని విడిపించమని ప్రక్కనే ఉన్న భీమసేనునితో చెబుతూ అన్న ధర్మజుడు అనునయంగా భీముని తాకబోగా ఆ చేతికి అందక అలవోకగా ప్రక్కకు ఒరుగుతాడు ఎన్ టి ఆర్. భీమసేనుని మనస్థత్వాన్ని తెలియచేసే ఆ చర్య ఓ అద్భుతం. పాత్రలో ఒదిగిపోయే ఆ తీరు మహాద్భుతం.

దుర్యోధనుని విడిపించిన తర్వాత బంధీగా ఉన్న కురు రాజును చూచి ఎన్ టి ఆర్ చెప్పిన డైలాగులు దుర్యోధనుడే కాదు, చూసిన ప్రేక్షకులు సైతం ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారంటే ఆ ప్రాభవం ఎన్ టి ఆర్ స్వంతం. దుర్యోధనుని బంధనాలను విడువమని ధర్మరాజు ఆజ్ణాపించినప్పుడు ఇష్టం లేని బెట్టుతనం మొహంలో ప్రతిఫలింపచేసిన వైనం నయనానందకరం. అడవిలో భీముడు కిమ్మీరుని వధించటం, ఆంజనేయుడు భీముని పరీక్షించే సమయంలో ఆంజనేయుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాభినయం, భార్యను అవమానించిన సైంధవుని పరాభవించిన సందర్భంలోనూ, అలాగే పతాక సన్నివేశాల్లోనూ మహోదృతంగా సాగే నదిలా ఎన్ టి ఆర్ నటన పరవళ్ళు త్రొక్కింది. భీమసేనుడి పాత్రలో ఎన్ టి ఆర్ చేసిన పరకాయ ప్రవేశం చరిత్ర మరువని అపురూప స్మృతి చిహ్నం. చిత్రం ఆసాంతం ఎన్ టి ఆర్ అభినయంతో ప్రేక్షకులు ఓ విధమయిన ఉద్వేగానికి లోనయిపోవడం జరిగింది. కమలాకర కామేశ్వర రావుగారు సైతం ఆ ట్రాన్స్ లోంచి చాలాకాలం బయటపడలేక పోయారు.

అలాగే సంగీత దర్శకుడు ఘంటసాల రీ రికార్డింగులో ఎన్ టి ఆర్ కు ప్రత్యేకంగ మ్యూజిక్ బిట్ కంపోజ్ చేశారు. ఎన్ టి ఆర్ కనిపించినప్పుడల్లా ఆ బిట్ ప్లే చేశారు ఘంటసాల.

హావభావ ప్రదర్శనలో, డైలాగ్ మాడ్యులేషన్లో ఎన్ టి ఆర్ కు ధీటుగా నిలిచి దుర్యోధనుడి పాత్రను ఎస్ వి ఆర్ పోషించారు.

కురు సభలో ఎన్ టి ఆర్, ఎస్ వి ఆర్ పోటీపడి నటిస్తూ పాడిన పద్యాలకు తమ గాత్రాలతో మరింత గంభీరత్వాన్ని తీసుకొచ్చారు ఘంటసాల, మాధవపెద్ది.

ఎన్ టి ఆర్ ఎంత ఆవేశంతో నటించారో, ధారుణి రాజ్య సంపద మదంబున, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ అన్న పద్యాలను అంత ఆవేశం తోనూ పాడి సన్నివేశ ప్రాధాన్యం పెంచారు ఘంటసాల.

