పిల్ట్‌డౌన్ మనిషి
పిల్ట్‌డౌన్ మనిషి ఒక పాలియో ఆంత్రోపోలాజికల్ మోసం. కొన్ని ఎముకల శకలాలను, అప్పటికి ఇంకా తెలియని తొలి మానవుడి శిలాజ అవశేషాలుగా చూపించిన బూటక కథనం ఇది. 1953 లో ఇదంతా మోసం అని తేల్చారు. 2016 లో జరిపిన విస్తృతమైన శాస్త్రీయ సమీక్షలో, ఈ బూటక వ్యవహారానికి కారకుడు ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త చార్లెస్ డాసన్ అని తేలింది.[1]
1912 లో వాలిడికి (తోక లేని కోతి. మానవ పూర్వీకుడు), మనిషికీ మధ్య "తప్పిపోయిన లింకు"ను కనుగొన్నానని చార్లెస్ డాసన్ పేర్కొన్నాడు. 1912 ఫిబ్రవరిలో అతడు, నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని భూగర్భశాస్త్ర కీపర్ ఆర్థర్ స్మిత్ వుడ్‌వర్డ్‌ను ఈ విషయమై సంప్రదించాడు. తూర్పు సస్సెక్స్‌లోని పిల్ట్‌డౌన్ సమీపంలో ఉన్న ప్లైస్టోసీన్ కాలపు కంకర పొరలో మానవుడి పుర్రె భాగం లాంటి దాన్ని కనుగొన్నానని చెప్పాడు.[2] ఆ వేసవిలో, డాసన్, స్మిత్ వుడ్‌వర్డ్ ఈ ప్రదేశంలో మరిన్ని ఎముకలు, హస్తకృతులను కనుగొన్నారు. అవన్నీ ఒకే వ్యక్తికి చెందినవిగా వాళ్ళు భావించారు. వీటిలో దవడ ఎముక, మరిన్ని పుర్రె శకలాలు, పలువరుస, ఆదిమ కాలపు పనిముట్లూ ఉన్నాయి.
స్మిత్ వుడ్‌వర్డ్ పుర్రె శకలాలను పునర్నిర్మించాడు. అవి 5,00,000 సంవత్సరాల క్రితం నాటి మానవ పూర్వీకుడికి చెందినవని ప్రతిపాదించాడు. ఈ ఆవిష్కరణను జియోలాజికల్ సొసైటీ సమావేశంలో ప్రకటించారు. దీనికి లాటిన్ పేరు ఎయోంత్రోపస్ డాసోని ("డాసన్స్ డాన్-మ్యాన్") అని పెట్టారు. సందేహాస్పదమైన ఈ వ్యవహారమంతా, 1953 లో అది మోసం అని తేలేంత వరకు కూడా వివాదాస్పద అంశంగానే ఉంటూ వచ్చింది. దానిలో కింది దవడను మార్చారని, ఒరంగుటాన్ పళ్ళను తెచ్చి ఉద్దేశపూర్వకంగా పూర్తిగా అభివృద్ధి చెందిన ఆధునిక మానవుడి కపాలంలో పెట్టారనీ తేలింది.
పిల్ట్‌డౌన్ మోసం రెండు కారణాల వల్ల ప్రసిద్ధి చెందింది: మానవ పరిణామం అనే అంశం చుట్టూ అది కొత్తగా పోగుచేసిన శ్రద్ధాసక్తులు ఒకటి కాగా, మోసం అని తేలేవరకూ, 41 ఏళ్ళ పాటు, అది నిలిచి ఉండడం రెండోది.
కనుగోలు
[మార్చు]1912 డిసెంబరు 18 న చార్లెస్ డాసన్, జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ సమావేశంలో, అంతకు నాలుగేళ్ళ కిందట పిల్ట్‌డౌన్ లోని కంకర గొయ్యి వద్ద ఒక పనివాడు తనకు ఒక పుర్రె భాగాన్ని ఇచ్చాడని చెప్పాడు. డాసన్ ప్రకారం, అతను అక్కడికి వెళ్ళడానికి కొద్ది కాలం ముందు ఆ పనివారు పుర్రెను కనుక్కున్నారు. అదొక కొబ్బరికాయ శిలాజం అనుకుని వాళ్ళు దాన్ని పగలగొట్టారు. ఆ తరువాత డాసన్ అనేక సార్లు ఆ స్థలానికి వెళ్ళినపుడు పుర్రెకు చెందిన మరిన్ని శకలాలను కనుగొని, వాటిని బ్రిటిష్ మ్యూజియంలోని భౌగోళిక విభాగం కీపర్ ఆర్థర్ స్మిత్ వుడ్‌వర్డ్ వద్దకు తీసుకువెళ్ళాడు. వాటి పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వుడ్‌వర్డ్, డాసన్‌తో కలిసి ఆ స్థలానికి వెళ్ళాడు. 1912 జూన్, సెప్టెంబరు మధ్య ఇద్దరూ కలిసి పనిచేసినప్పటికీ, డాసన్‌కు మాత్రమే మరిన్ని పుర్రె శకలాలు, దిగువ దవడ ఎముకలో సగ భాగమూ దొరికాయి. 1908 లో వెలికితీసిన పుర్రె మాత్రమే దాని ఒరిజినల్ స్థలంలో కనుగొన్నాడు. మిగతా శకలాల్లో చాలావరకూ కంకర తవ్వేటపుడు పక్కన పడవేసిన చెత్త కుప్పలలో దొరికాయి.
