పైడికొండల మాణిక్యాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పైడికొండల మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు. 2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. తెదేపా-భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా 2014 శాసనసభ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. చిన్నతనం నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లోనూ, ఆవిర్భావం నుంచీ భారతీయ జనతా పార్టీలోనూ ఆయన పనిచేస్తున్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మాణిక్యాలరావు పైడికొండల సుబ్బారావు, రంగనాయకమ్మ దంపతులకు 1961లో జన్మించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పాఠశాల విద్య, సమీపంలోని పెంటపాడు గ్రామంలో కళాశాల విద్య అభ్యసించారు. డిగ్రీ చదువుతూ విద్యాభ్యాసాన్ని ఆపుచేసిన మాణిక్యాలరావు ఫోటోగ్రాఫర్‌గా వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. అనంతర కాలంలో ఫోటోస్టూడియో ప్రారంభించి నిర్వహించారు. ఫోటోస్టూడియో మూసివేసి "సింధు షూమార్ట్" పేరిట చెప్పుల దుకాణాన్ని ప్రారంభించారు. చాలాకాలం పాదరక్షల అమ్మకాన్ని కొనసాగించి సింధు షూమార్ట్‌ను సింధు ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చి ఆటోమొబైల్ విడిభాగాల అమ్మకాన్ని చేస్తున్నారు. ఆయన భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

పైడికొండల మాణిక్యాలరావు 9 సంవత్సరాల వయస్సులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరారు. సంఘ్ కార్యకర్తగా ఆయన ఉన్నత పాఠశాల విద్యార్థిగానే దేశ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా అజ్ఞాతంగా పోరాడారు. బాల్యదశలోనే జై ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. అనంతర కాలంలోనూ ఆరెస్సెస్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచీ పార్టీలోనే కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షునిగా 1998 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీ స్థానానికి యు.వి.కృష్ణంరాజును గెలిపించారు. కృష్ణంరాజు కేంద్ర సహాయమంత్రిగా ఉండగా ఆయనతో సమన్వయం చేస్తూ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎంతోకాలం పార్టీకి సేవలందించారు. భారతీయ జనతా పార్టీ తరఫున పురపాలకసంఘ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో కౌన్సిలర్‌గా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-తెదేపా పొత్తు నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో ఎవరూ ఊహించని విధంగా మాణిక్యలరావుకు భారతీయ జనతా పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అనుకోని విధంగా తెదేపా-భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నిలిచిన మాణిక్యాలరావు అనూహ్యంగానే తన సమీప ప్రత్యర్థి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట పూర్ణగోపాల సత్యనారాయణ (గోపి) పై 14వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు నేపథ్యంలో 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో మాణిక్యాలరావుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించారు.

సేవా కార్యక్రమాలు[మార్చు]

మాణిక్యాలరావు పలు ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెం మండలం నాచుగుంట గోసంరక్షణ సమితి సభ్యునిగా గోసేవలో భాగం పంచుకున్నారు. తనకున్న స్థలంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి నిర్వహిస్తున్నారు. 2011 నుంచి 2013 వరకూ మానవత సంస్థ గూడెం పట్టణ అధ్యక్షునిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 2013-14 సంవత్సరానికి గాను మానవత జిల్లా అధ్యక్షునిగా జిల్లావ్యాప్తంగా సేవలు విస్తరించారు. మానవత సేవాసంస్థ ద్వారా జిల్లాలోని పలు పట్టణాల్లో శీతల శవపేటికలు ఏర్పాటుచేసి ఉచితంగా అందజేస్తూన్నారు. ముఖ్యపట్టణాల్లో శవవాహక వాహనాన్ని కూడా నిర్వహిస్తూ మరణించినవారి భౌతికదేహాలను శ్మశానం వరకూ తీసుకువెళ్ళేందుకు ఉచితంగా ఇస్తున్నారు.

మూలాలు[మార్చు]