Jump to content

పైకా తిరుగుబాటు

వికీపీడియా నుండి
పైకా తిరుగుబాటు

పైకా తిరుగుబాటు ద్విశతాబ్ది సందర్భంగా భారత తపాలా బిళ్ళ (2018)
Dateమే 1817 – డిసెంబర్ 1818
Location
ప్రస్తుత ఒడిశా రాష్ట్రం, పరిసర ప్రాంతాలు
Result

ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం

  • పైకా పాలనకు అధికారిక ముగింపు
  • పైకాలు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి రావడం
  • గజపతి, గఢ్జాత్ రాజులు కంపెనీ ఆధీనంలో కొనసాగడం
  • ఒడిశాపై ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణ స్థాపన
Belligerents
ఖుర్దా రాజ్యం

బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ

Commanders and leaders
బక్షి జగబంధు థామస్ హిస్లాప్
Strength
10,000కు పైగా 10,000కు పైగా
భువనేశ్వర్లోని పైకా తిరుగుబాటు నాయకుడు బక్షి జగబంధు విగ్రహం.

పైకా తిరుగుబాటు (పైకా బిద్రోహా లేదా పైక్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు) 1817లో భారతదేశంలో కంపెనీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ తిరుగుబాటు. బక్షి జగబంధు నాయకత్వంలో పైకాలు తిరుగుబాటు ప్రారంభించారు. జగన్నాథుడును ఒడియా ఐక్యతకు ప్రతీకగా ప్రదర్శిస్తూ ఈ ఉద్యమం ఒడిశా అంతటా వేగంగా వ్యాపించింది. చివరికి కంపెనీ సైన్యాలు దీన్ని అణచివేశాయి.[1]

పైకాలు

[మార్చు]
ఎడమ నుంచి కుడికి: కృతిబాస్ పట్సాని, మాధవ చంద్ర రౌత్రాయ్, బక్షి జగబంధు, జయి రాజగురు, పిండికి బహుబలేంద్ర.

పైకాలు ఒడిశాలోని గజపతి రాజులకు చెందిన రైతు యోధ దళాలు. వీరు శాంతి కాలంలో వ్యవసాయం చేసేవారు; యుద్ధ సమయాల్లో రాజులకు సైనిక సేవలు అందించేవారు.[2] పైకాలు వారి విధుల ఆధారంగా మూడు వర్గాలుగా విభజించబడ్డారు. తిరుగుబాటు సమయంలో వీరిని ప్రధానంగా ఖండాయత్లు నడిపించారు.

  • ప్రహరి – భూములను కాపాడే తొలి రక్షకులు; వీరు ఖడ్గాలను ఉపయోగించేవారు.
  • బనువా – విలువిద్యలో, తుపాకీ ప్రయోగంలో నైపుణ్యం కలిగిన యోధులు.
  • ధెంకియా – ఖండా ఖడ్గాలు, కవచాలతో ముందువరుసలో యుద్ధం చేసిన యోధులు.[3]

1803లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒడిశాను ఆక్రమించి, ఖుర్దా రాజును తొలగించిన తరువాత పైకాల ప్రతిష్ఠ, అధికారాలు తగ్గడం ప్రారంభమైంది. కంపెనీ పాలకుల దృష్టిలో పైకాల సేవలు అవసరం లేని వాటిగా మారాయి. వారికి ఇచ్చిన జాగీర్ భూములు స్వాధీనం చేసుకున్నారు. వారిని సాధారణ రైతుల మాదిరిగా పన్నులు చెల్లించాల్సిన వారిగా పరిగణించారు.[4]

తిరుగుబాటుకు కారణాలు

[మార్చు]

పైకా తిరుగుబాటుకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి.

ఒడిశాలో అప్పట్లో నాలుగు ప్రధాన వాణిజ్య నౌకాశ్రయాలు ఉండేవి. లక్షలాది వ్యాపారులు వాటి ద్వారా వ్యాపారం చేసేవారు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ గుత్తాధిపత్యంను కాపాడుకోవడానికి ఆ నౌకాశ్రయాలను మూసివేసింది. దీని వల్ల స్థానిక ప్రజలు అసంతృప్తికి గురయ్యారు.

పైకాలు, స్థానిక పరిపాలకులకు ఇచ్చిన వారసత్వ భూములను కంపెనీ స్వాధీనం చేసుకుంది. అనేక మంది పైకాలు తమ భూములను బెంగాలీ జమీందారులకు చాలా తక్కువ ధరలకు అప్పగించాల్సి వచ్చింది.[5]

కంపెనీ అధిక పన్నులు విధించడం వల్ల రైతులు, జమీందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉప్పుపై పన్నులు పెరగడం ప్రజలలో ఆగ్రహాన్ని రేపింది. ఒడిశాలో వాడుకలో ఉన్న కౌరీ నాణేల వ్యవస్థను రద్దు చేసి, వెండి నాణేలలోనే పన్నులు చెల్లించాలని కంపెనీ ఆదేశించింది. ఇది ప్రజలకు మరింత భారంగా మారింది.

