పిరదౌసి (కావ్య సమీక్ష)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిరదౌసి కావ్య ముఖచిత్రం

జాషువా కావ్యాలలో పలు ముద్రణలు పొందిన కావ్యం పిరదౌసి.

పెక్కు సాహిత్య విమర్శకులచే ప్రశంసలు పొందిన కావ్యం పిరదౌసి.

ఆంధ్ర విశ్వ కళాశాల గ్రంథ నిర్ణాయక సభ వారిచే 1940 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా నిర్ణయింపబడిన కావ్యం పిరదౌసి.

జాషువా ఈ కావ్యాన్ని సింగరాటు లక్ష్మినారాయణ గారికి అంకితం యిచ్చారు.

పిరదౌసి ఒక పారశీక కవి. పిరదౌసి యొక్క యధార్ధజీవిత, వ్యధార్ధ వెతల కతయే ఈ పిరదౌసి కావ్యం. విధి వంచితుడైన ఆ అభాగ్య కవి జీవిత చివరి ఘట్టాన్ని ఎంతో హృద్యంగా వర్ణించాడు ఈ కావ్యంలో జాషువ. జాషువా, పిరదౌసి లోకి పరకాయ ప్రవేశం చేసి వ్రాసిన రచన. పిరదౌసి లానే జాషువ కూడా తన నిజ జీవితంలో కష్టాలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. కాని నవ్విన నాపచేను పండినట్లు, తన కృషికి తగ్గ గుర్తింపు, ప్రశంసలు, సన్మానాలు బిరుదులు పొందాడు. కాని కావ్యం లోని పిరదౌసి యివ్వేమీ పొందకుండానే కనుమూసిన విధివంచిత కవి.

కావ్య విశేషాలు

[మార్చు]

పిరదౌసి కావ్యాన్ని జాషువా మూడు అశ్వాసాలుగా వ్రాశాడు.

పిరదౌసి కావ్యాంశం టూకీగా:

ప్రథమాశ్వాసము

ఇందులో గజనీమహమ్మదు భరతఖండంపై 18 మార్లు దండయాత్ర సాగించడం, తన వంశచరిత్ర, తన విజయచరిత్రను గ్రంథంగా వ్రాయమని పిరదౌసిని అడగటం, పద్యానికొక బంగారు రూక యిస్తానని ఆన యివ్వడం, కవి ముప్పదియేండ్లు శ్రమించి 60వేల పద్యాలతో షానామా గ్రంథాన్ని వ్రాసి సుల్తాను కివ్వడం, రాజు మాటతప్పి వెండిరూకలివ్వగా, పిరదౌసి నొచ్చుకొని, ధనాన్ని తిరస్కరించి నిందిస్తు లేఖ వ్రాయగా సుల్తాను కోపించి కవిని వధింప భటులను పంపడం, పిరదౌసి హితులు ఈ మాట పిరదౌసి చెవినివెయ్యగా కవి అక్కడినుండి తప్పించుకొనుటకు ప్రయత్నించడం వరకు వర్ణించడం జరిగింది.

ద్వితీయాశ్వాసము

ఇందులో పిరదౌసి సతి, పుత్రిక సమేతంగా రహస్యంగా నగరంవిడి అర్దరాత్రి వేళలో కీకారణ్యంలో భయంగా ప్రయాణం సాగించడం, తన దురదృష్టానికి చింతించడం,మరుసటి వుదయం అడవిలోని ప్రకృతిని కాంచి, బహ్య ప్రపంచాన్ని మరచి పులకరించి, ఇంతటి అందమైనప్రకృతిని సృజించిన ఈశ్వరుని రమణియముగా స్తుతిస్తూ, ప్రార్థించడం జరుగుతుంది.

తృతీయాశ్వాసము

ఇందులో పత్ని, కుమార్తెతో ఆదట్టమైన అడవిమధ్యలో చిక్కుకున్న పిరదౌసి,ఆకలిదప్పులతో అల్లాడుచూ, ఎటువెళ్ళాలో తెలియక అయోమయస్ధితిలో వుండటం, బెంగపడటం,యింతలో ఒక నిషాధుడు (బోయవాడు) దైవీకంగా (!?)ఆటుగా వచ్చి పలకరించి, వారికి దైర్యం చెప్పి, వారికి మార్గంచూపిస్తూ,తూసినగర శివారువరకు తోడుగా రావడం, పిరదౌసి దిగులుతో రుజగ్రస్తుడవ్వడం,అచ్చట గజని తన సామాంతులు చెఫ్ఫిన మీదట తనతప్పిదాన్ని ఎరిగి,60వేళ బంగారురూకలను ఒంటెలమీద కెక్కించి పంపించడం,ధనం కవిగృహం చేరునప్పటికి,పిరదౌసి మరణించి ఆయన పార్ధివశరీరం కబరుస్తానుకు తీసుకెళ్ళడం,తన తండ్రి అకాలమరణానికి కారణమైన ధనాన్ని పిరదౌసి పుత్రిక తిప్పి పంపడం, జరిగిన తప్పిదానికి మిగుల వగచిన సుల్తాను పిరదౌసి నివాసితనగరమైన తూసిలో కవిపేరు మీద ఒక సత్రమును నిర్మించడంతో కావ్యం ముగుస్తుంది.

ప్రధమాశ్వాసము

[మార్చు]

కావ్యప్రారంభం గజనీమహమ్మదు భరతఖండం పై పదినెనిమిదిమార్లు దండయాత్ర సాగించి ఏ విధంగా ఇచ్చటి అపారసంపదను కొల్లగొట్టి గజనివగరానికి తరలించినవైనాన్ని వర్ణించడంతో మొదల్వుతుంది. బంగారు నాణెలను, పచ్చలను, మణులను, మొలకవజ్రాలను ఎలా కొల్లగొట్టినది. సోమనాధిని ఎలా ధ్వంసమొనర్చినది కళ్లకుకట్టినట్లు వర్ణించాడు జాషువా తన కవితాప్రాభవంతో. ఈపద్యంలో అలనాటి భరతఖండమెంత సుసంపన్న దేశమో అర్దమౌతుంది. అంతేకాదు ఇంతటి అపారసంపద అలనాటి హిందూరాజులలోని ఐక్యతలోపించడం వలననేకదా కొల్లకొట్టబడి, ఇంతోటి దౌర్భ్యగ్యం దాపురించినదని బాధ కల్గుతుంది.

 మును గజనీమహమ్మదుఁడ
 భూత పరాక్రమశాలి,వీరవా
 హినుల బలంబుతో బదియు
 నెన్మిది మాఱులు కత్తిదూసి,చి
 క్కని రుధిరంబులో భరత
 ఖండము నార్ద్ర మొనర్చి సోమనా
 ధునిఁ పెకలించి,కైకొని యెఁ
 దొమ్మిది వన్నెల రత్నరాసులన్.


 బంగారు నాణెముల్ బస్తాల కెత్తించి
 మదపుటేన్గుల మీఁద బదిలపరచి
 లేఁతపచ్చల నేరి గోతాలఁ గుట్టించి
 లొట్టి పిట్టలమీఁద దిట్టపఱచి
 కురువిందమణులను కుంచాలగొలిపించి
 పరువు డెద్దులబండ్లపై నమర్చి
 మొలక వజ్రముల జాలెలఁ బోసి కూర్పించి
 గుఱ్రాల మూఁపుల గుస్తరించి


 పదియు నెనిమిది విజయరంభల వరించి
 గాంగలజలమున నెత్తుటికత్తి గడగి
 సర్వము హరించి హిందూదేశంబు విడచి
 గజనీమామూదు గజనీకిఁ గదలిపోయె

యింతటి అపారసంపదను తీసికెళ్ళిన మహమ్మదు సుల్తాను గజనీనగరంలో ఎమి చేసాడు?.పసిడిపూతల గోడలపై ముత్యాలను, పచ్చలను చెక్కించాడు. రత్నఖచిత స్తంబాలనెత్తించాడు. మేడలు,మసీదులను నిర్మించాడు. భారతదేశంలోని దేవాలయాలు కూల్చబడి, గజనీపురంలో మసీదులయ్యినవి. వర్తమానంలో, భవిష్యత్తులో ఏమిజరుగనున్నదో? కాలమే నిర్ణయించాలి.

 భారత క్షోణిఁ గల్గు దేవస్ధలములు
 చెదరి గజనీ పురాన మసీదులయ్యె
 నిప్పటి మసీదు లేరూప మెత్తఁగలవొ
 కాలమెఱుఁగును,ధారుణీగర్భ మెఱుఁగు.

ఐశ్వర్యము, సంపద (లక్ష్మిదేవి) చంచలమైనది. ఎవ్వరిని ఎప్పుడు కటాక్షిస్తుందో, ఎవ్వరిమీద శీతకన్ను వేస్తుందో చెప్పడం నరునికి సాధ్యమే?.

క్షణంలో అభాగ్యున్ని కుభేరున్ని చేస్తుంది. చిటెకెలో ధనవంతున్ని కుచేలున్ని చేస్తుంది. అంతా సిరి మాయా!

  హిందువుల దోర్బలము నాశ్రయించి బతుకు
 ద్రవ్యసంపద,తురకభూధవునిఁ జేరి
 కాఁపుర బుండె నతనిఖడ్గమును వలచి
 సిరి నిజంబుగ వట్టి టక్కరిది సుమ్ము.

రాజుకదనరంగంలో విజయానికి కారకులు ఎవ్వరు? సుశిక్షితులైనసైనికులు, వారిని యుద్ధరంగంలో ముందుండి నడిపించు దళపతులు, సేనాపతులు.అందుకే మహమ్మదు సుల్తాను వారిని ఘనంగా సన్మానించాడు.ఇనాములు,అహుమతులు,బిరుదులు సత్కారాలు చేసాడు.సుల్తానుకు తనపరాక్రమానికి అక్షరరూపం కల్పించాలనే కోరికకల్గింది. నాటి హిందూరాజులు కూడా యుద్ధంలో గెలచినప్పుడు తమశౌర్యాన్ని తెలుపుతూ విజయశాసనాలు, స్తూపాలు చెక్కించెవారు.ఇక్కడ సుల్తాను తన వంశచరిత్రను,తన విజయచరిత్రను గ్రంథస్తంచెయ్య సంకల్పించాడు.పారశీక కవులలో శ్రేణి శిరోభూషణుండైన పిరదౌసీ పిలిపించాడు. తన యిఛ్చనెరగించాడు. గడచిన యుగాలచరితను మరల సృష్టి చెయ్యగలవాడు కవీయే అంటూ మెచ్చికోలుగా మాట్లాడడు. కవికి తానివ్వబొవ్వె యినామెమిటొ వెల్లడించాడు.

 క్షణము గడచిన దాని వెనక్కు మఱల్ప
 సాధ్యమే మానవున కిలాచక్రమందు?
 దాటి పోయిన యుగములనాఁటి చరిత
 మరల బుట్టింప గవియ సమర్ధుఁ డగును.