ఆ శకలాలు పునర్నిర్మించినపుడు, పుర్రె ఆధునిక మానవుడితో సరిపోలినట్లు తేలిందని అదే సమావేశంలో వుడ్‌వర్డ్ చెప్పాడు. ఆక్సిపుట్ (వెన్నెముక కాలమ్‌లో కూర్చునే పుర్రె భాగం), మెదడు పరిమాణం ఇందుకు మినహాయింపు. మెదడు పరిమాణం ఆధునిక మానవుడి పరిమాణంలో మూడింట రెండు వంతులే ఉంది అని కూడా చెప్పాడు. మానవుడి లాంటి రెండు మోలార్ దంతాలు తప్పించి, దవడ ఎముక అచ్చం ఆధునిక, యువ చింపాంజీ లాగానే ఉందని కూడా అతను సూచించాడు. బ్రిటిష్ మ్యూజియం చేసిన పుర్రె పునర్నిర్మాణాన్ని బట్టి, పిల్ట్‌డౌన్ మనిషి వాలిడికి, మానవుడికీ మధ్య తప్పిపోయిన పరిణామ సంబంధాన్ని సూచిస్తోందని వుడ్‌వర్డ్ ప్రతిపాదించాడు. ఎందుకంటే మానవుడిలాంటి కపాలం, వాలిడి లాంటి దవడతో కలిసి ఉండటం వల్ల అప్పట్లో ఇంగ్లండులో ప్రాచుర్యంలో ఉన్న పరిణామ సిద్ధాంతమైన - మానవ పరిణామం మెదడుతోటే ప్రారంభమైందనే భావనకు ఇది సమర్ధనగా ఉంది.
ముందు నుండీ, వుడ్‌వర్డ్ చేసిన పిల్ట్‌డౌన్ శకలాల పునర్నిర్మాణాన్ని కొంతమంది పరిశోధకులు గట్టిగా సవాలు చేస్తూ వచ్చారు. పునర్నిర్మాణానికి బ్రిటిష్ మ్యూజియం వారు ఉపయోగించిన శకలాలనే వాడి రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ వారు పునర్నిర్మించగా, పూర్తిగా భిన్నమైన రూపం ఏర్పడింది. మెదడు పరిమాణం, ఇతర లక్షణాలకు సంబంధించి ఆ పునర్నిర్మాణం పూర్తిగా ఆధునిక మానవుడిని పోలి ఉంది. ఇది మానవ రూపాన్ని ఎక్కువగా పోలి ఉన్నందున, ప్రొఫెసర్ (తరువాత 'సర్' అయ్యాడు) ఆర్థర్ కీత్ దీనికి హోమో పిల్ట్‌డౌన్సిస్ అని పేరుపెట్టాడు.[3] దీనికి కొన్ని సంవత్సరాల ముందు హైడెల్‌బర్గ్ శిలాజాలను కనుగొన్న ఒట్టో స్కోటెన్సాక్ కూడా ఈ శకలాలు సరైనవే అని భావించాడు; ఆధునిక మానవుల పూర్వీకుడికి (వాలిడి లాంటి పూర్వీకుడికి) ఇది చక్కటి ఆధారమని ఆయన అభివర్ణించాడు.[4] ఫ్రెంచ్ జెస్యూట్ పాలియోంటాలజిస్టు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త అయిన పియరీ టెయిల్‌హార్డ్ డి చార్డిన్, వుడ్‌వర్డ్‌తో కలిసి పిల్ట్‌డౌన్ పుర్రెను వెలికి తీయడంలో పాల్గొన్నాడు.
