పెమ్మసాని నాయకులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గండికోట ప్రాకారములోని కొంత భాగము

పెమ్మసాని నాయకులు 300 సవంత్సరాల పాటు గండికోట పాలకులుగా ఖ్యాతి గడించారు. పెమ్మసాని నాయకులు కమ్మ కులానికి చెందినవారు.[1] 1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పతనం తరువాత స్వతంత్రంగా కొంత కాలం గండికోట సీమ పాలించారు. 1652లో జరిగిన గండికోట యుద్ధంతో వీరి రాజ్యం పతనం అయింది. ముఖ్యముగా విజయనగర సామ్రాజ్య కాలములో గండికోట పాలకులుగా ప్రశస్తమగు విజయనగర సేనాధిపతులుగా పేరు ప్రఖ్యాతులుగాంచిరి. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండకు చెందిన ముసునూర్ల గోత్రీకులు.

1369వ[2] సంవత్సరములో ఓరుగల్లు సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరు విజయనగరమునకు తరలిపోయి ఆ తరువాత మూడు శతాబ్దములు దక్షిణ భారతదేశమును హిందూమతమును రక్షించుటకు పాటుపడిరి.

వంశమూలాలు[మార్చు]

చారిత్రకాధారములను బట్టి పెమ్మసాని నాయకుల వంశానికి మూలపురుషుడు వేంకటపతి నాయుడు. ఈతను బుక్కరాయల కడ సేనాధిపతిగా పనిచేసెను. పిమ్మట కుమార తిమ్మా నాయుడు బుక్కరాయనికి పలుయుద్ధములలో తోడ్పడెను. కుమారతిమ్మ జమ్మలమడుగు, వజ్రకరూరు, కమలాపురం, తాడిపత్రి, పామిడిలలో కోటలు కట్టించెను. వీరు కమ్మ కులస్తులు.

తిమ్మా నాయుడు[మార్చు]

పెమ్మసాని వంశమునకు యశః కీర్తులు సాధించినవాడు తిమ్మా నాయుడు. ప్రౌఢ దేవరాయలవద్ద (రెండవ దేవరాయ; 1420-1448) సేనాధిపతిగా గుల్బర్గా యుద్ధములో అహమ్మదు షాను వోడించి యాడకి పరగణాను 1422 లో బహుమతిగా పొందెను. క్రమముగా గుత్తి, గండికోటలను కూడా తన ఆధీనములోనికి తెచ్చుకొనెను. గండికోటను శత్రుదుర్భేద్యమగు కోటగా బలపరిచెను. తిమ్మానాయుని ప్రాభవము కృష్ణా నది నుండి అనంతపురమువరకు వ్యాపించెను. ఈతని సంవత్సర ఆదాయము ఇరువది ఇదు లక్షలు కాగా తొమ్మిది లక్షలు విజయనగర రాజునకు కప్పముగా చెల్లించుచుండెను. నాణెములు వీరభద్రుని బొమ్మతో ముద్రించెను. పెక్కు సంవత్సరములు పరిపాలించి పలు దేవాలయములు, చెరువులు, ఆరామములు కట్టించెను. ఈతని తరువాత కొడుకు వీరతిమ్మా నాయుడు రాజ్యము చెసెను.ఈతను ఆలం వెంకటపతి కుమారుడు.ఈతని గురుంచి కడపజిల్లా శాసనములు అనే పుస్తకములో వివరించబడింది. ఈతనిని ప్రౌఢరాయలు, పావురాళ్ళు మీద కొల్వు వుంచగా పావురాళ్ళ తిమ్మా నాయుడని పేరు వచ్చింది.ఈతని భార్య పేరు వెంకటమ్మ. వీరికి చిరకాలం సంతానములేకపోగా చివరికి యాడికిలోని వీర్భద్రస్వామి దయవల్ల ఒక శిశువు జన్మించాడని,ఆ శిశువుకు వీరతిమ్మానాయుడు అని నామకరణం చేశారు.

