Jump to content

పురాణవైర గ్రంథమాల

వికీపీడియా నుండి

జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన 12 నవలల మాలిక పురాణవైర గ్రంథమాల.

రచనా నేపథ్యం

[మార్చు]

భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరువాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది.[1]
పురాణాల చారిత్రికతను తిరస్కరించే ధోరణిని విశ్వనాథ సత్యనారాయణ పురాణవైరమన్నారు. చారిత్రికాంశాలను పురాణాల నుంచి స్వీకరించి ఆయన పురాణవైర గ్రంథమాల రచించారు. ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి పురాణవైరము అని శీర్షిక ఏర్పరుపబడినది. అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.[2]

చారిత్రికాంశాలు

[మార్చు]

కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం
సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం అని అర్థం. ఇందులోని వంశాల చరిత్ర అనేదే భారతీయ చరిత్రకు ప్రధానాధారంగా స్వీకరించాలని అలా తీసుకోకపోవడం వల్లనే భారతీయ చరిత్ర తప్పుగా రాయబడిందని విశ్వనాథ వాదం. పురాణాల్లోని కలిరాజవంశం, కల్హణ పండితుని కాశ్మీర రాజతరంగిణి, మగధ రాజవంశచరిత్ర, నేపాళ రాజవంశచరిత్ర వంటివి సమన్వయం చేస్తే భారత చరిత్ర సమగ్రమవుతుందని ఆయన పేర్కొన్నారు. టి.ఎస్.నారాయణశాస్త్రి చేసిన ఆదిశంకరాచార్య కాలనిర్ణయం, నడింపల్లి జగన్నాధరావు రాసిన మహాభారత యుద్ధ కాలనిర్ణయం ఈ నవలల్లోని చారిత్రికతకు ఆధారాలని ఆయన వివరించారు. పలు అంశాలు భారతచరిత్ర భాస్కర బిరుదాంకితులు కోట వెంకటాచలము గ్రంథాల నుంచి స్వీకరించారు.

నవలల జాబితా

[మార్చు]

ఈ నవలామాలికలోని నవలలు మొత్తం 12. ఆ నవలలు ఇవి:

  1. భగవంతుని మీది పగ
  2. నాస్తికధూమము
  3. ధూమరేఖ
  4. నందోరాజా భవిష్యతి
  5. చంద్రగుప్తుని స్వప్నము
  6. అశ్వమేధము
  7. అమృతవల్లి
  8. పులిమ్రుగ్గు
  9. నాగసేనుడు
  10. హెలీనా
  11. వేదవతి
  12. నివేదిత

ఇతివృత్తాలు

[మార్చు]

పురాణవైర గ్రంథమాలలోని నవలల ఇతివృత్తం గురించి వివరిస్తూ పదునారింటను(మొదట పదహారు నవలలుగా ప్రణాళిక వేశారు విశ్వనాథ) కలిసి ఒకటే కథ యుండదు. ఒకదానితో నొకడానికి సంబంధముండదు. కొన్నింటియందు సంబంధమున్నా అది ప్రధానము కాదు అని పేర్కొన్నారు. ఈ గ్రంథాలకు ఉన్న సంబంధాన్ని గురించి చెప్తూ మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవకతవకలు కాదని నిరూపించడమే ఈ నవలల లక్ష్యమని అందుకే దీనికి పురాణవైరమనే శీర్షిక ఏర్పరచబడిందని పేర్కొన్నారు.

ప్రాచుర్యం

[మార్చు]

విమర్శనలు

[మార్చు]

పురాణవైర గ్రంథమాల నవలల గురించి సాహిత్యవిమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తీకరించారు. ఎవరు ఎవరికి శత్రువులు? ఎవరు ఎవరికి మిత్రులు? – వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ సులభంగా సమాధానం చెప్పలేని విధంగా పాత్రలనీ, సంఘటనలనీ, సన్నివేశాలనీ, సంభాషణలనీ సృష్టించి, నడిపించిన రచయిత మాయలో నిజంగా వూపిరయినా తీసుకోకుండా కొట్టుకుపోతాం. అని ప్రశంసించారు గ్రంథమాలను పాఠకులకు పరిచయం చేస్తూ ప్రముఖ రచయిత్రి టి.శ్రీవల్లీ రాధిక. ఆమె పురాణవైర గ్రంథమాలను పాఠకులకు పరిచయం చేస్తూ గ్రంథాన్ని రాశారు.[3] కమ్యూనిస్టు ఉద్యమంలో పాలుపంచుకున్న వ్యక్తి, విపుల, చతురల సంపాదకుడు చలసాని ప్రసాదరావు ఈ నవలల్ని తీవ్రంగా ఆక్షేపించారు.[4]. ఈ రెండు అభిప్రాయాలకు మధ్యేమార్గంగా ప్రముఖ చారిత్రిక నవలారచయిత నోరి నరసింహశాస్త్రి ఈ నవలల్లోని కల్పనను, విశ్వనాథ కనబరిచిన ప్రతిభను ప్రశంసిస్తూనే నవలల్లో చెప్పిన చారిత్రికాంశాలను మాత్రం అంగీకరించలేకున్నట్టు పేర్కొన్నారు. ఏమైనా పురాణవైరి గ్రంథమాలలోని శ్రీ విశ్వనాథ నవలలు చారిత్రక నవలా రచయితలకు, విమర్శకులకు ఒక సవాలువంటివని మాత్రము అంగీకరించక తప్పదు! అని తేల్చారు.[5] ఈ గ్రంథమాల గురించి ముగ్గురు విమర్శకులను పేర్కొన్నా ఆ మూడు విధాలైన అభిప్రాయాల విభాగాల్లో ఎందరో విమర్శకులు వున్నారని గుర్తించాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. [https://web.archive.org/web/20130327072556/http://www.eemaata.com/em/issues/201301/2040.html?allinonepage=1 Archived 2013-03-27 at the Wayback Machine భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపోద్ఘాతం,రచన:[[వేల్చేరు నారాయణరావు]], [[డేవిడ్ షుల్మన్]], అనువాదం:పప్పు నాగరాజు(ఆంగ్లమూలం: texures of time, foreword)]]
  2. భగవంతుని మీది పగ నవలకు విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఉపోద్ఘాతము
  3. విశ్వనాథ నవలా సాహిత్య పరిచయం (పురాణవైర గ్రంథమాల - 1):టి.శ్రీవల్లీరాధిక: ప్రమథ సంస్థ ప్రచురణ
  4. చలసాని ప్రసాదరావు ఇలా మిగిలేం పుస్తకం లో కవిసామ్రాట్టు...! వ్యాసం(గ్రంథ ప్రచురణ 1993, వ్యాసరచన 1971)
  5. "సారస్వత వ్యాసములు, ఐదవ సంపుటము, కవి సమ్రాట్ శ్రీ నోరి నరసింహ శాస్త్రిగారి వ్యాసములు గ్రంథం(1979:ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ ప్రచురణ)లో ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల వ్యాసం". Archived from the original on 2012-08-30. Retrieved 2014-01-30.