పుణ్యకవ్రతము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

పుణ్యకవ్రతము- విశిష్టత

[మార్చు]

నదులలో గంగ, దేవుళ్లలో శివుడు, దేవతా స్త్రీలలో పార్వతి, వర్ణాలలో బ్రాహ్మణులు, పుణ్య క్షేత్రాలలో పుష్కర క్షేత్రము, పుష్పాలలో పారిజాత పుష్పము, పత్రములలో తులసి, తిధులలో ఏకాదశి, వారములలో ఆదివారము, మాసములలో మార్గశిర మాసము, ఋతువులలో గ్రీష్మ ఋతువు, యుగములలో కృత యుగము, పూజింపదగిన వారిలో గురువు, పూజ్యులైన వారిలో తల్లి, ఆప్తులలో భార్య , విలువైన వస్తువులలో రత్నము, ప్రియులలో భర్త, బంధువులలో పుత్రుడు, వృక్షములలో కల్ప వృక్షము, పండ్లలో మామిడి పండు, తోటలలో బృందావనము, స్త్రీలలో శతరూపాదేవి, పట్టణాలలో కాశీ, తేజస్సులో సూర్యుడు, కీర్తినిచ్చేవాటిలో కవిత, సుందరులలో మన్మథుడు, శాస్త్రాలలో వేదాలు, అవయవాలలో నేత్రము, స్పర్శలలో పుత్రుని స్పర్శ, హింసించు వారిలో దుష్టుడు, తపస్సు చేసుకొనేవారిలో బ్రహ్మ, ఆవుపాల నుండి ఏర్పడిన వస్తువులలో నెయ్యి, పరిశుద్ధులలో అగ్ని, వస్తువులలో బంగారము, దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, కవులలో శుకుడు, కావ్యములలో పురాణాలు, క్షమాగుణంలో భూమి, లాభంలో ముక్తి, సంపదలో శ్రీహరి భక్తి, పవిత్రులలో వైష్ణవులు, అక్షరములలో ఓం కారము, మంత్రాలలో విష్ణుమంత్రము, బీజాలలో ప్రకృతి, విద్వాంసులలో సరస్వతి, చంధస్సులో గాయత్రి, యక్షులలో కుబేరుడు, సర్పములలో వాసుకి, వేదాలలో సామవేదము, గరికలో దర్భ, సుఖంలో లక్ష్మీదేవి, శీఘ్ర గమనములో మనస్సు, అక్షరాలలో అ కారము, మేలు కోరువారిలో తండ్రి, భగవంతుని మూర్తులలో సాలిగ్రామము, పశువులలో విష్ణుపంజరము, చతుష్పాద జంతువులలో సింహము, ప్రాణులలో మానవుడు, మానవులలో రాముడు, శక్తి కలవారిలో మహాదేవుడు, స్థూల పదార్థాలలో పరమాణువు, ఆదిత్యులలో ఇంద్రుడు, దైత్యులలో బలిచక్రవర్తి, దాతలలో ధధీచీ మహర్షి, సాధు పురుషులలో ప్రహ్లాదుడు, అస్త్రములలో బ్రహ్మాస్త్రము, చక్రాలలో సుదర్శన చక్రము ఎంత శ్రేష్ఠమో వ్రతాలలో ఈ పుణ్యక వ్రతము అంత శ్రేష్ఠము.

శ్రీ హరి మంత్రమును జపించుచు శ్రీహరిసేవ చేయు భక్తుని జన్మ సఫలమగును. ముందున్న కోటి తరములవారు ఉద్ధరించబడి వైకుంఠమునకు చేరుకొందురు.

పుణ్యకవ్రత విధానము

[మార్చు]

పుణ్యకవ్రతము యొక్క విశేషాన్ని విన్న పార్వతీదేవి భర్తతో ఆ వ్రత విధానాన్ని చెప్ప మంటుంది.

ఈ వ్రతానికి నూరు మంది బ్రాహ్మణులు అవసరము అని పరమశివుడు వ్రత విధి విధానాల గురించి చెప్పడం మొదలు పెట్టాడు. వేదవేదాంగాలు ఎరిగిన బ్రహ్మ కుమారుడైన సనత్కుమారుడిని పురోహితునిగా చేసుకొమ్మని చెప్పి, వ్రతానికి అవసరమైన సంభారాలుగా పరిశుద్ధమైన ఫలములు, పుష్పములు, నూరుగురు సేవకులు, కోటిమంది దాసీజనము మున్నగుననవి అవసరము అని చెబుతాడు.

వ్రతాన్ని ప్రారంభించడానికి మాఘ మాసము త్రయోదశి రోజు అత్యుత్తమ తిథి. ఆ రోజుకు ముందు రోజు ఉపవాసము చేసుకొని వస్త్రములను మంచిగా ఉతికి ఆరవేసుకోవాలి. త్రయోదశి రోజు వేకువ జామునే శయ్య నుండి లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని, నిర్మలమైన నీటి యందు స్నానము చేసి, ఉతికిన బట్టలు కట్టుకొని, షోడశోపచారములతో శ్రీకృష్ణునికి పూజ చెయ్యవలెను. సంవత్సర కాలము ఈ విధంగా చెయ్యవలెను. ఆరు నెలలు హవిస్సాన్నము తిని, మిగిలిన ఆరు నెలలలో ఐదు నెలలు ఏకభుక్తముగా ఉండవలెనని పరమశివుడు చెబుతాడు.

అంగాంగ సౌష్ఠవానికి శ్రీకృష్ణుని ఆరాధించే విధానము

[మార్చు]

శ్రీకృష్ణుడిని పూజించేవిధానాన్ని పరమశివుడు ఈవిధంగా చెబుతాడు.

అందమైన రూపానికి 108 పారిజాత పుష్పాలతో, మంచి వర్ణానికి తెల్లని చంపకపుష్పములతో, ముఖ సౌందర్యానికి సహస్రదళములు కల లక్ష పద్మాలతో, కండ్లకు శోభ కలుగుటకు వేలకొలది అద్దములతో, కళ్ళ సౌందర్యం కోసం లక్షనీలోత్పములతో, వెంట్రుకలకు లక్ష తెల్లని చామరములతో, ముక్కు శోభ కోసం ఆమూల్య రత్నములచే నిర్మించిన లక్ష పద్మములతో, అందమైన బింబోష్ఠములకు లక్ష దిరిసెన పువ్వులతో, ముత్యాల వంటి పలువరుస కోసం లక్ష ముత్యాలతో, చెక్కిళ్ళకు రత్నగండూషములతో, పెదవుల క్రిందిభాగమునకు రత్నపాశములతో, చెవులకు రత్నములచేత చేయబడిన కర్ణభూషణములతో, చక్కని గొంతు కొరకు రత్నపాత్రలతో శ్రీకృష్ణుని పూజించాలని పరమశివుడు చెబుతాడు.

పుణ్యకవ్రత కథ

[మార్చు]

పార్వతి శివుని పుణ్యకవ్రతకథ గురించి చెప్పుమనగా శివుడు బ్రహ్మకు, శతరూపాదేవికి జరిగిన సంవాదం గురించి చెబుతాడు. మనువుకి భార్య అయిన శతరూపాదేవి సంతానము లేక బ్రహ్మ వద్దకు వెళ్ళి తాను గొడ్రాలిని అని మొరపెట్టుకొనగా బ్రహ్మ పుణ్యక వ్రతము గురించి చెప్పి ఆ వ్రత ప్రభావమున ఇదివరకు ఎటువంటి సంతానము కలిగినదో చెప్పనారంభిస్తాడు.