పెద్దాపురం ప్రస్థానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పెద్దాపురం ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రసిద్ధ పురాతన మునిసిపల్ పట్టణము. స్వాతంత్ర్యానికి ముందు ఇది ఒక సంస్థానంగా విలసిల్లింది.

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చింది[మార్చు]

పెద్దాపురానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయ్ంలో భిన్న కధనాలు ఉన్నాయి, అందులో కొన్ని పౌరాణిక కారణాలు వినపడుతున్నాయి, కొన్ని చారిత్రిక కారణాలు కనపడుతున్నాయి.

పృథాపురం[మార్చు]

కుంతీదేవి అసలు పేరు పృథాదేవి. కుంతిభోజుడు తనకూతురు పృథాదేవి పేరుమీద ఒక మహానగరం నిర్మించాడు. ఆ నగరం పరిసర ప్రాంతలన్నిటికంటే మిక్కిలి ఎత్తుగానూ సూర్యోదయం వేళ సముద్రంలోనూ సూర్యాస్తమయం వేళ గోదావరిలోనూ కనిపించేలా ఈ నగరం ఉండేది. ఆ మహానగరం పృథాపురంగా పిలువ బడింది.

పార్థాపురం[మార్చు]

పురాణాలు, స్థానిక చరిత్రల ప్రకారం పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడ నివసించారు. పాండవ మధ్యముడు అర్జునుడికి పార్ధ అనే పేరు కూడా వున్నది. అతడి పేరున పార్థాపురం అనే పేరుతో ఈ ప్రాంతమంతా పిలువబడేది. కాలక్రమంలో ఈ పార్థాపురం కాస్తా వ్యవహారంలో "పెద్దాపురం" గా స్థిరపడింది.

కిమ్మూరు[మార్చు]

పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు పెద్దాపురం ఉన్న ప్రాంతాన్ని కిమ్మీరుడు అనే కిరాత రాజు పరిపాలించే వాడు. ఆ కారణం చేత ఈ ప్రాంతమంతా అతని పేరునే కిమ్మూరు సీమ గా వ్యవహరింపబడేది.

పద్మాపురం[మార్చు]

పద్మనాయకులు ఈ ప్రాంతాన్ని కొంతకాలం పరిపాలన చేయడం చేత పద్మాపురం అని పిలువబడింది.

పొర్లునాడు[మార్చు]

పెద్దాపురం పిఠాపురం ల మద్య ఏలేరు నది ప్రవహించడం మూలాన రెడ్డి రాజులు ఈ రెండు ప్రాంతాలను పొర్లునాడు అని పిలిచేవారు.

పెద్దాపురం[మార్చు]

ఈ ప్రాంతం వత్సవాయ వారి ఆధీనం లోనికి రాకముందు రెడ్డిరాజులు పాలించేవారు. వారికి సరదారుగా ఇసుకపల్లి పెరుమాళ్ల పాత్రుడు ఇతని అనంతరం పెద్దాపాత్రుడు ఈ ప్రాంతానికి పరిపాలకుడయ్యి ఈ ప్రాంతంలో ఉన్న రెండు పెద్ద పెద్ద మెట్టలని చదును చేయించి, ఒక కోటని కట్టించి చుట్టూ మట్టి గోడ పెట్టించి వాటిపై చుట్టూ బురుజులు తీర్పించి ఆ కోట నుండి పరిపాలన సాగించెను. అతని పేరు మీదనే ఈ ఊరికి పెద్దాపురం అని పేరు వచ్చింది

రాజరిక ప్రస్థానం[మార్చు]

రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి పెద్దాపురం సంస్థాన సంపాదకులు. తొలుత వీరు రెడ్దిరాజులకు సరదారుగా ఉండి తన పరాక్రమము చేత పెద్దాపురం సంస్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన తండ్రి శ్రీ వత్సవాయి పేరరాజు, తల్లి గొట్టుముక్కల వారి ఆడపడుచు నారమాంబ. పెద్దాపురం సంస్థానాన్ని వీరి వంశస్థులు దాదాపు 300 సంవత్సరాలు పరిపాలన చేసినారు

