Jump to content

పుస్తక గ్రామాలు - భారత దేశం

వికీపీడియా నుండి
పుస్తక గ్రామాలు, భారతదేశం
దేశముభారతదేశము
తరహాప్రత్యేక గ్రంథాలయాలు
ఆశయంస్థానికులు, పర్యాటకులు, పరిశోధకులు
స్థాపితముమే 4, 2017 (2017-05-04)
ప్రదేశముBhilar, Maharashtra, India
ప్రాప్యత, వినియోగం
పనిచేసే ప్రజలుస్థానికుల నివాసాలు, ప్రభుత్వం
సభ్యులుస్థానికులు, పర్యాటకులు, పరిశోధకులు

పుస్తక గ్రామాలు అంటే అనేక పుస్తక నిలయాలు ఉన్న గ్రామం. భారతదేశంలో మొదటగా "పుస్తకాంచ గావ్" (ఆంగ్లం పుస్తకాల గ్రామం) మహారాష్ట్ర, సతారా జిల్లా, భిలార్ గ్రామంలో 2017లో ప్రారంభమైంది. అదే విధంగా మరికొన్ని ఇటువంటి గ్రామాలు బెంగాల్, కాశ్మీర్, లడఖ్ మొదలగు ప్రదేశాలలో ప్రారంభించారు.

భిలార్ "పుస్తకాంచ గావ్"

[మార్చు]

భారతదేశంలో మొదటగా "పుస్తకాంచ గావ్" (ఆంగ్లం పుస్తకాల గ్రామం) అనేది ఒక ప్రత్యేక గ్రంథాలయం అను భావనతో మహారాష్ట్ర, సతారా జిల్లా, భిలార్ గ్రామంలో 2017 మే 4న ప్రారంభమైంది.[1] 'పుస్తకాంచ గావ్' ను మరాఠీ భాష సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వినోద్ తావ్డే నాయకత్వం వహించి రూపొందించాడు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దీనిని ప్రారంభించారు.[2] మహారాష్ట్ర ప్రభుత్వం ఈవిషయంలో పుస్తక దుకాణాలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ పట్టణం బ్రిటన్, వెల్స్ లో "హే-ఆన్-వై" నుండి ప్రేరణ పొందింది.

కార్యక్రమాలు

[మార్చు]

మహారాష్ట్రలో మహాబలేశ్వర్ పంచగని సమీపంలోని భిలార్ అనే గ్రామాన్ని సాంస్కృతిక, సాహిత్య కేంద్రంగా ప్రోత్సహించడం కోసం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.[3] ప్రారంభంలో భిలార్లో 25 కళాత్మకంగా అలంకరించబడిన ప్రదేశాలు పాఠకులకు అనుకూలమైన ప్రదేశాలుగా మార్చారు. అందరు కలసి సమిష్టిగా 18 విభిన్న శైలులలో 15,000 పుస్తకాలను ఏర్పాటుచేశారు.[4] భారతదేశం అంతటి నుంచి డెబ్బై ఐదు మంది కళాకారులు భిలార్ కు ప్రయాణించి, 25 ప్రదేశాలను సృజనాత్మకంగా రూపొందించారు, వీటిని పఠన ప్రదేశాలు, ప్రదర్శన కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ ప్రదేశాలలో ఒక ఆలయం, రెండు పాఠశాలలు, అనేక ఇళ్ళు, హోమ్ స్టేస్ ఉన్నాయి.[5] చాలా పుస్తకాలు మరాఠీ భాషలో ఉన్నాయి. ఆంగ్లం, హిందీ, గుజరాతీ వంటి ఇతర భాషలలో కూడా అదనంగా 25,000 పుస్తకాలను చేర్చాలని ప్రణాళికలు ఉన్నాయి.[3]