అంతవరకూ వచ్చిన పౌరాణిక చిత్రాల్లో భీముడి పాత్ర ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉండేది. అయితే ఆ పాత్రను ఎన్ టి ఆర్ పోషించడంతో దానికి హీరోయిజం వచ్చేసింది. ఇక ద్రౌపది పాత్రను సావిత్రి చేస్తుండటం సినిమాకు మరో ప్లస్ పోయింట్ అయింది. వీరిద్దరికీ ఒక యుగళ గీతం పెట్టాలనే ఆలోచన మొదట దర్శక నిర్మాతలకు లేదు. అయితే ఎన్ టి ఆర్, సావిత్రి వంటి పోప్యులర్ జంటను పెట్టుకుని దుఎత్ లేకపోతే ఎలా అని విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి  అనడంతో అప్పటికప్పుడు పాట రాయించి చిత్రీకరించారు. అదే హిమగిరి సొగసులు, మురిపించెను మనసులు పాట. ఈ పాట ఎంత పోప్యులర్ అయ్యిందో చెప్పనక్కరలేదు. హిమగిరి అన్న ఏకవచన ప్రయోగానికి బదులు చలిమల సొగసులు అని ఉంటే బాగుండేదని ఆ సినిమా విడుదలైన తొలి రోజుల్లో ఒక విమర్శకుడి అభిప్రాయం.  ద్రౌపదీ, భీమసేనుడు ఇరువురూ వనవాస నియమాలకు లోబడి ఉన్నారు. వీరిద్దరినీ ఎక్కడికి తీసుకు వెళ్ళి ప్రణయాంకురం చేస్తూ పల్లవి వ్రాయాలి. సాహితీ సముద్రాలని మధించిన సముద్రాల అపార ప్రజ్ణ ఇక్కడ ఒక్కసారిగా హిమోన్నత స్థాయికి ఎదిగింది. అనుకోకుండా దొరికిన ఏకాంత విడిదిని మనసులు మురిపించే స్థాయిలో పల్లవించి అందులోంచి ప్రణయ మానస భావ వీచికలు చల్లగా తాకేలా పాట సాగుతుంది. ద్రౌపది ఉమా మహేశ్వరులను గుర్తు చేస్తూ క్షేత్ర మహిమలను ప్రస్తావిస్తూ ఉంటే భీముడు రతీ మన్మధుల ప్రస్తావన తెస్తూ అక్కడికి వచ్చిన పనిలోని అంతరార్ధాన్ని శృంగార భావాల్ని గుర్తు చేసేలా పాట సాగుతుంది. విరహానికీ వియోగానంతర ఏకాంత కలయికల సమయంలో ఖమాస్, కాఫీ, భాగేశ్వరి, రాగేశ్వరి రాగాలు వాడతారు. ఘంటసాల జయ జయావంతీ రాగం లో వీక్షకుల్ని మెప్పించారు.

ఈ చిత్రంలో ద్రౌపది పాత్రకు ముందు భానుమతిని సంప్రదించారు నిర్మాత. ఆమె తన సహజ ధోరణిలో " ఐదుగురు భర్తలకు భార్య, అందులో శోక పాత్ర జనాలు చూడరు, నేను వేస్తే అసలు చూడరు" అని చలోక్తి విసిరి విరమించుకున్నారు. అప్పుడు సావిత్రిని ఆ పాత్రకు తీసుకున్నారు. నర్తనశాలలో ద్రౌపదిగా ప్రేక్షకుల హృదయాలపై ప్రగాఢ ముద్ర వేసిన సావిత్రి ఈ సినిమాలో మరోమారు తాను ద్రౌపది పాత్ర పోషణలో సిద్ధ హస్థురాలని నిరూపించుకున్నారు. నిండు సభలో పరాభవం జరిగినప్పుడు భీష్మ ద్రోణాది కురు వృద్ధులను చూసే చూపులో, పాండవుల్ని చూసే చూపులో వైవిధ్యాన్ని ఏక కాలంలో ప్రదర్శించిన మహా నటి ఆమె. ఆమె ఐదుగురు పాండవుల్ని ఐదు రకాల చూపులతో చూడటం కూడా మనం ఈ చిత్రం లో గమనించ వచ్చు.  కురు సభలో కురు వృద్ధులను చూస్తూ నా భర్త నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా, నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా అనే ధర్మ సందేహాన్ని వ్యక్తం చేశే సన్నివేశంలో ఆమె నటించిన తీరు అద్భుతం. మరో విషయమేమిటంటే ఇమేజ్ కలిగిన నటి సావిత్రి. అటువంటి నటి మీద వస్త్రాపహరణ సన్నివేశం చిత్రీకరించడం నిజంగా కత్తిమీద సామే. అయినా ఎంతో హుందాగా, అసభ్యానికి తావు లేనివిధంగా ఆ సన్నివేశాన్ని చిత్రీకరించి అందరినీ ఆకట్టుకున్నారు కామేశ్వర రావు.