 1. రాజా వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి (1555-1607)
 2. రాజా వత్సవాయ రాజా రాయపరాజ మహారాజు (1607-1649)
 3. రాజా వత్సవాయ సార్వభౌమ తిమ్మరాజు (1649-1688)
 4. రాజా వత్సవాయ ఉద్దండ రాయపరాజు (1688-1714)
 5. రాజా వత్సవాయ కళా తిమ్మజగపతి (1714-1734)]
 6. రుస్తుం ఖాన్ (1734-1749)]
 7. రాజా వత్సవాయ రాయ జగపతి రాజు (1749-1758)
 8. మహమ్మదీయులు (1758 1760]]
 9. రాజా వత్సవాయ విద్వత్ తిమ్మ జగపతి (1760-1797)
 10. రాజా వత్సవాయ రాయ జగపతి (1797 - 1804)
 11. ఆంగ్లేయులు (1804 - 1809)
 12. రాణీ లక్ష్మీ నరసాయమ్మ (1809 - 1814)
 13. ఆంగ్లేయులు (1814 - 1828)
 14. వత్సవాయి బుచ్చి సీతాయమ్మ (1828 - 1833)
 15. ఆంగ్లేయులు (1833 - 1836)
 16. బుచ్చి బంగారయమ్మ (1836 - 1838)
 17. వత్సవాయ సూర్యనారాయణ జగపతి (1839 1847)
 18. ఆంగ్లేయులు (1847 - 1915)

పెద్దాపురం సంస్థానం సంక్షిప్త చరిత్ర[మార్చు]

పెద్దాపురం ప్రాచీన ఆంద్ర దేశములో పురాతన సంస్థానములలో ఒకటి. ఇంచుమించు ఐదు వందల ఏళ్ల పూర్వ చరిత్ర కలది. గోదావరి మండలము లోని చాలా భాగము, కృష్ణా - గుంటూరు మండలాలలోని కొంత భాగము, విశాఖ పట్నం లోని కొన్ని గ్రామాలు అయిన తోటపల్లి, రంప, చోడవరం, మొదలగు మన్యం ప్రాంతాలు ఒకప్పటి పెద్దాపురం సంస్థానములోనివి. సంస్థానములోని ముఖ్య పట్టణం అయిన "పెద్దాపురం" తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం (ఇప్పటి రాజముండ్రి) కు ఈశాన్య దిక్కుగా 32 కి.మీ. దూరంలో ఉంది. 1803 నాటికి పెద్దాపురం సంస్థానం ఆదాయం పది లక్షలు. సాలుసరి పేష్కషు (కప్పం రూపములో వచ్చే ఆదాయం) ఆరున్నర లక్షలు. రాజా వేంకట సూర్య నారాయణ జగపతి రాజు గారి పేర నమోదయిన కొట్టాము ఎస్టేటు యొక్క రాబడి రెండున్నర లక్షలు పేష్కషు ఇరవై ఆరువేల నూట డెబ్బై మూడు రూపాయలు. కొట్టాము ఎస్టేట్ యొక్క ముఖ్య పట్టణం తాండవ నది ఒడ్డున ఉన్న తుని.

అంత పెద్ద సంస్థానం కాలక్రమంలో చిన్న చిన్న భాగాలుగా విభజించబడి చివరికి కొట్టాము, తుని ఎస్టేటు గా మారిపోయి, ఆ తరువాతి కాలంలో ఆంద్రప్రదేశ్ రాష్త్రంలో అంతర్భాగం అయ్యిపోయింది.

పెద్దాపురం సంస్థాన సంస్థాపకులు శ్రీ వత్సవాయి తిమ్మరాజు (ముక్కు తిమ్మరాజు). కృష్ణాజిల్లా జగ్గయ్యపేట తాలూకాలో వత్సవాయి అను గ్రామమున్నది. అక్కడకు వచ్చిన సాగి రామరాజు గారికి ఆ గ్రామ నామమే గృహనామమైనది.

శ్రీ వత్సవాయి తిమ్మరాజు క్రీ.శ. 1530న జన్మించారు. తిమ్మరాజు గారి తండ్రి పేర్రాజు. వీరు ఎనిమిది మంది సోదరులు. 1555న పెద్దాపురం కోటలో ప్రవేశించి సంస్థానమును స్థాపించి, 1607వరకు పరిపాలించి స్వర్గస్థులయ్యారు. తిమ్మరాజు బిక్కవోలు నందుండిన తురుష్క వీరులతో ఘోరమగు యుద్ధము చేసి జయించారు. రాజమహేంద్రవరము సర్కారు తిమ్మరాజు గారి వశమైంది. క్రీ.శ.1572న గోల్కొండ సుల్తాను యొక్క సేనాపతియగు రాహత్‌ఖాన్ రాజమహేంద్రవరము సర్కారు మీదికి దండెత్తి వచ్చాడు. తురుష్క వాహినుల నడ్డగించుట దుస్సాహసమని నిశ్చయించుకొని, తిమ్మరాజు రాహత్‌ఖాన్ ని కలిసి రాజమహేంద్రవరము సర్కారులోని 18 పరగణాలు మాత్రము తిమ్మరాజుగారు అనుభవించుటకు సంధి చేసుకొనిరి. చతుర్భుజ తిమ్మరాజుగా వాసికెక్కిన ఈ ముసలి తిమ్మరాజు బహుపరాక్రమశాలి, కార్యఖడ్గ నిపుణుడు. పెద్దాపుర సంస్థానమును స్థాపించి వృద్ధి చేసారు. పెద్దాపురము తాలూకా నంతయును, తుని, పిఠాపురం, రామచంద్రాపురం తాలూకాలలో చాలా భాగమును, తోటపల్లి, జడ్డంగి మున్నగు మన్యప్రదేశములను పరిపాలించారు. పెద్దాపురమునందును, బిక్కవోలునందును తురుష్కులను, తూర్పుదేశమున శత్రురాజులను జయించారు. ఈయన 1607లో కాలధర్మము చెందారు.

