పూసలార్
| పూసలార్ | |
|---|---|
| జననం | క్రీ.శ 8వ శతాబ్దం తిరునిండ్రవూరు |
| బిరుదులు/గౌరవాలు | నాయనార్ సాధువు |
| తత్వం | శైవమతం, భక్తి |
పూసలార్ (పూసలార్, పూసల లేదా పూసలార్ అని కూడా పిలుస్తారు) ఎనిమిదవ శతాబ్దపు నయనారు సాధువు, హిందూ మతంలోని శైవ శాఖలో పూజలందుకుంటారు. ఇతను సాధారణంగా 63 మంది నాయనార్ల జాబితాలో యాభై ఎనిమిదవ వాడు.[1] ఇతను తన మనస్సులో శివుని కోసం ఒక గొప్ప ఆలయాన్ని ఎలా సృష్టించాడో, పల్లవ రాజు సృష్టించిన భౌతిక ఆలయానికి బదులుగా శివుడు తన మనో మందిర ప్రతిష్ఠాపనకు హాజరుకావడానికి ఎలా ప్రాధాన్యతనిచ్చాడో ఇతని జీవిత చరిత్ర వివరిస్తుంది.
| శ్రేణిలో భాగం |
| శైవం |
|---|
జీవితం
[మార్చు]పూసలార్ జీవితానికి సంబంధించిన ప్రాథమిక ఆధారం తమిళంలోని పెరియ పురాణం. ఇది సేక్కిళార్ (12వ శతాబ్దం) రచించిన 63 మంది నాయనార్ల జీవిత చరిత్ర. పూసలార్ ఒక బ్రాహ్మణ పూజారి. ఇతను ప్రస్తుతం చెన్నై నగరంలో ఒక ప్రాంతంగా ఉన్న తిరునిండ్రవూరు (తిరు నిండ్రవూరు/నిండ్రవూరు)లో నివసించాడు. పూసలార్ కాలంలో, తిరునిండ్రవూరు పల్లవ రాజ్యంలో భాగమైన తొండై నాడు (తొండై మండలం)లో అంతర్భాగంగా ఉండేది. ఇతను ఒక పేద ఆలయ పూజారి.[2] పూసలార్ శివుని భక్తుడైన శైవుడు. ఇతను శివునికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ అందుకు తగినంత డబ్బు లేదు. అందువలన, పూసలార్ తన ఊహతో తన మనస్సులో శివునికి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇతను ఆలయ నిర్మాణ ఆచారాలను అనుసరించి, ఒక శుభ దినాన స్థలాన్ని పవిత్రం చేసి తన మనో మందిరానికి మొదటి రాయిని వేశాడు. కాలక్రమేణా, ఇతను తన మనో మందిరాన్ని పూర్తి చేశాడు. ఆలయ ప్రతిష్ఠాపన చేసి గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు, కుంభాభిషేకం వేడుక కోసం ఒక పవిత్రమైన రోజును ఎంచుకున్నాడు.[3]
పల్లవ రాజు కాడవార్కోన్ రాజధాని కాంచీపురంలో ఒక గొప్ప శివాలయాన్ని అప్పుడే పూర్తి చేసి, తన ఆలయ ప్రతిష్ఠాపనకు అదే రోజును ఎంచుకున్నాడు. శివుడు రాజు కలలో కనిపించి, తన భక్తుడైన పూసలార్ ఆలయ ప్రతిష్ఠాపన కోసం అదే రోజు తిరునిండ్రవూరుకు వెళుతున్నందున, తన ఆలయ ప్రతిష్ఠాపన తేదీని వాయిదా వేయమని ఆదేశించాడు. రాజు దైవాజ్ఞ ప్రకారం తేదీని వాయిదా వేశాడు. శివుడు తన స్వంత ఆలయం కంటే పూసలార్ ఆలయానికే ప్రాధాన్యత ఇవ్వడంతో ఆ అద్భుతమైన దేవాలయాన్ని చూడటానికి తొందరపడ్డాడు. అయితే, తిరునిండ్రవూరు చేరుకున్న తర్వాత, రాజుకు పట్టణంలో రాతితో కట్టిన ఏ దేవాలయమూ కనిపించలేదు. ఇది చూసి అతను అయోమయానికి గురయ్యాడు. అతను పూసలార్ ఇంటికి చేరుకుని తన కలను గురించి పూసలార్‌కు తెలియజేశాడు. ఆ ఆలయం తన హృదయంలోనే ఉందని ఆ సాధువు వెల్లడించాడు. పూసలార్ భక్తికి రాజు ఆశ్చర్యపోయి, అతనికి నమస్కరించి పూజించాడు. పూసలార్ నిర్ణయించిన రోజునే ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. చనిపోయే వరకు తన ఆరాధనను కొనసాగించాడు. మరణానంతరం అతను శివుని నివాసమైన కైలాసం చేరుకున్నాడని చెబుతారు.[3]