అఖిల భారత స్థాయిలో డ్రీం గర్ల్ గా పేరు తెచ్చుకున్న హేమ మాలిని తెలుగులో రెండు చిత్రాలలో నటించగా అవి రెండూ ఎన్ టి ఆర్ చిత్రాలే కావడం గమనార్హం. అంతే కాదు ఆమె నటించిన తొలి సినిమా పాండవ వనవాసం కావడం విశేషం. ఇందులో దుర్యోధనుడు ఘోష యాత్రకోసం అడవికి వచ్చినప్పుడు వచ్చే నృత్య సన్నివేశంలో మొగలిరేకుల సిగ దానా, మురిడీ గొలుసుల చినదానా అనే పాటలో నృత్య దర్శకుడు కె ఎస్ రెడ్డి తో నటించారు హేమమాలిని. ఎన్ టి ఆర్ కాంబినేషన్ లో ఆమె నటించిన మరో చిత్రం శ్రీ కృష్ణ విజయం. ఈ సినిమాలో రంగుల్లో చిత్రీకరించిన జోహారు శిఖిపించమౌళి పాటలో ఆమె పాల్గొన్నారు. 2017 సంవత్సరం బాల కృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాత కర్ణి లో గౌతమిగా నటించారు. తేనె మనసులు చిత్రం లో నాయిక పాత్ర కోసం ఆమె దరఖాస్తు చేసుకుంటే ఆదుర్తి తీసుకోలేదు, కాని కమలాకర కామేశ్వర రావు చలన చిత్ర రంగానికి ఆమెను పరిచయం చేసిన ఘనతను సముపార్జించూకోగలిగారు.

శశిరేఖ, అభిమన్యుల ప్రణయ గాధతో రూపు దిద్దుకున్న మాయా బజార్ చిత్రాన్ని తెలుగువారెవరూ మరిచిపోలేరు. అంత గొప్పగా ఆ చిత్రాన్ని తీర్చి దిద్దారు కె వి రెడ్డి. అదే కధను ఈ సినిమా ద్వితీయార్ధంగా ఎన్నుకోవడం ఒక సాహసమే. అయినా కె వి రెడ్డి స్కూల్ విధ్యార్ధే కనుక ఎలాంటి లోటూ లేకుండా చిత్రీకరించారు కామేశ్వర రావు. ఇందులో శశిరేఖగా ఎల్ విజయ లక్ష్మి, అభిమన్యుడుగా హరనాధ్, లక్ష్మణకుమారుడిగా పద్మనాభం, ఘటోత్కచుడిగా సత్య నారాయణ నటించారు. శశిరేఖ, అభిమన్యులపై చిత్రీకరించిన రాగాలు మేళవింప, నా చందమామ పాటలు కూడా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాలో దుర్యోధనుడిగా ఎస్ వి ఆర్, శకునిగా లింగమూర్తి, ధర్మరాజు గా గుమ్మడి, భీముడిగా ఎన్ టి ఆర్,  అర్జునుడిగా బాలయ్య, ద్రౌపదిగా సావిత్రి, దుశ్శాసనుడిగా మిక్కిలినేని, ఆంజనేయుడిగా అజిత్ సింగ్, కృష్ణుడిగా కాంతారావు, చిత్రసేనుడిగా ధూళిపాళ, కర్ణుడిగా ప్రభాకర రెడ్డి, దూర్వాసుడిగా ముక్కామల, అభిమన్యుడిగా హరనాధ్, శశి రేఖగా ఎల్ విజయ లక్ష్మి, ఘటోత్కచుడిగా సత్యనారాయణ, సత్య భామగా వాణిశ్రీ, కిమ్మీరుడిగా నెల్లూరు కాంతారావు, సైంధవుడిగా రాజనాల, బ్రహ్మాండం గా రమణా రెడ్డి, అండం గా అల్లు రామ లింగయ్య, పిండం గా సీతారాం, విదురునిగా నాగయ్య, భానుమతిగా సంధ్య , లక్ష్మణ కుమారుడిగా పద్మనాభం ఇంకా ఇతర పాత్రలలో రాజ సులోచన, ఋష్యేంద్రమణి నటించారు.

తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని పాండబేర్ బనవాస్ పేరుతో బెంగాలీలోకి అనువదించబడిన తొలి తెలుగు చిత్రం ఇదే. చిత్ర నిర్మాత ఏ ఎస్ ఆర్ ఆంజనేయులు, నవ శక్తి గంగాధర రావు ఈ సినిమాని అనువదించారు. గంగాధరరావు సోదరుడు పర్వతనేని సాంబశివరావు డబ్బింగ్ బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలలు కలకత్తాలో ఉండి డబ్బింగ్ చేశారాయన. ఒక తెలుగు చిత్రం డబ్బింగ్ జరుగుతోందని విని సత్యజిత్ రే, ఉత్తమ కుమార్ వంటి ప్రముఖులు డబ్బింగ్ థియేటర్ కు రావడం విశేషం. అంతవరకూ బెంగాళీ పాద ధూళి కధలు తెలుగు లో సాంఘికాలుగా కొన్ని వచ్చాయి. పాండవ వనవాసం తెలుగునుండి బెంగాళీకి అనువదించబడిన తొలి తెలుగు చిత్రం.

ఈ చిత్రానికి సి నాగేశ్వర రావు కెమెరా పనితనం మనకి కురు సభలో స్పష్టం గా కనిపిస్తుంది. సెట్టింగ్ విశాలం గా లేకపోయినా, తన షాట్ డివిజన్ ప్రతిభతో ఆయన భీష్మ, ద్రోణ, విదుర, వికర్ణాది కురు వీరులనూ, వారి హావ భావాలనూ ఎంతో విపులం గా చూపించగలిగారు. ఇలాంటి దృశ్యాల చిత్రీకరణ సందర్భంలో మరొక కెమెరా మేన్ అయితే ట్రాలీ షాట్లను విరివిగా ఉపయోగిస్తారు. కాని సి నాగేశ్వర రావు ఆ పని చేయలేదు. ఆ మాటకొస్తే కెమెరాను ఎక్కడ ఏ పొజిషన్ లో పెట్టారో కూడా మనం కనిపెట్టలేనివిధంగా ఆయన ఈ దృశ్యాలను చిత్రీకరించారు.

ఘంటసాల సంగీత దర్శకత్వంలో పాటలు, పద్యాలు అన్నీ సుమధురంగా రూపొంది ఈ చిత్రాన్ని అజరామరం చేశాయి.