 ఒక్కొక్క పద్దియంబున
 కొక్కొక్క బంగారు రూక యొసఁగెదను కవీ!
 మక్కా మసీదుతోడని
 వక్కాణించెన్ మహాసభా మాధ్యమునన్

సుల్తానంతటి వాడు స్వయంగా కబురంపి, భారీగా ఇనాంతో కృతికావింప మనగానే పిరదౌసి అనందభరితుడైపోయాడు. గజనినగరముననే విడిదిచేసి, కృతిరచనకుపక్రమింఛాడు. పారశీక గ్రంథబండారాలలోని పుస్తాకాలన్నింటిని వెలికితీసి,తీయనిపదాలని,వ్యంగవాచార్ధ పదాలను ఏర్చి,కూర్చి,శాసనాలన్నింటిని క్షుణ్ణంగా పరికించి,రాజ చరితంలోని యిసుమంత సత్యాన్ని జారవిడువకుండగా కవనరచన సాగించాడు. ఇంతలో పిడుగులాంటి కబురు....తూసు నగరంలోని ప్రియసతి నుండి లేఖ....ముద్దులు మూటలుకట్టె,ముక్కుపచ్చలారని మూడేళ్ల తనయుడు ఇకలేడని....అయ్యో! ఎంత కష్టం.. భరింపశక్యమే ...కవిగుండెలవిసి పోయింది.అయినా పుట్టెడు దుఖాన్ని ఎదలోనే దాచుకొని మరల గ్రంథరచన కొనసాగించెడు.కఠోరదీక్షతో..ఒకటి..రెండు..ఏళ్ళు కాదు?....ముప్పదిఏండ్లు శ్రమించి, షాహ్‌నామా గ్రంథాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది పూర్తిచేస్తాడు. మహమ్మదు అనతిపై నిండుపెరోలగంలో, శ్రవణానందపేయంగా, మూడుమాసాలు పఠించి, భూపతికంకితమిచ్చి నివాసంనకెగినాడు.

సుల్తాన్ మదికేమి తోచినదో, లేక పండితులేమి చెప్పినారో?. మాటతప్పి సుల్తాన్ బంగారునాణెంలకు బదులుగా వెండిరూకలనంపినాడు, అదేమి చిత్రమో!?.

బంగారునాణెంలకు బదులుగా వెండినాణెంలను చూడగానే కవికి.....

 ఎన్నో కొండలు గుండెలోఁ గరఁగిపో
 యెన్ వార్ధి సంతానముల్
 గన్నీరయ్యె సమస్త లోకము నిరా
 కారస్ధితిం బొల్చె ను
 త్పన్నంబయ్యె విషాదమేఘపటల
 ధ్వాంతౌఘమాశాలత
 ల్సున్నాలయ్యె నగాధ కూప జలరా
 సుల్ దోఁచె పిర్దౌసికిన్

కవికి దుఃఖం పొంగుకొచ్చింది, ధనాన్ని తిరస్కరించి,వెనకకి పంపి సుల్తాన్ను మాటతప్పి నందుకు నిందిస్తూ వుత్తరం వ్రాస్తాడు...ఓ సుల్తాను, నీ కల్లమాటలను నమ్మి నేనుకట్టుకున్న ఆశాసౌధం కూల్చి వేశావు కదయ్యా! నిన్ను నమ్మినందుకు నా సర్వస్వం కొల్పోయినాను. దుఃఖంతప్ప నాకీమిమిగిలింది.

 ఓ సుల్తాను మహమ్మదూ! కృతక వి
 ద్యుద్ధీపముల్ నమ్మి యా
 శాసౌధంబును గట్టికొంటి నది ని
 స్సారంపుటాకాసమై
 నా సర్వస్వమును దొంగలించి నరకా
 నం గూల్చిపోయెన్ వృథా
 యాసప్రాప్తిగ నిల్చినాఁడ నొక దుః
 ఖాక్రాంతలోకంబునన్


ప్రజల కెవ్వరివల్లనైన అన్యాయం జరిగితే ప్రభువుకు విన్నవించుకుంటారు.కంచె చేనుమేసిన చందాన ప్రభువువల్లనే అన్యాయం జరిగితే ఎవ్వరికి మొరపెట్టుకోవాలి. ఆ దేవదేవునికి తప్ప?

అయినా యుద్ధరంగంలో మసుజ రక్తాన్ని నిర్దయగా తమ కరకుకత్తులకు బలియిచ్చె కర్కససుల్తానులను కీర్తీస్తూ నా కవితాసుధని చిందించి నేనుచేసుకున్న ఘోరఅపరాధం యిది. యిట్టి అపరాధ మొనర్చి నందులకే నాశ్రమ నిష్పలమైనదని పిరదౌసి నిరాసక్తితో వాపోతున్నాడు.

 పూని కరాసికి న్మనుజ
 భుక్తి నొసంగెడు ఱాతిగుండె సు
 ల్తానుల కస్మదీయ కవి
 తాసుధఁ జిందించిన పాతకంబు నా
 పై నటనం బొనర్చినది
 వాస్తవ మిట్టి స్వయంకృతైక దో
 షానలదగ్ధమై చనిన యర్ధము
 నాకు లభింపబోవునే

ముప్పదిఏండ్ల కష్టఫలం...ఎంతో ఆశలు పెంచుకుని ఫలప్రాప్తికై ఎదురుచూస్తున్న తరునంలో....కళ్ళముందే ఆ ఆశలసౌదం కూలిపోతే..? భరింప మానవసాధ్యమే!?.చింతాక్రాంతమైన చంచల మసస్సు తో, ఈ ముదిమి వయస్సులో మరల కావ్యరచన సాధ్యమైయే కార్యమేనా?అట్లు వ్రాయయత్నించిననను ఆ కవికలంనుండి కవిత రసవిహీనమైన విషాదగీతికలకే పరిమితం కదా యని చింతిస్తున్నాడు పిరదౌసి. నా కలములోని సిరా రసహీన విషాదపద్యాలకీ పరిమితం కదా., ముప్పైఏండ్ల సుల్తాను సేవకు చివరకు నాకు ముదిమి, నిరాసతో కూడిన కన్నిళ్ళు ఫలితంగా దక్కినవి అని నిరాసక్తిగా నుడువుచున్నాడు. .

 ఇంక విషాదగీతముల
 కే మిగిలెన్ రసహీనమై మషీ
 పంకం నాకలమ్ము న
 భాగ్యుఁడనైతి వయఃపటుత్వమున్
 గ్రుంకె శరీరమందలము
 కొన్నది వార్ధక భూత మీ నిరా
 శాంకిత బాష్పముల్ఫలము
 లైనవి ముప్పదియేండ్ల సేవకున్.

పిరదౌసి మనస్సులో రకరకాలైన భావాలు పొడచూపుచున్నాయి.... ఎక్కడైన ఇలా ఇలలో మానవేంద్రుడు సామాన్యునిలా కల్లలాడునా? మాటతప్పి కవితా ఋణమీయకుండునా?....ఒక్కొక్క పద్యెంకు అక్షరరూపం కల్పించి గ్రంథమొనర్చుటకు ఒక్కొక్క రక్తపుబొట్టును వెచ్చించానే!? దానికిదా ఫలితం...అంతా వృధాశ్రమ అయ్యినదికదా.బూడిదలో పోసిన పన్నీరయ్యిందికదా???. సుల్తాను నిజ స్వభావాన్ని గుర్తించలేని మందభాగ్యుడను కదా?

 ఒక్కొక్క పద్దియంబునకు
 నొక్కొక్క నెత్తురుబొట్టు మేనిలోఁ
 దక్కువగా రచించితి వృ
 థా శ్రమయయ్యెఁ గులీనుఁడైన రా
 జిక్కరణిన్ మృషల్వలుకు
 నే?కవితాఋణమియ్యకుండునే
 నిక్కమెఱుంగ నైతి గజ
 నీ సులతాను మహమ్మదగ్రణీ.

పిరదౌసిలోని ఆక్రోశంకట్టులు తెంచుకొంటున్నది సుల్తాను మీద ....అల్లామీద ఒట్టు అనిమాట యిచ్చి.. యిప్పుడేమో మాటతప్పి వెండితో సరిపుచ్చాలనుకుంటున్న టక్కరివి. అరే! నీలాంటి అసత్యలాడు వాడుచేయు పూజలను (నమాజు) ఆ అల్లా స్వీకరిస్తాడా?. ముస్లిము అబద్ధమాడరాదు కదా! మరి అబద్ధాకోరువైన నీ పూజలను అందుకున్న దేవునికి సుఖమేలా కల్గును.!?.ఈ అవనిలోఎవ్వడు నిరంతం సత్యంపలుకుతాడొ, కల్లలాడడో వాడే నిజమైన మానవుడు,నరుడు, ధన్యుడు.. అని సుల్తానును పరోక్షంలో నిందిస్తూన్నాడు. ఎంతైనా కవి కూడా మనిషే., అయనకూ కోపం వస్తుంది, బాధా కల్గుతుంది.

 అల్లాతోడని పల్కి నాపసిఁడి కా
 వ్యద్రవ్యము న్వెండితో
 జెల్లింప దొరకొన్న టక్కరివి:నీ
 చేఁ బూజితుండైనచో
 నల్లా కున్సుఖమే? మహమ్మదు నృపా
 లా! సత్య వాక్యం బెవం
 డుల్లంఘింపఁదొ వాడెపో నరుఁడు,ధ
 న్యుం డిద్ధరామండలిన్.

పాపం! మూప్పదేండ్లుగా అవిరామమంగా నిద్ర, విశ్రాంతి, సుఖం అన్న మాటయే మరచి కావ్యరచనచేసిన పిరదౌసి హౄదయం వయోభారంతో అలసిపోయింది,సొలసిపోయింది.అలసట తీర్చుకోవాలనిపిస్తుంది. ఆశాపహతుడైన పిరదౌసికి యిక నిర్మలమగు చిత్త శాంతికి తావెక్కడ... అవిరామమైన విశ్రాంతి కోరుకుంటున్నాడు. వెనలేని వెన్నలగురియించు నా కవిత్వం అసత్యవాదివైన నీకు లభించినదని కవి వ్యాకులంచెందుచున్నాడు.

అలసట ఎక్కడ తీర్చుకోవాలనుకుంటున్నాడు!?...మహమ్మదురాజులతో సమాధి శ్యయ్యలపై.......అంటే?