పూసలార్ చారిత్రక పురుషుడిగా పరిగణించబడతాడు. పెరియ పురాణం కథనంలోని పల్లవ రాజు కాడవార్కోన్, సా.శ 700, 728 మధ్య పరిపాలించిన రాజసింహ (రెండవ నరసింహవర్మన్ అని కూడా పిలుస్తారు) రాజుగా గుర్తించబడ్డాడు. ఆ రాజు ఆలయం కైలాసనాథర్ ఆలయంగా గుర్తించబడింది, ఇది రాజసింహ నిర్మించిన గొప్ప ఆలయంగా పరిగణించబడుతుంది. ఇది రాజు వ్యక్తిగత మందిరంగా కూడా పనిచేసింది. కైలాసనాథర్ ఆలయ వెలుపలి గోడలపై ఉన్న 12 సంస్కృత శ్లోకాలతో ఉన్న శాసనం ఈ గుర్తింపుకు సహాయపడుతుంది. ఏడవ శ్లోకం రాజసింహ విన్న "శరీరం లేని స్వర్గపు స్వరం" గురించి మాట్లాడుతుంది. పూసలార్ కథలో ఈ స్వరం శివుని స్వరంతో ముడిపడి ఉంది. అందువలన, పూసలార్ ఎనిమిదో శతాబ్దం ప్రారంభానికి చెందినవాడని, సుందరార్‌కు సమకాలీనుడని భావించవచ్చు. పూసలార్ కథను చెప్పడానికి పెరియ పురాణం కైలాసనాథర్ ఆలయంలోని ఈ శాసనాలపై ఆధారపడి ఉంటుంది.[4]
పూసలార్ కథ (తెలుగులో పూసల నాయనారు అని పిలుస్తారు) 13వ శతాబ్దపు తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలో కూడా క్లుప్తంగా, కొద్దిపాటి మార్పుతో ప్రస్తావించబడింది. తమిళ వెర్షన్‌లో పల్లవ రాజుకు బదులుగా, ఇందులో రాజును విక్రమ చోడుడు (సా.శ 1118–1135 మధ్య పరిపాలించిన చోళ రాజు) అని పిలుస్తారు. అతను బంగారంతో ఒక గొప్ప ఆలయాన్ని సృష్టించాడు. పూసల నాయనారు మనస్సులో అలాంటి ఆలయాన్ని సృష్టించి శివుని అనుగ్రహం పొందాడు.[5]
స్మరణ
[మార్చు]పూసలార్‌ను గుండుతో, చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లుగా చిత్రీకరిస్తారు. ఇతని గౌరవార్థం తమిళ అశ్వయుజ మాసంలో ఇరవై ఎనిమిదవ రోజున (సాధారణంగా నవంబర్ 13న వస్తుంది) ఒక పవిత్రమైన రోజును జరుపుకుంటారు. ఇతను 63 మంది నాయనార్లలో భాగంగా సామూహిక పూజలు అందుకుంటాడు. తమిళనాడులోని అనేక శివాలయాలలో వీరి విగ్రహాలు, వారి పనుల క్లుప్త ఖాతాలు కనిపిస్తాయి. ఉత్సవాలలో వీరి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళతారు.
పల్లవులు పూసలార్ గౌరవార్థం తిరునిండ్రవూరులో హృదయలీశ్వరార్ (భక్తుల హృదయంలోని దేవుడు)గా శివునికి అంకితం చేయబడిన హృదయలీశ్వరార్ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గర్భగుడిలో శివునితో పాటు పూసలార్ కూడా పూజలందుకుంటాడు. ఆలయ పౌరాణిక కథనం ప్రకారం, శివునికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలన్న పూసలార్ కోరికను నెరవేర్చడానికి పల్లవ రాజు ఈ ఆలయాన్ని సృష్టించాడు. పూసలార్ మొదట ఈ ఆలయాన్ని తన హృదయంలో నిర్మించినందున, గుండె జబ్బులతో బాధపడుతున్న రోగులు, కార్డియాలజిస్టులు గుండె జబ్బుల నివారణ కోసం ఈ ఆలయంలో పూజలు చేస్తారు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Roshen Dalal (2011). Hinduism: An Alphabetical Guide. Penguin Books India. p. 281. ISBN 978-0-14-341421-6.
- ↑ Vidya Dehejia (1988). Slaves of the Lord: The Path of the Tamil Saints. Munshiram Manoharlal. pp. 86, 177. ISBN 978-81-215-0044-9.
- ↑ 3.0 3.1 Swami Parmeshwaranand (2004). Encyclopaedia of the Śaivism. Sarup & Sons. pp. 242–3. ISBN 978-81-7625-427-4.
- ↑ Mohan Lal (1 January 2006). The Encyclopaedia Of Indian Literature (Volume Five (Sasay To Zorgot). Sahitya Akademi. p. 3905. ISBN 978-81-260-1221-3.
- ↑ Siva's Warriors: The Basava Purana of Palkuriki Somanatha. Princeton University Press. 2014. p. 168. ISBN 978-1-4008-6090-6.
- ↑ "Sri Hrudayaleeswarar temple". దినమలర్. Retrieved 25 August 2019.