వీర తిమ్మా నాయుడు[మార్చు]

శ్రీకృష్ణ దేవరాయలు (సా.శ.1509-1529)అనుజ్ఞ తీసుకొని తిరిగి యాడికి గ్రామాధికారిగా వీరతిమ్మానాయుడు తిరిగి వచ్చాడు. ఈతను వేయించిన నాణెములను బట్టి తానికి ఇష్టదైవమగు యాడికి వీరభద్రుని భక్తితో సేవించి, తన ఇష్టదైవమైన వెంకటరమణ ప్రతిమను ముందర ఉండేటట్టు వెనుక వీరభద్ర అనే నాగరం అక్షరాలతో నాణెములను ముద్రించెను. ఇతడు తన తల్లి పేరుతో తాడిపత్రికి 2 మైళ్ళదూరంలో వెంకటాంపల్లి అనేగ్రామాన్ని నిర్మించాడు. ఈతను శ్రీకృష్ణదేవరాలకాలం నాటికి 40సం.వాడై ఉండవచ్చును.

రామలింగ నాయుడు[మార్చు]

వీరతిమ్మానాయునికి చెన్నప్పయను కుమారుడు గలడు. చెన్నప్పకు రామలింగ, పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులు గలరు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించెను. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించెను. ఈతనివద్ద మహాయోధులగు 80,000 సైనికులు గలరు. విజయనగరములో బస చేయుటకు 1430 కుంటల స్థలము గలదు. శ్రీకృష్ణదేవరాయలకు సామంతునిగా, యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, గోల్కొండ, అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి కృష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యెను. రాయచూరి యుద్ధములో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలెను. పెమ్మసాని నరసింహనాయుడు రాయచూరి యుద్ధములో తన అన్నకొడుకైన రామలింగ నాయుని పరాక్రమాలను కొనియాడుతూ ఒక చాటు పద్యములో "ముగ్గురు వజీరులను ముక్కపరిచె" అని చెప్పెనని రాయవాచకము ఉటంకిస్తున్నది.[3] రామలింగ అనంతపూరు మండలములో పలు దేవాలయములు కట్టించెను.

రామలింగనాయుని తమ్ముడు పెద్దతిమ్మానాయుడు కూడా మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యెను.

రెండవ తిమ్మా నాయుడు[మార్చు]

రెండవ తిమ్మానాయుడు కృష్ణదేవరాయని ఉత్కళదేశ దండయాత్రలో పాల్గొని ఉదయగిరి, అద్దంకి, కొండపల్లి, రాజమహేంద్రవరము, కటకము (కటక్) లను జయించెను. రాయలవారి ఉమ్మత్తూరు దండయాత్రలో ముఖ్యపాత్ర పోషించెను.

బంగారుతిమ్మా నాయుడు[మార్చు]

1529వ సంవత్సరములో రాయలవారు మరణించిరి. అల్లుడగు రామ రాయలు సింహాసనమెక్కెను. బహమనీ సుల్తాను ప్రోద్బలముతో సలకము తిమ్మరాజు విజయనగరముపై దండెత్తెను. రామరాయలు గండికోటకు పారిపోయిరాగా బంగారుతిమ్మ ఆతనికి ఆశ్రయమిచ్చి తిమ్మరాజుపై యుద్ధమునకు వెడలెను. కోమలి వద్ద జరిగిన పోరులో సలకము రాజుని సంహరించి బహమనీ సైన్యమును పారద్రోలి రామ రాయలను విజయనగర సింహాసనముపై అధిష్ఠించెను. ఈ ఉదంతము పెమ్మసానివారి స్వామిభక్తికి, విశ్వాసమునకు, విజయనగరసామ్రాజ్య రక్షణాతత్పరతకు తార్కాణము.

తళ్ళికోట యుద్ధము తరువాత విజయనగర రాజ్యము పెనుగొండకు తరలిపోయెను. ఈ సమయమున శ్రీరంగరాయలు, వేంకటపతిరాయలకు అండగా పెదవీరానాయుడు అటుపిమ్మట బొజ్జతిమ్మానాయుడు, వేంకటగిరినాయుడు బీజాపూరు గోల్కొండ సైన్యములతో తలపడుచూ రాజ్యావశేషములను కాపాడుతూ వచ్చిరి.

