ప్రవీణ్ పూడి

From వికీపీడియా
Jump to navigation Jump to search
ప్రవీణ్ పూడి
జననంసూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్
వృత్తిఎడిటర్
జీవిత భాగస్వామిప్రశాంతి
పిల్లలుజాగృతి, విన్మయి
తల్లిదండ్రులు
  • భాస్కర రావు (తండ్రి)
  • శకుంతల (తల్లి)

ప్రవీణ్ పూడి ఒక సినీ ఎడిటర్.[1] ఎడిటర్ గా అతని మొదటి సినిమా ఆకాశ రామన్న. 2011లో వచ్చిన పిల్ల జమీందార్ అతనికి మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి అనేక హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. ఒక తమిళ సినిమాకు కూడా పనిచేశాడు.

వ్యక్తిగత వివరాలు[edit]

ప్రవీణ్ సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ లో పుట్టాడు. అతని తండ్రి ఏలూరు నుంచి వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. ఆయనకు అక్కడ ఆటో మొబైల్ వర్క్ షాపు ఉండేది. తర్వాత కొద్ది రోజులకు వారి కుటుంబం హైదరాబాదుకు మారింది. హైదరాబాదులో అతని తండ్రి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ వాహనాలు కొని కొన్ని సినీ సంస్థలకు లీజుకిచ్చేవాడు. కానీ ఆ వ్యాపారం కలిసి రాలేదు. అతని కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుంది. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రవీణ్ చదువు మధ్యలోనే ఆపేసి 1997 లో ప్రసాద్ ల్యాబ్ లో ఎడిటింగ్ విభాగంలో సహాయకుడిగా చేరాడు.

ఇతని తమ్ముడు ప్రదీప్ కూడా సినిమా రంగంలోనే ఉన్నాడు. వర్క్ ఫ్లో అనే పేరుతో సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ ను అందించే సంస్థను ప్రారంభించాడు. మనం, గోపాలా గోపాలా, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలకు టైటిల్ ఎఫెక్ట్స్ అందించాడు.

కెరీర్[edit]

ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు దగ్గర అప్రెంటీస్ గా రాజకుమారుడు, సమరసింహా రెడ్డి లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత మార్తాండ్ కె. వెంకటేష్ దగ్గర కొన్ని రోజులు పనిచేశాడు. డిజిటల్ ఎడిటింగ్ రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తుండటంతో అందులో ప్రావీణ్యం సంపాదించి కొద్ది రోజులు ఓ సంస్థలో ఉద్యోగిగా చేరి సినిమాలు, సీరియళ్ళు, కార్పొరేట్ ఫిల్ములు, వాణిజ్య ప్రకటనలు, డాక్యుమెంటరీలను ఎడిట్ చేశాడు. పవన్ కల్యాణ్ జానీ సినిమా కోసం సహాయకులు కావాలను కోరడంతో ఆయన దగ్గర చేరి జానీ సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్ గా, గుడుంబా శంకర్, బంగారం, బాలు, అన్నవరం సినిమాలకు అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశాడు. తరువాత శ్రీకర్ ప్రసాద్ దగ్గర శిష్యరికం చేశాడు. ఆయనతో కలిసి జల్సా సినిమాకు పనిచేశాడు.

తర్వాత తానే సొంతంగా ఎడిటర్ గా పనిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. కొద్ది రోజులు ఎదురు చూసిన తర్వాత ఆకాశరామన్న సినిమాతో ఎడిటర్ గా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఎడిటర్ గా ప్రయత్నాలు కొనసాగిస్తూనే శ్రీకర్ ప్రసాద్ తో కలిసి ఖలేజా, ఇష్క్ సినిమాలకు కూడా పనిచేశాడు. తర్వాత గాయం-2, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. 2011లో వచ్చిన పిల్ల జమీందార్ అతనికి మంచి పేరు తెచ్చింది. జులాయి సినిమాకి కూడా ఎడిటర్ గా మంచి పేరు వచ్చింది.

సినిమాలు[edit]

మూలాలు[edit]

  1. "పవన్‌ సావాసమే కాలేజీ!". eenadu.net. ఈనాడు. మూలం నుండి 10 November 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 10 November 2016.
  2. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.