వుడ్‌వర్డ్ చేసిన పునర్నిర్మిత పిల్ట్‌డౌన్ మనిషికి వాలిడికి ఉండే లాంటి కోర పళ్ళు ఉన్నాయి. ఇది కూడా వివాదాస్పదమైంది. 1913 ఆగస్టులో వుడ్‌వర్డ్, డాసన్, టెయిల్‌హార్డ్ డి చార్డిన్ లు ఈ పళ్ళ కోసం చెత్త కుప్పలలో ఒక క్రమపద్ధతిలో వెతకడం మొదలుపెట్టారు. టైల్హార్డ్ డి చార్డిన్ కు ఒక పన్ను దొరికింది. అది దవడలో సరిగ్గా ఇమిడి పోయిందని వుడ్‌వర్డ్ చెప్పాడు. కొన్ని రోజుల తరువాత, టెయిల్‌హార్డ్ డి చార్డిన్ ఫ్రాన్స్‌కు వెళ్లిపోయాడు. అతడు తిరిగి ఈ ఆవిష్కరణలలో పాల్గొనలేదు. ఈ పన్ను "సరిగ్గా వాలిడితో సరిపోలుతూ ఉన్నాయి" అని పేర్కొంటూ వుడ్‌వర్డ్,[5] అది తన పుర్రె పునర్నిర్మాణంపై ఉన్న వివాదాన్ని ముగిస్తుందని భావించాడు. అయితే, కీత్ దీనిపై దాడి చేశాడు. నమిలేటప్పుడు మానవుల పళ్ళు ప్రక్కలకు కదులుతూ ఉంటాయని కీత్ చెబుతూ, పిల్ట్‌డౌన్ దవడ నిర్మాణం ప్రకారం, పక్కలకు కదలడం కుదరదని, అందులో ఈ పన్ను ఉండటం అసాధ్యమనీ అతడు చెప్పాడు. మోలార్ దంతాలపై కనిపించిన అరుగుదల సాధ్యపడాలంటే, కోరపళ్ళు మోలార్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడానికి వీలే లేదు. తోటి మానవ శాస్త్రవేత్త గ్రాఫ్టన్ ఇలియట్ స్మిత్, వుడ్‌వర్డ్ ను సమర్ధించాడు. ఆ తరువాత జరిగిన రాయల్ సొసైటీ సమావేశంలో, కీత్ వ్యతిరేకతకు కారణం అతడి అసూయేనని పేర్కొన్నాడు. "మా సుదీర్ఘ కాలపు స్నేహం అలా ముగిసింది" అని కీత్ ఆ తరువాత చెప్పుకున్నాడు.[6]
1913 లోనే, లండన్ కింగ్స్ కాలేజికి చెందిన డేవిడ్ వాటర్‌స్టన్, ఈ నమూనాలో వాలిడి దవడ, మానవ పుర్రె ఉన్నాయని నేచర్ పత్రికలో రాసాడు.[7] అదేవిధంగా, ఫ్రెంచ్ పాలియోంటాలజిస్ట్ మార్సెలిన్ బౌల్ 1915 లో ఇదే నిర్ధారణకు వచ్చాడు. అమెరికన్ జువాలజిస్ట్ గెరిట్ స్మిత్ మిల్లెర్ వెలిబుచ్చిన మూడవ అభిప్రాయంలో పిల్ట్‌డౌన్ దవడ వాలిడి శిలాజానిదని తేల్చాడు. 1923 లో, ఫ్రాంజ్ వీడెన్‌రీచ్ ఈ అవశేషాలను పరిశీలించి, ఆధునిక మానవ పుర్రె, అరగదీసిన పళ్ళతో కూడిన ఒరంగుటాన్ దవడా అందులో ఉన్నాయని నిర్ధారించాడు.[8]
షెఫీల్డ్ పార్క్ కనుగోలు
[మార్చు]1915 లో, డాసన్ ఒక కొత్త స్థలంలో (పిల్ట్‌డౌన్ II) మరొక పుర్రెకు చెందిన మూడు శకలాలను కనుగొన్నట్లు చెప్పుకున్నాడు. ఈ స్థలం తొలి స్థలానికి సుమారు 2 మైళ్ళ దూరంలో ఉంది. ఈ స్థలం ఎక్కడ ఉందో చెప్పమని వుడ్‌వర్డ్ అనేక సార్లు అడిగాడు గానీ డాసన్ చెప్పలేదు. ఇప్పటివరకు ఆ స్థలం ఎక్కడ ఉందో బయట పడనే లేదు. అక్కడ కనుగొన్న వాటి వివరాలు ఎక్కడా అక్షరబద్ధం కాలేదు. 1916 ఆగస్టులో డాసన్ మరణించిన ఐదు నెలల తరువాత గానీ వుడ్‌వర్డ్ ఈ కొత్త కనుగోళ్ళను సొసైటీకి సమర్పించలేదు. అవి ఎక్కడ దొరికాయో తనకు తెలుసునన్నట్లుగా అతడు ప్రవర్తించాడు. 1921 లో, అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ప్రెసిడెంట్ హెన్రీ ఫెయిర్‌ఫీల్డ్ ఒస్బోర్న్ పిల్ట్‌డౌన్, షెఫీల్డ్ పార్క్ కనుగోళ్ళను పరిశీలించి, దవడ, పుర్రె రెండూ, "ప్రశ్నే లేదు" ఒక దానివే అని చెప్పాడు.[6]
షెఫీల్డ్ పార్కులో కనుగొన్న శకలాలను పిల్ట్‌డౌన్ మనిషి ప్రామాణికతకు రుజువుగా తీసుకున్నారు. వాలిడి దవడ, మానవ పుర్రెను కలిపడమనేది ఒకసారి జరిగే అవకాశం ఉండొచ్చు, కానీ అది రెండుసార్లు జరిగే అవకాశం బాగా తక్కువ. కీత్ కూడా, తనకు కొన్ని అనుమానాలున్నప్పటికీ, ఈ క్రొత్త సాక్ష్యాలను అంగీకరించాడు.[9]
స్మారకం
[మార్చు]1938 జూలై 23 న, పిల్ట్‌డౌన్ లోని బర్ఖామ్ మేనర్ వద్ద చార్లెస్ డాసన్ పిల్ట్‌డౌన్ మనిషిని కనుగొన్న స్థలానికి గుర్తుగా సర్ ఆర్థర్ కీత్ ఒక స్మారకాన్ని ఆవిష్కరించాడు. సర్ ఆర్థర్ తన ప్రసంగంలో ఇలా అన్నాడు:
మనిషికి తన దీర్ఘ చరిత్రపై, మన పూర్వీకులు సాగించిన చీకటి వెలుగుల ప్రస్థానంపైన, వారు అనుభవించిన కష్టసుఖాలపైనా ఆసక్తి ఉన్నంతవరకూ చార్లెస్ డాసన్ పేరు స్మరణీయం. ఈ ఆవిషకరణ జరిగిన ససెక్స్ లోని ఈ అందమైన ప్రాంతానికి అతడి పేరుతో లింకు పట్టడం మన అదృష్టం. అతడి స్మృతిలో ఈ స్మారకాన్ని ఆవిష్కరించడం నేను గౌరవంగా భావిస్తున్నాను.[10]
స్మారక శిలపై ఉన్న శాసనంలో ఇలా రాసారు:
1912–13 లో ఇక్కడ ఈ పాత నదీ గర్భంలోని కంకర రాళ్ళలో చార్లెస్ డాసన్ FSA పిల్ట్‌డౌన్ మనిషి పుర్రె శిలాజాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ గురించి చార్లెస్ డాసన్, సర్ ఆర్థర్ స్మిత్ లు "క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ జియొలాజికల్ సొసైటీ" లో వివరించారు.