తిమ్మరాజు గారి జేష్టపుత్రులైన శ్రీ వత్సవాయ రాయప (జగపతి) రాజు బహద్దరు (1607-1649) 1607లో పట్టాభిషికులయ్యారు. వీరిపాలనలో మరొక రెండు పరగణాలు జమీలో కలిసినవి. వీరునూ తండ్రిగారి వలే పరాక్రమశాలి. వీరు రంపకు 4 మైళ్ళ దూరమునున్న అమ్మయ్యగట్టు చెంత తురక సైన్యమును జయించారు. అనేక మన్నె రాజులను జయించి సామంతులుగా జేసుకొనెను. ఈ ప్రభువు రౌతులపూడిలోను, అన్నవరములోను కోటలు కట్టించారు. శ్రీ రాయజగపతి గారి కుమారులు తిమ్మరాజు, బలభద్రరాజు. వీరు 1649 నుండి 1688 వరకు పరిపాలించారు. వీరు పర్లాకోట, బావిణికోట, యోదుకోట, మన్యపు దుర్గములను వశము చేసుకొనిరి. సార్వభౌమ తిమ్మరాజు తమ బంధువైన నారాయణరాజు గారి చిల్లంగికోటను, వారిభూములను వశముచేసుకొని కిమ్మూరు పరగణాలలో కలుపుకొనిరి. సంతాన హీనుడైనందున వీరి తమ్ముడైన బలభద్రరాజు గారి కుమారుడు రెండవ రాయపరాజు 1688 నుండి 1714 వరకు పరిపాలించారు.

ఈయన జేష్టకుమారుడైన మూడవ (కళా) తిమ్మరాజు (1714-1734) తండ్రి మరణించుసరికి బాలుడగుట వలన వీరి తల్లి రాఘవమ్మ బాలుని పట్టాభిషిక్తుని జేసి తామే పరిపాలన భారము వహించారు. రుస్తుంఖాన్ అనే హాజీ హుస్సేన్ రాజమహేంద్రవరము ఫౌజుదారిగా నున్న సమయములో సైన్యసమేతముగా పెద్దాపురము వెళ్ళి పాండవులమెట్ట వద్ద రాఘవమ్మగారికి తమ కుమారు లిరువరిని తనవద్దకు పంపిన యెడల రాజ్యము వారికి స్థిరపరచి పోయెదనని వర్తమానమంపెను. ఖానుని బలమెరిగి చేయునదేమున లేక తమ పుత్రులిద్దరిని పంపించారు. కాచిన నూనెను వెన్నుపై పోయించి రుస్తుంఖాన్ వారివురిని చంపించెను. ఈ వార్తవిని రాఘవమ్మగారు, మిగిలిన క్షత్రియ స్త్రీలు అగ్నిజ్వాలలకు ఆహుతిలయ్యారు. పెద్దాపుర సంస్థానము మహమ్మదీయుల వశమైనది. 3వ తిమ్మరాజుగారి పుత్రుడు జగపతి కప్పుడు ఏడు మాసముల వయసు. ఇతడిని విజయనగర సంస్థాదీశుడైన పెదవిజయరామ గజపతి విజయనగరము తీసుకొచ్చి సీతారామ సార్వభౌమ కుమారుడగు ఆనందరాజుతో పాటు పెంచారు. జగపతి విజయనగర కోటలో పెరిగి 16 సంవత్సర వయస్సులో నున్నపుడు విజయరామ గజపతి పెద్దాపుర సంస్థానమును తిరిగి రాబట్టి ఈయనను పట్టాభిషిక్తుని గావించారు. ఈ గజపతిరాజు గారే చెందుర్తి యుద్ధమున విజయనగర మహారాజు ఆనందరాజు నెదురించి పోరాడి పరాజితులై పలాయనం గావించారు. తదుపరి ఆనంద గజపతి సామర్లకోటలోనున్న ఫ్రెంచివారిని గొట్టుటకై వెళ్తూండగా జగపతిరాజును, పిఠాపురాధీశుడైన రావు నీలాద్రిరాయని కాకర్లపూడి వారితో కలసి కొన్నివేల సైన్యముతో ఆనంద గజపతిని సామర్లకోట సమీపమునున్న ఉండూరు వద్ద 1759 డిసెంబరులో నెదుర్కొన్నారు. గజపతి ధాటికి నిలువలేక జగపతిరాజు మరణించారు.