 అలసట దీర్చుకొందును మ
 హమ్మదురాజులతో సమాధిశ
 య్యలపయి ముప్ప దేఁడుల ప్ర
 యాసకు డెందము గందిపోయె ని
 ర్మలమగు చిత్త శాంతి కిఁక
 మార్గములే దెన లేని పండు వె
 న్నలగురియించు నా కవిత
 నీకు లభించె నసత్యవాదికిన్

పై విధంగా వ్రాసిన పిరదౌసి లేఖను చదవగానే సుల్తానుకు ఆగ్రహము కట్టలుతెంచుకొన్నది.విఛక్షణ కోల్పోయ్యాడు. పంజా విసిరే పెద్దపులిలా సర్రున గద్దెమీదనుండి లేచాడు.తనసేనాపతి పిల్చి పిరదౌసిని పట్టిచంపుడని అజ్ఞాపించెను.పిరదౌసి లేఖపై రెండురకాలుగా స్పందించారు సభలోనివారు.ఒకసామాన్యుడైన కవి సుల్తాను ఇంతగా నిందిస్తాడా? తృనమో!పణమో! ప్రభువు ఇచ్చినది పుచ్చుకొకుండగా తక్కువచేసి మాట్లాడటంతగదని సభలోని యిచ్చకపు జీతంలందుకోను పండితబ్రువుల్ వక్కాణించగా, ధర్మతత్పరులైన వారుమాత్రం దీన్ని యిసడించారు. యిచ్చిన బాస తప్పి విభుడు తప్పుచెయడమే కాక, తనకు కబ్బమంకితమిచ్చిన కవిని పట్టి చంపచూస్తున్నాడే?ఇతని పాపంపండిందని మనస్సులో తలపోసిరి.


సభలో నున్న,కవిరాజు పిరదౌసిని అభిమానించె,ఆరాధించె సభికుడొక్కండు వేగమే పిరదౌసి కడకేగి మహమ్మదుని కఱకుటాననతి విన్నవించాడు.

రాజాజ్ఞ గురించి వినగానే---

 అరవది వేల దిన్హరము
 లస్త్రములై తుదకిట్లు కుత్తుకన్
 దఱుగుట కుద్యమించిన వి
 ధానము సర్వము నాలకింపగఁగా
 పిరదవుసీ ముఖాబ్జమునఁ
 బిన్నని నవ్వుదయించె మింటనీ
 శ్వరుఁడు కలండో లేఁడొ యను
 సంశయము న్దళుకొత్తె నెమ్మదిన్

కృతియేమో పెద్దపులి వలె శరీరపటుత్వమును హరించి వేసింది...శేషితమైన అస్ధిపంజరంలో ప్రాణం వూగిసలాడుచూ, నడపీనుగ వంటి ఈముదివగ్గు శరీరం మహమ్మదుగారి ఖడ్గదేవతకు రుచించునా యని ఆశ్చర్యపోతున్నాడు కవివరేణ్యుడు.హతవిధి అంటూ విలపిస్తూన్నాడు బేలగా.

 కృతి యొక బెబ్బులింబలె శ
 రీరపటుత్వము నాపహరింప,శే
 షితమగు నస్థిపంజరము
 జీవలవంబున నూఁగులాడఁగా
 బ్రతికితుఁ జచ్చియున్న ముది
 వగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
 వతకు రుచించునా? పరిభ
 వ వ్యధ యింతట నంతరించునా?

గజనీ నగరమునవుండుట అపాయమని తలచి,మసీదు గోడమీద ఈ క్రిందివిధంగా వ్రాసి,సతి,పుత్రికతో నగరంవిడచి రహస్యముగా అరణ్యమార్గము పట్టినాడు పిరదౌసి.


 ముత్యముల కిక్కయైన సముద్రమున
 బెక్కుమాఱులు మున్కలు వేసినాడ;
 భాగ్యగీనుఁడ ముత్యమ్ము వడయనైతి
 వనధి;నను మ్రింగ నోరు వచ్చినది తుదకు.

ద్వితీయాశ్వాసము

[మార్చు]

జాషువా కవి ఈఆశ్వాసంలో పిరదౌసి ద్వారా తన స్వయంప్రవృత్తి అయినా ప్రకృతి ఆరాధన,వర్ణణ, దైవ స్తుతిని పాఠకులముందుంచాడు.కావ్యం చదువుచున్నప్పుడు జాషువా పిదదౌసి మమేకమై పోయికనిపిస్తారు.కొండొకచో యిది జాషువా గారి స్వీయానుభవమేమో యని భ్రమకల్గుతుంది.

అమరేంద్ర (కీ.శే.చతుర్వేదుల నరసింహ శాస్త్రి,కవి, సాహిత్య విమర్శకుడు) జాషువాగారి కవితారసాన్ని ఆస్వాదించినవాడు.

ఆయన మాటల్లో జాషువాగారు హృదయవాదకవి.

ఆమరేంద్రగారు జాషువాగారి గురించి వెల్లడించిన భావాలలో ఒకటి రెండుమాటలు....

సుకుమార మనోభావాలు వెల్లివిరిసే కవితను వెలువరించే కవులు హృదయవాదులు.కవి హృదయాంతరంనుంచి భావాలు ఎగసివచ్చి చదువరిహృదయవీణ తంత్రులుమీటి అతని అంతరంగపు అనంతమైన ఆకాశంలో రెక్కలువిప్పుకున్న విహంగాలలా విహరిస్తాయి. భావకవిత్వపు ఉత్తమలక్షణాలను ఆయన (జాషువా)కవితలో గుర్తించవచ్చును. భావకవిత్వానికి ప్రాణమైన ఆత్మాశ్రయ లక్షణమూ, సౌందర్యారాధనమూ, సంస్కరనాభిమానమూ, ప్రణయతత్వ విలాసమూ, మానవ మహిమాభివర్ణనమూ,ఆయనరచనల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రత్యక్షరంలో,భావకవిత్వపు, ఉత్తమసంప్రదాయాలవల్ల ఆయన ప్రభావితుడైనట్లు ఆయన కృతులే సాక్ష్యం చెబుతున్నాయి. చెప్పదలసిన విషయం విస్పష్టంగా,తికమక అనేది లేకుండ చెప్పడంలో ఆయన విశిష్టత గోఛరిస్తుంది.ఆయన హ్ర్దదయవాదులైన ఉత్తమ భావకవులందరి మాదిరిగానే పరమాణు మొదలు పరమాత్మ దాకా, సకల వస్తువులను రసాత్మకదృష్టితో పరిశీలన చేశారు. రసైకదృష్టి వుంటె ప్రతిఅణువులో కవిత్వం సాక్షాత్కరిస్తుందని నిరూపించారు.

విధి బహువిచిత్రమైనది., కడుబలీయమైనదికుడా సుమీ.ఆడినమాట తప్పిన నరేంద్రుడు హాయిగా రాచనగరులో అంతఃపురంలో హంసతూలిక తల్పం పై నిద్రిస్తుంటే,రాజుకు తన ముప్పైఏండ్ల ఆయుస్సును వెలకట్టలేని కవితరూపంలో సమర్పించిన కవిరాజు కారడవిలో భార్య,బిడ్దతో దిక్కుతోచని అయోమయస్ధొతిలో,నైరాశ్యంతో క్రూరమృగాల నుండి తప్పించుకొనుచూ,గుండెలరచేతిలో పెట్టుకొని తన పయనం సాగిస్తున్నాడు.కవికింతటి అన్న్యాయం జరుగుతుంటే ఆపరమాత్మ మిన్నకున్నాడేమిటి.రాజుచేసుకున్న పుణ్యమేమి?కవిచేసిన తప్పిదం,పాపమేమిటి?. కవికి భగవంతుడుపెట్టిన పరీక్షయా!? ఆ చిదానందునికి ఇలాంటి లీలావినోదాలు పరిపాటియే కదా!. అల్పులమైన మానవమాతృలకు ఆ జగన్నాధుని అంతరంగం ఎరుగుట సాధ్యమే!?.కవిని అలా అర్ధాంతంగా వనవాసానికి రప్పించడంలో ఎదో పరమార్ధమున్నది.కవి తన్నుతాను తెలుసుకొని పరమేశ్వరుని లీలలను ఎరుంగించుటకై ఉండవచ్చును..ఔను...

పిరదౌసి తనపత్ని,పుత్రిక సమేతుడై అడవిని చేరుసమాయానికి సాయంత్రమైనద్ది.దినకరుడు క్రమంగా పశ్చిమదిక్కున అస్తమించాడు.చీకటి క్రమముగా అడవిని ఆక్రమించడం మొదలైనది.ధరణి లలానా మణికి జలకాలాడించుకన్నట్లు ఆకాశంలో కారుమబ్బులు దట్టంగా అల్లుకుపోయాయి.చలిగాలులు వీచడం మొదలైనది.గూడ్లలోని శాకుంతలపక్షులు తమకూనలకు రక్షణగా తమరెక్కల మాటునకప్పి,నిద్ర కుపక్రమించాయి. ఆ శీధీలో నిన్నటివరకు ఎండకన్నెరగని వనితామణులు అలా కారడవిలో పాదారులై నడవటం చూసి,కవి కన్నీళ్ళు కార్చడంచూసి చలించిన మేఘాలు సుల్తాను పై క్రోధించినట్లుగా ఉరమసాగాయి.

 జలదంబుల్నలు పెక్కి యాకసమునన్
 సంచారముం జేసె,భూ
 లలనారత్నము స్నానమాడునని వే
 ళాఘంటికల్ మ్రోసెఁ గ్రొం
 జలిగాడ్పుల్ చెలరేగి దేహముల నం
 టన్ గూండ్లలోఁ బండి కూ
 నలపై ఱెక్కలు గప్పి కన్ను మలిపెన్,
 నానాశకుంతఛ్ఛటల్.


 తన కల్యాణియుఁ గూఁతురున్ జటుల కాం
 తారంబులం బాదచా
 రిణులై వచ్చుట చూడఁజాలక కవి
 శ్రేష్ఠుండు వర్షించు వె
 చ్చని కన్నీటికిఁ గారణంబగు మహీ
 శమన్యుపై పండ్లు నూ
 ఱినయ ట్లంబరవీధియందుఱిమి యా
 ర్చెన్ గర్భణీ మేఘముల్.

అల్ప మానవుడు అహంకారంతో,రాజ్యాధినేతనన్న అహంభావంతో కవియడ కిరాతకంగా ప్రవర్తించినప్పటికి,అడవులు పాలు చేసి నప్పటికి ప్రకృతి కవి యడ కరుణాదృక్కులతోనే చూసింది.ఆ రాత్రిలో కవి కుటుంబాన్ని యిబ్బందుల పాలు చెయ్య నిఛ్చగించలేదు.ప్రకృతికున్న మానవీయత మానవులలో కూడా వుంటే ఎంత భావుండునో కదా! ఇలా కవిశ్రేష్టుడు కానలకేగ వలసిన అగత్యము కలిగి వుండక పొయ్యేదికదా. కవి కుటుంబాన్ని కణికరించటానికన్నట్లు గగనసీమలో దట్టముగా వ్యాపించిన మబ్బులు చిన్నపాటి చినుకులతో సరిపెట్టుకున్నాయి...కుంభవృష్టి కురియలేదు....వురుములు పెక్కుసార్లు వురిమాయి కాని పిడుగులు పడలేదు...మెరుపులు మెరిసాయు...కాని కళ్లు మిరమిట్లు గొలిపేలా కాదు....చలిగాలులు వీచిన,యిదురుగాలులు వీచలేదు.చూస్తున్నంతలోనే ఆకాశం లోని మబ్బులు అటూ..ఇటూ దూది పింజెల్లా చెదరి పోయి ఆకాశమంత మళ్లి నిర్మలంగా మారింది. మబ్బులు తొలగిపోగానే ఆకాసమంత పిండిఆరపోసిన చందాన నక్షత్రాలు ప్రత్యక్షమైనాయి...కవి పయనంసాగుతున్నది మెల్లగా...అర్ధరాత్రి కావస్తున్నది...బెబ్బులి వేటమాని పొదరిల్లుజేరి నిద్రకుపక్రమించింది.నలుదిశలు చీకటి అలముకున్న ఆ నడిరేయి ఆకీకారణ్యములో కవిని కాచేవారే లేరా?...లేకేమి? సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే రక్షకుండైన ...కవి కుటుంబానికేలా చింత...