బయట పడడం
[మార్చు]శాస్త్రీయ దర్యాప్తు
[మార్చు]మొదటి నుండీ కొంతమంది శాస్త్రవేత్తలు పిల్ట్‌డౌన్ వద్ద కనుగొన్న దానిపై సందేహాన్ని వ్యక్తం చేశారు. 1953 లో ఇది బూటకమని తేలడానికి ముందు దశాబ్దాలలో శాస్త్రవేత్తలు, ఇతర చోట్ల కనిపించే శిలాజాల ద్వారా తెలిసిన హోమినిడ్ పరిణామ మార్గానికి విరుద్ధంగా ఈ పిల్ట్‌డౌన్ ఉందని భావించారు.
1953 నవంబరులో టైమ్ మ్యాగజైన్, పిల్ట్‌డౌన్ మనిషి ఒక ఫోర్జరీ అని రుజువు చేసే సాక్ష్యాలను - కెన్నెత్ పేజ్ ఓక్లే, సర్ విల్ఫ్రిడ్ ఎడ్వర్డ్ లే గ్రాస్ క్లార్క్, జోసెఫ్ వీనర్ లు సేకరించిన వాటిని - ప్రచురించింది. ఆ శిలాజం మూడు విభిన్న జాతుల సమ్మేళనం అని ఆ ఆధారాలు నిరూపించాయి. ఒకటి మధ్యయుగం నాటి మానవ పుర్రె, రెండవది 500 ఏళ్ళ నాటి ఒరంగుటాన్ దిగువ దవడ, మూడవది చింపాంజీ శిలాజ దంతాలు. ఎముకలను ఇనుప ద్రావణం, క్రోమిక్ ఆమ్లాలతో కడగడం ద్వారా ఎవరో దానికి పురాతనమైనదన్నట్లుగా చిత్రీకరించారు. మైక్రోస్కోపిక్ పరీక్షలో దంతాలపై ఆకురాతి గుర్తులు బయటపడ్డాయి. దీన్ని బట్టి ఆ పళ్ళను మానవ ఆహారానికి అనుకూలంగా ఉండేలా ఎవరో మార్చారని తేల్చారు.
ఆధునిక సర్వభక్షక లక్షణాని కంటే ముందే, పెద్దదైన ఆధునిక మెదడు ఏర్పడిందని అప్పట్లో శాస్త్రవేత్తలు విశ్వసించేవారు. సరిగ్గా దీనికి అనుకూలంగానే ఈ బూటక కథనాన్ని తయారుచేసారు. దాంతో దీన్ని చాలామంది నమ్మారు. జాతీయతావాదం, సాంస్కృతిక పక్షపాతం కారణంగా కొంతమంది బ్రిటిషు శాస్త్రవేత్తలు, సరైన ఆధారాలు లేనప్పటికీ ఈ శిలాజాన్ని వాస్తవమైనదిగా అంగీకరించారని భావించారు.[7] మొట్టమొదటి మానవులు యురేషియాలో కనిపిస్తారనే యూరోపియన్ అంచనాలకు ఇది సరిపోయింది. పైగా బ్రిటిషు వారు, ఐరోపాలో దొరికిన శిలాజ హోమినిడ్లకు ఆద్యుడుగా మొదటి బ్రిటన్ ఉండాలని కోరుకున్నారు.
ఫోర్జరు గుర్తింపు
[మార్చు]పిల్ట్‌డౌన్ ఫోర్జరు గుర్తింపు ఇప్పటికీ ఖచ్చితంగా తెలియదు. కాని అనుమానితులలో డాసన్, పియరీ టెయిల్‌హార్డ్ డి చార్డిన్, ఆర్థర్ కీత్, మార్టిన్ ఎసి హింటన్, హోరేస్ డి వెరే కోల్, ఆర్థర్ కోనన్ డోయల్ లు ఉన్నారు.
