Jump to content

పొన్నగంటికూర

వికీపీడియా నుండి
(పొన్నగంటి కూర నుండి దారిమార్పు చెందింది)

పొన్నగంటి కూర
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
A. sessilis

పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర.ఇది పొన్నగంటి కూర (Alternanthera sessilis) అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర.దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే చాలా రుచికరంగా వుంటుంది. ఇది అతి సులభంగా, అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారా అభివృద్ధి చెందగలదు.పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి.బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.

దీని పేరు వెనుక చరిత్ర

[మార్చు]

తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో పోయిన కంటికి ఈ కూర వాడితో కంటిచూపు వస్తుందనే నమ్మకంతో పోయిన కంటి కూర అనే వాడుకనుండి పొన్నగంటికూరగా వచ్చిందని నానుడి[1].

వివరణ, రుచి

[మార్చు]

పొన్నగంటి కూర ఆకులు చిన్న నుండి మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి.ఆకు పొడుగుగా బల్లెంరూపు (లాన్సోలేట్) తో దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. సగటున దీని ఆకులు 3-15 సెంటీమీటర్ల పొడవు, 1-3 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.ఆకులు పొడవైన, ఇరుకైన, ముదురు ఆకుపచ్చరంగుతో చదునైన అంచులతో మృదువుగా ఉంటాయి.గుబురుగా కాండం చివరన ఎక్కువగా ఉంటాయి. పొన్నగంటి కూర మొక్క నిటారుగా, గుబురుగా ఉండే శాశ్వతమైన మొక్క. ఇది అనేక రకాలుగా వ్యాప్తి చెందుతున్న కాండంతో చిన్న తెల్లని పువ్వులతో ఉంటుంది.ఆకులు చూపులకు తాజాగా రసవంతమైన వికసించిన రూపుతో ఉంటాయి.దీని రుచి బచ్చలికూర రుచి మాదిరిగానే కలిగి ఉంటుంది.[2]

ప్రస్తుత వాస్తవాలు

[మార్చు]

పొన్నగంటి కూర ఆకులు, వృక్షశాస్త్రపరంగా ఆల్టర్నేన్తేరా సెసిలిస్ అని వర్గీకరించబడ్డాయి.ఇది అమరాంథేసి జాతికి చెందిన మొక్క.దీనిని సంస్కృతంలో మత్యాక్షఅని అంటారు.వాటర్ అమరాంత్, సెసిలే జాయ్‌వీడ్, డ్వార్ఫ్ కాపర్లీఫ్ అని ఆంగ్లంలో పిలుస్తారు.[1] పొన్నగంటి కూరను భారతదేశంలో ఒక అద్భుత మొక్కగా పిలుస్తారు, ఇక్కడ దీనిని చాలా పేర్లుతో పిలుస్తారు. "పోన్" అనే పదంతో "బంగారం" అని అర్ధం. పొన్నగంటి కూర మొక్క పెరగడం పరిస్థితులను బట్టి మారుపేర్లు, విభిన్న వృద్ధి నమూనాలను కలిగి ఉన్నందున గుర్తించడం కష్టం.పొన్నగంటి కూర బాగా తేమ, వేడి వాతావరణంలో పెరుగుతుంది.ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో వరి, చెరకు పొలాలు చుట్టూ చిత్తడి ప్రాంతాలలో పెరుగుతుంది.[2]భారతదేశమంతటా తేమగల ప్రదేశాలలో పెరుగుతుంది. పెంచబడుతుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • పొన్నగంటి కూరను పలురకాలుగా కూరలుగా వాడతారు.
  • జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.
  • ఆయుర్వేద ఔషధంలో వంటిలోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.
  • పురాతన పుస్తకాలు, భారతీయ వైద్య గురువులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది..
  • థైలాం అని పిలువబడే పొన్నంగంటి నూనె శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని, భారతదేశంలో అధిక శరీర వేడి, తలనొప్పికి తగ్గటానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది. [2]
  • జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది.[3]

పోషక విలువలు

[మార్చు]

పొన్నగంటి కూర ఆకులునందు ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం.[2]ఇంకా విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఇనుము, మెగ్నీషియం దీన్నుంచి సమృద్ధిగా దొరకుతాయి.

భౌగోళిక / చరిత్ర

[మార్చు]

పొన్నగంటి కూర ఆకులు భారతదేశం, శ్రీలంకకు చెందినవి.తరువాత ఇది ఆసియా అంతటా అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. ఈ రోజు దీనిని ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, కరేబియన్, యునైటెడ్ స్టేట్స్ లోని ప్రత్యేకమైన కిరాణా తాజా మార్కెట్లలో అమ్ముతున్నారు.[2]

ఇతర భాషలలో పేర్లు

[మార్చు]

సంస్కృతంలో మత్యాక్షి, పత్తూర్, హిందీ : గుద్రిసాగ్, కన్నడ : వోనుగొనె సొప్పు, మలయాళం : మీనన్నాని, పొన్నన్నాని, తమిళం : పొన్నన్కన్నిక్కిరై అని పిలుస్తారు.

మొక్క వర్ణన

[మార్చు]

శాఖోపశాఖలుగా నేలపై పాకే ఔషధీ మొక్క. శాఖ కాండలు సాధారణంగా ఊదా రంగులో ఉంటాయి. క్రింది కణుపుల నుండి నేలలోకి వేళ్ళు పాతుకుంటాయి. ఆకులు కొద్ది మందంగా చిన్నవిగా కొలగా కొసగా చిన్న చిన్న బిళ్ళలు వలె ఉంటాయి. ఆకు కాడలు కొద్ది బారుగా వెడల్పుగానే ఉంటాయి. మొక్క పై నూగు లేకుండా నున్నగా ఉంటుంది. పూవులు చిన్నవిగా, తెల్ల రేఖలు ముద్దగా ఉంటాయి. కాయలు పల్చగా ఉంటాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 admin. "పుష్కలమైన పోషకాలతో పొన్నగంటికూర. – Vanitha Blog" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-11.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Ponnaganti Koora Leaves". specialtyproduce.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-11.
  3. "వేసవిలో ఆకుకూరలే హాయి". Telugu News International - TNILIVE (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-09. Retrieved 2020-07-11.

వెలుపలి లంకెలు

[మార్చు]