కవిత్రయం పద్యాలు కేవలం ఘంటసాల ఆలాపన వల్లే ఈనాటికీ సంగీత కచేరీల్లో రాణిస్తున్నాయి. ఎంతోమంది గాయనీ గాయకులకు నర్తనశాల, పాండవ వనవాసం చిత్రాల్లోని పద్యాలు బ్రతుకుతెరువును కల్పించాయండంలో అసత్యం లేదు. భీమసేనుని శౌర్య ప్రతాపాలను, దుర్యోధనుడి అసూయ ఈర్ష్యలను చక్కగా చేస్తాయా పద్యాలు. దుర్యోధనుడి పద్యాలు మాధవపెద్ది, భీముడి పద్యాలను ఘంటసాల రసోచితం గా పోటీలు పడి ఆలపించారు. పి లీల గారు పాడిన దేవా దీన బాంధవా మనసును ద్రవింప చేసే శోక గీతం. భీం ప్లాస్ రాగం లో అతి దీనం గా, మధురం గా ఉంటుందీ పాట. ఇది వింటుంటే పాంచాలి పరాభవ దృశ్యం కన్నులముందు ప్రత్యక్షమై కన్నీటి పర్యంతమౌతాము. పి లీల గారి గాత్రంలో జాలి, ఆవేదన, నిస్సహాయతా మిళితమై వ్యధాభరిత జలపాతంలా ప్రవహిస్తుంటాయి. ఈ పాటలో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద రక్షణ గాధల్ని సముచితంగా ప్రస్తావించడం ఎంతో సముచితం గా ఉంటుంది.

పాండవ వనవాసం సంక్రాంతి కానుకగా 14-01-1965 న 23 కేంద్రాలలో విడుదలయ్యి, విడుదలైన అన్ని కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకుంది. రెండు కేంద్రాలలో రజతోత్సవాలు జరుపుకుంది. బెంగాళీ బాషలోకి డబ్ అయితే అక్కడ కూడా రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రానికి 1970 ప్రాంతాలలో ఎం ఎస్ రెడ్డి (మల్లె మాల) పంపిణీ హక్కులు తీసుకున్నారు. అప్పటికి ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయనను మళ్ళీ పరిశ్రమలో నిలబెట్టిన చిత్రమిది. కొమ్మినేని వేంకటేశ్వర రావు గారు 1990 ప్రాంతాలలో ఈ చిత్రం మళ్ళీ విడుదల చేశారు. ఆ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్లను రంగుల్లో డిజైన్ చేయించారు. శాటిలైట్ ప్రదర్శనల్లో కూడా ఈ చిత్రం ఆర్ధిక విజయాన్ని సాధించింది. ఈ చిత్ర నిర్మాతలు తమ తదుపరి చిత్రంగా అక్కినేని, జమునలతో బంధిపోటు దొంగలు చిత్రం తీశారు.

సంక్షిప్త చిత్రకథ[మార్చు]

మయ సభలో దుర్యోధనునికి జరిగిన పరాభవం, తాము పొందిన ప్రశంసలను గుర్తుకు తెచ్చుకొని శ్రీకృష్ణుని సహాయానికి కృతజ్ఞత తెలుపుతారు పాండవులు. జరిగిన పరాభవాన్ని తలచుకొని కృంగిపోతున్న దుర్యోధనునికి ధైర్యం చెప్పి మాయా జూదంలో పాండవుల సంపదను హరిస్తానని చెబుతాడు శకుని. ధృతరాష్ట్రుని ఆహ్వానంపై వచ్చిన ధర్మరాజు జూదములో పాల్గొని సర్వస్వం వోడిపోయి చివరకు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వస్తుంది.

అరణ్యవాస సమయంలో పాండవుల్ని దూర్వాసుడు పరీక్షించడం, ద్రౌపది కోరికపై భీమసేనుడు సౌగంధికా కమలాలను సాధించి తేవడం, ఘోషయాత్రకు వచ్చిన దుర్యోధనుడు చిత్రసేనుని చేతిలో పరాభవం పొందటం, పాండవుల ధాతృత్వంతో ప్రాణాలు దక్కించుకున్న సుయోధనుని ఆత్మహత్యా ప్రయత్నం, శశిరేఖ వివాహ సమయంలో లక్ష్మణ కుమారుని పరాభవం, అభిమన్యునితో వివాహం మొదలైన సంఘటనలన్నీ రసవత్తరంగా కూర్చి ఈ చిత్ర కథను రూపొందించారు.