పిల్ట్‌డౌన్ ఆవిష్కరణకు ముందు ఒకటి రెండు దశాబ్దాల్లో చార్లెస్ డాసన్ చేసిన ఇతర పురావస్తు మోసాలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడంతో అతడే ముఖ్య మోసకారి అనే వాదనకు మద్దతు లభించింది. బౌర్న్‌మౌత్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త మైల్స్ రస్సెల్, డాసన్ చేసిన పురాతన సేకరణలను విశ్లేషించాడు. ఆ సేకరణల్లో కనీసం 38 సేకరణలు నకిలీలని అతడు నిర్ధారించాడు.[11][12] వీటిలో, 1891 లో "కనుగొన్న" సరీసృపాలు / క్షీరద హైబ్రిడ్, ప్లాగియులాక్స్ డాసోని, (20 ఏళ్ళ తరువాత పిల్ట్‌డౌన్ మనిషి దంతాలను అరగదీసినట్లు గానే, వీటినీ అరగదీసాడు); హేస్టింగ్స్ కాజిల్ గోడలపై "నీడ బొమ్మలు" అని చెప్పినవి; ఒక ప్రత్యేకమైన రాతి గొడ్డలి; బెక్స్‌హిల్ పడవ (హైబ్రిడ్ సముద్రయానపు పడవ); పెవెన్సీ ఇటుకలు; లావాంట్ గుహలలోని విషయాలు (మోసపూరిత "ఫ్లింట్ గని"); బ్యూపోర్ట్ పార్క్ "రోమన్" విగ్రహం (హైబ్రిడ్ ఇనుప వస్తువు); బుల్వర్‌హైత్ హామర్; మోసపూరిత "చైనీస్" కంచు పాత్ర; బ్రైటన్ "టోడ్ ఇన్ ది హోల్"; ఇంగ్లీష్ ఛానల్ సముద్ర పాము; ఉక్ఫీల్డ్ హార్స్‌షూ (మరొక హైబ్రిడ్ ఇనుప వస్తువు), లూయిస్ ప్రిక్ స్పర్. డాసన్ పురాతత్వ రచనల్లో కాపీలు కాకపోయినా కనీసం చవకబారు ప్రస్తావనలు కనిపిస్తాయి. రస్సెల్ ఇలా రాసాడు: "పిల్ట్‌డౌన్ ఏదో ఒకానొక మోసం కాదు, ఒక జీవిత కాలం పాటు చేసిన పనులకు అది పరాకాష్ట." [13] ఇది కాక, డాసన్ పరిచయస్తుడైన హ్యారీ మోరిస్, పిల్ట్‌డౌన్ కంకర గొయ్యి వద్ద డాసన్‌కు దొరికిన ఫ్లింట్లలో ఒకటి సంపాదించాడు..దాని వయసును కృత్రిమ పద్ధతిలలో పెంచాడని అతను అనుమానించాడు - "మోసం చేసే ఉద్దేశ్యంతో సి. డాసన్ దాని రూపు మార్చాడు". అతను డాసన్‌ను తీవ్రంగా అనుమానిస్తూనే ఉన్నాడు. అయితే తన అనుమానాలను బయట పెట్టలేదు. బహుశా మోరిస్ గట్టిగా నమ్మిన ఎయోలిత్ సిద్ధాంతానికి అది వ్యతిరేక మౌతుందని అతడు భావించి ఉండవచ్చు.[14]
అసలు మోసాలను బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో, మరొక "మోసగాడు" మరీ కొట్టొచ్చినట్టు కనిపించే మోసాలను కల్పించి ఉండొచ్చని 'కొంతమంది సూచించార'ని UK నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రొఫెసరు అడ్రియన్ లిస్టర్ చెప్పాడు. ఇది మైల్స్ రస్సెల్ ప్రతిపాదించిన సిద్ధాంతమే.[15] 'క్రికెట్ బ్యాట్' (ఏనుగు ఎముక శిలాజం) అనే పేరు పెట్టిన మోసం అటువంటిదే. ఇతర అన్వేషణలపై సందేహాన్ని కలిగించడానికి నాటిన మోసమే ఇది కావచ్చు. డాసన్ కార్యకలాపాలను బయట పెట్టడానికి సస్సెక్స్ పురావస్తు సమాజంలోని అసంతృప్త సభ్యులు చేసిన ప్రయత్నంలో ఇది భాగమని తెలుస్తోంది. ఏదేమైనా, 'క్రికెట్ బ్యాట్' ను ఆ సమయంలో అంగీకరించారు. ఇది కొంతమందిలో అనుమానాలను రేకెత్తించినప్పటికీ, అసలు మోసాన్ని బయట పెట్టడానికి దారితీసింది.