అక్కడి సామాజిక సమూహాలు అనేక మంది ప్రఖ్యాత కవులు, రచయితల శాస్త్రీయ రచనల పఠనాలు నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమాలకు తరచుగా సాహిత్య రంగంలోని అనేక ప్రముఖులు హాజరవుతారు. ఉదాహరణకి, భారత మాజీ రాష్ట్రపతి ఎ. పి. జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన జీవితం, వారసత్వాన్ని గౌరవించడానికి 'వాచన్ ప్రేరణ దిన్' ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ మరాఠీ వార్తా ఛానల్ 'ఎబిపి మజా' ప్రసారం చేసింది. 'వాచన్ ప్రేరణ దిన్' సందర్భంగా విద్యార్థులకు చదివే అభిరుచి పెంపొందించుటకు ప్రత్యేక సమావేశం, అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ వారు గ్రామంలోని వివిధ ప్రదేశాలలో వారితో సంభాషించిన రచయితలు, కవులు, చరిత్రకారులు, భాషా నిపుణులను కలిసే అరుదైన అవకాశం లభించింది. కవి 'విందా కరండికర్' వారసత్వాన్ని పురస్కరించుకుని రాజ్య మరాఠీ వికాస్ సంస్థ ఒక గొప్ప సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. డాక్టర్ అరుణ ధేరే, జయశ్రీ కాలే, ప్రదీప్ నిఫాద్కర్, డాక్టర్ వృశాలి కిన్హాల్కర్, ఉషా పరబ్, సంగీత బార్వే, పవన్ నలత్, ఐశ్వర్య పటేకర్, అబా పాటిల్, శ్రీధర్ నాందేద్కర్ వంటి ప్రముఖులు పద్యాలు, కవిత్వ పఠనం చేశారు.

వనరులు

[మార్చు]

పుస్తకాంచ్ గావ్లో 19 కళా ప్రక్రియలకు సంబంధించిన ప్రత్యేకమైన 19 గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రంథాలయాన్ని స్వతంత్ర కళాకారులు, చిత్రకారులు, నిపుణులచే రూపొందించారు, అలంకరించారు. తమ కళాకృతుల ద్వారా బలమైన సామాజిక సందేశాన్ని అందించాలని భావిస్తారు. పుస్తకాలు, వివిధ కళాప్రక్రియల ఇతివృత్తాలను ప్రతిబింబించే వివరణాత్మక కుడ్య చిత్రాలు, చిత్రాలు, కళాకృతులతో ఈప్రదేశాన్ని పరిసరాలను రూపొందించి అందంగా అలంకరించారు.

హాజియోగ్రఫీ (Hagiography) అనేది జీవిత చరిత్రలు. సాధువుల జీవితాలు, వారి పని, ఆరాధనను వివరించే సాహిత్యం. హాజియోగ్రఫీ సాహిత్యం ప్రధానంగా సాధువుల, సన్యాసుల జీవిత చరిత్రలను, సమాధులు, అవశేషాలు, చిహ్నాలు, విగ్రహాలు వంటి అద్భుతాల వృత్తాంతాలతో ముడిపడి ఉంటుంది. మహారాష్ట్రలో హాజియోగ్రఫీకి గొప్ప సంప్రదాయం ఉంది, ఈ ఆలయంలో సాధువుల శబ్దాలు, ఘంటికలు శక్తివంతమైన గాలి, భక్తుల ప్రవాహం, ఇంకా ఈ ప్రదేశంలో అందంగా అలంకరించబడిన దేవతలు దైవిక వాతావరణాన్ని పెంచే విధంగా ఉంటుంది. ఒక మూలలో సాధువుల దైవిక వచనాలను, ప్రసంగాలు ఉన్న ప్రతులు కలిగిన అల్మారాలు ఉంటాయి. 'పుస్తకాంచ గావ్' వద్ద హాజియోగ్రఫీ పుస్తకాలు కూడా ఉంటాయి. ఇవి పాఠకులకు మార్గదర్శకత్వంగా ఉంటాయి . ఈ ఆలయం మొత్తం వాతావరణం పాఠకులకు ఆత్మపరిశీలన చేసుకోవడానికి, జీవితంలోని పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి అవకాశం ఇస్తుంది. 'పుస్తకాంచ గావ్' లోని హాలులో, పాఠకులకు మరాఠీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మాణిక్ సీతారాం గాడ్ఘాట్ ('కవి గ్రేస్' అని ప్రసిద్ధి గాంచారు), శాంతా షెల్కే వంటి అనేక మంది ప్రముఖ కవుల రచనలతో అనుసంధానం అవ్వడానికి అరుదైన అవకాశం లభిస్తుంది. ఈ అత్యంత వాణిజ్య ప్రధానమైన ప్రపంచంలో కూడా, పాఠకులు కవిత్వం ద్వారా పదాలలోని సున్నితత్వాన్ని తిరిగి గమనించవచ్చు. ఇక్కడ ఉన్న సాహిత్య అభిమానుల కోసం మరాఠీ వార్తాపత్రికలను నిర్వహించే ఇల్లు ఉంది. ఈ విభాగం రాష్ట్రంలోని స్థానిక ప్రముఖ వార్తాపత్రికలను నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