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

విశేషాలు[మార్చు]

  • ఈ సినిమాలో ఆ తరువాత ప్రఖాత్య హిందీ సినిమా తార అయిన హేమామాలిని కొన్ని నృత్య సన్నివేశాలలో నటించింది. ఇదే ఆమె తొలి సినిమా.
  • ఘంటసాల పాడిన ఆంజనేయ స్తుతి భక్తిపూరితంగా ఉంటుంది.
  • జూద ఘట్టంలో మహాభారత కావ్యములో సభాపర్వములో ఆది కవి నన్నయ వ్రాసిన మహాభారతంలోని కొన్ని పద్యాలు, ద్రౌపది వస్త్రాపరహణ ఘట్టం అద్భుత భీభత్స, కరుణ, వీర రసాల్ని ఆవిష్కరించాయి.
  • ఘటోత్కజుని పాత్ర చిత్రంలో సంధర్బోచితంగా ప్రవేశపెట్టారు.
  • ఉత్తరాభిమన్యుల కల్యాణానికి మాయాబజార్ సినిమా లో శశిరేఖా పరిణయ ఘటాన్ని జత చేసి చిత్రానికి కొత్త సబసులద్దేరు.

పాటలు[మార్చు]

పాట రచయిత సంగీతం గాయకులు
ఓ వన్నెకాడా నిన్ను చూసి నా మేను పులకించెరా సముద్రాల సీనియర్ ఘంటసాల ఎస్. జానకి బృందం
నా చందమామ నీవె భామ తారలే ఆన నీ నీడనే నా ప్రేమ సీమ సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల పి.సుశీల
దేవా దీన బంధవా అసహాయురాలరా కావరా దేవా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల పి.లీల
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు ఆరుద్ర ఘంటసాల పి.సుశీల, పద్మనాభం
మహినేలే మహారాజు నీవే మనసేలే నెరజాణ: సముద్రాల సీనియర్ ఘంటసాల పి. లీల, ఎల్.ఆర్.ఈశ్వరి
మొగలీరేకుల సిగదానా మురిడీ గొలుసుల కొసరాజు ఘంటసాల ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
విధి వంచితులై విభవమువీడి అన్నమాట కోసం అయ్యో అడవి పాలయేరా సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల
హిమగిరి సొగసులు మురిపించును మనసులు సముద్రాల రాఘవాచార్య ఘంటసాల ఘంటసాల పి.సుశీల
రాగాలు మేళవింప ఆహా హృదయాలు పరవశింప సముద్రాల సీనియర్ ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
ఉరుకుల పరుగుల దొర

పద్యాలు[మార్చు]

  1. అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  2. ఏకచక్రపురాన ఎగ్గుసిగ్గులు (సంవాద పద్యాలు) - ఘంటసాల,మాధవపెద్ది- రచన: సముద్రాల సీనియర్
  3. ఓ కమలాననా వికసితోత్పలోచనా నీలవేణీ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: సముద్రాల సీనియర్
  4. కారున్ కూతలు కూయబోకుమిక గర్వాంధా (పద్యం) - మాధవపెద్ది- రచన: సముద్రాల సీనియర్
  5. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకులు (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  6. ఙ్ఞానవిఙ్ఞానమోక్షదం మహాపాపరం దేవం (శ్లోకం) - మంగళంపల్లి - రచన: సముద్రాల సీనియర్
  7. ధారుణి రాజ్యసంపద మదంబున కోమల (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  8. నమో బ్రాహ్మణ్యదేవాయా గో బ్రాహ్మణహితాయచ (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  9. మనోజవం మారుతతుల్యవేగం ( ఆంజనేయ దండకం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  10. మాయలమారివై మొగలు (సంవాద పద్యాలు) - మాధవపెద్ది,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
  11. శాతనఖాగ్రఖండిత లసన్మద కుంజర కుంభముక్తము (పద్యం) - పి.లీల - రచన: సముద్రాల సీనియర్
  12. శ్రీకృష్ణా కమలానాభా వాసుదేవా సనాతనా గోవిందా ( పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు[మార్చు]