1803లో బ్రిటిష్‌లు మరాఠాలను తరిమికొట్టి ఒడిశాను ఆక్రమించిన తరువాత పరిస్థితి మరింత దిగజారింది. ఖుర్దా రాజు ముఖుంద దేవ IIతో కర్నల్ హార్కోర్ట్ ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఆ ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయలేదు. దీనికి నిరసనగా జయి రాజగురు 2,000 పైకాలతో నిరసన వ్యక్తం చేశాడు. చివరకు రాజగురును పట్టుకొని 1806లో మరణదండన విధించారు. ఖుర్దా రాజును పూరీకి బహిష్కరించారు. దీంతో స్థానిక పాలన కూలిపోయింది, పైకాల శక్తి క్షీణించింది.[5]

నాయకులు, పాల్గొన్నవారు

[మార్చు]

పైకా తిరుగుబాటుకు బక్షి జగబంధు నాయకత్వం వహించాడు. ఆయన ఖుర్దా రాజు సైన్యాధ్యక్షుడు. 1814లో ఆయన కుటుంబ ఆస్తి “కిల్లా రోరంగ్”ను ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. దీనివల్ల ఆయన పేదరికంలోకి జారిపోయాడు.

1817 మార్చిలో తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు పైకాలు జగబంధు నాయకత్వంలో ఏకమయ్యారు. ఈ ఉద్యమానికి జమీందారులు, సామంతులు, సాధారణ ప్రజలు మద్దతు ఇచ్చారు. ఒడియా సమాజ ఐక్యతకు జగన్నాథుడిని ప్రతీకగా భావించారు. గజపతిని జగన్నాథుడి ప్రతినిధిగా చూశారు.

కరిపూర్, మృచ్‌పూర్, గోల్రా, బలరాంపూర్, బుడ్నకేరా, రూపాసా ప్రాంతాల జమీందారులు పైకాలకు మద్దతిచ్చారు. తిరుగుబాటు బనపూర్, ఖుర్దా నుంచి ప్రారంభమై పూరీ, పిపిలి, కటక్, కనికా, కుజంగ్, పట్టముండై తదితర ప్రాంతాలకు వ్యాపించింది.

కనికా, కుజంగ్, నయాగఢ్, ఘుముసూర్ రాజులు జగబంధుకు సహకరించారు. జడుపూర్‌కు చెందిన దలబేహెరా మిర్హైదర్ అలీ అనే ముస్లిం నాయకుడు కూడా తిరుగుబాటులో ముఖ్య పాత్ర పోషించాడు.[6]

తిరుగుబాటు పరిణామం

[మార్చు]

1817 మార్చిలో ఘుముసూర్ ప్రాంతానికి చెందిన సుమారు 400 మంది ఖోండ్లు ఖుర్దాలోకి ప్రవేశించి కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించారు. జగబంధు నేతృత్వంలోని పైకాలు వారితో కలిశారు. వారు బనపూర్‌లోని పోలీస్ స్టేషన్, తపాలా కార్యాలయాన్ని దోచుకొని తగలబెట్టారు.

తరువాత తిరుగుబాటుదారులు ఖుర్దాకు చేరుకొని ప్రభుత్వ భవనాలు, ఖజానాను ధ్వంసం చేశారు. మరో దళం పరగణా లెంబాయిని ఆక్రమించి కంపెనీ అధికారులను హతమార్చింది.[4]

కటక్ మేజిస్ట్రేట్ ఇ. ఇంపే నేతృత్వంలోని కంపెనీ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయడానికి సైన్యాన్ని పంపింది. లెఫ్టినెంట్ ప్రిడౌర్ ఖుర్దాకు, లెఫ్టినెంట్ ఫారిస్ పిపిలికి పంపబడ్డారు. పైకాల దాడులతో వారు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఫారిస్ యుద్ధంలో మరణించాడు.

కెప్టెన్ వెల్లింగ్టన్ ఆధ్వర్యంలో పంపిన మరో సైన్యం 1817 ఏప్రిల్ 9న ఖుర్దాను తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడ మార్షల్ లా అమలు చేశారు.[7]

కానీ ఇదే సమయంలో బక్షి జగబంధు నేతృత్వంలోని తిరుగుబాటుదారులు పూరీని ఆక్రమించారు. కంపెనీ సైన్యం కటక్‌కు వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. అనంతరం కెప్టెన్ లె ఫెవ్రే నేతృత్వంలోని సైన్యం తిరుగుబాటుదారులను ఓడించి పూరీని తిరిగి స్వాధీనం చేసుకుంది. రాజును పట్టుకుంది.[4]

1817 మే నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒడిశా మొత్తం మీద మళ్లీ నియంత్రణ సాధించింది. అయినప్పటికీ ప్రాంతంలో శాంతి నెలకొనడానికి చాలా కాలం పట్టింది.

