పాల్వంచ సంస్థానం
ఒకప్పటి శంకర గిరియే నేటి పాల్వంచ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మంలో ఉండేది, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతానికి చెందుతుంది. దీని విస్తీర్ణం 800 చ. మైళ్లు. 40,000 జనాభా కలిగి ఉంది. రాజ్య ఆదాయం 70,000. ఇది నిజాం రాజ్యంలోని సామంత రాజ్యం. భద్రాచలం జమీందారుల ఆధీనంలో ఉండేది. దీన్ని వెలమ సామాజిక కులంవారు పరిపాలించారు. అశ్వరావు కండిమల్ల జలగమ తండ్రి డామరు. ముత్యాల వంశం వారు పరిపాలించారు.[1] ఇది ఆరు తాలూకాలతో కూడిన సంస్థానం.[2]
చారిత్రక సంగతులు
[మార్చు]ఒక సంస్కృతి ఉంది. సంస్థానాల్ని కేవలం భౌగోళిక పరిధులకు సంబంధించినవిగానే పరిగణించకూడదు. వాటికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆంగ్లేయుల నుంచి విముక్తయిన తర్వాత భారతదేశంలో అనేక సంస్థానాల్ని విలీనం చేశారు. కానీ అంతకుముందు వాటి విల క్షణలతో అవి మనుగడలో సాగాయి. అవి చరిత్రలో, చరిత్ర నిర్మాణంలో భాగం.
నిజాం రాష్ట్రంలో అప్పట్లో 14 సంస్థానాలుండేవి అందులో కేవలం 5 మాత్రమే పాలనా అధికారాలను కలిగివున్న పెద్ద సంస్థానాలుగా నిలబడ్డాయి.[3] అందులో పాల్వంచ ఒకటి. ఈ సంస్థానంలో చాలా ప్రాంతం దట్టమైన అడవులతో నిండివుంది. గోదావరి నది వాయవ్యంగా మొదలై ఆగ్నేయ దిశగా పారుతూ ఈ సంస్థానాన్ని రెండుగా విభజిస్తుంది.[4] గోదావరి (తెలివాహ) కుడి వైపు ప్రాంతం నిజాం రాష్ట్రంలో బాగంగానూ, ఎడమవైపు ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగానూ వుండేది. పాల్వంచ సంస్థానం ఒకప్పుడు హైదరాబాదు రాష్ట్రంలోని భాగం. 1860లో బ్రిటీషు ప్రభుత్వానికి దత్తత చేయబడి మధ్యరాష్ట్రాలలో చేర్చబడింది. 1935లో దీని పేష్కసు పద్దెనిమిది వేలు వుండేది.1769 లో జాఫరుద్ధౌలా (ధాంశ ) ఒక యుధ్దంలో నరసింహ అశ్వారావును సంహరించి తామ్రఫలకాల మీద రాసిన సదు పత్రాలను స్వాధీనం చేసుకున్నాడు. 1798లో నిజామలీఖాన్ వెంకట్రామ అశ్వారావుకు రాజబహద్ధూర్ సవై అనే బిరుదు ఇచ్చాడట. అయితే ఈ బిరుదుతో పాటు ఒక గౌరవ ప్రథమైన బాధ్యతను కూడా వీరికి అప్పగించారట. 2000 అశ్విక దళాలను, 3000 పదాతి దళాన్ని నిర్వహించాలనేది ఆ షరతు. అన్నివేళ అశ్విక దళాలు ఇబ్బంది పడకుండా నీరు త్రాగేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఇప్పటికీ ఇక్కడ గుర్రాల చెరువు అనే పేరుతోనే పిలుస్తున్నారు.
