పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్, రవీంద్రభారతి, హైదరాబాదు

పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ అనేది హైదరాబాద్ రవీంద్రభారతిలో కళల ప్రదర్శనతోపాటు సినిమాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లఘు చిత్రాలు, సినిమా ప్రదర్శనలకోసం ఏర్పాటుచేసిన ప్రివ్యూ థియేటర్.[1] తెలంగాణ రాష్ట్రం నుండి హిందీ చిత్ర పరిశ్రమలో నటుడిగా మంచి పేరు సంపాదించి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్ పేరును ఈ ప్రివ్యూ థియేటర్ కు పెట్టబడింది.[2]

కళాకారుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడం కోసం పైడి జయరాజ్ థియేటర్‌లో సినిమాల ప్రదర్శనలతోపాటు సినిమారంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.[3]

ప్రారంభం[మార్చు]

హిందీలో మాత్రమే కాకుండా మరాఠీ, ఒరియా, బెంగాలీ, పంజాబీ, కొంకణి, గుజరాతీ, మలయాళం సహా పలు జాతీయభాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి భారతీయ సినిమా పరిశ్రమలో శిఖర సమానుడిగా నిలిచి, తెలంగాణ నేలనుంచి దేశం గర్వించదగ్గ స్థాయిలోకి ఎదిగిన పైడి జైరాజ్ అందించిన సేవలకు గుర్తుగా రవీంద్రభారతి రెండవ అంతస్తులోని హాలును ఆధునీకరించి ‘పైడి జైరాజ్‌ ప్రివ్యూ థియేటర్‌’గా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసింది.[4][5]

2017 సెప్టెంబరు 21న తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి అజ్మీరా చందులాల్ చేతులమీదుగా ఈ పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పర్యాటక-సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాల నిర్వహణ[మార్చు]

తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువ దర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులకు ప్రపంచ సినిమాను పరిచయం చేసే ఉద్దేశంతో పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

