Jump to content

పురాతన మానవులు

వికీపీడియా నుండి
హోమో రొడీసియెన్సిస్ ("బ్రోకెన్ హిల్ క్రేనియం"): 1,30,000 సంవత్సరాల క్రితం (అమైనో యాసిడ్ రేస్‌మైజేషన్ నిర్ణయాన్ని ఉపయోగించి) లేదా 6,00,000 నుండి 8,00,000 సంవత్సరాల క్రితం ( హోమో ఎరెక్టస్ జీవించిన కాలం లోనే ). ఏ డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది.

3,15,000 సంవత్సరాలకు ముందు, ఆధునిక మానవుల కంటే ముందు ఉద్భవించిన హోమో రకాలన్నిటినీ కలిపి పురాతన మానవులని అంటారు. హోమో నియాండర్తాలెన్సిస్ (4,30,000 + –25,000 సం.),[1] డెనిసోవాన్స్, హోమో రొడేసియెన్సిస్ (3,00,000–1,25,0000 సం.), హోమో హైడెల్‌బెర్గెన్సిస్ (6,00,000-2,00,000 సం.), హోమో యాంటెసెస్సర్ లను సాధారణంగా పురాతన మానవులని భావిస్తారు.

ఈ పరిభాషపై సార్వత్రిక ఏకాభిప్రాయం లేదు. "పురాతన మానవుల" రకాలను కొంతమంది రచయితలు హోమో సేపియన్స్ లేదా హోమో ఎరెక్టస్ అనే పేరు కింద చేర్చారు.

పురాతన మానవుల మెదడు పరిమాణం సగటున 1,200 నుండి 1,400 క్యూబిక్ సెంటీమీటర్ల వరకూ ఉంటుంది. ఇది ఆధునిక మానవుల మెదడు పరిమాణంతో అటూ ఇటూగా సరిపోలుతుంది. మందపాటి పుర్రె, ఎత్తైన కనుబొమల గట్లూ ఉండడం, స్ఫుటమైన చుబుకం లేకపోవడం వంటి లక్షణాల కారణంగా పురాతన మానవులు ఆధునిక మానవుల కంటే విభిన్నంగా ఉంటారు.[2][3]

ఆధునిక మానవులు 3,00,000-2,70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో తొలుత ఉద్భవించారు. 70,000 సంవత్సరాల క్రితం (టోబా విపత్తు సిద్ధాంతం చూడండి) క్రమంగా "పురాతన" మానవుల స్థానాన్ని ఆక్రమించారు. ఆధునికేతర హోమో రకాలు 30,000 సంవత్సరాల క్రితం వరకు ఉండేవారనేది ఖాయం. బహుశా 12,000 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉండి ఉండవచ్చు. ఈ రకాల మానవుల్లో ఎవర్ని పురాతన మానవులుగా భావించాలి, అసలు ఎవర్నైనా భావించాలా లేదా అనేది వివిధ రచయితలు దాన్ని నిర్వచించిన విధాన్ని బట్టి మారుతూ ఉంది. ఏదేమైనా, ఇటీవలి జన్యు అధ్యయనాల ప్రకారం, ఆధునిక మానవులు పురాతన మానవులలోని "కనీసం రెండు సమూహాలతో" – నియాండర్తల్, డెనిసోవాన్స్ తో- లైంగిక సంపర్కం జరిపి ఉండవచ్చు.[4]

మరొక సమూహం - చైనాలోని రెడ్ డీర్ కేవ్ ప్రజలు - 11,500 సంవత్సరాల క్రితం వరకూ కూడా ఉండి ఉండవచ్చు.[5] లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన క్రిస్ స్ట్రింగర్, ఈ వ్యక్తులు డెనిసోవన్లు, ఆధునిక మానవుల మధ్య సంపర్కం ఫలితంగా ఉద్భవించి ఉండవచ్చని సూచించాడు.[6] ఆధునిక మానవ జనాభాలలో మామూలుగా ఉండే వైవిధ్యాలలోని భాగమే ఈ ప్రత్యేక లక్షణాలని చెబుతూ, కొందరు శాస్త్రవేత్తలు ఈ వాదనను సందేహించారు.[7]

పరిభాష, నిర్వచనం

[మార్చు]

"పురాతన మానవులు" వర్గానికి ఒక ఇదమిత్థమైన నిర్వచనమంటూ లేదు.[2] ఒక నిర్వచనం ప్రకారం, హోమో సేపియన్స్ అనేది పురాతన, ఆధునిక మానవులు రెంటినీ కలిగి ఉన్న అనేక ఉపజాతుల సమూహం. ఈ నిర్వచనం ప్రకారం ఆధునిక మానవులను హోమో సేపియన్స్ సేపియన్స్ అని అంటారు. పురాతన మానవులను కూడా "హోమో సేపియన్స్" అనే ఉపసర్గతోనే పిలుస్తారు. ఉదాహరణకు, నియాండర్తల్‌లను హోమో సేపియన్స్ నియాండర్తాలెన్సిస్ అనీ హోమో హైడెల్బెర్గెన్సిస్ ను హోమో సేపియన్స్ హైడెల్బెర్గెన్సిస్ అనీ అంటారు. ఇతర వర్గీకరణ శాస్త్రవేత్తలు పురాతన, ఆధునిక మానవులను ఒకే జాతిగా కాకుండా వివిధ జాతులుగా పరిగణించాలని అంటారు. ఈ పద్ధతిలోని పేర్లు ప్రామాణిక వర్గీకరణ ప్రకారం ఉంటాయి. అంటే హోమో రొడీసియెన్సిస్, హోమో నియాండర్తలెన్సిస్ - ఇలాగ.