స్వత్రంత్ర సమయానికి ముందు
[మార్చు]కాకతీయుల కాలం నుంచే పాల్పంచ సంస్థానాధీశులు నిజాముకు పూర్వం నుండే రాజ్యాధికారాలను కలిగివున్నట్లు అనేక ఆధారాలతో తెలుస్తోంది. వీరు కాకతీయ ప్రతాపరుద్రుని సేనానులుగా. అశ్వసైన్యాధీశులుగా పనిచేసారట. పద్మనాయక వంశస్థుడైన అప్పన్న క్రీ.శ 1324 ప్రాంతంలో శంకరగిరి, హసనాబాదు ప్రాంతాలకు పాలకుడిగా వున్నాడు. క్రీ.శ 1698 వరకూ ఈయన వంశీయులు ముసునూరి. పద్మనాయక, బహమనీ, గోల్కొండ సుల్తానులకు సామంతులుగా వున్నారు. ఈ వంశంలో 18వ తరానికి చెందిన పాలకుడు ఔరంగాజేబు చక్రవర్తి మెప్పు పొంది బాదుషాహి మున్సబు దారీ పొందాడు. థంసాగా పేరు పొందిన జఫరుద్దాలా అనే మొగలు సేనాని ఆలయాలనూ, రాజ్యాలనూ ఆక్రమించుకుంటూ కొల్లగొట్టుకుంటూ వచ్చే క్రమంలో క్రీ.శ 1769లో అప్పటి పాల్వంచ పాలకుడిగా వున్న నరసింహ అశ్వారావును వధించి రాజ్య భాండాగారాన్నీ ప్రజలనూ కొల్లగొట్టాడు. ఆ క్రమంలోనే ఈ సంస్థానము అసష్టాహీ వంశీయుల సామంత రాజ్యంగా మారింది. రాజా నరసింహ అశ్వారావు తర్వాత రామచంద్ర అశ్వారావు పాల్వంచ సంస్థానాన్ని కేవలం ఒక్క సంవత్సరం పాలించాడు. అతని తర్వాత వెంకటరామ నరసింహ అశ్వారావు పాలనలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. పాల్వంచ సంస్థానానికి పూర్వవైభవం తేవడం కోసం శక్తివంచన లేకుండా కృషిచేసారు అందులో భాగంగానే క్రీ.శ 1796 లో నిజామలీఖాన్ నుండి రాజ బహద్దూర్, సవై మున్సబుదారు బిరుదాలతో పాటు జెండా, నౌబతు లను పొందాడు. నౌబత్ అంటే మంగళ సూచక వాయిద్యం. పెద్ద పెద్ద మందిరాల్లో లేదా గొప్ప వారి ఇంటి ముఖ్యద్వారం పైన కూర్చొని నగారా, సన్నాయి మొదలైన మంగళ వాయిద్యాలను వాయించడం. ఈ పేరుతోనే హైదరాబాద్ లో నౌబత పహాడ్ వచ్చింది. వాటితో పాటు రెండు వేల అశ్వదళాలను, మూడువేలమంది కాల్పలాన్నీ కలిగివుండేలా అనుమతులను పొందాడు. ఈయన తర్వాత నరసింహ అశ్వారావు పాల్వంచ సంస్థానాధీశుడయ్యారు. ఈ నరసింహ అప్పారావు గారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు వీరందరూ చిన్నపిల్లలుగా వున్న సమయంలోనే శెట్టిపల్లి జమిందారులతో వ్యాజ్యం నడిచింది. పాల్వంచ సంస్థానాన్ని పొందాలనేది శెట్టిపల్లి జమీందారుల వ్యూహం. క్రీ.శ 1800 నుంచి క్రీ.శ 1858 వరకూ ఈ తగాదాలు నడిచాయి. ఈ గొడవలతో సంస్థానం ఆర్ధికంగా బాగా చితికి పోయింది. ఏదైమయినప్పటికీ ఈ సంస్థానానికి చెందిన రాజా శ్రీ సీతారామ చంద్ర సవై అశ్వారావు బహద్దర్ గారి ఉపాయంతో ఈ వ్యాజ్యం నుంచి పాల్వంచ సంస్థానం గట్టెక్కింది. ఈయన సర్ సాలార్జంగ్ గారి సహాయ సహకారాలను సంపాదించి వాటి సహాయంతో పీటముడిపడిన తగాదానుంచి సంస్థానాన్ని రక్షించారు. ఈ ఆర్ధిక దుస్థితి ఇతర కారణాలతో ఈయన కాలంలోనే రేకపల్లి, భద్రాచలం