శ్రీ వత్సవాయి నాల్గవ తిమ్మజగపతిరాజు గారికి (1760-1797) అప్పుడు ఏడేడ్ల వయస్సు. వీరు పూసపాటి ఆనందగజపతి గారి భార్య చంద్రయ్యమ్మ గారి సంరక్షణమున పెరిగెను. ఆనంద గజపతి హైదరాబాద్ ముట్టడి సందర్భములో దారిలో కాలధర్మము నొందెను (1760). చంద్రయమ్మగారు తమ దత్తుడగు చిన విజయరామగజపతిని, నాల్గవ తిమ్మజగపతిని తోడ్కొని నవాబుతో రాజీపడి విజయనగర రాజ్యము విజయరామ గజపతికిని, పెద్దాపుర రాజ్యము 4వ తిమ్మజగపతికిని స్థిరపరచెను. వీరివురును ప్రియమిత్రులు.

శ్రీ వత్సవాయ నాల్గవ రాయజగపతి (1797-1804) 22 సం.ల ప్రాయమున తండ్రిగారి యనంతరమున 1797లో రాజ్యమునకు వచ్చారు. వీరి కాలముననే సంస్థానమున శాశ్వత కర నిర్ణయము (పెర్మనెంట్ సెటిల్‌మెంట్) చేయబడి సంస్థానము విస్తరింపబడినది. వీరి కుమారుడు బుచ్చితిమ్మరాజు (తిమ్మ జగపతిరాజు) 1807లో స్వర్గస్తులైనారు. జ్ఞాతులగు భీమవరపు కోట శాఖకు చెందిన శ్రీ వత్సవాయ జగన్నాథరాజు 1808 జూలై 29 న సంస్థానమును వశపరచుకొన్నారు. రాణీగారు దావాలో తామున్నంత కాలమును సంస్థానము పాలించుటకును, ఆమె యనంతరము జమీందారీ జగన్నాధరాజు గారికి చెందుటకును, జమీందారీలోని కొఠాం ఎస్టేట్ జగన్నాధరాజుకి జీవనాధారముగా నిచ్చుటకు తీర్పు ఇవ్వబడినది. రాణి లక్ష్మీనరసయమ్మ గతించిన వెంటనే రాణి బుచ్చిసీతయ్యమ్మగారు (1828-1833) 13-03-1828న సంస్థానము స్వాధీనపరచుకొనిరి. ఈమె తర్వాత రాణి బుచ్చిబంగారయ్యమ్మగారు వత్సవాయ నరసరాజుగారి పౌతృడగు వెంకటపతిరాజనే బాలుడిని వెంకటజగపతిరాజు అను పేరుతో పెంచారు. 1834, 1835 సం.లలో సంస్థానము మరల దొరతననమువారి పరిపాలనమున నుండెనట. బుచ్చి బంగారయ్యమ్మగారు రెండేడ్లు పాలించి స్వర్గస్తులయ్యారు.

