తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ

వికీపీడియా నుండి
(పాలెం సుబ్బయ్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

పాలెం సుబ్బయ్యగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మమహబూబ్ నగర్ జిల్లా, బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో 1926, ఏప్రిల్ 23న జన్మించారు. పెద్దగా చదువుకోకున్నా విద్యారంగంలో, గ్రామ అభివృద్ధిలో ఇతోధిక సేవ చేసి పాలెం గ్రామ అభివృద్ధికి మార్పుపేరుగా నిలిచారు. ఒక కుగ్రామాన్ని పట్టణస్థాయి వసతులు కల్పించడానికి కృషిచేశారు. తాను స్థాపించిన కళాశాలలో అభ్యసించిన విద్యార్థులందరో నేడు కవులుగా చెలామణి అవుతున్నారు. అప్పట్లోనే ఆయన సేవలను గుర్తిస్తూ జాతీయస్థాయిలో కూడా అనేక పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి. రాష్ట్రస్థాయిలోనే గ్రామానికి పేరుతెచ్చి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా సేవచేసి, తన స్వంత ఆస్తులనే గ్రామాభివృద్ధికి వెచ్చించిన మహనీయుడిగా నిలిచిన సుబ్బయ్య 1986, జూన్ 23న మరణించారు.[1] 1987లో ఆయన నిలవెత్తు కాంస్య విగ్రహాన్ని అప్పటి రాష్ట్ర గవర్నరు కుముద్‌బెన్ జోషిచే ఆవిష్కరించబడింది. సుబ్బయ్య స్థాపించిన పాఠశాల పేరును తోటపల్లి సుబ్రహ్మణ్యం స్మారక ఉన్నత పాఠశాలగా పేరుమార్చి ఆయన సేవలను గుర్తించారు. 2006లో సుబ్రహ్మణ్యం చేసిన సేవలపై ప్రత్యేకంగా ఒక పుస్తకమే వెలువడింది.

బాల్యం

[మార్చు]

తోటపల్లి సుబ్రహ్మణ్యం 1926, ఏప్రిల్ 23న సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి సత్యమూర్తి, తల్లి భగీరథమ్మ. తల్లిదండ్రులు మొదట ఈయనకు పౌరోహిత్యం నేర్పాలని ప్రయత్నించారు. కాని సుబ్రహ్మణ్యంకు దీనిపై ఆసక్తి లేకుండేది. అప్పుడు గ్రామంలో ఒకేఒక పాఠశాల, అదీ కూడా ఏకోపాధ్యాయ పాఠశాల ఉండేది. అందులోనేకొంతవరకు తెలుగు, ఉర్దూ అభ్యసించారు.

జీవనం

[మార్చు]

ప్రారంభంలో సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయుడిగా జీవనం ఆరంభించారు. కాని ఈ వృత్తిలో ఇతనికి ఆసక్తి లేకుండేది. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. తాను 22 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు ఈయనపై పడ్డాయి. తన తమ్ముడు రామేశ్వర్‌ను ఉన్నత విద్య అభ్యసించడానికి సహాయపడినారు. రామేశ్వర్‌కు ఉన్నత ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్ననూ అది కాదని గ్రామాభివృద్ధిలో తనకు సహకరం అందించవలసిందిగా, తనకు తోడుగా ఉండవలసిందిగా కోరడంతో చివరి వరకు కూడా ఇద్దరూ కలిసే గ్రామాభివృద్ధిలో పాలుపంచుకున్నారు.

గ్రామాభివృద్ధి కార్యక్రమాలు

[మార్చు]

1960 నాటికి పాలెం గ్రామం 1300 జనాభాతో జిల్లాలో పూర్తిగా వెనకబడిన ప్రాంతంగా ఉండెది. అదే సమయంలో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రారంభమవడంతో గ్రామాని ఎలాగైనా అభివృద్ధి చేయాలనే తలంపుతో గ్రామప్రజలను ఏకం చేసి సుబ్రహ్మణ్యం నడుంబిగించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు

ప్రతి పంచాయతి బ్లాకులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలని ప్రభుత్వం భావించడంతో ఆ కేంద్రాన్ని పాలెంకు రప్పించడానికి సుబ్బయ్య ప్రయత్నించారు. బ్లాకు కేంద్రం బిజినేపల్లి కాకుండా చిన్న గ్రామమైన పాలెంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు అభ్యంతరపర్చిననూ తన శక్తినంత ధారపోసినారు. ఆరోగ్యకేంద్రం ఏర్పాటుకు కావలసిన 2 ఎకరాల భూమిని బ్లాకుకేంద్రంలో సకాలంలో సమకూరకపోవడంతో పాలెంలో తనకున్న స్వంత భూమిని ఇస్తానని, దానికి తోడు రూ 10000/- కూడా విరాళం ఇవ్వదల్చుకున్నానని చెప్పి మొదటిసారిగా గ్రామంలో ఆరోగ్యకేంద్రం ఏర్పాటుకు కృషిచేసి సఫలీకృతులైనారు

శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం

గ్రామంలో అధ్యాత్మిక విలువలు పెంచాలనే తలంపుతో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణానికి పూనుకొని గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేత ఆలయానికి ప్రారంభోత్సవం చేయించారు. [2]

విద్యాసంస్థలు

అప్పట్లో గ్రామంలో కేవలం ప్రాథమిక పాఠశాల మాత్రమేఉండేది. తర్వాతి చదువులకై నాగర్‌కర్నూల్ వెళ్ళవలసి వచ్చేది. కాబట్టి ముందుగా ఉన్నతపాఠశాల నెలకొల్పాలని సంకల్పించి, దానికి అనుబంధంగా వసతిగృహాన్నికూడా ఎర్పాటుచేశారు. ఆ తర్వాత ప్రభుత్వ డిగ్రీకళాశాల, ఓరియంటల్ కళాశాల కూడా స్థాపించారు. ఇక్కడ స్థాపించబడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లాలొనే రెండవది కాగా రాష్ట్రంలోనే ఒక గ్రామంలో స్థాపించబడ్డ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మొదటిది.

వ్యవసాయ పరిశొధన కేంద్రం

జిల్లాలోనే ఏకైక వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెంలో ఏర్పాటు కావడానికి కారకుడు సుబ్బయ్యనే. పట్టుబట్టి తన స్వంత భూములు కూడా దీనికై ధారబోసి పరిశొధన కేంద్రాన్ని రప్పించుకున్నారు. 'పౌల్ట్రీ, ఇతర పరిశ్రమలు అధ్యాత్మికంగా, విద్యాపరంగా గ్రామం పేరుపొందినప్పటికీ పారిశ్రామికంగా కూడా ముందంజవేయాలని తలచి ముందుగా సుబ్బయ్య పౌల్ట్రీ పరిశ్రమను గ్రామానికి రప్పించుకున్నారు. ఆ తర్వాత ఇతర పరిశ్రమలు కూడా గ్రామంలో స్థాపించడానికి సుబ్బయ్య కృషిచేశారు.

బస్సుస్టేషను

జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామానికి బస్సుసౌకర్యం కోసం కృషిచేసి స్టేషను నిర్మాణానికి పాటుపడ్డారు. అప్పట్లో సమితికేంద్రంలో కూడా బస్టాండ్ లేకుండేది, అయితే పాలెం గ్రామానికి భక్తులు, డిగ్రీ, ఓరియంటల్ కళాశాలలో అభ్యసించే విద్యార్థులు దూరప్రాంతాలనుంచి వస్తున్నారని పట్టుపట్టి బస్సుస్టేషను నిర్మాణానికి కారకులయ్యారు.

అమెరికా పయనం

జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి కారకుడైన సుబ్బయ్య ప్రపంచ పౌల్ట్రీ సంస్థ కోరికపై అమెరికా వెళ్ళి పౌల్ట్రీ, డెయిరీ, వ్యవసాయ ఉత్పాదకతలపై పరిశోధన చేశారు. ఇక్కడికి వచ్చిన పిదప పాలెంలో అమలుచేయడానికి ప్రయత్నించారు.

ఆదర్శగ్రామంకై కృషి

ఒక కుగ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పేరుతేవడానికి సుబ్బయ్య కృషిచేయడమే కాకుండా సఫలీకృతుడైనారు. అప్పట్లో పాలెం గ్రామం రాష్ట్రస్థాయిలో పేరు సంపాదించడానికి సుబ్బయ్య కృషే కారణం.

చివరి రోజులు

ఒక మారుమూల చిన్న గ్రామాన్ని రాష్ట్రస్థాయిలో పేరువచ్చినట్లు చేసి, జాతీయ స్థాయిలో గుర్తింపుపొందినట్లు చేసి, అంతర్జాతీయ చిత్రపటంపై కూడా పాలెం గ్రామముద్ర వేసిన సుబ్బయ్య చివరి రోజుల్లో మాత్రం ఇదంతా ఎందుకు చేశాను అనుకొనే పరిస్థితికి వచ్చింది. ప్రధానమంత్రిని, ఎందరో ముఖ్యమంత్రులనే కాకుండా అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను కూడా పాలెంకు రప్పించిన సుబ్బయ్య గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి వ్యక్తిగతంగా మంచి పేరు పొందినప్పటికీ, చివరి దినాలలో మాత్రం కొందరి వల్ల అసంతృప్తి చెందారు. 1986, జూన్ 23న సుబ్బయ్య మరణించారు. ఆ తర్వాతి ఏడాది 1987, జూన్ 22న అప్పటి గవర్నరు కుముబ్ బెన్ జోషిచే సుబ్బయ్య కాంస్య విగ్రహం గ్రామంలో ఆవిష్కరించబడింది. 1986లో సుబ్బయ్యపై ప్రత్యేకంగా ఒక పుస్తకమే ప్రచురించబడింది.

మూలాలు

[మార్చు]
  1. మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము, రచన: బీఎన్ శాస్త్రి
  2. వైతాళికుడు, సంపాదకత్వం: హెచ్.రమేష్ బాబు, పేజీ 119