భిలార్ మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన మహాబలేశ్వర్ ఉపజిల్లా ప్రధాన కార్యాలయానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. భిలార్ రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో, పంచగని నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రధాన నగరాల్లో సతారా, పూణే, ముంబై ఉన్నాయి. భిలార్ గ్రామ జనాభా 5,000గా అంచనా, ఇది స్ట్రాబెర్రీలకు ప్రధాన ఉత్పత్తి కేంద్రం. 'పుస్తకాంచ గావ్' ను రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. పూణే, ముంబై నుండి వివిధ ప్రైవేట్ బస్సులు, కార్లు, టాక్సీ సేవలు ఉన్నాయి. సతారా సమీప రైల్వే స్టేషన్, ఇక్కడ నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతర సమీప ప్రధాన రైల్వే జంక్షన్లు పూణే (148 కి. మీ.), మిరాజ్ (188 కి. మీ)లు. భిలార్ కు సమీప విమానాశ్రయం పూణే అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది భిలార్ నుండి 118 కి.మీ.ల దూరంలో ఉంది. ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం 259 కి.మీ. దూరంలో ఉంది.

పెరుంకులం, కేరళ

[మార్చు]

కేరళలో పుస్తకాలు చదివే సంస్కృతిని కాపాడటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, జాతీయ పఠన దినోత్సవం అయిన 2021 జూన్ 19న కొల్లం జిల్లా లోని పెరుంకులం అనే గ్రామాన్ని కూడా పుస్తక గ్రామం (పుస్తకాల గ్రామం) గా ప్రకటించారు, ఏర్పాటు చేసారు. ఇది భారతదేశంలో రెండవది, కేరళలో మొదటి పుస్తక గ్రామంగా నిలిచింది. దీనికి ప్రేరణ భారతదేశంలోని మొట్టమొదటి భిలార్ పుస్తక గ్రామం. కేరళలో మొదటి పుస్తక గ్రామం ఏర్పడడానికి నేపధ్యంగా ఉన్న సంఘటన 1948లో మహాత్మా గాంధీ కాల్చి చంపబడిన విషయం. పెరుంకుళం అనే గ్రామం నుండి కొంతమంది యువకులు గాంధీ మరణ దుఃఖం నుండి ప్రజలు కోలుకోవడానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కే. కృష్ణ పిళ్లై అతని కొద్దిమంది స్నేహితులు దాదాపు 100 పుస్తకాలను సేకరించి గ్రామంలోని ఒక చిన్న గదిలో ఉంచారు. చాలా మంది ఈ చిన్న గదిని సందర్శించడం ప్రారంభించారు, ఇక్కడ కథలు చెప్పే తరగతులు, పుస్తక పఠన తరగతులు మొదలైనవి నిర్వహించి ప్రజలను చదవడానికి ప్రేరేపించారు. దీని ఫలితంగా బాపూజీ స్మారక వాయునశాల (బాపూజీ స్మారక గ్రంథాలయం) ఏర్పడింది. ఈ గ్రంథాలయాన్ని అనేక సార్లు వేదికను మార్చడంతో పాటు, అనేకసార్లు మూసివేసారు.