భీమవరపు కోట: శ్రీ వత్సవాయి జగన్నాధరాజు గారి జేష్ఠపుత్రుడు శ్రీ సూర్యనారాయణ జగపతిరాజు 15-09-1838 న కొఠాం ఎస్టేటెను సంపాదించినారు. మార్చి 1839లో పెద్దాపురము సంస్థానము కూడ వీరిపరమైంది. 1847లో పెద్దాపురము సంస్థానము దొరతనము వారి పాలయినది. అప్పుడు తుని, కొఠాం ఎస్టేట్లు కలిపివెయబడినవి. సూర్యనారాయణజగపతి బహదురువారు తమ రాజధానిని తునికి మార్చారు. వీరి యనంతరము జేష్ఠపుత్రుడు వెంకట జోగిజగన్నాధ జగపతిరాజు స్వల్పకాలము తుని ఎస్టేట్ ను పాలించి స్వర్గస్తులయ్యారు. 1853లో జన్మించిన వీరి సోదరుడు శ్రీ వెంకట సింహాద్రిరాజుగారు రాజ్యపాలన చేసారు. వీరు 11-12-1903న వ్రాసిన వీలునామా ప్రకారము వీరి భార్య వెంకట సుభద్రయ్య గారికి కొఠాం ఎస్టేట్, చర స్థిరాస్తులు యవత్తూ దఖలు పడుటయే గాక తమ యిష్టం వచ్చిన పిల్లవానిని దత్తత చేసుకొనుటకు అధికారం లభించినది. వీరు వేదపాఠశాలను స్థాపించారు. వందలకొలది క్షత్రియ వివాహములు జరిపించారు. భీమవరపుకొట వాస్తవ్యులు శ్రీ వత్సవాయ వరాహ నృసింహరాజు గారి జేష్ఠ పుత్రుడగు సత్యనారాయణని దత్తత చేసుకొని వారికి "వెంకట సూర్యనారాయణ జగపతి బహద్దర్" అని పునర్నామకరణము చేసినారు. వీరికి పుత్రసంతానము కలుగలేదు. వీరు 1978లో కాలధర్మము నొందిరి. వీరి పరిపాలన కాలములో తుని ఎస్టేట్ ఆంధ్రరాష్టములో విలీనమైనది. వీరి మరణముతో తుని ప్రభువుల వంశమంతరించినది..

సాహితీ ప్రస్థానం[మార్చు]

 • ప్రాచీన కవులు

ప్రాచీన కాలంనుండీ పెద్దాపురం కవులకు నిలయం గా విలసిల్లింది వత్సవాయ మహారాజుల పాలనలో అష్టదిగ్గజ కవులు పోషించబడ్డారు, కవులకు అనేక సత్కార్యాలు జరిగినట్టు చారిత్రిక గ్రంధాలు, రచనల ద్వారా స్పష్టమవుతుంది వీరిలో కొందరు పెద్దాపురం వాసులు కాగా మరి కొందరు పెద్దాపురం సంస్థానంలో సత్కరింపబడినవారు పైడిపాటి జలపాలా మాత్యుడు, వెణుతురుబల్లి విశ్వనాధకవి, ఏనుగు పెదలచ్చన్న, ఏనుగు లక్ష్మణ కవి, చల్లా వెంకయ్య కవి పరవస్తు వెంకట రంగాచార్యులు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, పింగళి సూరనార్యుడు, ఆడిదం సూరకవి, తురగా రామకవి, వక్కలంక వీరభద్రకవి, మాగాపు శరభకవి, చావలి రామశాస్త్రి, ఆణివిళ్ళ వేంకట శాస్త్రి, వత్సవాయ రాయజగపతి వర్మ, సుసర్ల బ్రహ్మన్న శాస్త్రి, నలజర్ల గంగరాజు, బులుసు రామగోవింద శాస్త్రి, హోతా వేంకటకృష్ణ కవి, చిలుకూరి సోమనాథ శాస్త్రి, బుద్ధవరపు పట్టాభిరామయ్య, వత్సవాయి వేంకటనీలాద్రిరాజు, మానవల్లి రామకృష్ణ కవి పెద్దాపురం మహారాజులపై చాటువులు, రచించి పెద్దాపురం చరిత్ర గ్రంధాలు రచించి పెద్దాపురం మహారాజులచే సత్కరింపబడిన ప్రాచీన కవులు గా ప్రసిద్ధి చెందారు,

 • ఆధునిక కవులు

ఆధునిక పద్య గద్య కవులకూ పెద్దాపురం నిలయం గా భాసిల్లింది ఈ కవులలో కొందరు పెద్దాపురం వాసులు కాగా మరికొందరు పెద్దాపురం ఉద్యోగం నిమిత్తం వచ్చి స్థిరపడినవారు విస్సా అప్పారావు, వేదుల సత్యనారాయణశాస్త్రి, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, మధునాపంతుల వేంకట పరమయ్య, చెళ్ళపిళ్ళ సీతారామ మూర్తి, పోచిరాజు శేషగిరిరావు, మల్యాల జయరామయ్య, అల్లంరాజు లక్ష్మీపతి, ద్వివేది సత్యకవి బుద్ధవరపు చినకామరాజు, లింగాల లక్ష్మీ నరసింహారావు, చెళ్ళపిళ్ళ బంగారేశ్వర శర్మ, శ్రీ పాద కృష్ణశాస్త్రి, వడలి సుబ్బారాయుడు, మారెళ్ల పూడి వీరభద్రరావు, పంపన సూర్యనారాయణ, పింగళి వెంకట రమణ రావు, దార్ల తిరుపతి రావు, సి. రామచంద్రరావు, జోస్యుల కృష్ణబాబు, గుర్లింక ధర్మరాజు, చల్లా విశ్వనాధం, యాసలపు సూర్యారావు, వంగలపూడి శివకృష్ణ 