 ఆ నడిరేయి భీకర కాననమునఁ
 బయనమొనరించు కవికుటుంబంబు నరసి
 తారకా దివ్యనేత్రపద్మములు విచ్చి
 కాచి రక్షించుచుండె జగద్గురుండు.

విధాతయే అండదండగా, రక్షకుడుగా వుండగా అడవులనేమి సంసారభవసాగరాన్నే ఈదవచ్చును.అందుకే కవి పత్ని, పుత్రికా సమేతంగా ఆరేయి వాగులను,వంకలను, గిరులను, వన్యమృగాల ఆవాసాలను దాటుకుంటూ తనపయనం సాగిస్తున్నాడు.కాలం గమిస్తున్నది....తూరుపుకొండలలో మెల్లమెల్లగా,చీకటిని తరుముకొంటు, వెలుతురుకిరణాలు రెక్కలు విప్పుకొని ప్రసరించడం మొదలైనది. మలయమరుతం మెల్లగా వీచడం మొదలైనది.ఉషఃకాంతుల వెలుగులో తనపరిసరాలను గమనించిన కవికి, రాత్రంతా కనిపించకుండ తనను,తనకుటుంబాన్ని కాచిన పరమాత్ముని యెడ ఒక్కపెట్టుగా ఆరాధన పెల్లుకుబగా, కృతజ్ఙతభావంతో ఆసరేశ్వరుని అత్మనైవేద్యంగా స్తుతించాడు.

 విత్తనంబున మహా వృక్షఁబు నిమిడించి
 సృష్టించి గారడీ సేయువాఁడ
  కడుపులో శిశువును గల్పించి పదినెలల్
 మోయించి యూపిరి వోయువాఁడ
 సద్భక్త వరులకు సాక్షాత్కరించియు
 నున్న చోటెరిగింప కున్న వాఁడ
 పొటమరింపక ముందె పుష్ప సంతతులకు
 వింతగా రంగులు వేయువాడ

ఇంత అందమైన,అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి,అనుభవించండని,ఆనందించండని నరులకిచ్చిన, ఓదేవదేవా!.నీవు మాత్రము నిలువనీడలేకుండ వున్నావు కదా!నాకు జన్మనిచ్చిన ఈశ్వరా.

 చెలువ మొప్పఁ బుడమి సృష్టించి మాకిచ్చి
 అనుభవింపుఁ డనుచు నానతిచ్చి
 నిలువ నీడలేక నిల్చిన వాఁడ!
 కడుపునిండ నన్నుఁ గన్నవాడ
 

బాలాదిత్యుని ఆగమాన్ని సూచిస్తూ తూర్పుకనుమలు కుంకుమరంగును పులుముకుంటున్నాయి.తీరుబాటుగా దినకరుడు గగనమార్గమున గమించడం మొదలెట్టాడు.సశ్చిమకనుమలనుండి చల్లగా చంద్రుడు నిర్గమించాడు.చీకట్లు తొలగిపోయి నలుదిక్కులు ప్రకాశవంతమైనవి.

ఈసకలచరాచరమును క్షణమాత్రకాలంలో సృజించిన జగన్నాధునికి నిల్వనీడ లేకపోవడమా? పరమాణాంశాలను,పరమాణువులను,అణువులను,నక్షత్రాలను,గ్రహాలను,నక్షత్రమండలాలను,పాలపుంతలను,కృష్ణ బిలాలను అలవోకగా స్పర్శచే సృజించిన సృష్టికర్త లేనిదెక్కడ? ఇందుకలడు... అందులేడు..అనే సందేహం ఎలా? ...అంతఃర్నేత్రం విప్పి చూడగలిగితే అన్నింటా ఆదివ్యమంగళస్వరూపం సాక్షాత్కరించదా!?.పిరదౌసి కూడా అదేఅంటున్నాడు. సూర్యబింబంలోను,నిండుజాబిల్లి ధవళ హాసములోను,మొలక తెమ్మరలలో,మేఘమాలికలలోని మెరుపుల్లో,అన్నింట్టా నీ వునికి కనుగొన్నానని స్తుతిస్తున్నాడు.తన పూజలందుకోమంటున్నాడు.

 సంజ కెంజాయలో జలకంబు సవరించి
 పఱతెంచు సూర్యబింబంబు లోన
 పదనాఱు దినముల పరువు వచ్చిన నాఁటి
 చంద్రుని ధవళ హాసములలోన
 పూల తోటలతోడ ముద్దు ముచ్చట సెప్పి
 చెఱలాడు మొలక తెమ్మరలలోన
 నీలమేఘంబుల నెఱియలలోఁగుల్కి
  పరువెత్తు మెఱపు గర్భముల లోన


 హాయిగాఁ బవ్వళించి బ్రహ్మాండములను
 బల్కరించుచు నున్న దివ్య స్వరూప!
 హృదయమును జీల్చి పూజ లర్పించుకొందు
 నందుకొనిపొమ్ము,వ్యవధి లేదనక రమ్ము.
 

దైవమా! యింతగా నేను అర్ధిగా ప్రార్థిస్తూ,అర్ధిస్తూంటే నన్ను చూడవేమి? పలకరింపవేమి?...సర్వేశ్వరా ! అభాగ్యుడనైన నేను నీకేమి సమర్పించుకోజాలను...నాదేహన్ని,మసస్సును సమర్పించుకుంటాను.రా తండ్రి... వచ్చి నాఏదపై తలవాల్చి విశ్రమించు....ఇంతకుమించి ఏమివ్వగలడు ఈ నిర్భాగ్యభక్తుడు..

 అలసట లేక హోరుమని
 యార్చుచుఁ బారెడు ఇమ్మహానదిన్
 గులుకు తరంగ మాలికల
 కున్ గిలిగింతలు పెట్ట ఫేనపం
 క్తుల నటనా విలాసముల
 కుం దలయూచుచు నేను మొక్కినన్
 గిలకిల నవ్వి నన్నుఁ దిల
 కింపని కారణమేమి దైవమా?

 ................

 ................

 నీకే కానుక లీ సమర్ధుఁడగు నీ
 నిర్భాగ్యు డీ దేహమున్
 నీకిత్తును దలవాల్చి పొమ్మెలమిఁ దం
 డ్రీ! నామనశ్శయ్యలన్

తల్చూకొన్నదే తడవుగా మన్నునుండి నావంటి కోటానుకోట్ల మనుసులను సృజింపగల్గిన శక్తికలిగిన ఈశ్వరా! నను వీడక,కనుమూయకుండ నన్ను సదాకాపాడుచున్న నీరుణము ఏలాతీర్చుకొందు తండ్రీ! అంటూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటునే...మరోసారి ..దేవా! గగనసీమలో మబ్బులను పడకగా చేసుకొని శయనించిన బుడతచంద్రునికి చెఱవునీట ఉయ్యాల కట్టి జోలపాడుచు, నావంక చూడవదేమయ్యా! కరణించు ...అంటూ నిందార్హంగా,నర్మగర్భంగా ప్రార్థిస్తున్నాడు పిరదౌసి.

 నన్నుఁ బోలు కోటినరుల మృత్తిక నుండి
 వెలువరింప శక్తి గలిగియుండి
 నన్ను విడువలేక కన్ను మూయ వదేల?
 యెట్లు తీర్చుకొందు నీ ఋణంబు


 ఆగడపు మబ్బుశయ్యల నపరశిఖరి
 బుడత చంద్రుఁడు నిద్దుర వోవుచుండె
 ఈ చెఱవునీట నతని కుయ్యెలలు గట్టి
 జోలవాడుచు నావంకఁ జూడవేమి?

పంచభూతాధిపతియైన సర్వాంతరామి అనంతశక్తి తనకండగా వుండగా, వజ్రకవచంలా రక్షణగా వుండగా ఏ ఉపద్రవం తనదరిచేరలేదని కవిభరోసా,నమ్మకం,విశ్వాసం..

 భూతపంచకమున మున్గి తేలుచున్న
 నీయనంతశక్తి నిశ్చయముగ
 నాకుఁ పట్టుకొమ్మ నీ వజ్రకవచమ్ము
 సిలుఁగు లేమిచేయగలవు నన్ను?

తృతీయాశ్వాసము

[మార్చు]

పిరదౌసి ప్రకృతి మహత్వవర్ణన,ఈశ్వరప్రణయంబు ముగించి, అడుగడుగునకు భయపడుచు నడయాడుచున్న అబలలతోకూడి ఆడవిమార్గంనచనుచున్నాడు.పడమటివైపునకు పొద్దు వాలుచున్నది ....వడివడిగా అడుగొక ఆమడగా వారిపయనం సాగుతున్నది...గుఱ్రాల గిట్టలచప్పుడు వినిపించిన,సుల్తానుభటులై వుండవచ్చునని,సమీపంలో దట్టంగా చెట్లువున్న పర్వతశ్రేణులగుండ,పెద్దపులులు సంచరిస్తున్న లోయలగుండ..పెడదారులద్వారా సాగుచున్నది పయనం...కాలమెవ్వరికోసం ఆగదు కదా!.. పొద్దుక్రుంగింది...అడవిపందుల సంచారం మొదలైనది....చూస్తుండగానే ఆడవిలో,ఆకాశం న,అష్టదిక్కులు అంధకారంలో మునిగాయి.

... ఆ స్ధితిలో కవిపయనమెలా సాగుచున్నది.... కొదమసింగాల ఘర్జనలకు బెదురుచు,ఎలుగుబంటులకు భితిల్లుచు..అడవిమృగాల కూతలకు జడుచుకొనుచూ, సాగుచున్నది....

