Jump to content

పేరాల భరతశర్మ

వికీపీడియా నుండి
పేరాల భరతశర్మ

పేరాల భరతశర్మ సంస్కృతాంధ్రాలలో విద్వత్కవి, పండితుడు, అవధాని, నాటకకర్త, నవలాకారుడు.[1]

బాల్యము, విద్యాభ్యాసము

[మార్చు]

భరతశర్మ 1933, ఫిబ్రవరి 2వ తేదీ ప్రకాశం జిల్లా, చీరాల పట్టణంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మమ్మ, బాలకృష్ణయ్య గారలు. ఇతడు గుంటూరు లోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్, సి.వి.ఆర్.కళాశాలలో బి.ఎ.చదివి 1953లో డిగ్రీ సంపాదించాడు. విశ్వనాథ సత్యనారాయణ ఇతని గురువు. ఇతడు డిగ్రీ తరువాత ప్రయివేటుగా చదివి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో ఎం.ఎ. పట్టాను 1959లో పొందాడు.

ఉద్యోగము

[మార్చు]

ఇతడు 1953లో డిగ్రీ పూర్తి అయిన వెంటనే తను చదువుకున్న ఎస్.ఆర్.ఆర్., సి.వి.ఆర్ కాలేజిలోనే ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరాడు. తక్కువ సమయంలోనే ఉపన్యాసకునిగా పదోన్నతి పొంది 1960వరకు అక్కడ పనిచేశాడు. తరువాత కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో 1960 నుండి 1985 వరకు ఉపన్యాసకుడిగా పనిచేశాడు. 1985లో మరొకసారి పదోన్నతి పొంది విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1991లో ఇతడు అధ్యాపక వృత్తి నుండి పదవీవిరమణ చేశాడు.

రచనలు

[మార్చు]

ఇతడు బహుగ్రంథకర్త. ఇతని రచనలలో ముఖ్యమైనవి.

  1. శ్రీ వేంకటేశ్వర కృపావర్షిణీ (కావ్యం)
  2. శారదానందలహరి (కావ్యం)
  3. మానస హిమాంశు (కావ్యం)
  4. ఇయం స్వతంత్ర భారతీ (కావ్యం)
  5. కళ్యాణ రాఘవము (గేయనాటిక)
  6. మహర్నవమి (గేయనాటిక)
  7. కళ్యాణ శాకుంతలము (గేయనాటిక)
  8. కృష్ణా తరంగిణి (సంగీత రూపకము)
  9. అభిషేకము (భాస నాటకానువాదము)
  10. మధురావిజయం (నవల)
  11. శింశుపా (నవల)
  12. కాదంబరీ రసజ్ఞత (విమర్శ)
  13. విశ్వనాథ - వాల్మీకి సుందరకాండ పరామర్శ (విమర్శ)
  14. మహాకవి సందేశము (విమర్శ) మొదలైనవి.

అవధానాలు

[మార్చు]

ఇతడు విజయవాడ, కాకినాడ, గుంటూరు, కంభంమెట్టు, కడప, చిలకలూరిపేట మొదలైన ప్రాంతాలతో పాటు ఆంధ్రదేశం నలుమూలలా తిరిగి 400కు పైగా అవధానాలు చేశాడు. ఇతని అవధానాలలో సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, పురాణం, నిషిద్ధాక్షరి, గణితం, అప్రస్తుత ప్రసంశ అనే అంశాలు ఉంటాయి.

అవధానాలలో పూరణలు

[మార్చు]

ఇతడు వివిధ అవధానాలలో చెప్పిన పద్యాలలో మచ్చుకు కొన్ని:

సమస్య
  • రతి వెగటయ్యే నేటి కవురా నవలాప్రియ నాగరాళికిన్

 స్తుతమతులౌ కవీంద్రుల విశుద్ధవచస్కుల జోలి పోరుగా
అతులవిశేషభావగరిమాద్భుతమాధురి గ్రోల లేరుగా
అతి విరసంబులై వెలయునట్టివె యచ్చున వచ్చుచుండ భా
రతి వెగటయ్యె నేటి కవురా నవలాప్రియ నాగరాళికిన్

  • చైనాలో పొంగిపోయే సాగరమేదో

ఆనన సుందర దీప్తుల
మానితలీల గనగ సుకుమారి కుమారిన్
మానసమున తలపులు తఱు
చై నాలో పొంగిపోయె సాగరమేదో!

దత్తపది
  • డైమండ్ - కళావర్ - ఆటీన్ - స్పేట్ అనే పదాలతో వేంకటేశ్వర స్తుతి

అరయన్ దుష్టవధార్థఖండనఘనుండై మండు డెంతేన్ కళా
వరు
డై పోల్చెడు గోపికారమణులన్ భావింప, శృంగార సం
భరణాటీన కళావిలాసివయి శుంభన్మూరి నీ బ్రాహ్మమౌ
సిరితో సృష్టిని గూర్చు నీశుడవు ప్రస్ఫేడాత్త ప్రజ్ఞానిధీ

వర్ణన
  • వరూధిని పిలుపు - ప్రవరుని నిరాకరణము పిమ్మట పశ్చాత్తాపము

శతమన్యుప్రముఖామరాధిప మనస్సంసక్తభావోజ్వలల్
సుతనుల్ రాగకలావిలాస గరిమా శుభ్రాంత రంగోత్తరల్
రతి సంభ్రాంత విలాస లాలసత రారా! యంచు బిల్వంగ దు
ర్మతినై నాడు వరూధినిన్ విడియ నర్థంబంనైది నాడన్ రతిన్

సత్కారాలు, గుర్తింపులు

[మార్చు]

ఇతడికి అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. ఇతని నవల మధురావిజయము ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ వారిచే ఉత్తమ నవలగా నిర్ణయించబడింది. 1999లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు అవధాన ప్రతిభా పురస్కారం ఇతడికి ప్రదానం చేశారు.

మరణము

[మార్చు]

అనేక అవధానాలు, రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలను ఆకట్టుకున్న పేరాల భరతశర్మ 2002, డిసెంబరు 13న విజయవాడలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 382–386.