విద్యా ప్రస్థానం[మార్చు]

భారత దేశ స్వాతంత్ర్యానికి కి పూర్వమే పెద్దాపురం విద్యాపురంగా బాసిల్లింది రాజరిక కాలంలో అక్షరాస్యత విషయంలో వెనుకబడిన పెద్దాపురం సంస్థానం బ్రిటీష్ పరిపాలన సమయంలో ఊపందుకుంది 1891లో ఎడ్వర్డ్ ఇమ్మానుయేల్ మహాశయుడు స్థాపించిన లూథరన్ ఉన్నత పాఠశాల పెద్దాపురంలో పేరెన్నికగన్న విద్యాలయం తదనంతరం అనేక పాఠశాల లు నెలకొల్పబడి నేటి పెద్దాపురం విద్యాకేంద్రంగా బాసిల్లుతుంది.

పురపాలక సంఘ ప్రస్థానం[మార్చు]

పెద్దాపురం మున్సిపాలిటీ  ఆంధ్ర రాష్ట్రం లోనే రెండవ మరియు అతి పురాతనమైన మున్సిపాలిటీ గా పేరు సంతరించుకుంది

పెద్దాపురం సంస్థానం 1847 వరకూ వత్సవాయ సూర్యనారాయణ జగపతి బహదూర్ పాలన కొనసాగింది. 1847లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ / జాన్ వాట్స్ కంపెనీ పెద్దాపురంను ఆక్రమించడం జరిగింది. తరువాత బ్రిటిష్ వారు పెద్దాపురంను రెవిన్యూ డివిజన్ చేసి మున్సబు కోర్టు నిర్మించారు. 1857 తిరుగుబాటు తర్వాత భారత దేశంలో కంపెనీ పాలన రద్దు చేయబడి 1858 నుండి బ్రిటీష్ రాజ్ ఆవిర్భవించింది. ఆ తరువాత కొంత కాలానికి 1902లో బ్రిటీషు వారిచే "టౌన్ హాల్" నిర్మించబడి 1915లో రాష్ట్రంలో నే రెండవ మున్సిపాలిటీ గా పెద్దాపురం ఆవిర్భవించబడింది. శ్రీ. వి. కె అనంత కృష్ణ అయ్యర్ మరియు శ్రీ. అభినవ పట్నాయక్ లు బ్రిటీషు గవర్నమెంటు వారిచే నియమించబడి 1915 నుండి 1918 వరకూ పెద్దాపురం మున్సిపాలిటీకి చైర్ మెన్ లుగా వ్యవహరించగా వీరి అనంతరం బ్రిటీషు వారిచే నియమింపబడిన పెద్దాపురం వాస్తవ్యుడైన మొట్టమొదటి చైర్మెన్

 • శ్రీ ముప్పన రామారావు(1956 – 1972 & 1981- 1986) వరుసగా 4 సార్లు పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికై 1961-66 కాలానికి ఛాంబర్ చైర్మెన్ గా ఏకగ్రీవం గా ఎన్నిక కాబడి ఇప్పటి వరకూ ఎక్కువ కాలం చైర్మన్ గా చేసిన వ్యక్తి గా గుర్తింపు పొందారు.

పైన ఉదహరించిన వాటి మద్య కాలాలలో ఏదేని కారణం చేత చైర్మన్ ఎన్నికలు నిర్వహించనప్పుడు ఆర్ డి. ఓ గానీ జాయింటు కలక్టరు వారు గానీ లేక ఇతర అధికారులెవరైనా కానీ పురపాలకం నిర్వాహక భాద్యతను చేపట్టడం జరుగుతుంది దీనినే “స్పెషల్ ఆఫీసర్” పాలన గా వ్యవరిస్తారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు గలరు

ఎం.యల్.ఏగా ఎంపిక కాబడిన వ్యక్తులు:


 • పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు

రెండు మున్సిపాల్టీలున్న నియోజకవర్గాల్లో పెద్దాపురం ఒకటి. పెద్దాపురం పట్టణంగా జనవరి 1, 1915లో ఏర్పడగా, సామర్లకోట 1950లో ఏర్పడింది. ఈ రెండు మున్సిపాల్టీలు ద్వితీయశ్రేణిలో ఉన్నాయి.