ప్రాంతాలు బ్రిటీషు వారి స్వాధీనం అయ్యాయి. సీతారామచంద్ర అశ్వారావు పెళ్లిచేసుకోక అవివాహితుడిగానే వున్నారు. సంస్థానం దుర్భరమైన కష్టాలలో వున్నప్పుడు అప్పుగా డబ్బుని కూడబెట్టి దానికి బదులుగా 12 సంవత్సరాలు శిస్తు వసూలుకు హక్కులిచ్చారు. ఆ గడువు పూర్తి అయిన తర్వాత న్యాయస్థానాలలో ఆరు లక్షలకు కోర్టు కేసు నడిచింది. ఆ కోర్టు కేసునుంచి రుణం ఇచ్చిన వారినుంచి గెలిచేందుకు ఒక మూడు లక్షల రూపాయిలు నిజాం ప్రభువు చెల్లించగా మరొక మూడు లక్షల రూపాయిలకు గానూ మల్లూరు, రామానుజవరాలను రుణదాతకు ఇవ్వవలసి వచ్చింది.[2]
రాణి లక్ష్మి నరసయ్యమ్మారావు తన బిడ్డ కొడుకు నూజివీడు అప్పారావు కుటుంబంలో పుట్టిన పార్థసారధి అప్పారావును దత్తత తీసుకున్నారు. క్రీ.శ 1875 లో రాణీ లక్ష్మీనరసయ్యమ్మారావు మరణించారు. కానీ ఆమె ముందు చూపుతో దత్తత పొందిన పుత్రుడు పార్థసారథి అప్పారావు గారి సమయం లో తిరిగి కళా కాంతులని పుంజుకోవడంతో పాటు నిజాం సుల్తానుల నుండి ఈయన బిరుదులు గారి సమయంలో తిరిగి పాల్వంచ సంస్థానము కళాకాంతులను పొందారు. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం లోని గ్రామం ఉప్పులూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం రాజా పార్థసారథి నిర్మాణానికి పాల్వంచ, భద్రాచలం సంస్థానాదీశులు అప్పారావు బహుదూర్ 1893లో భూదానమిచ్చారు. శనివారపు పేట సంస్థానాధీశులు రాజా ధర్మ అప్పారావు బహుదూర్ ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఆలయం కోసం పార్థసారథి అప్పారావు గారు 40 ఎకరాలను కేటాయించారు. ప్రస్తుతం 25 ఎకరాల్లో అర్చక కుటుంబాలు సాగు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. మరో 13 ఎకరాలు ఆలయాభివృద్ధికి, రెండెకరాలు భజంత్రీలకు కేటాయింపులున్నాయి. శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో దళితులే అర్చకులుగా కొనసాగుతున్నారు. [5]
ఉప్పులూరు చెన్నకేశవస్వామి కళ్యాణ మహోత్సవాలలో” రాజా పార్ధ సారధి అప్పారావు సవాయ్ ఆశ్వారావుపేట మున్సబార్ రుస్తుంబా నగర్ సంస్థాన్ పాల్వంచ, భద్రాచలం అండ్ నిడదవోలు వగైరా దొరవారు సమర్పించిన మంత్రపుష్పం "అని చెబుతారు పార్థసారథి అప్పారావు గారు మైలవరం జమీందారు కూతురు సీతమాంబ ను పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు కొడుకులు, ఒక్క కూతురు పుట్టారు. పార్థసారథి అప్పారావు గారి తర్వాత క్రీ.శ 1932లో వీరి పెద్ద కొడుకు శ్రీ రాజా నారయప్పారావు సవై అశ్వారావు బహద్దరు, ఆయన తర్వాత నారయప్పారావు గారి కుమారుడు విజయ అప్పారావు పాల్వంచ సంస్థానాన్ని పాలించారు. చివరికి పోలీసు చర్య తర్వాత పాల్వంచ సంస్థానము హైదరాబాదు రాష్ట్రములో విలీనం అయ్యింది.
పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా, ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శి బాధ్యతలు నిర్వహించిన కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ ‘పాల్వంచ సంస్థాన చరిత్ర' పేరుతో మరొక గ్రంధం రాసారు. ఇటువంటి అనేక సంగతులు తరచిచూస్తే మరింతగా వెలుగులోకి వచ్చే అవకాశం వుంది.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం
[మార్చు]ఈ సంస్థానం పరిధిలోకే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం, భద్రాచలం వస్తుంది. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 117వ శతాబ్దం రెండవ భాగంలో అక్కన్న మాదన్నల మేనల్లుడు, ఖమ్మంజిల్లా నేలకొండపల్లి ప్రాంతానికి చెందిన కంచర్ల గోపన్న హసనాబాద్ కు తహశీల్దార్ గా ఉన్నపుడు తన పాలనలోని హసనాబాదు నుంచి వసూలైన శిస్తు డబ్బులను కూడా వినియోగించి ఈ ఆలయ నిర్మాణం చేపట్టాడు.[6]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరు నిచ్చిన భద్రాచలం నామ వృత్తాంతం ఈ కథలోనే కలిసివుంది. రామాలయం కట్టిన కొండపేరు భద్రగిరి. ఈ భద్రపర్వతం పేరు వెనుక పౌరాణిక కథనం ప్రకారం మహా మేరు పర్వతానికీ, మేనకా దేవి కి జన్మించిన పుత్రుడే ఈ భద్రుడు, ఈ భద్రుడి పేరు మీదుగా భద్రగిరి అయ్యింది. భద్రుడి తమ్ముడి పేరు నీలుడు, నీలుడి పేరుమీదుగా ఇక్కడికి దగ్గరలోని ఖమ్మంజిల్లా పెనుబల్లి మండలానికి చెందిన రామచంద్రాపురం దగ్గరలోని అడవుల్లో నీలాద్రి వుంటుంది. ఇక్కడ శివాలయం వుంది. రామాయణంలో రాముడికి కష్టాల లాగానే భద్రాచల రాముడి గుడికి కూడా ఆదినుంచి ఇప్పటిదాకా ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే వున్నాయి. ఆలయ నిర్మాత రామదాసు జైలు పాలు అయినట్లుగానే, నిజాం పాలనా కాలంలో పదిహేవ శతాబ్ద కాలంలో థంసా అనే యవనుడి దాడుల వల్ల రాముడు సతీసమేతంగా మరొసారి గోదావరిని దాటుకుంటూ పోలవరం వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంగతులు భల్లా పేరయ్య కవి రచించిన భద్రగిరిశతకం ఆధారంగా తెలుస్తున్నాయి. క్రీ.శ 1768-69 సంవత్సరంలో జరిగిన థంసా దాడుల వలన భద్రద్రి రాముని మూల విగ్రహాలను శత్రువుల బారిన పడకుండా భద్రగిరి నుంచి తప్పించి పోలవరం చేర్చారు. అక్కడ 1773- 74 వరకూ వుంచాల్సివచ్చింది. 1775లో మళ్ళీ థంసా మరణానంతరం పోలవరం నుంచి తిరిగి మూలమూర్తులను రప్పించి భద్రాద్రిలోనే సీతారామచంద్రుల కళ్యాణం జరిపించారనీతెలుస్తోంది.[7]
ఈ భద్రాచల ఆలయం పోలవరం ప్రాంతానికి తరలించడం అక్కడ పూజాదికాలు జరిగేలా జాగ్రత్తలు పై థంసా దాడి జరిగిన సమయంలో ఆలయంలోని ప్రధాన విగ్రహాలను తీసుకుని ఐదేళ్ళ తర్వాత థంసా మరణానంతరం పొలవరం వాసులు దైవంగా సంస్థానాధీశులైన అశ్వారాయ వంశస్థుల పాత్ర ప్రధానమైనది. ఈ స్థిరపడిన భద్రాద్రి వాసుని మళ్ళీ భద్రాచలం రప్పించడంలో పాల్వంచ విషయాలనన్నింటినీ భద్రగిరి శతకంలో భల్లా పేరయ్య కవి పేర్కొనడంతో పాటుపాల్యంచ సంస్థానంలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శ్రీనాధుని వెంకటరామయ్య అనే 17వ శతాబ్దపు కవి, రచయిత ఈ సంస్థాన చరిత్రను ‘అశ్వారాయ చరిత్రము' లేదా 'శ్రీరామ పట్టాభిషేకం' అనే పేరుతో గ్రంధంగా రాసారని సురవరం ప్రతాపరెడ్డి గారు సేకరించి ప్రచురించిన 'గోల్కొండ కవుల చరిత్ర'లో తెలియజేసారు.