ఆధునిక మానవులను పురాతన మానవులనూ, పురాతన మానవులను హోమో ఎరెక్టస్ నూ వేరుచేసే పరిణామ విభజన రేఖలు అస్పష్టంగా ఉన్నాయి. 1,95,000 సంవత్సరాల క్రితం నాటి ఓమో అవశేషాలు, 1,60,000 సంవత్సరాల క్రితం నాటి హోమో సేపియన్స్ ఇడాల్టు, 90,000 సంవత్సరాల క్రితం నాటి కాఫ్జె అవశేషాలు ఆధునిక మానవులవి. అయితే, ఈ తొలి ఆధునిక మానవులకు కూడా కొద్దిపాటి ఎత్తైన కనుబొమ గట్ల వంటి అనేక పురాతన మానవ లక్షణాలు ఉంటాయి.

మెదడు పరిమాణం విస్తరణ

[మార్చు]
శరీర నిర్మాణపరంగా ఆధునిక మానవుల (ఎడమ), హోమో నియాండర్తాలెన్సిస్ (కుడి) ల పుర్రెల నిర్మాణ పోలిక

పురాతన మానవుల ఆవిర్భావం కొన్నిసార్లు పంక్చుయేటెడ్ ఈక్విలిబ్రియమ్ కు ఉదాహరణగా ఉపయోగిస్తారు.[8] కొద్ది కాలం లోనే ఒక జాతి గణనీయమైన జీవ పరిణామానికి గురైనప్పుడు ఇది సంభవిస్తుంది. తదనంతరం, ఈ జాతి చాలా కాలం పాటు, మళ్ళీ తరువాతి పంక్చుయేషన్ వరకు, చాలా తక్కువ మార్పులకు లోనవుతుంది. పురాతన మానవుల మెదడు పరిమాణం హోమో ఎరెక్టస్‌ లోని 900 సిసి నుండి 1,300 సిసి వరకూ గణనీయంగా విస్తరించింది. పురాతన మానవుల్లోని ఈ గరిష్ట స్థాయి నుండి ఈ పరిమాణం తగ్గడం మొదలైంది.[9]

భాష మూలాలు

[మార్చు]

భాషను మొదట ఉపయోగించినది పురాతన మానవులని రాబిన్ డన్బార్ అన్నాడు. పురాతన మానవుల మెదడు పరిమాణాన్ని హోమినిన్‌ సమూహాల మెదడు పరిమాణాలతో పోల్చి చూసి, పురాతన మానవులకు పెద్ద మెదళ్ళు ఉన్నందున, వారు 120 మందికి పైగా వ్యక్తులతో కూడిన సమూహాలలో నివసించి ఉండాలని అతడు తేల్చిచెప్పాడు. భాష ఉపయోగించకుండా హోమినిన్లు ఇంత పెద్ద సమూహాలలో నివసించడం సాధ్యం కాదనేది డన్బార్ వాదన. భాష లేకపోతే సమూహంలోని వ్యక్తుల మధ్య సమన్వయం ఉండక, సమూహం విచ్ఛిన్నమవుతుంది. చింపాంజీలను చూస్తే, అవి 50 వరకూ ఉన్న చిన్న చిన్న సమూహాలలో నివసించడం కనిపిస్తుంది.[10]

శిలాజాలు

[మార్చు]
  • అటాపుర్కా పర్వతాలు, సిమా డి లాస్ హ్యూసోస్
  • సల్దాన్హా మ్యాన్
  • అల్టమురా మనిషి
  • కబ్వే పుర్రె
  • స్టీన్‌హీమ్ స్కల్
  • ఎన్‌డుటు కపాలం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మానవ పరిణామం

మూలాలు

[మార్చు]
  1. Hublin, J. J. (2009). "The origin of Neandertals". Proceedings of the National Academy of Sciences. 106 (38): 16022–7. Bibcode:2009PNAS..10616022H. doi:10.1073/pnas.0904119106. JSTOR 40485013. PMC 2752594. PMID 19805257.
  2. 2.0 2.1 Dawkins (2005). "Archaic homo sapiens". The Ancestor's Tale. Boston: Mariner. ISBN 978-0-618-61916-0.
  3. Barker, Graeme (1 January 1999). Companion Encyclopedia of Archaeology. Routledge. ISBN 978-0-415-21329-5 – via Google Books.
  4. Mitchell, Alanna (January 30, 2012). "DNA Turning Human Story Into a Tell-All". NY Times. Retrieved January 31, 2012.
  5. Amos, Jonathan (March 14, 2012). "Human fossils hint at new species". BBC. Retrieved March 14, 2012.
  6. Barras, Colin (2012-03-14). "Chinese human fossils unlike any known species". New Scientist. Retrieved 2012-03-15.
  7. James Owen (2012-03-14). "Cave Fossil Find: New Human Species or "Nothing Extraordinary"?". National Geographic News.
  8. Huyssteen, Van; Huyssteen, Wentzel Van (12 April 2006). Alone in the World?. Wm. B. Eerdmans Publishing. ISBN 978-0-8028-3246-7 – via Google Books.
  9. Zyga, Lisa (15 March 2010). "Cro Magnon skull shows that our brains have shrunk". phys.org. Retrieved 14 June 2017.
  10. Dunbar (1993). Grooming, Gossip, and the Evolution of Language. Harvard University Press. ISBN 978-0-674-36336-6.

బయటి లింకులు

[మార్చు]