ఈ ప్రాంతం మెట్ట, ఏలేరు, డెల్టాల కలయిక. 1952లో పెద్దాపురం, 1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఆవిర్భవించాయి. 1962 వరకు రెండూ వేర్వేరుగానే కొనసాగాయి. 1967లో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు. 1952 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆరుగురు, కమ్యూనిస్టులు ఇద్దరు, తెదేపా తరఫున నలుగురు విజయం సాధించారు. 2009లో కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ నుంచి పంతం గాంధీమోహన్‌ గెలుపొందారు. 2014లో నిమ్మకాయల చినరాజప్ప ఎం ఎల్ ఎ గా గెలుపొందిన ఈయన ప్రస్తుతం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగానూ మరియు హోం మంత్రిగాను యున్నారు.

1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్నిచోట్లా కమ్యూనిస్టులు విజయపతాకం ఎగురవేస్తే పెద్దాపురం నియోజకవర్గంలో కాడెద్దుల గుర్తుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి తోట రామస్వామి తన సమీప స్వతంత్ర అభ్యర్థి దూర్వాసుల వెంకట సుబ్బారావుపై విజయం సాధించారు.

1955లో పెద్దాపురానికి దూర్వాసుల వెంకట సుబ్బారావు (సి.పి.ఐ) చల్లా అప్పారావు (కె ఎల్ పి = కృషి లోక్ పార్టీ) పై విజయం సాధించారు. అలాగే

1955లో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గం అయిన తర్వాత ఎన్నికల్లో సామర్లకోటకి చెందిన ఉండవిల్లి నారాయణమూర్తి కమ్యూనిస్టు పార్టీ నుంచి పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు.

1962లో జరిగిన ఎన్నికల్లో పంతం పద్మనాభం (కాంగ్రెస్‌) దూర్వాసుల వెంకట సుబ్బారావు (సి.పి.ఐ) పై విజయం సాధించారు. అలాగే 1962లో జరిగిన ఎన్నికల్లో సామర్లకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మహ్మద్‌ ఇస్మాయిల్‌ పోటీ చేసి విజయం సాధించారు.

1967లో పెద్దాపురం, సామర్లకోట రెండు ఒకే నియోజకవర్గంగా కలిసి పోయాయి

1967లో ఉండవిల్లి నారాయణమూర్తి ( సీపీఐ ) కొండపల్లి కృష్ణమూర్తి (కాంగ్రెస్‌) పై 1972లో కొండపల్లి కృష్ణమూర్తి (కాంగ్రెస్‌) ఉండవిల్లి నారాయణమూర్తి ( సీపీఐ ) పై 1978లో ఉండవిల్లి నారాయణమూర్తి (కాంగ్రెస్‌) ఏలేటి దానయ్య (జనతా పార్టి) పై 1983లో బలుసు రామారావు ( తెదేపా ) గోలి రామారావు (కాంగ్రెస్‌) పై 1985లో బలుసు రామారావు ( తెదేపా) దూర్వాసుల సత్యనారాయణ మూర్తి (కాంగ్రెస్‌) పై 1989లో పంతం పద్మనాభం (కాంగ్రెస్‌) బొడ్డు భాస్కరరామారావు (తెదేపా) పై 1994లో బొడ్డు భాస్కరరామారావు (తెదేపా) పంతం పద్మనాభం (కాంగ్రెస్‌) పై 1999లో బొడ్డు భాస్కరరామారావు ( తెదేపా ) పంతం గాంధీ మోహన్‌ (కాంగ్రెస్‌) పై 2004లో తోట గోపాలకృష్ణ ( కాంగ్రెస్‌ ) బొడ్డు భాస్కరరామారావు ( తెదేపా ) పై 2009లో పంతం గాంధీ మోహన్‌ (ప్రజారాజ్యం) బొడ్డు భాస్కరరామారావు ( తెదేపా ) పై 2014లో నిమ్మకాయల చినరాజప్ప ( తెదేపా ) తోట సుబ్బారావు నాయుడు (వై ఎస్ అర్ సి పి) పై గెలుపొంది ప్రస్తుతం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగానూ మరియు హోం మంత్రిగాను యున్నారు.

పెద్దాపురం అసెంబ్లీ నియోజక వర్గములో 1,51,642 ఓటర్లు గలరు

పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం, సామర్లకోట రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్నాయి.