 దెసలు బీఁటలు వాఱ వసపట్టి పోరాడు
 కొదమ సింగములకు బెదరిపడుచు
 త్రాటితోపులఁ గల్లు ద్రావు భల్లూకాల
 గుటగుట ధ్వనులకుఁ గుదులుకొనుచు,
 నూహింపరాని యెవో మ్రుక్కిడి మృగాల
 వెఱ్రికూతఁలకు తబ్బిబ్బుపడుచు,
 కొఱవిదయ్యముల టక్కరి దివ్వియల జూచి
 యూరు డగ్గఱెనంచు నూఱడిలుచు


 గొసరి నివ్వరి ధాన్యంబుఁ గొఱికి నమలు
 నెలుక మునిపంటి సవ్వడి కులికిపడుచు,
 త్రోవ గమియుంచు నాటి పాంధుల,నదేమొ
 అదరి బెదరించె నొక యెండుటాకు కూడ.
 మునుకొన్న సాధ్వసంబునఁ
 గనుల కరణ్యమున వృక్షగణ మరి గణమై
 కనుపట్ట నతని గళమును
 బెనఁగొనఁగా సాగి రనుఁగు బిడ్డయు పతియున్

కవికుటుంబానికి ఆ రాత్రి సమయంలో ఎటు వైపు వెళ్ళాలో తెలియని పరిస్దితి.ఎటు వైపు వెళ్ళిన ఏమి ఉపద్రవం కాచి వున్నదో తెలియదు.గతంలో పిరదౌసి పలు మార్లు పారశీకదేశం నుండి గజనికి వెళ్ళినప్పటికి అందరు బాటసారులు వెళ్లె త్రోవలో వెళ్ళాడు.కాని యిప్పుడు సుల్తాను సైనికులకు భయపడి అరణ్యంలో పెడదారులవెంట,అడ్డత్రోవలవెంట,పొంతలప్రక్కగా,లోయలకుండా సాగిస్తున్న ప్రయాణం యిది.మరి అతనికి నరసంచారమే లేని ఈ కీకారణ్యమున అండగా వచ్చి మార్గ నిర్దేశం చెయ్యువారు ఏవరుంటారు?...దిక్కెవ్వరు? .. ఉగ్రాటవిలో కవి కుటుంబానికి వెన్నంటి కాచిన వాడిదే ఈ భారం.

దట్టమైన,క్రూర మృగాల ఆవాసమైన కీకారణ్యమున ఏ త్రోవ ఎటు పోతుందో,ఏ కాలిబాటలో చెలిమ లున్నాయో, లోయలున్నాయో, ఫలవృక్షాలున్నాయో సరిగా చెప్పగలిగిన వారెవ్వరు?...ఇంకెవ్వరు ఆ గిరులలలో పుట్టి,పెరిగి,ప్రకృతితో మమేక జీవనం సాగించె గిరిజనులు ( కోయ్యలు,చెంచులు,బోయలు తదితరులు).దైవమే పంపినట్లుగా, రాత్రి వేళ వేటకై వచ్చిన,విలుకాడు,ప్రసన్నవదనుడైన ఒక కోయ్యదొర (నిషాధుడు)కవి కుటుంబాన్ని చూసి,దగ్గరికి వచ్చి,పిరదౌసితో " అయ్యా!మీరు దారి తప్పినట్లున్నారు.భయమేమి లేదు.బెంగ పడనవసరంలేదు.రండి!మీకు వూరుచేరు దారి చూపించెదనని" చెప్పి వూరట కల్గించాడు.

... (ఇలాంటి సంఘటన కవి జీవితంలోనే కాదు.మనుష్య జీవితాలలో కూడా పరిపాటి.ఉహించని విధంగా కుటుంబానికి విపత్తు కల్గి, లేదా విషమ పరిస్ధితి ఏర్పడినప్పుడు,అయినవారు,తెలిన వారు ఎవ్వరు సహాయ పడుటకు సిద్ధంగా లేనప్పుడు/ముందుకు రానప్పుడు..మనం కలలో కూడా ఉహించని వ్యక్తి/వ్యక్తులు వచ్చి ధైర్యం చేప్పి ఆవిపత్తునుండి కాపాడుతారు.ఇంచుమించు ప్రతి వ్యక్తి జీవితంలో ఇటువంటి సంఘటన ఒకటైన జరుగుతుంది.

నాగరికులమనుకొని తమ మధ్య మతం,కులము,ఆర్ధిక స్దితి అనే కృత్తిమ గోడలు కట్టుకొని,పొరుగువాడికి సహాయపడవలసినప్పుడు,సహకారమందించవలసినప్పుడు హోదా అనే నల్ల పరాదా కప్పుకుని తప్పుకొనె నగరవాసులకు...తమ మధ్య ఎటువంటిభేషాలు లేకుండగా కష్టమైన సుఖమైన సామూహికంగా ఒకే కుటుంబంలా పంచుకొని ఉమ్మడిగా ప్రకృతి వడిలో బ్రతుకు అడవి బిడ్దల మనఃస్తత్వానికి పోలికెక్కడ.నాటి పిరదౌసి కాలానికి..నేటికాలానికి ఇదే మనఃస్ధితి.చదువుంటే చాలదు..సంస్కారమబ్బాలి.సంపద వుండే చాలదు..పొరుగువాడికి సహాయపడె మనస్సు వుండాలి.

ఇదుగో ఈ కోయ దొరకు చదువులేదు కాని సహ్రుదయత ఉంది...సంపదలేదు..అపరచితుల కష్టానికి స్పందించె మంచి మనస్సున్నది.ఇవియే కదా మనిషి కుండ వలసిన అసలైన సంపదలు.)...

దైవం పంపిన దూత వలె వచ్చిన కోయదొర,కవికుటుంబానికి ముందునడుస్తూ,దారి సుగమంచేస్తూ,వారికితోడుగా ఆడవిలో సూర్యోదయం వరకు వచ్చాడు.దట్టమైన కీకారణ్యాన్ని అధికమించి,అడవి శివారుకు దాదాపు వచ్చారు.పారశికదేశపు సరిహద్దుల కనుచూపు మేర చేరారు.అప్పుడు నిషాధుడు భక్తిపూర్వకంగా కవికి నమస్కరించి"సామీ.అదిగో పారశిక దేశ పొలిమేరకు వచ్చాం.ఇక్కడనుండి మీరు సురక్షితంగా మీ వూరికెగవచ్చును.మిమ్మల్లి చూస్తేనగరవాసులల్లే వున్నారు,ఈ అడవి మార్గానికి క్రొత్త వారని తెలుస్తున్నది.అందుకే ఈ మును సూచనలు" అంటూ తగు జాగ్రత్తలు చెప్పుచున్నాడు.


ఇచ్చట జాషువా కవి తన మనస్సులో జాలువారు అడవి ప్రకృతి వర్ణనను ఈ కోయదొర ముఖత పాఠకుల ముందుంచాడు ఎంతో రమణీయంగా.చదువుచున్నంతసేపు పాఠకుడే ప్రత్యక్షంగా ఆయా అడవి మార్గాన పయనించిన అనుభూతి కల్గుతుంది...

"దొర ఆ దిక్కున నీళ్ళ మడుగులా కన్పిస్తున్నవి ఎండమావులు.అటువెళ్లిన ఎడారి వున్నది.ఎడారిలో మీరు పయనమొనర్చడం ప్రమాదం.అటు వెళ్లకండి. ఆ కన్పిస్తున్న కొండ అంచున పెద్ద చెఱువున్నది.వలసినచో అక్కడ మీరు ఆగి చల్ది తినవచ్చును.అదిగో అటు కనుచూపు మేరలో పిడి యేనుగులు టేకు చెట్టలను కూకటి వేళ్లలతో సహా పెకలించి వేస్తున్నాయి.జాగురత గా పయనం సాగించండి.మీరు కొంచెం ముందుకువెళ్లిన చెఱువుకు కుడిచేతి దిక్కున మా చెంచుగూడెంలు కానవచ్చును.అక్కడ మీకు భయమేమి లేదు."

అటు కొండలకు అవతల

 ఈ గ్రచ్చ పొదలయందే నిర్భయము మీఱ
 బెబ్బులుల్ పిల్లలఁ బెట్టుచుండు;
 ఈ జలాశయములందే జంటలై వచ్చి
 యెదలైన యేనుంగు లీఁతలాడు,
 ఈ కొండ లోయలందే నిశీధమునందు
 దయ్యాలు గుంపులై తాండవించు,
 ఈ తాండ్రతోఁపులందే జంతువుల మ్రింగి
 కొండచిల్వలు మత్తుగొని పరుండు.

"అయ్యా! జాగ్రత్త ఇక్కడ దొంగలు గుంపులుగా వచ్చిడబ్బుకై ఖూనిలు/హత్యలు చేస్తుంటారు.దొరా!ఈ అడవి బ్రహ్మపుట్టించిన వింత ఆపదల నిలయమనుకో!.అదిగో అటు వైపున్న్న త్రోవల పోవు బాటసారులు మక్కా నగర దర్శనంకేగుచున్న అరబ్బీ సన్యాసులు.ఆ పెద్ద కొండల మీద చివరకెళ్లి చూచిన గాంధార (నేటి కాంధహార్)మహానగర ఎత్తన భవనాల ప్రాసాదాల అగ్రభాగాలు కనపట్తును. ఇటువైపున పారశికుల సశ్మశాన వాటికలున్నాయి.ముందుకు సాగినచో తేనె పట్టుల్లా భ్రమింప చేస్తూ గుత్తులు గుత్తులుగా దోరగా పండిన ఖర్జురపుచెట్ల తోటలలో తిరుగుచు,వంకల దాపున పసి ఒంటెలను మేపుచున్న పారసీపౌరులు కన్పిస్తారు.ఇటు ఉత్తరదిక్కుగా ఎడారికి దాపున పుట్టగొడుగుల్లా వెలసివున్నవి,అరబ్బు ముత్యపు వ్యాప్యారస్తుల మజిలి గుడారాలు.ఆ చెట్లను చేరి వారి ఒంటెలు పరుండి ఉన్నాయి.ఓ దొరా! అందమైన పచ్చని మేనిఛాయతో,విశాలనుదురు,కట్టుబొట్టు చూస్తే మీరు పారసీకుల వలె నున్నారు.మరి ఈ ముది వయస్సులో, ఆడుబిడ్దలతో ఈ కీకారణ్యంలో కొండ లను,లోయలను దాటుచూ,ఇక్కట్లకు లోనగుచు పాదాచారులై ప్రయాణం చెయ్య వలసిన అగత్యమెమొచ్చింది.ఇట్లడుగుట తప్పిదమైన మన్నించండి "అని వినయపూర్వకంగా పలికాడు కొయ్యదొర.