పతనము[మార్చు]

చిన్నతిమ్మానాయుడు గండికోట చివరి పాలకుడు. ఈతని మంత్రి పొదిలి లింగన్న ప్రోద్భలముతో గోల్కొండ నవాబు పెద్ద సైన్యముతో మీర్ జుంలాను గండికోట వశము చేసుకొనుటకు పంపెను (1652). భీకరయుద్ధము జరిగినను కోట వశముకాలేదు. గండికోట అప్పగించినచో గుత్తి దుర్గమునకు అధిపతి చేస్తానని జుంలా బేరసారాలు చేశాడు. తిమ్మా నాయుడు అంగీకరించలేదు[4]. చివరికి మీర్ జుంలా లింగన్నకు లంచమిచ్చి చిన్నతిమ్మానాయునిపై విషప్రయోగము గావించి కోటను ఆక్రమించాడు. చిన్నతిమ్మనాయుని కొడుకు బాలుడగు పిన్నయ నాయుని ఆతని బంధువులు తప్పించి మైసూరు తీసుకొనివెళ్ళిరి. మిగిలిన అరువదియారు ఇంటిపేర్ల గండికోట కమ్మ వంశములు గంపలలో ఆభరణములు, విలువైన వస్తువులు పెట్టుకొని గుంటూరు, కార్వేటిరాజుపురము, మధుర, తిరునెల్వేలి, రామనాథపురములకు తరలివెళ్ళిరి. వీరందరు గంపకమ్మవారని, గండికోట కమ్మవారని వాడుకలోనికి వచ్చిరి.

కొందరు నాయకులు మధురనేలుచున్న విశ్వనాథ నాయకుని వద్ద, తంజావూరి నాయకుల వద్ద సేనానులుగా చేరిరి. ఫెద్దవీరప్ప నాయుడు, రుద్రప్ప నాయుడు మున్నగువారు సింహళదేశ యుద్ధములలో మధుర నాయకులకు విజయములు సాధించిపెట్టి కురివికులము మొదలగు జమీందారీలు పొందిరి.

బ్రిటిష్ వారి కాలములో కురివికులము జమీందారు పెమ్మసాని నందస్వామిదురై కొండలరాయస్వామి నాయుడు.

మూలాలు[మార్చు]

  1. Vijaya Ramaswamy. Wikisource link to Migrations in Medieval and Early Colonial India. Routledge. వికీసోర్స్. p. 169. 
  2. రాబర్ట్ సెవెల్, విజయనగర ఎంపైర్
  3. Tidings of the king By Phillip B. Wagoner పేజీ.204
  4. Dr Ghulam Yazdani Commemoration Volume, H. K. Sherwani, 1966, Dr Abul Kalam Azad Oriental Research Institute, Delhi

ఇవి కూడా చూడండి[మార్చు]

వనరులు[మార్చు]

  • రాయవాచకము, విశ్వనాథరాయ స్థానాపతి.
  • కృష్ణరాజవిజయము, కుమార ధూర్జటి.
  • గండికోట పతనము, కొసరాజు రాఘవయ్య
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  • పెమ్మసానివారిచరిత్రము, యమ్. లక్ష్మీనరసింహ శర్మ
  • Vijayanagara, Burton Stein, Cambridge University Press, 1989, p. 88-92, ISBN 0521266939
  • A Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma, 1945, Andhra University, Waltair
  • Quartely Journal of Mythic Society, Bangalore, Vol. 30 (2), p. 186
  • Carnatic Chronolgy: Hindu and Mahomedan, C. P. Brown, 1863, Bernard Quaritch, London, p. 64
  • Krishnadeva Raya, M. Rama Rao, 1971, National Book Trust, New Delhi, p. 17
  • A Forgotten empire (Vijayanagar) : A Contribution to the History of India by Robert Sewell (https://web.archive.org/web/20051202102715/http://historion.net/r.sewell-vijayanagar-history-india/)
  • Tidings of the king: a translation and ethnohistorical analysis of the Rayavachakamu by Phillip B. Wagoner. University of Hawaii Press, Honolulu. 1993, Page 138-139, ISBN 0-8248-1495-9 (http://www.questia.com/PM.qst?a=o&d=62773998 Archived 2011-06-05 at the Wayback Machine)
  • Further Sources of Vijayanagar History by K. A. Nilakanta Sastry, 1946 (http://www.archive.org/details/FurtherSourcesOfVijayanagaraHistory)
  • The Aristocracy of Southern India, A. Vadivelu, 1984, Mittal Publications, New Delhi, p. 167.