 • మున్సిపాలిటీలు: పెద్దాపురం, సామర్లకోట
 • మండలాలు: పెద్దాపురం, సామర్లకోట
 • నియోజకవర్గంలో గ్రామాలు: పెద్దాపురం మండలంలో 23 గ్రామాలు, సామర్లకోటలో 18 గ్రామాలు, రెండు మున్సిపాలిటీలు
 • విస్తీర్ణం: 288 చదరపు కిలోమీటర్లు

వ్యవసాయం: ఏలేరు కింద సాగు: 2,867హెక్టార్లు కాలువల కింద: 1,045 హెక్టార్లు చెరువుల కింద: 1,278.47 హెక్టార్లు బోర్ల కింద: 1,433.46 హెక్టార్లు ఇతర సాగు విధానం కింద: 364 హెక్టార్లు

నట ప్రస్థానం[మార్చు]

భారత దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండీ కూడా పెద్దాపురం నాటక రంగానికి ప్రసిద్ధి పెద్దాపురంలో ఒకనొకప్పుడు 21 నాటక సమాజాలు వెల్లువిరిసాయి ఇక్కడి నుండి కళాకారులు నాటక ప్రదర్శనలివ్వడానికి ఇతర ప్రాంతాలకు తీసుకు వెల్లబడేవారు, తరువాత కాలంలో ఇక్కడ నుండి చాలా మంది సినీ రంగ ప్రవేశం కూడా చేశారు వారిలో కొందరు ప్రముఖుల వివరాలు

భౌగోళిక విస్తీర్ణం[మార్చు]

పెద్దాపురం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో పెద్దాపురం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో పెద్దాపురం మండలం యొక్క స్థానము
పెద్దాపురం is located in ఆంధ్ర ప్రదేశ్
పెద్దాపురం
పెద్దాపురం
ఆంధ్రప్రదేశ్ పటములో పెద్దాపురం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°05′N 82°08′E / 17.08°N 82.13°E / 17.08; 82.13
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము పెద్దాపురం
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,18,045
 - పురుషులు 59,139
 - స్త్రీలు 58,906
అక్షరాస్యత (2001)
 - మొత్తం 61.29%
 - పురుషులు 64.11%
 - స్త్రీలు 58.47%
పిన్ కోడ్ 533437

పెద్దాపురం 17.08° N 82.13° ఏ అక్షాంశాం, రేఖాంశాలపై ఉంటుంది[1]. సముద్రమట్టం నుండి 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

జనాభా[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం పెద్దాపురం మండల జనాభా 1,18,045 . ఇందులో 50.1% పురుషుల సంఖ్య, 49.9% స్త్రీల సంఖ్య ఉన్నారు. పెద్దాపురం మండలంలో అక్షరాస్యతా శాతం 61.29%, ఇది మన జాతీయ అక్షరాస్యతాశాతం 59.5% కన్నాకూడా ఎక్కువ: అందులో పురుషుల అక్షరాస్యతా శాతం 64.11%, మరియు స్త్రీల అక్షరాస్యతా శాతం 58.47%.

పెద్దాపురము మండల జనాభా:

గ్రామీణ పట్టణ మొత్తము
గృహములు: 18,139 11,065 29,204
మొత్తము జనాభా: 72,525 45,520 118,045
పురుషుల సంఖ్య: 36,657 22,482 59,139
స్త్రీల సంఖ్య: 35,868 23,038 58,906
6 సం. లోపు పిల్లలు: 09,502 05,113 14,615
6 సం. లోపు బాలురు: 04,831 02,646 07,477
6 సం. లోపు బాలికలు: 04,671 02,467 07,138
మొత్తము అక్షరాస్యులు: 35,342 28,053 63,395
మొత్తము నిరక్షరాస్యులు: 37,183 17,467 54,650

పెద్దాపురానికి సంబందించిన ప్రముఖులు[మార్చు]

పెద్దాపురంలో జన్మించి ఇతరప్రాంతాలు మరియు విదేశాలలో రాణించిన వారిలో ఎందరో ప్రముఖులు ఉన్నారు అలాగే ఎక్కడో జన్మించి నప్పటికీ ఇక్కడ నివసించినత్రమాత్రం చేత పెద్దాపురాన్ని తమ జన్మస్థలంగా గర్వంగా చెప్పుకుంటారు కొందరు వారందరి వివరాలు చూడండి

పెద్దాపురంలోని పంచాయితీ గ్రామాలు[మార్చు]

పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో దర్శించవలసిన ప్రదేశాలు[మార్చు]

పాండవుల గుహలు

మూలాలు[మార్చు]

పెద్దాపుర సంస్థాన చరిత్రము (పుస్తకము) ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణము తూమాటి దోణప్ప

 1. ఫాలింగ్ రెయిన్ జీనోమిక్స్ సంస్థ - పెద్దాపురం

పెద్దాపురం మండలం పిన్ కోడ్ వివరాలు

పెద్దాపురం మండలం జనాభా వివరాలు

పెద్దాపురం మండలంలోని గ్రామాల వివరాలు

ఆంధ్ర ప్రదేశ్ లోని పంచాయితీ గ్రామాలు

జనాభా లెక్కలు వివరాలు