దైవం పంపినట్లుగా వచ్చి,వేటమానుకొని రాత్రంతా తమకు అండదండగా వుండి,మార్గదర్శకుడుగా సహపయనమొనర్చిన నిషాధవల్లభుని వినయ పూర్వక వాక్కులను వినగానే కవీశ్వరుని కంటివెంట జల జల మంటు కన్నీరు కారింది. (కష్టాలలో వున్న వ్యక్తినేవరరైన ఒదార్పుమాటలాడిన,ఒక్కపెట్టున దుఃఖం పెళ్ళిబికి కన్నీరు లోలకడం సహజమేకదా!).కంట కన్నీరొలకగా,కోయదొరను మనసారా గట్టిగా కౌగలించుకొని,దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో తన విషాద కతను తెలిపి,

పిరదౌసి"నీవు చేసిన ఈ మహోపకారాన్ని నాబొందిలో జీవమున్నంత తనక మరువజాలను.నీ సహాయానికి ఆజన్మాంతరం రుణపడివుంటాను.కృతజ్ఞడను"అనిపలికి నీళ్ళు నిండిన కళ్లతో అడవిబిడ్దకు వీడ్కోలు పలికి, ఆలిబిడ్దలతో తనపయనం ముందుకు సాగించాడు.

కవి కుటుంబం కనుమారుగు అయ్యే వరకు చూసి,కవికి కలిగిన కష్టాలకు చింతిల్లుచు,విషాద భరిత హృదయంతో తన గూడెం దిశగా కదిలాడు కోయదొర.

మరి గజనీ నగరంలో ఎమి జరుగుచున్నది.సుల్తాను ఆనతిమేరకు పిరదౌసిని బంధించుటకై కవి సదనంకేగిన భటులు,కవి వెళ్లి పోయ్యెనని తెలిసి హతాసులై,పటాలమంత వేగిరమే అప్రమత్తమై,నలు దిక్కులకు వెళ్లి పిరదౌసికై గాలించిరి.దైవలీలయో..మరేదెమో? కవి అదృష్టమో! కవిచనిన వనభూమి రాజ భటుల దృష్టిలో పడలేదు.మహమ్మదుకు ఈ విషయం ఎరిగించగానే,సుల్తానుకు పట్టరాని కోపం వచ్చింది.వంటింటి కుందేటి వంటి పారసీక కవిని పట్టలేని అసమర్ధులై నా రాజసానికే అవమానం కల్గించిరంటూ,ఇదే భట వలయం తనకు ఎన్నో ఏండ్లగా విశ్వాసంగా వూడిగంచేసిన విషయం, యుద్ధ రంగంలో ప్రాణలొడ్ది,రక్తంచిందించి తనకు జయలక్ష్మిని,రాజ్యలక్ష్మిని అందించినరన్న నిజాన్ని విస్మరించి,కృతజ్ఞత మరచి చెరశాల పాలు కావించాడు.ఔరా!రాజెంత నిర్దయుడు!.రాజుకు అనుగ్రమొచ్చినా?ఆగ్రహమొచ్చిన భరింప కష్టతరమే సుమ్ము!. పిరదౌసికి ఆశ్రయమిచ్చిన వాడు తనకు వైరి వంటి వాడగునని భూపతులకు,సామాంతులకు ఫర్మానాలు పంపాడు.షానామా వంటి గొప్ప గ్రంథానికి కృతిపతి అయ్యిండి,అట్టి కవిత తన కంకితమిచ్చిన కవినే పట్టి చంపచూస్తున్నాడు.భళి!గొప్పమనసున్నరాజే?... అని జనులు ఆడిపోసుకున్నారు.జనుల మాటలాలకించిన,మంచి చెడును ఎంచు బుద్ధిమంతులైన,సుల్తాను యొక్క సామాంతరాజులు కొందరు,సందేశము ను పంపిరిట్లు....

 గడియించితిరిగదా,కనకరత్న చయంబు
 దననాయకునకు దంతములు పులియ,
 వణఁకించితిరి గదా,పదియు నెన్మిదిమాఱు
 లకిల భారత హరిదష్టకంబు;
 అగలించితిరిగదా,హైందవ దేవతా
 గర్భములు రత్నరక్తముల్ చింద,
 సృష్టించితిరిగదా,ఇస్లాము మతమును
 బాపనయ్యల గృహభ్యంతరముల.

ఓ రాజా !అట్టి ఘన చరిత్ర కలిగిననీవు, వైరి భయంకరుడవైన మీ కీర్తికి అమరత్వం కల్గించెటట్లు కృతిని సమర్పించిన కవి యెడ కారుణ్యరహితమేల.మక్కాలోని మహమ్మదు ప్రవక్త సమాధిపై బక్కాకీర్తులను చెక్కించిన భక్తాగ్రేసుండవై,ఒకకవి కివ్వ వలసిన ద్రవ్యంబు ఇవ్వకుండుట పాటి కాదు.మీ హుక్కా కర్చుకు సాటి రాదు కదా !కవికివ్వ వలసిన రొక్కం...కవితాకన్యకు పతివైన మీకేలా ఈ అపకీర్తి.

ఓ భూపతి! రాజేంద్ర!! ఆలకించుమా మా విన్నపం....

 దాదాపు నాల్గువందలమంది కవులు గా
 నము సేయు మీ దివాణంబు ఠీవి
 అల్లాకుఁ బ్రీతి సేయం గాఫరులమీఁది
 కుఱుకు మీకత్తి వాదర పసందు
 సకలించి శత్రుమత్సరము వెల్లడిచేసి
  కాల్ద్రవ్యు మీ ఘోటకముల పసరు
 పసిడిఁ జల్తారు టంబారీల యొఱపునఁ
 దిరుగు మీ గజముల గరువతనము


 మా యవన రాజ్యమునకు బూరాయు లని
 తలఁచు కొనుచుందు మెపుడు సుల్తాను వృషభ!
 లలితకలలు వడంబించు నెలవు మీదు
 నిండుకొలువున కవుల కన్నీరు తగదు.

"ఓ ధరాధిపతి!షానామా గ్రంథంలో భూనాయక మేలి రత్నములున్నవికదా!.అరవై వేల దీనారాలిచ్చుటకు సంసయమేలా?కళాపోషకులైన మీకిది పాటి కాదుకదా!కక్షణిక రాజ్యవధూటికన్న,మీయశస్సును చీరకాలం వెలయంగజేయు కావ్యకన్యక యే మేలు కదా!".

వినయంగా,నమ్రతగా విషయాన్ని విన్నవించుకొంటు,సామంతులు పంపిన సందేశం సుల్తానుకు నచ్చింది.కవిమీద కోపం మందగించింది.మునుపటిలా మళ్లి పండిత గోష్ఠిలో,కవితా గోష్టులలో పాల్గొనడం మొదలెట్టాడు.చూస్తుండగానే ఇట్టె మూడు వత్సరాలు గడచిపోయాయి.

సుల్తాను మునుపటిలా దర్బారు నిర్వహిస్తున్నాడు.సభలో కవిత చెప్పిన కవులకు మాణిక్యాలు ఇచ్చి పంపినాడు...పండిత విమర్సకు మెచ్చి పసిడి దుశ్శాలను కప్పి సత్కరించాడు....కమనీయంగా గాన మొనరించిన గాయకులకు దొసిల్లకొలది ముత్యాలు బహుకరించాడు....నర్తకి నాట్యానికి మురిసి కొంగున వరహాలు గుమ్మరించాడు...కాని పిరదౌసికివ్వ వలసిన ద్రవ్యంబు మాత్రం మరచినాడదెట్లో??.

ఒకనాడు ప్రభాత వేళ మహమ్మదు సుల్తాను నమాజు చెయ్యుటకై మసీదు కేగి,అల్లాకు నమాజు చేసి వచ్చు సమయంన,మసీదు గోడలపై చదివిన ప్రతి అక్షరం కన్నీళ్లొలికేటట్లు పిరదౌసి వ్రాసిన


కృతియొకబెబ్బులింబలె శ....

........................

.......................

.................పరిభ

వ వ్యధ యింతట నంతరించునా?


"ముత్యములకిక్కయైన సముద్రమునను

............................

............................

వనధి నను మ్రింగనూరువిచ్చినది తుదకు" అంటూ వ్యధాభరితంగా వ్రాసిన పద్యాలను చదివాడు.

పద్యాలను చదివిన రాజు వళ్ళు జల్లుమన్నది.తనతప్పిదం గుర్తెరిగాడు.తక్షణమే...

 ఏలిక పారసీక కవికి
 నిచ్చెదనన్న పసిండి నూరు బ
 స్తాలకుఁ బట్టి యొంటియల
 షట్కము పై నిడి వీరులైన ము
 ల్లాల పరంబు చేసి పది
 లంబుగ సత్కవి కప్పగింపు డం
 చోలి ననుజ్ఞఁ జేసె బురి
 నున్న సుధీమణు లుల్లసిల్లగన్ .

కాని..దైవలీల మరోలా ఉంది.. పిరదౌసిని దారిద్రం వెన్నంటె ఉంది.వూరుచేరిన కవి బీదరికంతో కటకట పడుచున్నాడు.కవిని సరస్వతి కటాక్షించింది.కాని...సిరి కవిని మరచింది..ఈ ముదివయస్సులో కవి ఏమి చెయ్యగలడు?...పిళ్లిడు వచ్చిన కూతురు యింట్లో ఉంది.... ఆమె నొక యింటి దాన్ని చెయ్య వలసిన బాధ్యత కళ్ళ ముందు కదలాడు చుండగా..బెంగతో ఆరోగ్యం క్షీణించింది.ఏడాదిగా రోగపీడుతుడై,మంచాన సపర్యలు ఆలుబిడ్దలచే పొందుచున్న కవి ...తనువు చాలించాడు.


హతవిధి!కవి ఎంతటి దురదృష్తవంతుడు? తన ముప్పదిఏండ్ల కవితాకృషికి ప్రతిఫలమందుచున్న విషయం తనచెవిని పడకమున్నే కనుమూసాడుకదా!.తన కృషి నిష్ఫలం కాలేదన్న నిజం తెలిసున్న కవి ఆత్మకింత వూరట లభించేదికదా.ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోలేక పోయాడు,ఆ ఆభాగ్య కవివరేణ్యుడు.ఇటు సుకవి పార్థివ శరీరం శ్మశానవాటి చేరు సమయాన,అటు కవి ఇంటికి,సుల్తాను అనుచరులు చేరుకున్నారు కవితా రొక్కంతో.ఒక్ నిమీష కాల వ్యవధిలో జరిగినదిది,విధివిలాసమెరుగుట నరునికి సాధ్య తరమే!.

 సుకవిదేహంబు ప్రేతభూమికి లభింప
 అర్ధమప్పుడె శూన్యగేహమును జేరె,
 నిమిషభేదంబు నడుమ సంధింపఁబడిన
 ఈ రహస్యంబుఁ గనుగొన నెవరితరము?

కటిక పేదరికంలో మ్రగ్గుతున్న ఎవ్వరైన అనుకోని విధంగా సంపద వచ్చిన కాదందురా?తిరస్కరిస్తారా?.కాని అభిమానమే సంపదగా బ్రతికే వారు ఇట్టి ప్రలోభాలకు అతీతులు.పులి కడుపున పిల్లి పుడుతుందా? అభిమానధనుడైన పిరదౌసి అనుంగుకూతురు,స్వాభిమానంలో తండ్రికి తగ్గ తనూజ.అందుకే తన తండ్రికి దుఖఃహేతువు,మనస్సును నొప్పించి అడవుల పాలు చేసి మనోవేధనకు గూరికావించి,మృత్యువుకు కారణమైన అరవదివేల బంగారు దీనారాలను తృణప్రాయంగా ఎంచి తిరస్కరించింది.