2016 లో ఈ మోసంపై చేసిన ఎనిమిదేళ్ళ సమీక్ష [1] ఫలితాలు [16][1] విడుదలయ్యాయి. ఈ సమీక్షలో డాసన్ మోడస్ ఆపరాండీని గుర్తించారు. అనేక నమూనాలపై ఒకే రకమైన పద్ధతిని ప్రయోగించాడు: రంగులు పూయడం, కంకరతో పగుళ్లను పూడ్చడం, దంతవైద్యుల పుట్టీతో పళ్ళను మార్చడం. ఆకారాన్ని, ట్రేస్ DNA నూ విశ్లేషించగా, రెండు సైట్ల లోని దంతాలు కూడా ఒకే ఒరంగుటాన్‌కు చెందినవని తేలింది. ఒకే రకమైన పద్ధతులను అనుసరించడం, ఒకే మూలం ఉండటాన్ని బట్టి అన్ని నమూనాల పైనా ఒకే వ్యక్తి పని చేసాడని తెలుస్తోంది. పిల్ట్‌డౌన్ 2 తో సంబంధం ఉన్న వ్యక్తి డాసన్ ఒక్కడే. డాసన్‌కు ఈ శిలాజాలను వేరొకరు అందించి ఉండొచ్చనే అవకాశాన్ని రచయితలు తోసిపుచ్చలేదు. అయితే టెయిల్‌హార్డ్ డి చార్డిన్, డోయల్ లతో సహా అనేక ఇతర అనుమానితులు ఈ మోసంలో పాలుపంచుకోలేదని వారు తేల్చారు.
పిల్ట్‌డౌన్ మోసంలో పియరీ టెయిల్‌హార్డ్ డి చార్డిన్ ప్రధాన అపరాధి అని స్టీఫెన్ జే గౌల్డ్ చెప్పాడు. టెయిల్‌హార్డ్ డి చార్డిన్ వెళ్ళిన ఆఫ్రికాలోని ప్రాంతాల్లో ఒక క్రమరహిత అన్వేషణ పుట్టుకొచ్చింది. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో హింటన్ ఒక ట్రంకు పెట్టెను పెట్టాడు. 1970 లో చూసినపుడు, అందులో పిల్ట్‌డౌన్‌లో చేసినట్టుగా అరగదీసిన పళ్ళు, రంగూ రూపూ మార్చిన జంతువుల ఎముకలూ కనిపించాయి. ఆర్థర్ కీత్ చేసిన ప్రకటనలు, అతడి చర్యలలో అసంగతాలను పరిశీలించడం ద్వారా డాసన్కు ఆర్థర్ కీత్ సాయపడ్డాడని ఫిలిప్ టోబియాస్ చెప్పాడు. మోసం చేసింది ఒక్కరు కాదనీ, కొంతమంది సహచరులు ఇందులో ఉన్నారనీ ఇతర పరిశోధనలు సూచించాయి.[17]
వారసత్వం
[మార్చు]తొలి మానవులు
[మార్చు]1912 లో, శాస్త్రీయ సమాజంలో చాలా మంది, పిల్ట్‌డౌన్ మనిషి వాలిడులకు మానవులకూ మధ్య “తప్పిపోయిన లింకు” అని నమ్మారు. అయితే, కాలక్రమేణా టాంగ్ చైల్డ్, పెకింగ్ మ్యాన్ వంటి ఇతర ఆవిష్కరణలు వెలువడడంతో పిల్ట్‌డౌన్ మనిషి చెల్లుబాటు కోల్పోయింది. ఆర్‌డబ్ల్యు ఎహ్రిచ్, జిఎమ్ హెండర్సన్ “వారి పూర్వీకుల పని పట్ల ఇంకా భ్రమలు తొలగని వారికి పిల్ట్‌డౌన్ పుర్రె అనర్హత, విస్తృత పరిణామ క్రమంలో పెద్దగా మార్పేమీ తీసుకురాదు. ఈ నమూనా ప్రామాణికత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమే” అని అన్నారు.[18] చివరికి, 1940, 1950 లలో ఫ్లోరిన్ శోషణ పరీక్ష వంటి ఆధునిక డేటింగ్ సాంకేతికతలు, ఈ పుర్రె వాస్తవానికి ఒక మోసం అని శాస్త్రీయంగా నిరూపించాయి.