-
రామాలయ దృశ్యము
-
దేవస్థానం వద్ద రామదాసు విగ్రహం
-
భద్రాచలం దేవాలయం
-
దేవాలయ ప్రవేశద్వారం
-
దేవాలయ గోపురం
-
2011 ఏప్రిల్ శ్రీరామనవమినాడు కళ్యాణ మహోత్సవం
-
ఉత్సవమూర్తులు
-
వర్ణచిత్రం
-
భద్రాచలం దేవస్థానం
ప్రధాన పట్టణాలు
[మార్చు]పాల్వంచ సంస్థానపు తొలి ప్రధాన పట్టణంగా కొన్ని ఏళ్ళు పాల్వంచ పట్టణం ఉంది. తర్వాత కొన్నాళ్ళు అశ్వారావుపేట పట్టణ కేంద్రంగానూ, తర్వాత భద్రాచల పట్టణ కేంద్రంగానూ పాలన సాగింది.
సరిహద్దు ప్రాంతాలు
[మార్చు]పాల్వంచ సంస్థానం (తెలంగాణ), వేఁగినాడు (ప.గో.జి), కోనసీమ, రంపనాడు ప్రాంతాలకి. చాలా కుటుంబాలకి భద్రాద్రి రాముడు, ఇలవేల్పు. భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
సాహిత్య పోషణ
[మార్చు]తెలంగాణ సంస్కృతి నిర్మాణంలో ముఖ్యంగా సాహిత్యం వికాసంలో సంస్థానాల పాత్ర విశిష్టమైనది. ఆసఫ్‌జాహీలు నిర్వహించాల్సిన పనిని ఇవి నిర్వహించాయి. అనేక తాళపత్ర గ్రంథాలను భద్రపరిచారు. దక్షిణాంధ్రయుగంలో తంజావూరు, మధుర, పుదుక్కోట రాజ్యాలు పోషించిన పాత్రను తెలంగాణలో ఈ సంస్థానాలు పోషించాయి. తెలంగాణా సంస్థానాధీశుల్లో కొందరు కవి పండితులై కావ్యాలు వెలువరించారు. మరి కొందరు ఎందరో కవులను ప్రోత్సహించి కావ్యాలు వెలువడుటకు కారకులయ్యారు. [8]
- ఈ సంస్థానం హయాంలో జరిగిన సాహిత్య సేవకు సంబంధించిన ఆధారాలేవీ మిగుల్చుకోలేకపోవడం దురదృష్టకరం. కానీ సా.శ. 1700 ప్రాంతంలో పాల్యంచ సంస్థానంలోని అశ్వారావుపేట ప్రాంతానికి చెందిన శ్రీనాధుని వెంకటరామయ్య అనే కవి, రచయిత ఈ సంస్థాన చరిత్రను అశ్వారాయ చరిత్రము లేదా శ్రీరామ పట్టాభిషేకం అనే పేరుతో రాసారని సూరవరం వారు సేకరించి ప్రచురించిన గోల్కొండ కవుల చరిత్రలో పేర్కొన్నారు. కానీ ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావడం లేదు. [9]
- పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ పాల్వంచ సంస్థాన చరిత్ర పేరుతో రాసారు. ఇతను పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసాడు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శి బాధ్యతలు నిర్వహించాడు.
సాంస్కృతిక సేవ
[మార్చు]తెలంగాణ సంస్కృతి వ్యాప్తిలో, సంఘ సంస్కరణలలో సంస్థానా ధీశుల పాత్ర చాలా విశేషమైంది. భద్రాచల దేవాలయ పోషణ పాల్వంచ సాంస్కృతిక వైభవానికి ఒక నిదర్శనం. రామునికి, పట్టువస్త్రాలూ, ముత్యాల తలంబ్రాలూ హైదరాబాదు ముస్లిం పాలకులకాలం నుండి ప్రతీయేటా సమర్పించబడటం ఆచారంగా ఉంది హిందూ ముస్లిం సాంస్కృతిక సమన్యయానికి ఇది ఒక నిదర్శనంగా నిలచింది. దాశరథి శతక రచన చేసి తొలి సంకీర్తనాచార్యులలో ఒకరిగా పేరు పొందిన భక్త రామదాసు శంకరగిరి, హసనాబాదు తాలూకా అధికారిగా విధులు నిర్వహించినవాడే. తెలంగాణాలోని ఏకైక బౌద్ధ గుహాలయం కారుకొండను కలిగివున్న ప్రాంతం ఇదే.