ద్రవ్యంబును కొని వచ్చిన భటులతో,కన్నీరొలకగా పిరదౌసి తనయ "నా తండ్రి హృదయాన్ని భాణలై నొప్పించి,గాయపరచి,మరణహేతువైన ఈ ధనాన్ని స్వీకరించిన,స్వర్గగ్రస్తుడైన నా తండ్రి ఆత్మ క్షోభిస్తుంది.నా ముదుసలి తండ్రిని దయతో ఏలిన మీ నవాబు గార్కి నా పదివేల నమస్కృతులు తెలుపుడి."అని దైన్యం చిందిపడగా,నూడివి ధనంను తిరస్కరించినది. .

 "ఇది నా తండ్రికి కష్ట పెట్టిన శరం,
 భీస్వాపతేయంబు ము
 ట్టుదునా,నా జనకుండు కంటఁ దడిఁబె
 ట్టున్ స్వర్గమందుండి,నా
 ముదితండ్రిన్ దయతోడ నేలిన నవా
 బుండైన మీ స్వామికిన్
 బదివే లంజలు"లంచుఁ బల్కుడని బా
 ష్పస్విన్న దుఃఖాస్యయై.

సులతాను భటులు కవిధనంతో తిరుగుబాట పట్టి,గజనీ నగరంకు చేరి రాజుకు పిరదౌసికవీంద్రుడు కీర్తిశేషుండైన వృత్తాంతం,స్వాభిమానవతియైన కవితనయ ధనమును తిప్పిపంపిన వైనం విన్నవించారు.పిరదౌసి మరణవార్త సులతాను హృదయానికి వజ్రఘాతం వలె తాకినది.కంటివెంట ధారపాతంగా కన్నీళ్లు కారుచుండగా,కొలువు చాలించి,తనశయన మందిరమునకు పోయి,తలుపులు మూసుకొని,రోదిస్తూ......

"ఓరి కృతఘ్నుడా!అఫఘన్ రాజ్యామంతయు కావ్యసుధలో ఒలలాడించిన పిరదౌసికి తీరని అన్యాయంచేసి,స్వర్గంన పిరదౌసి కవితో కలసి స్వర్గసుఖాలనుభవించు అవకాశం పోగొట్టుకొంటివికదా!జీవించినంతకాలం మనుపీనుగవై కాలమిడ్చు.న్యాయంతప్పి,పిరదౌసి విషాద మరణానికి కారణభూతుడవై,సంపద,పౌరుష కీర్తి కలిగిన రాజ వంశానికి అపకీర్తిని మూట కట్టావు కదా!.కవులెందరున్నా వారి కవనం పిరదౌసి కవితావాక్కులకు సాటి రావుకదా.ఎంతటి నిర్భాగ్యుడవు!"-అంటూ తన్న తాను నిందించుకొని అత్మ ప్రక్షాళన కావించుకొన్నాడు.

జరిగినదానికి వగచిన నవాబు,తన తప్పిదానికి ప్రాయఃశ్చిత్తంగా,కవిరుణం తీర్చుకొనుటకు,తూసు నగరమున కవి పిరదొసినామంన ఆయన స్మృతిగా కట్టించాడొక చక్కని సత్రశాల.దాని శైథిల్యములు నేటికి కనిపించగా.చూచిన పారసీకులు కన్నీరు విడుతురు.ఈ సత్రశాల కవికి సత్కీర్తిని,సుల్తానుకు శాశ్విత అపకీర్తిని ఆపాదిస్తూ చరిత్రలో మిగిలిపోయునది.ఇప్పటికి రాత్రి వేళలో, గజనీ నగర వీధులలో తిరుగుచు,మహమ్మదు సప్రాణ కంకాళం/అస్తిపంజరం ఆర్తనాదాలు జేయునని ప్రజలు అనుకొంటుంటారు.మనిషి మరణించినను చేసిన పాపం వూరకే పోవునే!


 అని పశ్చాత్తప్తుండై
 వనరి,యతనిపేరఁ దూసు పట్టణమునఁ జ
 క్కని సత్రశాల గట్టిం
 చె నవాబుఁడు కఋణ్ంబు చెల్లింపగన్


 దాని శైథిల్యములు నేఁడు గానఁపడును;
 పారసీకులు చూచి కన్నీరు విడుతు
 రఁట మహమ్మదుగారికి నపశయంబు,
 నిండు సత్కీర్తి కవికి నిలిచిపోయె.


 గజనీపట్టణ వీధులన్ నృపుని క
 కాళంబు సప్రాణమై,
 రజనీమధ్యములందుఁ గ్రుమ్మరుచు నా
 ర్త ధ్వానముల్ సేయునం
 చు జనశ్రేణి వచించుచుండు,నవునౌ
 క్షోణీస్థలిన్ వీడినన్
 వృజినం బూరక పోవునే?నరుని శాం
 తిజ్యోతిఁ జల్లార్చదే?

తుదిపలుకులు

[మార్చు]

పిరదొసి కావ్య విశేషం,విశిష్టత ఎమిటి?....ఏమున్నదందులో?...

పిరదౌసికావ్యం 'పిరదౌసి'అనే పారసీక కవి జీవత కథ..విషాదభరిత కథ...కావ్యం మొత్తం విషాదయుతమేనా?,విషాదం పాల్లు ఎక్కువున్నప్పటికి మిగతా రసాల రసస్వాదనకు కొదువ లేదు (హస్య రసాన్ని మినహయించి).

పిరదౌసిరాసిన 'షానామా'లో అణీ ముత్యాలవంటి కవితలుంటె...జాషువా రాసిన కబ్బంలో మొలక వజ్రాలను,పచ్చలను మించి రాణించు పద్దియములు ఉన్నాయి.పిరదౌసి కావ్యంలో..ఒక కవి చరిత ఉంది..పద్దెనిమిది పర్యాయాలు భరతఖండంపై జయఖెతనం ఎగురవేసిన మహమ్మదు సుల్తాను చరిత్ర ఉంది.ప్రకృతి వర్ణణ-ప్రకృతి నియత ఉంది.భక్తుడి,భగవంతుని అనుబంధమున్నది. దైవారాధన,ఈశ్వరలీలలున్నాయి.కష్టాలున్నాయి...కన్నీళ్ళున్నాయి...హృదయ సాంత్వన ఉంది.

కావ్యాన్ని చదువుచున్నంతసేపు..పాఠకులను ఈ బహ్యప్రపంచానికి ఆవల మరో రసరమ్యలోకంలో విహరింపచేస్తాడుకవి..రసైక దృష్టి వున్నచో ప్రతి అక్షరంలో,ప్రతి పదంలో,ప్రతి వాక్యంలో కవిత్వం సాక్షాత్కరింపచేయవచ్చునని జాషువా నిరూపణ చేసిన కావ్య మిది.

ఇందులో పిరదౌసి కాలంనాటి సమకాలిన సామాజీక పరిస్ధితులున్నాయి.భరతఖండం పై నాటి విదేశపాలకుల దండయాత్రకు మూల కారణల ప్రస్థాపన ఉంది.దండయాత్రలకు మూల హేతువులు..అప్పటికే పొరుగు రాజ్యాలకన్న సుసంపన్నమైన భారతావని అపార ధనరాశిని కొల్లగొట్టం..హైందవ దేవాలయాల ధ్వంసమొనర్చుట..ఇస్లాం మతవ్యాప్తి.ఈ నగ్నసత్యాలు జాషువా కలం నుండి జాలువారిన వైనం కనుడి.

చిక్కని రుధిరంబులో భరత ఖండము నార్ధ్రమొనర్చి సోమనాధుని పెకలించి....బంగారు నాణెముల బస్తాలకెత్తించి....లీతపచ్చల నేరి గోతాల కట్టించి...మణులను కుంచాలకొలిపించి ...మొలక వజ్రాల జాలెల పోసి కుర్పించి...గజనీ మహమ్మదు గజనీకి కదలిపోయె.

భారత క్షోణిఁగల్గు దేవస్ధలములు చెదరి గజనీపురాన మసీదులయ్యే


...అగలించితిరి గదా,హైందవ దేవతా గర్భముల్ రత్నరక్తముల్ చింద,సృష్టించితిరికదా,ఇస్లాము మతమును బాపనయ్యల గృహాభ్యంతరముల;

రవి కాంచనిచోట కవి కాంచునన్నారు.మనచుట్టూ వున్న వాటిలోని మనుసులు చూడలేని అందాలని,అర్ధాలను చదువరి ముందుంచ గల సమర్ధుడగ్గును కవి.ఓ క్రొత్త లోకాన్ని అక్షరాలతో సృజించగల సమర్ధుడు.గతకాల చరితను,వైభావాన్నికవన రూపంలో కళ్లముందుంచువాడు కవీశ్వరుడు.ఈ సత్యాన్ని మహమ్మదు నోట పలికించాడు జాషువా మనస్సుకు హత్తుకుపోయేలా, ఇలా...

కవినిఁ కన్న తల్లి గర్భంబు ధన్యంబు;కృతిని జెందువాడు మృతుఁడుగాఁడు;...తమ్మిచూలి కేలుఁదమ్మిని గల నేర్పు కవిలకలంబునందుఁ గలదు గాన,నీశ్వరత్వమతనికే చలానణి యయ్యె;

దాఁటిపోయిన యుగములనాటి చరిత మరల బుట్తింప గవియ సమర్ధుడగును.

సుల్తాను మాటతప్పి బంగారుకు బదులుగా వెండిరూకలు పంపినప్పుడు,పిరదౌసి రాసిన వుత్తరము చదువరి కండ్ల దుఃఖాశ్రువులను చిందిస్తుంది.ఇక్కడ జాషువా గారు పిరదౌసి పాత్రలోకి పరకాయ ప్రవేశము చేసి,పిరదౌసి కవిపొందిన ఖేదము,వ్యధ,నైరాశ్యము,నిసృహ,ఆశాభంగాలను తాను పొందుతూ పద్యరూపంలో వెలువరించాడు.కావ్యాన్ని చదువుచున్నంతసేపే కాదు,కావ్య పఠనం ముగించిన తరువాత కూడా ఆ భావోధ్వేకం పాఠకుని మనస్సును వెంటాడుతూనే వుంటుంది.


వుత్తరములోని ప్రతి పద్యము,ప్రతి పద్య వాక్యము పాఠకుని హృదయాన్ని కలచి,కదలించి,కలవరపరుస్తుంది.కవిబాధను తనబాధగా అనుభవం పొందుతాడు.కవిస్ధితి యెడ మిక్కుటమైన సానుభూతి,సుల్తాను పట్ల ఎల్లలులేని కోపం,క్రోధం,అసహ్యం కట్టలు త్రెంచుకొని పెల్లుబుకుతుంది.

