Jump to content

పురుషోత్తం ఉపాధ్యాయ

వికీపీడియా నుండి
పురుషోత్తం ఉపాధ్యాయ
జననం(1934-08-15)1934 ఆగస్టు 15
మరణం2024 డిసెంబరు 11(2024-12-11) (వయసు: 90)
వృత్తిసంగీత స్వరకర్త, గాయకుడు
పేరుపడ్డదిగుజరాతీ సుగమ సంగీతం
పిల్లలుఇద్దరు కుమార్తెలు
పురస్కారాలుపద్మశ్రీ (2017) గౌరవ్ పురస్కార్

పురుషోత్తం ఉపాధ్యాయ (15 ఆగస్టు 1934 – 11 డిసెంబర్ 2024) ప్రధానంగా గుజరాతీ, హిందీ భాషల్లో పనిచేసిన భారతీయ సంగీత విద్వాంసుడు, గాయకుడు, స్వరకర్త. గుజరాతీ సుగమ సంగీతంలో (semi-classical) ఈయన సుపరిచితులు. 20కి పైగా చలనచిత్రాలు, 30కి పైగా నాటకాలకు సంగీతం అందించారు. 2017లో భారత ప్రభుత్వం ఈయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

జీవితం - వృత్తి

[మార్చు]

ఉపాధ్యాయ 1934 ఆగస్టు 15న ఉత్తరసందలో (ప్రస్తుత గుజరాత్‌లోని ఖేడా జిల్లా) జన్మించారు. చిన్నతనం నుండే ఈయనకు సంగీతంపై మక్కువ ఉండేది. పాటలు వినడం పట్ల ఉన్న ఆసక్తి క్రమంగా గానం వైపు నడిపించింది. పాఠశాల రోజుల్లోనే ప్రదర్శనలు ఇచ్చి అనేక బహుమతులు గెలుచుకున్నారు. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే సంగీత రంగంలో రాణించాలని అప్పట్లో బొంబాయి (ప్రస్తుత ముంబై) వెళ్లారు. కానీ తగిన అవకాశాలు లభించకపోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత గుజరాతీ నాటక సంస్థల్లో చేరుతూ సహాయ పాత్రల్లో నటించడం ప్రారంభించారు.[1][2]

ప్రముఖ నాటక నటుడు అష్రఫ్ ఖాన్ దృష్టిలో పడటంతో ఈయన కెరీర్ మలుపు తిరిగింది. అష్రఫ్ ఖాన్ సిఫార్సుతో బొంబాయి ఆకాశవాణిలో పాడే అవకాశం దక్కించుకున్నారు. సంగీత పరిశ్రమలో అమీర్‌బాయి కర్నాటకి, అల్లా రఖా, దిలీప్ ధోలాకియా, అవినాష్ వ్యాస్ వంటి కళాకారులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అవినాష్ వ్యాస్ మార్గదర్శకత్వంలో భారతీయ విద్యాభవన్‌లో సంగీత కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, అక్కడ తరగతులు కూడా బోధించేవారు. నవరంగ్ నాగ్‌పూర్కర్ వద్ద శాస్త్రీయ సంగీతం అభ్యసించారు.[1][2]

ఉపాధ్యాయ స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ అనేక సంగీత కచేరీలు నిర్వహించారు. గుజరాతీ సుగమ సంగీతంతో పాటు గజల్స్ కూడా పాడేవారు. కళ్యాణ్ జీ-ఆనంద్ జీ ద్వయం వద్ద పనిచేస్తూ సంగీత స్వరకల్పనలో అనుభవం గడించారు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, మహమ్మద్ రఫీ వంటి దిగ్గజ గాయనీ గాయకులకు సంగీత దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో హంసా దేవ్ వంటి గాయనీమణులు అనేక పాటలు పాడారు.[1]

మొత్తం 20కి పైగా సినిమాలు, 30కి పైగా నాటకాలకు సంగీతం సమకూర్చారు. ఈయన స్వరపరిచిన "హే రంగలో జామ్యో", "దివసో జుదైనా జాయ్ ఛే", "మారీ కోయి డాల్ఖీ మా" వంటి పాటలు గుజరాతీలో ఎంతో ప్రాచుర్యం పొందాయి.[2][3]

ఉపాధ్యాయకు ఇద్దరు కుమార్తెలు.[4] 90 ఏళ్ల వయసులో 2024 డిసెంబర్ 11న ముంబైలో కన్నుమూశారు.[2][4]

గుర్తింపు

[మార్చు]

గుజరాతీ సంగీత రంగానికి చేసిన సేవలకు గాను గుజరాత్ ప్రభుత్వం 'గౌరవ్ పురస్కార్' ఇచ్చి సత్కరించింది.[1][2] 2017లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.[1][2][4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

ఉపాధ్యాయ కింది చిత్రాలకు సంగీత స్వరకర్తగా లేదా గాయకుడిగా వ్యవహరించారు:

లీలుడి ధరతి (1968, గుజరాతీ)

తక్దీర్ (1983, హిందీ)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 Mule, Balkrishna Madhavrao. "ఉపాధ్యాయ్, పురుషోత్తం". Gujarati Vishwakosh (in గుజరాతీ). Retrieved 19 డిసెంబరు 2024.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Legendary Gujarati singer Purushottam Upadhyay passes away at 90, PM Narendra Modi expresses condolences". The Times of India. 11 డిసెంబరు 2024. ISSN 0971-8257. Retrieved 19 డిసెంబరు 2024.
  3. "We have lost a gem: Gujarat mourns Purushottam Upadhyay". The Times of India. 13 డిసెంబరు 2024. ISSN 0971-8257. Retrieved 19 డిసెంబరు 2024.
  4. 4.0 4.1 4.2 "Purushottam Upadhyay, doyen of Gujarati sugam sangeet no more". The Times of India. 12 డిసెంబరు 2024. ISSN 0971-8257. Retrieved 19 డిసెంబరు 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పురుషోత్తం ఉపాధ్యాయ పేజీ

మూస:Discogs artist

మూస:Padma Shri Award Recipients in Art