పాలనా కాలం
పాలనాకాలం అనేది ఒక వ్యక్తి లేదా రాజవంశం ఒక దేశానికి (ఉదాహరణకు, సౌదీ అరేబియా, బెల్జియం, అండోరా ), ఒక ప్రజలకు (ఉదాహరణకు, ఫ్రాంకులు, జూలూలు ) లేదా ఒక ఆధ్యాత్మిక సమాజానికి (ఉదాహరణకు, కాథలిసిజం, టిబెటన్ బౌద్ధమతం, నిజారీ ఇస్మాయిలిజం ) చక్రవర్తిగా పదవి నిర్వహించిన కాలం.[1] చాలా వంశపారంపర్య రాచరికాల లోను, కొన్ని ఎన్నికల రాచరిక వ్యవస్థల లోనూ (ఉదాహరణకు, పవిత్ర రోమన్ సామ్రాజ్యం) సార్వభౌముని పాలన లేదా పదవీకాలం వ్యవధిపై ఎటువంటి పరిమితులు లేవు, అలాగే పదవీ కాలం కూడా లేదు. అందువల్ల, రాచరికం రద్దు చేయబడితే లేదా చక్రవర్తి పదవిని వదులుకుంటే లేదా తొలగించబడితే తప్ప, చక్రవర్తి మరణించే వరకు పాలన సాధారణంగా కొనసాగుతుంది.
ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే రాచరిక వ్యవస్థలలో, రాజుకు ఒక నిర్దిష్ట పదవీకాలం ఉండవచ్చు (ఉదాహరణకు, మలేషియా ).
సార్వభౌముని పేరు తర్వాత, వారి పరిపాలన కాలాన్ని "పా" అనే సంక్షిప్త రూపంతో సూచించవచ్చు. (పాలనా కాలం) [2] ఉదాహరణకు:
- జార్జ్ VI, గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్, బ్రిటిష్ రాజ్యాల రాజు, భారతదేశ చక్రవర్తి (పాలన 1936 – 1952).
పాలన ముగింపు
[మార్చు]పరిపాలనా కాలం పలు విధాలుగా ముగియవచ్చు:
- వదలుకోవడం
- రాచరికం రద్దు
- మరణం
- తొలగింపు
వదలుకోవడం (పదవీ త్యాగం)
[మార్చు]- ఆస్ట్రియా చక్రవర్తి, హంగరీ, బోహేమియా రాజు, లోంబార్డీ-వెనీషియా రాజూ అయిన మొదటి ఫెర్డినాండ్ (పాలన 1835–1848) తన వైకల్యాల ( బుద్ధిమాంద్యం, మూర్ఛవ్యాధి ) కారణంగా పదవీత్యాగం చేశాడు. ఆయన వారసుడు, చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్ (పా. 1848 – 1916) 68 సంవత్సరాలు పాలించాడు.
- యునైటెడ్ కింగ్‌డమ్ రాజు ఎడ్వర్డ్ VIII, 1936 జనవరి నుండి డిసెంబరు వరకు పాలించి, సింహాసనాన్ని త్యజించాడు. ఆయన సింహాసన త్యాగం తర్వాత డ్యూక్ ఆఫ్ విండ్సర్‌గా ప్రసిద్ధి చెందాడు. గ్రేట్ బ్రిటన్ రాజ్యంలో గానీ, (1707–1800), గ్రేట్ బ్రిటన్, ఐర్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్ లో గానీ, గ్రేట్ బ్రిటన్, ఉత్తర ఐర్లాండ్ యునైటెడ్ కింగ్‌డమ్ లో గానీ, మరేదైనా డొమినియన్ లేదా కామన్వెల్త్ రాజ్యానికి గానీ చెందిన ఏ ఇతర చక్రవర్తి కూడా ఎన్నడూ సింహాసనాన్ని త్యజించలేదు. 1707 లో మాత్రం, ఇంగ్లాండ్ రాజ్యం, స్కాట్లాండ్ రాజ్యాలు విలీనమయ్యే ముందు అతి తక్కువ సందర్భాలలో మాత్రమే బలవంతపు సింహాసన త్యాగాలు జరిగాయి.
- నెదర్లాండ్స్ రాణి విల్హెల్మినా 1890 నుండి 1948 వరకు పాలించాక పదవిని త్యజించి తన కుమార్తె రాణి జూలియానాకు సింహాసనాన్ని అప్పగించింది. జూలియానా 1980 వరకు పాలించి, తన కుమార్తె నెదర్లాండ్స్ రాణి బీట్రిక్స్‌కు సింహాసనాన్ని అప్పగించింది. బీట్రిక్స్ కూడా అదే బాటలో నడిచి, 2013 లో తన కుమారుడు, కాబోయే వారసుడూ అయిన కింగ్ విల్లెం-అలెగ్జాండర్‌కు సింహాసనాన్ని ధారపోసింది.
రాచరిక నిర్మూలన
[మార్చు]- ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI 1774 నుండి 1792 వరకు పాలించాడు. 1792 లో రాచరికం పతనమైంది. మరుసటి సంవత్సరం అతన్ని ఉరితీసారు.
- 1912లో జరిగిన జిన్హాయ్ విప్లవం తరువాత చైనా చక్రవర్తి జువాన్‌టాంగ్ పదవీత్యాగం చేయడంతో, చైనా రాచరికం అంతమైంది.
- ఇటలీ రాచరికం రద్దు కావడానికి ముందు, 1946లో ఇటలీ రాజు ఉంబెర్టో II కేవలం కొన్ని వారాలు మాత్రమే పాలించాడు.
- గ్రీస్ రాజు రెండవ కాన్‌స్టాంటైన్ 1964 నుండి 1973లో గ్రీకు రాచరికం రద్దు అయ్యే వరకు పరిపాలన సాగించాడు.
- రష్యా జార్ నికోలస్ II 1894 నుండి 1917 వరకు పరిపాలన సాగించారు. ఆ తర్వాత ఆయన సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. రష్యన్ విప్లవం సమయంలో రష్యన్ సామ్రాజ్యాన్ని కూలదోసారు.
- ఇథియోపియా చక్రవర్తి హైలే సెలాసీ 40 సంవత్సరాలకు పైగా (1930-1974) పాలించాడు. డెర్గ్ ప్రభుత్వం ఆయనను పదవీ త్యాగం చేయమని బలవంతం చేసి, 3,000 సంవత్సరాల పురాతన రాచరికాన్ని రద్దు చేయడంతో, ఆయన ఇథియోపియాకు చిట్టచివరి (225 వ) చక్రవర్తి అయ్యాడు.
- ఇరాన్ షా మహమ్మద్ రెజా పహ్లవి, ఇరాన్ విప్లవం వరకు 37 సంవత్సరాలకు పైగా (1941–1979) పాలించాడు. ఈ విప్లవం 2,500 సంవత్సరాల రాచరికాన్ని తొలగించి ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థను స్థాపించింది. షా మరుసటి సంవత్సరమే మరణించాడు. ఆయనను కైరోలో ఖననం చేశారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "reign - definition of reign in English | Oxford Dictionaries". Oxford Dictionaries | English. Archived from the original on September 25, 2016. Retrieved 2017-04-09.
- ↑ Robbins, John Fonseca (2015-08-31). Fonseca Robbins´Lexicon (in ఇంగ్లీష్). Joinville: Clube de Autores. p. 238.