గ్రంధాలయ ఉద్యమంలో
[మార్చు]- హైదరాబాదు లోని కోఠిలో 1901 సెప్టెంబరు1న శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంని రావిచెట్టు రంగారావు ఇంట్లో ఏర్పాటు చేశారు. అప్పటి పాల్వంచ రాజాగారైన పార్థసారథి అప్పారావు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను అలంకరించిన పెద్దలలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి.నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.ఈ ఉద్యమాన్ని రాజా పార్థసారథి అప్పారావు (పాల్వంచ జమిందార్) అధ్యక్షుడిగా 10 సంవత్సరాలు వారి నిర్వహణలో దిగ్విజయంగా నడిపాడు.
- శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు రావిచెట్టు రంగారావు జ్ఞాపకార్ధం ఆతని సతీమణి లక్ష్మీనరసమ్మ 3000 రూపాయలు, మునగాల రాజా 1250 రూపాయలు, 750 రూపాయలు పార్థసారథి పౌండేషన్ వారు విరాళాలు సేకరించి ఈ భాష నిలయం అభివృద్ధికి తోడ్పాటును అందించారు.1940 నాటికి శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం పుస్తకాలు, పత్రికలు లక్షల్లో కొనుగోలు చేసి వాటిని భద్రపరిచారు.
- ఈ గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో అశ్వారావుపేట పట్టణంలో అశ్వారాయాంధ్ర భాషానిలయం పేరుతో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. తదనంతర కాలంలో దాని పోషకులు లేక గ్రంథాలయం మూతపడి జీర్ణమై పోయినవి పోగా మిగిలిన అతికొద్ది గ్రంథాలు వారసుల పంచన రక్షన పొందాయి.
ఆలయాల నిర్మాణం
[మార్చు]- ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం లోని గ్రామం ఉప్పులూరులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయం :[10] కాకతీయ సామ్రాజ్యం పతన దశలో వున్న రోజుల్లో మహమ్మదీయుల దాడి నుంచి హిందూ మత రక్షణకు, ఆంధ్ర దేశ పర్యటనకు వచ్చిన సింహాచల క్షేత్రనివాసి కందాల కృష్ణమాచారి ఉప్పులూరులో 1335వ సంవత్సరంలో అప్పటి అప్పలస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1650లో జజ్జూరి సంస్థ్దానాదీశులు రాజా వల్లి రాగన్న జమీందారు అప్పలస్వామి ఆలయ నిర్మాణం చేపట్టారు. పాల్వంచ, భద్రాచలం సంస్థానాదీశులు రాజా పార్థసారథి అప్పారావు బహుదూర్ 1893లో ఈ ఆలయానికి భూదానమిచ్చారు. శనివారపు పేట సంస్థానాదీశులు రాజా ధర్మ అప్పారావు బహుదూర్ 1793లో ఆలయ నిర్మాణం పూర్తిచేశారు. వైష్ణవ మత గురువులైన పరవస్తు రామాజనుజాచార్యులు 1870 సంవత్సరంలో ఈ ఆలయ విగ్రహానికి చెన్నకేశవస్వామిగా నామకరణం చేశారు. 1895లో శేషబట్టారు రాఘవాచారి చెన్నకేశస్వామికి మొట్టమొదటి సారిగా కల్యాణోత్సవాలు జరిపించారు.[11]
- శ్రీచెన్నకేశవస్వామి ఆలయంలో దళితులే అర్చకులుగా కొనసాగుతున్నారు. పల్నాడును పాలించిన బ్రహ్మనాయుడు సేనాధిపతి కన్నమదాసు సేవాతత్పరతకు, నిష్కళంక దేశభక్తికి మెచ్చి మాచర్ల, మార్కాపురం గ్రామాలలోని చెన్నకేశవస్వామి ఆలయాల్లో పూజల నిర్వహణ బాధ్యతను అప్పగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు 1280వ సంవత్సరంలో ఉప్పులూరు గ్రామానికి వలస వచ్చారు. తరువాతి కాలంలో ఆలయం ఆవిర్భావంతో నారాయణదాసు కుటుంబీకులే అర్చకులుగా కొనసాగుతున్నారని ఆలయ చరిత్రను బట్టి తెలుస్తోంది.