ప్రభావం
[మార్చు]పిల్ట్‌డౌన్ మనిషి మోసం మానవ పరిణామంపై చేసిన తొలి పరిశోధనలను గణనీయంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా, కొత్త రకాల ఆహారానికి అనుగుణంగా దవడ పరిణామం చెందడానికి ముందే, మెదడు పరిమాణం పెరిగిందనే నమ్మకం వైపు శాస్త్రవేత్తలను గుడ్డిగా నడిపించింది. 1920 లలో దక్షిణాఫ్రికాలో రేమండ్ డార్ట్ కనుగొన్న టాంగ్ చైల్డ్ వంటి ఆస్ట్రాలోపిథెసిన్ శిలాజాల ఆవిష్కరణలు, పిల్ట్‌డౌన్ మనిషి "తప్పిపోయిన లింకు" కారణంగా గుర్తింపుకు నోచుకోలేదు. దీని వలన మానవ పరిణామ పరిశోధన దశాబ్దాల పాటు గందరగోళంలో పడిపోయింది. పిల్ట్‌డౌన్ మనిషిపై పరీక్షలకు, చర్చకూ ఎంతో సమయం, శ్రమా ఖర్చయ్యాయి. 250 కి పైగా పత్రాలు ఈ అంశంపై వెలువడ్డాయి [19]
1925 నాటి స్కోప్స్ మంకీ విచారణలో జాన్ స్కోప్స్ కు మద్దతుగా క్లారెన్స్ డారో ఈ శిలాజాన్ని సాక్ష్యంగా చూపించాడు. పిల్ట్‌డౌన్ మనిషి మోసమని తేలడానికి పదిహేనేళ్ల ముందు, 1938 లో, డారో మరణించాడు.[20]
పిల్ట్‌డౌన్ మోసాన్ని బయటపెట్టింది స్వయానా శాస్త్రవేత్తలే. అయినప్పటికీ, సృష్టివాదులు ఈ మోసాన్నే ఉదహరిస్తూ (దీంతో పాటు నెబ్రాస్కా మనిషి ఉదంతాన్ని కూడా ఉదహరిస్తూంటారు) మానవ పరిణామాన్ని అధ్యయనం చేసే పాలియోంటాలజిస్టులకు నిజాయితీ లేదని తరచూ అంటూ ఉంటారు. (అయితే నెబ్రాస్కా మనిషి ఉదంతం కావాలని చేసిన మోసం కాదు.) [21][22]
ఈ మోసం బయటపడిన 50 వ వార్షికోత్సవం సందర్భంగా, 2003 నవంబరులో, లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం ఒక ప్రదర్శనను నిర్వహించింది.[23]
20 వ శతాబ్దం ప్రారంభంలో సైన్స్
[మార్చు]20 వ శతాబ్ది తొలిభాగంలో జాతి, జాతీయతావాదం ఈ రెండూ విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా రూపు దిద్దాయో చెప్పేందుకు పిల్ట్‌డౌన్ కేసు ఒక ఉదాహరణ. ఈ ఆవిష్కరణపై వచ్చిన భిన్నమైన వ్యాఖ్యానాలలో జాతీయత ప్రభావం స్పష్టంగా ఉంది: బ్రిటీష్ శాస్త్రవేత్తలలో ఎక్కువమంది ఈ ఆవిష్కరణను "తొలి ఆంగ్లేయుడు" గా అంగీకరించగా,[24] ఇతర యూరోపియన్, అమెరికన్ శాస్త్రవేత్తలు దాన్ని గట్టిగా సందేహించారు. పుర్రె, దవడ రెండు వేర్వేరు జీవుల నుండి వచ్చినవనీ, అనుకోకుండా అవి కలిసాయనీ చాలామంది సూచించారు. పిల్ట్‌డౌన్ మనిషి మగవాడని భావించారు. వుడ్‌వర్డ్ మాత్రం అది స్త్రీ కావచ్చునని సూచించాడు. దీనికి మినహాయింపు డైలీ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక; అది మాత్రం ఈ శిలాజం ఒక మహిళదిగా పేర్కొంది.
కాలక్రమం
[మార్చు]- 1908: మొదటి పిల్ట్‌డౌన్ శకలాలు కనుగొన్నట్లు డాసన్ పేర్కొన్నాడు.
- 1912 ఫిబ్రవరి: మొదటి పుర్రె శకలాలు గురించి డాసన్ వుడ్‌వర్డ్‌ను సంప్రదించాడు.
- 1912 జూన్: డాసన్, వుడ్‌వర్డ్, టెయిల్‌హార్డ్ డి చార్డిన్ త్రవ్వకాల బృందాన్ని ఏర్పాటు చేశారు.
- 1912 జూన్: బృందం ఏనుగు మోలార్, పుర్రె భాగాన్ని కనుగొంది.
- 1912 జూన్: కుడి ప్యారిటల్ పుర్రె ఎముకలు, దవడ ఎముకలను కనుగొన్నారు.
- 1912 నవంబర్: పాపులర్ ప్రెస్‌లో వార్తలు విరిగిపోయాయి.
- 1912 డిసెంబర్: పిల్ట్‌డౌన్ మనిషి అధికారిక ప్రదర్శన.
- 1913: డేవిడ్ వాటర్‌స్టన్ ఈ నమూనా ఒక వాలిడి కింది దవడ, మానవ పుర్రె అని తేల్చారు.
- 1914: తల్గై స్కల్ (ఆస్ట్రేలియా) పిల్ట్‌డౌన్‌ను నిర్ధారించడానికి ఆ సమయంలో పరిగణించబడింది.
- 1915: మార్సెలిన్ బౌల్ ఈ నమూనా ఒక వాలిడి కింది దవడ, మానవ పుర్రె అని తేల్చారు. గెరిట్ స్మిత్ మిల్లెర్ దవడ ఒక శిలాజ వాలిడి నుండి వచ్చినదని నిర్ధారించాడు.
- 1923: ఈ అవశేషాల్లో ఆధునిక మానవ కపాలం, అరగదీసిన పళ్ళతో ఉన్న ఒరంగుటాన్ దవడలూ ఉన్నాయని ఫ్రాంజ్ వీడెన్‌రిచ్ చెప్పాడు.
- 1925: ఎడ్మండ్స్, పిల్ట్‌డౌన్ జియాలజీలోని లోపాన్ని వివరించాడు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు.