ప్రభావాలు

[మార్చు]

1817 మేలో కంపెనీ ప్రభుత్వం ఖుర్దాలో ప్రత్యేక న్యాయమూర్తులను నియమించి తిరుగుబాటుదారులపై విచారణ జరిపింది. మరణదండన, కారాగార శిక్షలు, దేశనిర్బంధం వంటి శిక్షలు విధించబడ్డాయి. 1818 నుండి 1826 వరకు కంపెనీ సైన్యం అడవుల్లో దాక్కున్న తిరుగుబాటుదారులను పట్టుకోవడానికి అనేక దాడులు చేపట్టింది. చివరకు జగబంధు 1825లో లొంగిపోయాడు. ఆయనను కటక్‌లో ఖైదీగా ఉంచారు. 1829లో అక్కడే మరణించాడు.[8] తిరుగుబాటుకు కారణాలను తెలుసుకోవడానికి కంపెనీ ప్రత్యేక కమిషన్‌ను నియమించింది. కటక్ కమిషనర్ రాబర్ట్ కెర్ పరిపాలనా మార్పులు చేపట్టాడు. అయినప్పటికీ ఒడిశాను మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీల మధ్య భూసంబంధ మార్గంగా మాత్రమే కంపెనీ భావించింది.[9]

తరువాత కూడా ఒడియా ప్రతిఘటన కొనసాగింది. 1827లో తపంగా ఉద్యమం, 1835లో బనపూర్ తిరుగుబాటు వంటి సంఘటనలు జరిగాయి.[10] ఇంకా డోరా బిసోయి, చక్ర బిసోయి నేతృత్వంలోని ఖోండ్ తిరుగుబాట్లు, కోల్ తిరుగుబాటు, వీర సురేంద్ర సాయి నాయకత్వంలోని సంబల్పూర్ ఉద్యమం, ధరణీధర్ నాయక్ నేతృత్వంలోని భుయాన్ ఉద్యమం వంటి అనేక తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి.

2017 అక్టోబరులో ఒడిశా ప్రభుత్వం పైకా తిరుగుబాటును 1857 భారత తిరుగుబాటు స్థానంలో “భారత తొలి స్వాతంత్ర్య సమరం”గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.[11] 2021లో రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పైకా తిరుగుబాటును తొలి స్వాతంత్ర్య యుద్ధంగా పిలవలేమని పేర్కొన్నప్పటికీ, భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి ప్రజా తిరుగుబాట్లలో ఇది ఒకటని, 1817 నుండి 1825 వరకు కొనసాగిందని చెప్పారు. అలాగే దీనిని NCERT 8వ తరగతి చరిత్ర పాఠ్యాంశంలో చేర్చుతామని తెలిపారు.[12]

పైకా తిరుగుబాటు స్మారకం

[మార్చు]

భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బరుణీ కొండల సమీపంలో 10 ఎకరాల భూమిలో పైకా తిరుగుబాటు స్మారకాన్ని నిర్మిస్తున్నారు. దీని శంకుస్థాపనను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2019 డిసెంబర్ 7న చేశారు.[12]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ Kalia, Ravi (1994). Bhubaneswar: From a Temple Town to a Capital City. Southern Illinois University Press. pp. 31.
  2. ↑ "Paika Rebellion of Odisha".
  3. ↑ Mohanty, N.R. (August 2008). "The Oriya Paika Rebellion of 1817". Orissa Review: 1–3.
  4. 1 2 3 Paikaray, Braja (February–March 2008). "Khurda Paik Rebellion - The First Independence War of India". Orissa Review: 45–50.
  5. 1 2 "Paika Rebellion & why its 'omission' in NCERT books has triggered political slugfest in Odisha".
  6. ↑ "Paika revolt of 1817". Archived from the original on 2013-03-08. Retrieved 2026-05-26.
  7. ↑ "Paik Rebellion". Archived from the original on 2012-03-12. Retrieved 2026-05-26.
  8. ↑ "Death Anniversary of Buxi Jagabandhu" (PDF).
  9. ↑ Orissa General Knowledge. Bright Publications. p. 29.
  10. ↑ Paikaray, Braja (January 2005). "Sahid Krutibas Patasani: The Crusader of Banapur Rebellion of 1836". Orissa Review.
  11. ↑ Pattanaik, Nihar Ranjan (1997). Economic History of Orissa. p. 315.
  12. 1 2 "Explained: Why Centre has refused to accept Paika revolution as first war of independence". 2021-12-03.