ప్రతివాది భయంకర వెంకటాచారి

వికీపీడియా నుండి
(ప్రతివాది భయంకర వేంకటాచారి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భయంకరాచార్య

ప్రతివాది భయంకర వెంకటాచారి బ్రిటిషు పాలనను సాయుధంగా ఎదుర్కొన దలచిన ఆంధ్రుడు. భయంకరాచారి పేరుతో పిలువబడే ఈయన జననం 1910, మరణం 1978. ప్రతివాది భయంకరాచారి విప్లవకారుడు. కాకినాడ బాంబు కేసులో ముద్దాయి. శిక్షపడి అండమాన్ జైలులో కొంతకాలం ఖైదీగా ఉన్నాడు. ముస్తఫా ఆలీ అనే పోలీసు అధికారి స్వతంత్ర సంగ్రామానికి మద్దతిచ్చే కాకినాడ ప్రాంత నేతలపై లాఠీచార్జి జరిపాడు. ఇతర మద్దతుదారులను కూడా అతడు పలు ఇబ్బందులు పెడుతుండటంతో డి.ఎస్.పి ముస్తఫా ఆలీ ఖాన్ ను దోషిగా నిర్ణయించి, అతడిని చంపాలని నిర్ణయించుకున్నాడు, విప్లవ భావాలు కల దేశభక్తుడు భయంకరాచారి.

మరో ఎనిమిది మందితో చేరి ఒక పథకాన్ని రూపొందించాడు. కలకత్తా, బొంబాయి, పాండిచ్చేరి ల నుండి బాంబు తయారీ సామానులను సేకరించారు. ఈ పనులన్నీ రహస్యంగా చేసినప్పటికీ, తమకో బహిరంగ కార్యస్థలంగా ఉండేందుకు గాను సి.హెచ్.ఎన్.చారి అండ్ సన్స్ అనే ఒక దొంగ కంపెనీని పెట్టారు. అయితే ప్రత్యక్ష చర్యలో అందరూ భాగస్వాములు కాదు. భయంకరాచారితో పాటు కామేశ్వరశాస్త్రి అనే వ్యక్తి మాత్రమే ఇందులో పాలుపంచుకున్నాడు.

1933 ఏప్రిల్ 6కాకినాడ లోని ఒక చోటికి ముస్తఫా రానున్నాడని తెలిసికొన్న వీరు, బాంబులు తయారుచేసుకొని అక్కడ మాటు వేసారు. అయితే ముస్తఫా అక్కడికి రాలేదు. ఇద్దరూ నిరాశ చెంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళారు. ఏప్రిల్ 14 న మళ్ళీ కాకినాడలోనే మరోచోట ప్రయత్నించారు. అయితే ఈ సారి కూడా వారనుకున్నట్టు ముస్తఫా రాలేదు. మళ్ళీ ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మాటు వేసారు. మూడోసారి కూడా ముస్తఫా మాటు వైపు రాలేదు. ఈసారి ఇళ్ళకు తిరిగివెళ్ళక, బాంబులను అక్కడే ఉన్న ఒక పడవలో ఒక సంచిలో పెట్టి, దగ్గరలో ఉన్న హోటలుకు కాఫీ తాగేందుకు వెళ్ళారు. వీళ్ళు కాఫీ తాగుతూండగా రేవు కూలీ ఒకతను పడవలో ఉన్న సంచీని చూసి కుతూహలం కొద్దీ సంచీని తెరచి బాంబులను బయటికి తీసాడు. బాంబు పేలింది. ఆ కూలీతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

పేలుడు స్థలానికి కేవలం కొన్ని వందల గజాల దూరంలోనే ఉన్న ముస్తఫా, పేలుడును విని ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నాడు. వెంటనే దర్యాప్తు మొదలైంది. ఘటనా స్థలంలో మరో మూడు బాంబులు దొరికాయి. అదొక విప్లవకారుల కుట్ర అని, అధికారులను చంపే పథకమనీ ఓ ఐదు రోజుల వరకూ దర్యాప్తు అధికారులకు తెలియలేదు. ఐదు రోజుల తరువాత కాకినాడకు చెందిన ఎస్.కె.వి.రాఘవాచారి అనే వ్యక్తి రామచంద్రాపురం సబ్ ఇన్స్పెక్టరుకు కుట్ర సంగతి వెల్లడించడంతో విషయం బైటపడింది. పోలీసులు ఒకరొకరినే పట్టుకుంటూ వచ్చారు. సెప్టెంబర్ 11 న భయంకరాచారిని ఖాజీపేట్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.

డిసెంబరు 1933 నుండి ఏప్రిల్ 1934 వరకు తూర్పు గోదావరి జిల్లా సెషన్సు కోర్టు ఈ కేసును విచారించింది. మొత్తం తొమ్మిది మందికీ వివిధ వ్యవధుల జైలు శిక్షను విధించింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పుపై నిందితులు మద్రాసు హైకోర్టుకు వెళ్ళగా అక్కడ తీర్పు 1935 సెప్టెంబరు 26 న వచ్చింది. హైకోర్టు మాత్రం భయంకరాచారి, కామేశ్వరశాస్త్రి లను మాత్రమే కుట్రకు ప్రధాన నిందితులుగా పేర్కొంది. మిగిలిన ఏడుగురూ అప్పటికే గడిపిన రెండేళ్ళ శిక్ష సరిపోతుందని భావించి విడుదల చేసింది. భయంకరాచారికి ఏడేళ్ళ జైలుశిక్షను విధించి, అండమాను జైలుకు పంపింది. కామేశ్వరశాస్త్రికి నాలుగేళ్ళ శిక్ష విధించింది. 1937 లో ప్రాంతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినపుడు భయంకరాచారి జైలు నుండి విడుదలయ్యాడు.

మూలాలు[మార్చు]