- 1943: ఫ్లోరిన్ కంటెంట్ పరీక్ష చెయ్యాలని మొదటిసారిగా ప్రతిపాదించారు.
- 1948: వుడ్‌వర్డ్ రాసిన తొలి ఆంగ్లేయుడు ను ప్రచురించారు. (మరణానంతరం).
- 1949: ఫ్లోరిన్ కంటెంట్ టెస్ట్ పిల్ట్‌డౌన్ మనిషి ఇటీవలి కాలం నాటిదేనని నిరూపించింది.
- 1953: వీనర్, లే గ్రాస్ క్లార్క్, ఓక్లే లు ఈ బూటకాన్ని బయట పెట్టారు.
- 2003: చార్లెస్ డాసన్ బూటకాల చరిత్ర పూర్తి స్వభావం బహిర్గతమైంది.
- 2016: అధ్యయనం డాసన్ చేసిన ఫోర్జరీ పద్ధతిని వెల్లడించింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 Webb, Jonathan (10 August 2016). "Piltdown review points decisive finger at forger Dawson". BBC. Archived from the original on 23 July 2018. Retrieved 19 November 2018.
- ↑ Spencer, Frank (1990). The Piltdown papers, 1908–1955: the correspondence and other documents relating to the Piltdown forgery. Natural History Museum Publications. ISBN 978-0-19-858523-7.
- ↑ Keith, A (1914). "The Significance of the Skull at Piltdown". Bedrock. 2: 435–53.
- ↑ Russell, Miles. 2012. The Piltdown Man Hoax: Case Closed. History press. p. 81
- ↑ Woodward, A. Smith (1913). "Note on the Piltdown Man (Eoanthropus Dawsoni)". The Geological Magazine. 10 (10): 433–34. Bibcode:1913GeoM...10..433W. doi:10.1017/S0016756800127426. Archived from the original on 13 August 2012. Retrieved 31 May 2012.
- ↑ 6.0 6.1 Walsh, John E. (1996). Unraveling Piltdown: The Science Fraud of the Century and its Solution. Random House. ISBN 978-0-679-44444-2.
- ↑ 7.0 7.1 Gould, Stephen J. (1980). The Panda's Thumb. W. W. Norton. pp. 108–24. ISBN 978-0-393-01380-1.
- ↑ MacRitchie, Finlay (2011). Scientific Research as a Career. CRC Press. p. 30. ISBN 978-1-4398-6965-9.
- ↑ Craddock, Paul (2012). Scientific Investigation of Copies, Fakes and Forgeries. CRC Press. ISBN 978-1-136-43601-7.
- ↑ The Piltdown Man Discovery Archived 12 సెప్టెంబరు 2006 at the Wayback Machine, Nature, July 30, 1938
- ↑ Russell, Miles (2003). Piltdown Man: The Secret Life of Charles Dawson. Stroud: Tempus.
- ↑ Russell, Miles (2012). The Piltdown Man Hoax: Case Closed. Stroud: The History Press.
- ↑ Russell, Miles (23 November 2003). "Charles Dawson: 'The Piltdown faker'". BBC News. Archived from the original on 23 February 2011. Retrieved 16 December 2010.
- ↑ Weiner, The Piltdown Forgery, pp. 140–45.
- ↑ Russell, Miles (2012). The Piltdown Man Hoax: Case Closed. Stroud: The History Press. pp. 140–41.
- ↑ De Groote, Isabelle; Flink, Linus Girdland; Abbas, Rizwaan; Bello, Silvia M.; Burgia, Lucia; Buck, Laura Tabitha; Dean, Christopher; Freyne, Alison; Higham, Thomas (10 August 2016). "New genetic and morphological evidence suggests that a single hoaxer created 'Piltdown man'". Royal Society Open Science. 3 (160328): 160328. doi:10.1098/rsos.160328. PMC 5108962. PMID 27853612.
- ↑ Weiner, J. S. (29 January 2004). The Piltdown Forgery. Oxford University Press. pp. 190–97. ISBN 978-0-19-860780-9.
- ↑ "Culture area", in International Encyclopedia of the Social Sciences, vol. 3, pp. 563–68. (New York: Macmillan/The Free Press).
- ↑ Washburn, S.L. (1953). "The Piltdown Hoax". American Anthropologist. 55 (5): 759–62. doi:10.1525/aa.1953.55.5.02a00340 – via Wiley Online Library.[permanent dead link]
- ↑ "Clarence Darrow Is Dead in Chicago". The New York Times. March 14, 1938. Archived from the original on 5 జూలై 2018. Retrieved July 4, 2018.
- ↑ "Creationist Arguments: Piltdown Man". Retrieved 29 August 2007.
- ↑ "Piltdown Hoax". Retrieved 29 August 2007.
- ↑ "The Natural History Museum Annual Review 2003/2004". Archived from the original on 4 సెప్టెంబరు 2009. Retrieved 12 నవంబరు 2019.
- ↑ Woodward, A. Smith (1948). The Earliest Englishman. Thinker's Library. Vol. 127. Watts & Co. Archived from the original on 21 మే 2012. Retrieved 31 మే 2012.