ప్రకాండము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గింజ అంకురింపగనే వేరు భూమిలోనికి పోవునట్లే ప్రకాండము కొమ్మ స్వతస్సిద్ధముగా పైకి పెరుగుచున్నది. వేరు నందుకాక దీని మీద ఆకులు, పువ్వులు పుట్టుచున్నవి. ప్రకాండమును ఆకును కలిసికొనుటచే నేర్పడు కోణమును కణుపు అంటారు. రెండు కణుపుల మధ్యనున్న భాగమును స్కంధము లేదా గెణుపు అంటారు. కణుపు సందులందుండియే మొగ్గలు, కొమ్మలు పుట్టును. అన్ని మొక్కల ప్రకాండములు ఒక తీరునలేవు. చింత, పనస, మామిడి మొదలగు వానివి చాలా ఎత్తుగా, లావుగా పెరుగుచున్నవి. జామ, దానిమ్మ, మొదలగు వానియందు, అంత ఎత్తుగా, లావుగా పెరుగుట లేదు. వీనికి కొమ్మలు మిక్కిలి క్రిందుగా పుట్టి అన్నియు కొంచమించుమించు గుబురుగా పెరుగుచున్నవి. తోటకూర, పసుపు, మెట్టతామర, కుంకపు పువ్వు మొక్క మొదలగు వాని యందు ఎత్తుగగాని లావుగా గాని లేదు, అదిగాక ఇవి తక్కినవానివలె కొయ్యబారి గట్టిగా లేవు. ఈ భేదములెన్నుటకు, చింత మొదలగు వానిని, వృక్షములు (పెద్దచెట్లు) అనియు, దానిమ్మ మొదలగు వానిని గుబురు మొక్కలనియు, మొట్టతామర మొదలగు వానిని గుల్మము లని అంటారు. కొన్ని ప్రకాండములు వాని కొమ్మలును పై కెదుగనే ఎదుగక పల్లేరు మొక్క ఉన్నట్టు, నేల మీదనే పడి ఉండును. అట్లున్న కొన్ని కొమ్మల నుండి వేరులు కూడా పుట్టును. మరికొన్ని కొమ్మలు భూమిలోనికే పోయి అడ్డముగా పెరుగుచూ తల్లి మొక్క నుండి కొంచెము దూర మేగిన తరువాత పైకి వచ్చును. ఇట్లు భూమిలో వ్యాపించి పైకి వచ్చువానిని గామినులంటారు. కొన్నిటి ప్రకాండములు భూమిలోపలికి పోయి, మార్పు చెంది వేరొక పనిని చేయుచున్నవి. బంగాళాదుంప ఇట్టిదే. ఈ దుంప మార్పు చెందిన కొమ్మ. ఈ రీతిని కొమ్మలు భూమిలోనికి పోయి, లావెక్కిన వానిని గడ్డలందుము. అల్లము, పసుపు, అరటి, కంద దుంపలు కూడా ప్రకాండములే.

ఉల్లిపాయ[మార్చు]

ఉల్లిపాయ వేరును గాదు, ప్రకాండమును గాదు. కండబారి రేకులవలె వచ్చినవి మార్పు చెందిన ఆకులు. పాయకు అడుగున పలుచగ, ముచ్చిక వలె నున్నదియే ప్రకాండము, దీని అడుగు నుండి వేరులు వచ్చును. ఈ ఆకుల మధ్య ప్రకాండమునంటి మొగ్గలుగలవు. ఉల్లిపాయను కోసిచూచిన ఇవి ఆకుపచ్చగ కనిపించును. వీనినుండియే మొక్కలు పుట్టును. ప్రకాండ మిట్లు తీసిపోయి కండగలిగిన ఆకులతో గూడియుండిననది లశునమందుము.


మూలాలు[మార్చు]