- పాల్వంచ శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ గుడి ఇస్లామిక్, గోతిక్ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
- పెద్దమ్మ తల్లి గుడి పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ గుడికి ఎంతో ప్రజాదరణ సంతరించుకుంది
క్రీఢా ప్రాంగణాలు
[మార్చు]విద్యుత్ కళా భారతి ఆటస్థలం: ఖమ్మం జిల్లాలో కెల్లా పెద్దదైన ఈ ఆటస్థలం చరిత్ర పాల్వంచ క్రికెట్ క్లబ్బుతో ముడిపడి ఉంది. ప్రస్తుత కళాభారతి 1964లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రదేశం ఎవరికి చెందిందో తెలియరాలేదు కానీ, క్రికెట్ క్లబ్బుకు అందాక, క్లబ్బు 1971లో పెవిలియను నిర్మించి ఈ ప్రాంతంలో క్రికెట్ ఆట అభివృద్ధికి దోహదం చేసింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]
- భద్రాచలం
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
- పాల్వంచ
- భద్రాచలం
- అశ్వారావుపేట
- నూజివీడు సంస్థానం
- కిన్నెరసాని
- గోదావరి
- కృష్ణ గోదావరి ప్రాణహిత బేసిన్ భౌగోళిక చరిత్ర
- శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
మూలాలు
[మార్చు]- ↑ తూమాటి, దోణప్ప. ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణ (PDF). Archived from the original (PDF) on 2010-12-27. Retrieved 2020-07-16.
- ↑ 2.0 2.1 సురవరం, ప్రతాపరెడ్డి. నిజాం రాష్ట్రంలోని ఆంధ్ర సంస్థానముల చరిత్ర. శ్రీకృష్ణ దేవరాయల ఆంధ్రభాషానిలయం రచతోత్సవ సంచిక. p. 30-49.
- ↑ అనంతపంతుల, రామలింగస్వామి (1965). శ్రీకృష్ణ కవి జీవితము. p. 85.
- ↑ శిష్టాి, వెంకటప్పయ్య (1940). హృదయాభిరామ ప్రభందము.
- ↑ ఆంధ్రప్రభ వారపత్రిక ధారావాహిక (1987). డా. కొర్రపాటి గంగాధరరావు ధంసా నవల. పూర్ణిమ బుక్ హౌస్ విజయవాడ ప్రచురణ.
- ↑ సంగిశెట్టిశ్రీనివాస్ గారి సంపాదకత్వం, పరిచయపీఠికా సమాచారం. పునర్ముద్రించిన భద్రగిరి శతకం.
- ↑ . శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారి, 363 నుంచి పేజీ 370 మొదటి భాగము ((1973 రుధిరోద్గారి పాల్గుణము)). "చారిత్రక శతకములు భద్రగిరి శతకం". భారతి మాస పత్రిక నందన ఆశ్వీయజ సంచిక.
{{cite book}}: Check date values in:|year=(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: year (link) - ↑ సి. కమలా అనార్కలీ, సిద్ధాంత వ్యాసము,. "పిఠాపురం సంస్థానము కవిపండిత పోషణ”. ఉస్మానియా విశ్వవిద్యాలయము వారి పిహెచ్ డి పట్టా పరీక్షకు సమర్పించబడినది.
{{cite book}}: CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ సి. విజయలక్ష్మి (2000). ఆంధ్రదేశ సంస్థానాలు-సంగీత వాజ్మయం.
- ↑ ఆంధ్రజ్యోతి, దినపత్రిక. "చెన్నకేశవస్వామి కల్యాణోత్సవాలు". www.andhrajyothy.com. Archived from the original on 17 జూలై 2020. Retrieved 16 July 2020.
- ↑ "సమానత్వానికి పెద్దపీట - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 16 July 2020.
బయటి లింకులు
[మార్చు]- శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వెబ్సైటు Archived 2011-02-02 at the Wayback Machine
- భద్రాద్రి రామదర్శనీ వెబ్సైటు Archived 2011-02-02 at the Wayback Machine