  1. సినివారం: ప్రతీ శనివారం యువ దర్శకులు, రచయితలు, నటుల కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహ్తిస్తున్నది. ఇందులో డాక్యుమెంటరీలు, ఫీచర్ ఫిల్మ్‌లు ఉచితంగా ప్రదర్శించిన అనంతరం వారిని సన్మానించి, ప్రేక్షకులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తారు.
  2. సండే సినిమా: ప్రతి ఆదివారం సాయంత్రం ప్రపంచ సినిమాలను ప్రదర్శిస్తారు. సినిమా ప్రదర్శన అనంతరం వర్దమాన సినీ కళాకారులకు ప్రపంచస్థాయి సినిమాను పరిచయం చేసి ప్రపంచస్థాయి సినిమా నిర్మాణ విలువలు, విశేషాలు, మెళకువలను తెలియజేసేందుకు చర్చ కార్యక్రమం నిర్వహిస్తారు.
  3. టాక్‌ @ సినివారం: ప్రతి నెల రెండవ శనివారం ‘టాక్‌ @ సినివారం’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో సినీరంగ ప్రముఖులు పాల్గొని వాళ్ళ అనుభవాలను పంచుకుంటారు. ఈ కార్యక్రమానికి శేఖర్‌ కమ్ముల, హరిశంకర్‌, వంశీ పైడిపల్లి, ఎల్‌. శ్రీనాథ్‌, ప్రవీణ్‌ సత్తార్‌, నాగ్‌ అశ్విన్‌, తరుణ్‌ భాస్కర్‌, సంకల్ప్‌ రెడ్డి, సందీప్‌ రెడ్డి తదితరులు అథితులుగా వచ్చారు.
  4. ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్‌: సినిమారంగంలోకి రావాలనుకుంటున్న యువతకు అంతర్జాతీయ సినిమాను పరిచయంచేయడంతోపాటు ఆ సినిమాల్లోని థీమ్, టెక్నిక్, టేకింగ్‌ల గురించి సరైన అవగాహనకోసం శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమం.[6] ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను తెలుసుకోవడం వల్ల మన తెలంగాణ సినిమా రాబోయే కాలంలో ఎలా వుండాలో తెలుసుకోవడానికి ఈ ఫెస్టివల్ ఓ కేస్ స్టడీగా ఉంటుంది. గతంలో ఈ చిత్రోత్సవంలో ఇరాన్ చిత్రాలను, జర్మనీ చిత్రాలను, వివిధ భాషల్లో వచ్చిన దేవదాసు చిత్రాలను, ఫ్రెంచ్ చిత్రాలను, కొరియన్ చిత్రాలను,[7] మృణాళ్ సేన్ ఫిలిం ఫెస్టివల్,[8] గిరీష్ కర్నాడ్, పైడి జైరాజ్, జర్మన్ బాలల చిత్రాలను[9] ప్రదర్శించారు.
  5. అవతరణ ఫిల్మోత్సవం: ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా యంగ్ ఫిల్మ్ మేకర్స్ కు లఘుచిత్రాల పోటీ నిర్వహించి, వివిధ విభాగాలలో గెలుపొందిన వారికి దాదాపు 3 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు బహుకరిస్తున్నారు.
  6. బతుకమ్మ ఫిల్మోత్సవం: ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా 10రోజులపాటు ఆయా సంవత్సరాలలో విడుదలైన తెలంగాణ సినిమాలను ప్రదర్శించడంతోపాటు, సినిమా బృందాలను ఆహ్వానించి ప్రభుత్వం తరపున వారికి సత్కారం అందజేస్తున్నారు.
  7. యువ చిత్రోత్సవం: 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా లఘుచిత్రాల పోటీ నిర్వహించి, వివిధ విభాగాలలో గెలుపొందిన వారికి దాదాపు 3 లక్షల రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు బహుకరించారు.
  8. ఫిల్మ్ @ తెలంగాణ: తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఫిల్మ్ మేకర్స్ వారివారి గ్రామాల్లో, వారికున్న లిమిటెడ్ సోర్సెస్ తో సినిమాలు, షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ లు తీస్తూ తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అటువంటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఫిల్మ్ మేకర్స్ కి ప్రోత్సాహం అందించేందుకు 2023 సెప్టెంబరు 2న 'ఫిల్మ్ @ తెలంగాణ' కార్యక్రమం ప్రారంభించబడింది.

మూలాలు[మార్చు]

  1. Uddagiri, Nikisha (2023-04-02). "Ravindra Bharathi's Cinevaaram guiding, inspiring young Telugu filmmakers". newsmeter.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-02.
  2. Namasthe Telangana (28 September 2021). "పైడి జైరాజ్ దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌". Archived from the original on 17 April 2022. Retrieved 17 April 2022.
  3. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (29 July 2018). "సకల కళాభారతి!". Archived from the original on 30 July 2018. Retrieved 31 July 2018.
  4. "భారతీయ సినీపరిశ్రమకు తెలంగాణ ముద్ర జైరాజ్‌". EENADU. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.
  5. telugu, NT News (2022-09-28). "తెలంగాణ సినీశిఖరం జైరాజ్‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-28. Retrieved 2022-10-14.
  6. నమస్తే తెలంగాణ, సినిమా (10 April 2018). "ఘనంగా ప్రారంభమైన జర్మన్ చిత్రోత్సవం". Archived from the original on 20 July 2018. Retrieved 20 July 2018.
  7. నమస్తే తెలంగాణ, సినిమా (12 August 2018). "కొరియన్ ఫిలిం ఫెస్టివల్". Archived from the original on 12 August 2018. Retrieved 12 August 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 13 ఆగస్టు 2018 suggested (help)
  8. Times of India, Hyderabad City (27 January 2019). "Lights, camera! Cinema in state set for a lot of action". Srirupa Goswami. Archived from the original on 27 January 2019. Retrieved 27 January 2019.
  9. ఈనాడు, హైదరాబాదు (2 November 2019). "నగరంలో జర్మన్‌ బాలల చిత్రోత్సవం". www.eenadu.net (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2019. Retrieved 3 November 2019.

బయటి లింకులు[మార్చు]