ఫిబ్రవరి 2016 తర్వాత గ్రంథాలయం మరోసారి పునర్నిర్మించిన తర్వాత శ్రేయోభిలాషులు, పాఠకుల సహకారంతో అనేక కొత్త పుస్తకాలు సేకరించారు. అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండేలా ఒక స్థలాన్ని సృష్టించాలని భావనతో పెరుంకుళంలోని ప్రధాన కూడళ్లలో దాదాపు 50 పుస్తకాలను ఉంచగల "పుస్తక గూళ్ళు" నిర్మించాలనే ఆలోచన వచ్చింది. మొదటి పుస్తక గూడు 2019లో స్థాపించారు. క్రమంగా గ్రామంలో పుస్తక గూళ్ళు 1 నుండి 10కి చేరుకున్నాయి. పెరుంకులం కేరళలో మొదటి పుస్తక గ్రామంగా మారింది. COVID-19 సమయంలో కూడా, ఈ పుస్తక గూళ్ళే ప్రజలకు మరింత చదవడానికి ప్రోత్సహించాయి. ప్రజలు కూడా పుస్తకాలు, పత్రికలూ, జీవిత చరిత్రలు మొదలైన వాటిని విరాళంగా ఇచ్చారు. వారి ఇళ్లను చిన్న గ్రంథాలయాలుగా మార్చారు, వారి ఇళ్ల వెలుపల నవలలు, జీవిత చరిత్రలు, పిల్లల కథలతో నిండిన పుస్తక గూళ్ళను ఏర్పాటు చేశారు. స్థానిక కళాకారులు ఇందులో పాల్గొని, గోడలపై కుడ్యచిత్రాలను చిత్రించారు, గ్రామానికి రంగు వ్యక్తిత్వాన్ని జోడించారు. గ్రామస్తులు రూపొందించిన ఈ పుస్తక గూళ్ళు గ్రామంలోని అనేక ప్రదేశాలలో అంటే తపాలా కార్యాలయాలు, బస్ స్టాప్‌లు, పబ్లిక్ పార్కులు, తోటలు వంటి ప్రదేశాలలో ఏర్పాటు చేసారు. తద్వారా చదవడం కోసం గ్రంథాలయానికి వెళ్ళక్కరలేదు. ఒక పుస్తకం తీసుకొని మరొక పుస్తకంతో భర్తీ చేయడం ద్వారా ఇంటికి కూడా తీసుకెళ్లవచ్చు. “ఒక పుస్తకం ఇవ్వండి, ఒక పుస్తకం తీసుకోండి” అనే ఆలోచన దీనికి మూలం. ఇంతే కాకుండా పెరుంకుళంలో అనేక పుస్తక కేఫ్‌లు ఉన్నాయి. ఈ విధంగా పెరంకుళం ఒక పర్యాటక కేంద్రంగా మారింది, ఈ గ్రామం ఇప్పుడు సాహిత్య కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, పుస్తక ప్రదర్శనలను నిర్వహిస్తుంది, సాంస్కృతిక చైతన్యానికి కేంద్రంగా మారింది. డిజిటల్ లైబ్రరీ, ఈబుక్‌లు, ఆడియోబుక్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. [6]

మూలాలు

[మార్చు]
  1. "Book village being built in Bhilar, Maharashtra". The Times of India. Retrieved 9 November 2017.
  2. "Village Of Books: Maharashtra's Bhilar Is India's Answer To Britain's Hay". NDTV. Retrieved 9 November 2017.
  3. 3.0 3.1 "Book Village of Bhilar to get 25,000 non-Marathi books". The Asian Age. Retrieved 9 November 2017.
  4. "Maharashtra's Bhilar, India's first 'books village'". The Business Standard. Retrieved 9 November 2017.
  5. "Maharashtra: Country's first village of books to open near Panchgani on May 4". The Indian Express. Retrieved 9 November 2017.
  6. "Perumkulam – First Book Village In Kerala|Idea of Book Nests". Wanderon. 2024-02-23. Archived from the original on 2025-06-17. Retrieved 2025-09-23.

ఇతర వనరులు

[మార్చు]
  1. Bhillar, The First Book Village Of India
  2. Take A Trip To India’s First Book Village In Maharashtra - ‘Pustakache Gaav’
  3. This Village in Maharashtra is the first Book Village of India