ఎన్నో కొండలు గుండెలో గరఁగి పోయెన్.....సమస్త లోకము నిరాకారస్ధితిం బొల్చె...'


...కృతక విద్యుద్దీపముల్ నమ్మి యాశాసౌధంబు గట్టి గొంటి...వృథాయాసప్రాప్తిగా నిల్చినాడ నొక దుఃఖాక్రాంతలోకంబునన్


...ఱాతిగుండె సుల్తానుల కస్మదీయ కవితాసుధ జిందిన పాతకంబు.....స్వయంకృతైకదీషానలదగ్ధమై చనిన యర్ధము నాకు లభింపబోవునే.


ఇంక విషాదగీతముల కే మిగిలెన్ రసహీనమైన మషీపంకము....నిరాశాంకిత బాష్పముల్పలము లైనవి ముప్పది యేండ్ల సేవకున్.

ఒక్కొక్క పద్దియంబునకు నొక్కక్క బొట్టు మేనిలో దక్కువగా రచించితి...కులీనుడైన రాజిక్కరిణిన్ మృషల్వలుకునే? కవితాఋణనమీయకుండునే...


అల్లా తోడని పల్కి నా పసిండి కావ్య ద్రవ్యము న్వెండితో జెల్లింప దొరకొన్న టక్కరివి;నీ చే పూజితుండైన అల్లాకు సుఖమే?


...దీర్ఘాయువు బోసినాడను తదన్వయవల్లికి!వట్టి చేతులన్ బోయెద నంధకారమున మున్గి..

చిరముగ బానిసేని నభిషేక మొనర్చితి మల్లె పూవు టత్తరులోలికించి, మాయజలతారున రాదు కదా పసిండి.....శిరమున పోసికొంటిని నశింపని దుఃఖపుటగ్ని ఖండముల్

అలసట తీర్చుకొందును మహమ్మదురాజులతో సమాధి శయ్యలపై.....పండు వెన్నెల గురియించు నా కవిత నీకు లభించె నసత్యవాదికిన్.

పై పద్యాలు,వాటి భావం పాఠకుని గుండెలోతుల్లోకి చొచ్చుకెళ్లి కలకాలం,మనస్సులో తిష్టవేస్తాయి.

నగరం విడచిపోవు సమయాన మసీదు గోడపై లిఖించిన....

కృతి యొక బెబ్బులింబలె శరిరపటుత్వమునాహరింప,శేషితమగు నస్థిపంజరము జీవలంబున నూగులాడగా,బ్రతికియు జచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గదేవతకు రుచించునా>ఫరిభ వవ్యధ యింతట నంతరించునా?

ముత్యములకిక్కయైన సముద్రమున

బెక్కుమాఱులు ముంకలు వేసినాఁడ;

భాగ్యహీనుఁడ ముత్యమ్ము పడయనయితి

వనధి;నను మ్రింగ నీరు వచ్చినది తుదకు. పద్యంలలోని భావం సూటిగా చదువరుల గుండెలను తాకి కలచి,కలవరపిట్టి హృదయఫలకం పై కలకాలం శిలాక్షారాలై నిలచిపోవును.బాలవాక్కే కాదు సుకవి నోటినుండి వెలువడు వాక్కు కూడా బ్రహ్మవాక్కే సుమ్మీ!

ద్వితీయాశ్వాసంలో జాషువా పిరదౌసిచే దైవ స్తుతి చేయిస్తాడు..ఎందుచేత?.ఎవ్వరైన ఏ చిన్నపాటి సహాయం చేసిన ఆవ్యక్తిని పొగడ్తలతో ముంచెత్తుతాము,కృతజ్ఞతలు చెప్పుతాము..ఇతరులకు చేసిన చిన్నపాటి సహాయనికే ఇతరులనుండి ఇంతోటి మెప్పుదలను,కృతజ్ఞతలను,విశ్వాసాన్ని ఆశిస్తే... ఆ అఖిలాండ బ్రహ్మాండనాయకునికి మనమేంత ఋణపడి వున్నాం!?..ఎంతటి విశ్వాసం,కృతజ్ఞత వ్యక్తపరచాలి.

జాషువా ప్రకృతి సౌందర్య విలాసాలను తనివితీరా ఆనందిస్తూ,ఇంతటి అందాన్ని నిర్మించిన అదృశ్యశక్తిని,తలచుకొని గుండెలు నిండిన కృతజ్ఞతా భావంతో ....

విత్తనంబున మహా వృక్షంబు నిమిడించిన వాఁడ...కడుపులో శిశువును కల్పించి పదినెలలు మోయించి వూపిరి పోయువాడ,పొటకరింపక ముందె పుష్ప సంతతులకు వింత రంగులు వేసి... చెలువ మొప్ప పుడమి సృష్టించి,అనుభవింపుడని ఆనతిచ్చి నిలువ నీడ లేనివాడ కడుపునిండ మమ్ము కన్నవాడ అంటూ కృతజ్ఞతలు చెల్లిస్తునాడు.

ఈ కఠోరనగ్నసత్యాన్ని మనుసులకు తెలుపుటకే పిరదౌసిచే ఈశ్వర సోత్రగానమొనర్పింప చేసాడుజాషువా కవి సామ్రాట్.

జనులందరు భగవంతున్ని గుళ్లలోనో,ప్రార్థనా మందిరాలలో,మసీదుల్లో, వెతుకుచుండగా జాషువాకు ప్రకృతి సౌందర్యములో మమేకమై, అంతటా దొబుచూలాడు రూపాతీత,నిరాకార భగవంతుని సాక్షాత్కారాన్ని వీక్షించాడు. హృదయాన్ని చీల్చి పూజలర్పిస్తున్నాడు. కవి మాటలనే విందాం...

సంజెకెంజాయలో జలకంబు సవరించి,పరతెంచు సూర్యబింబంబులోన...పదియారు వన్నెల పరువు వచ్చిననాటి చంద్రుని ధవళహేసమ్ములోన...పూలతోటలతోడ ముద్దుముచ్చట సెప్పి,చెరలాడు మొలక తెమ్మరలలోన,...నీలిమేఘంబుల నెరియలలో కుల్కి పరువెత్తు మెరుపు గర్భములలోన....హాయిగా పవళించి బ్రహ్మాండములను పల్కరించుచునున్న దివ్య స్వరూప! హృదయమును చీల్చి పూలలర్పింకొందు అందుకొనిపొమ్ము వ్యవధి లేదనక సుమ్ము ...కవి దైవం పట్ల తనకు గల ఆరాధనను,ఒకింత చనువును ప్రదర్శిస్తున్నాడు.

భక్తునికి భగవంతునికి గల సంబంధం-అనుబంధము ఎలాంటిది.భక్తుడు భగవంతుని ఒకపరి కృతజ్ఞతతో ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు,ప్రశ్నిస్తాడు,కినుక చెందుతాడు,చనువుగా నిందిస్తాడు.విటన్నంటిని పిరదౌసిద్వారా మనముందుంచాడు జాషువా.తిలకించండి....

గాలికి దూగియాడు గిజిగాని కులాయము జూపి నాకు నీ పోలిక లాత్మలో గరగి పోసితి ధన్యుడనైతి.

...నదిన్ గులుకు తరంగ మాలికలకున్ గిలిగింతలు పెట్ట ఫేనపంక్తుల నటనావిలాసములకు దలయూచుచు నేను మొక్కినన్ గిలకిల నవ్వి నన్ను దిలకింపని కారణమేమి దైవమా?

ఆ నిదురించు పెద్దపులి యాస్యబిలంబున కెన్ని జంతువుల్ బోనములై యదృశ్యమయి పీయెనొ,రేపటి భుక్తికిన్ దయారైన మృగంబు లేపొదల యందవుగాము లెఱుంగ కింపుమైమేనులు వాల్చెనో,యెఱిగి మిన్నక చూచుచు నంగలార్తువా.

నీకే కానుక లీసమర్ధుడగు నీ నిర్భాగ్యు డీదేహమును నీకిత్తున్ దలవాల్చి పొమ్మెలమి దండ్రీ!నా మనశ్శయలన్.

నన్నుబోలు కోటినరుల మృత్తిల నుండి వెలవరింప శక్తి గలిగియుండి నన్ను విడువలేక కన్నమూయవదేల?యెట్లు తీర్చుకొందు నీ ఋణంబు?

...గ్రహింపజాల నెందుకు సృజియించినాడవొ ననున్ ఘనుడా!అసమగ్రబుద్ధితోన్

వాడి వత్తలై తొరగిన వృద్ధపుష్పముల దుఃస్ధితికిం గరుణించి యశ్రువుల్ గురుసితి వట్టి నీ కనుల లోన జెమర్చె నజాండముల్.

దేవా!యెక్కడిదీ ప్రశామంత గుణ? మాదిత్యుండు బ్రహ్మందపురం ద్రోవ నిల్చునె,తెల్లవారునె ప్రభూ!క్రోధంబు నీకుండినన్

...యేమని వ్రాసికొంటివో నా గతులందులోన కరుణానిధి!చిత్తము విహ్వలించెడిన్

...దిట్టి తావు నీ గోమల పాద సేవకులందగియున్నది పూజ సేయ దండ్రీ!మొగమింత సూపు;మిటనెవ్వరులేరు పరాయులీశ్వరా!

బ్రహ్మండ విలాస! నీ కవన మద్భుత మర్థగంభీర మీశ్వరా!

నీ భూములు నిల్చునా భువన మోహన! నీవు పరాక్రమించినన్!


ప్రకృతి ఆరాధకుడు కవికోకిల జాషువా.ప్రకృతిలో ఈశ్వర దర్శనం కాంచినవాడు,ప్రకృతిని ప్రేమించకుండ,ఆరాధించకుండ వుండ తరమే.మనిషి మారిన చుట్టు వున్న ప్రకృతి తన నియతిని తప్పకుండ వుంటుటకై ప్రయత్నిస్తుంటుంది.ప్రకృతిని ధ్వంసమొనర్చుతున్నప్పుడెల్లా ప్రకృతి మనకు సంకేతాలు పంపుతూనే ఉంది.సందేశం యిస్తునే ఉంది.కాని మనమే గుర్తించడంలేదు.అభివృద్ధిపేరిట ఆడవుల నరకి వేత,పారిశ్రామిక,రసాయనిక పరిశ్రమల ద్వారా మనిషి వదులుతున్న వ్యర్ధ కలూషిత జలాలు,విష వాయువులు, వ్యర్ధ విష రసయనాలు,వాతా వరణానికి తెస్తున్న చేటును ప్రకృతికి కల్గుచున్న చేటును ఆమ్ల వర్షాలద్వారా,వాతావరణ ఉష్ణోగ్రత పెరుదల,వర్ష ఋతువు గతి తప్పడం వంటి సంకేతాలను ఎప్పటికప్పుడు అందిస్తునే ఉంది.