పోషణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్థాలను పోషక పదార్థాలు, లేదా పోషకాలు (Nutrients) అంటారు. వీటిని సేకరించడం లేదా తీసుకోవడాన్ని పోషణ (Nutrition) అంటారు.

జంతు శాస్త్రం ప్రకారం పోషణలో ఆహార స్వీకరణ (ఆహారాన్ని తీసుకోవడం), జీర్ణక్రియ (స్థూల అణువులను సూక్ష్మ అణువులుగా మార్చడం), శోషణం (ఆంత్ర కుడ్యము పీల్చుకోవడం), స్వాంగీకరణం (రక్త ప్రసరణలోనికి చేరటం), విసర్జన (జీర్ణము కాని, అనవసరమైన పదార్ధాలను బయటకు పంపించడం) అను విధానాలు ఉంటాయి.

పోషకాలు రెండు రకాలు అవి

  1. స్థూల పోషకాలు (Macro Nutrients)
  2. సూక్ష్మ పోషకాలు (Micro Nutrients)

కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు లాంటివి మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మొత్తంలో కావాలి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.

కార్బో హైడ్రేట్లు[మార్చు]

ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో నిర్మితమవుతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గాలక్టోజ్, రైబోజ్, లాంటి వాటిలో ఒకే చక్కెర పరమాణువు ఉంటుంది. కాబట్టి వీటిని సరళ చక్కెరలు అంటారు. చెరకులోని చక్కెర అయిన గ్లూకోజ్, పాలలోని చక్కెరయైన లాక్టోజ్, జంతువులలోని పిండి పదార్థమైన గ్లైకోజెన్, మొక్కల్లోని పిండిపదార్థం, వృక్షకణాల్లోని సెల్యులోజ్ లాంటివి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ. వీటిలో రెండు నుంచి అనేక వందల చక్కెర అణువులు ఉంటాయి. ఆహారం ద్వారా మనం తీసుకున్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆహారనాళంలోని ఎంజైమ్ లతో జలవిశ్లేషణం చెంది సరళ చక్కెరలుగా విడిపోతాయి. ఈ సరళ చక్కెరలను మన శరీరం శోషించుకుంటుంది.

ప్రోటీన్లు[మార్చు]

ప్రోటీన్లు అమైనో ఆమ్లాలనే వాటితో నిర్మితమై ఉంటాయి. మనం తీసుకునే ప్రొటీన్లు ఆహారనాళంలో ఎంజైమ్‌ల సహాయంతో విడిపోయి అమైనో ఆమ్లాలుగా మారిపోతాయి. అమైనో ఆమ్లాలు పేగు గోడల నుంచి శోషణం చెందుతాయి. అవసరమైన విధానాన్ని బట్టి అమైనో ఆమ్లాలు రెండు రకాలు.

  1. ఆవశ్యక అమైనో ఆమ్లాలు
  2. అనావశ్యక అమైనో ఆమ్లాలు

కొవ్వులు[మార్చు]

కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్ తో ఏర్పడతాయి. కొవ్వులను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్ గా జల విశ్లేషణం చెందుతాయి. ఫ్యాటీ ఆమ్లాలను రెండు రకాలుగా విభజించారు.

  1. సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు
  2. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు

కొవ్వులు మనకు వృక్ష, జంతు సంబంధ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. వృక్ష సంబంధ కొవ్వులు ఎక్కువగా నూనెల్ రూపంలో ఉంటాయి. కుసుమ, పొద్దు తిరుగుడు, వేరుశనగ,కొబ్బరి, పామ్ మొక్క మొదలైన వాటి నుంచి వచ్చే నూనె వీటికి ఉదాహరణ.

ఖనిజ లవణాలు[మార్చు]

మానవ శరీరంలో సుమారు యాభై దాకా ఖనిజ లవణాలు ఉంటాయి. పెరుగుదల, కణాల మరమ్మతు, ద్రవాభిసరణకు అవసరమౌతాయి. సోడియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, పొటాషియం లాంటివి శరీరంలో ఉండే స్థూల మూలకాలు. మాంగనీస్, మోలిబ్డినం, రాగి, జింక్, ఫ్లోరిన్, అయోడిన్, ఇనుము లాంటివి సూక్ష్మ మూలకాలు.

విటమిన్లు[మార్చు]

విటమిన్ల గురించిన ఆలోచన 18వ శతాబ్దంలోనే మొదలైంది. అప్పట్లో నావికులు కాలేయాన్ని ఆహారంగా తీసుకోవడం వలన రేచీకటి, నిమ్మ జాతి ఫలాలను తీసుకోవడం వలన స్కర్వి వ్యాధి, కాడ్ చేప నూనెను తీసుకోవడం వల్ల రికెట్స్ వ్యాధి నయమవుతున్నాయనిగమనించారు. హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు అవసరమైన పదార్థం ఉందని కనుక్కుని దీన్ని అదనపు కారకం అని పేర్కొన్నారు. ఫంక్ అనే శాస్త్రవేత్త తవుడులో బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం ఉందని కనుక్కుని దాన్ని వైటమిన్ సి అని పిలిచారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పోషణ&oldid=2986902" నుండి వెలికితీశారు