ప్రసాదరాయ కులపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసాదరాయ కులపతి
జననంపోతరాజు వెంకట లక్ష్మీవరప్రసాదరావు
(1937-01-23)1937 జనవరి 23
India ఏల్చూరు గ్రామం,సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
ఇతర పేర్లుశ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి,
భార్గవ విద్యాదేవ కులపతి
వృత్తిఉపన్యాసకుడు
ప్రసిద్ధిఅవధాని శేఖర,
ఆశుకవి కేసరి,
కవితా సుధాకర,
సరస్వతీ కంఠాభరణ,
సాహితీసార్వభౌమ,
రూపక సమ్రాట్
మతంహిందూ
తండ్రిపోతరాజు పురుషోత్తమరావు
తల్లిస్వరాజ్యలక్ష్మి

ప్రస్తుతం కుర్తాళం పీథాధిపతిగా ఉన్న సిద్ధేశ్వరానంద భారతి పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతి గా ప్రసిద్ధి చెందాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతని అసలు పేరు పోతరాజు వెంకట లక్ష్మీవరప్రసాదరావు[1]. ఇతడు తన అసలు పేరుతోను, భార్గవ విద్యాదేవ కులపతిగా, ప్రసాదరాయ కులపతిగా విశేషమైన ఖ్యాతి పొందాడు. తరువాత కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిగా వెలుగొందుతున్నాడు. ఇతడు 1937, జనవరి 23వ తేదీన ఏల్చూరు గ్రామంలోజన్మించాడు. స్వరాజ్యలక్ష్మి, పురుషోత్తమరావులు ఇతని తల్లిదండ్రులు.

విద్యాభ్యాసం[మార్చు]

ఇతడు గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలు లో 8వ తరగతిలో చేరి ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలో సర్వప్రథముడిగా ఉత్తీర్ణుడై స్వర్ణపతకాన్ని గెలుచుకున్నాడు. తరువాత హిందూ కాలేజీలో ఎం.పి.సి. గ్రూపులో ఇంటర్మీడియట్ చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. ఇంటర్మీడియట్ చదివే సమయంలోనే ఇతడు ఆశువుగా పద్యాలు చెప్పడం అభ్యాసం చేశాడు. గణితశాస్త్రంపై విముఖతతో బి.ఎ.లో తెలుగు ప్రధాన అంశంగా స్వీకరించి బి.ఎ. యూనివర్సిటీ ఫస్ట్‌గా ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత 1962-64 సంవత్సరాల మధ్య శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో ఎం.ఎ. చదివాడు. తరువాత అదే విశ్వవిద్యాలయంలో ఆంధ్రభాగవత విమర్శ అనే విషయంపై పరిశోధన చేసి 1967లో పి.హెచ్.డి. పట్టా పుచ్చుకున్నాడు.

గురువులు[మార్చు]

సాహిత్యంలో ఇతని తండ్రి పోతరాజు పురుషోత్తమరావు, మిన్నికంటి గురునాథశర్మ, పింగళి లక్ష్మీకాంతం ఇతనికి గురువులు. మంత్రశాస్త్రాన్ని ఇతడు పసుమర్తి సుబ్బరాయశర్మ వద్ద అభ్యసించాడు. మల్లయుద్ధాన్ని, ముష్టి యుద్ధాన్ని మోచర్ల శ్రీహరిరావు వద్ద నేర్చుకున్నాడు.

ఉద్యోగం[మార్చు]

ఇతడు గుంటూరు హిందూ కాలేజీ తెలుగు శాఖలో చాలా కాలం ఉపన్యాసకుడిగా పనిచేసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొంది అక్కడనే పదవీ విరమణ చేశాడు.

ఆధ్యాత్మిక జీవితం[మార్చు]

బాల్యంలో ఇతడు హనుమదుపాసకుడు. హనుమాన్ మంత్రాన్ని కొన్ని కోట్లసార్లు జపించాడు. కొన్నిసార్లు ఇతడు పారలౌకిక విషయాలలో చాలా లోతుగా వెళ్లేవాడు. ఇతడు రాజయోగ మార్గంలో ధ్యానాన్ని, మంత్రసాధనను కొనసాగించాడు. ఇతడు త్వరగా సిద్ధులను పొందాడు. తంత్రవిద్యలో ప్రావీణ్యం సంపాదించ దలచి ఇతడు ఒక గురువు ద్వారా సాధన చేశాడు. ఇతని కఠోర దీక్షఫలితంగా ఇతడు దివ్యత్వాన్ని సంపాదించగలిగాడు. ఇతడు జిల్లెళ్ళమూడి అమ్మకు అత్యంత ప్రియశిష్యుడిగా అనుగ్రహం పొందాడు. ఆమెపై ఇతడు అంబికాసాహస్రి అనే స్తుతికావ్యాన్ని రచించాడు. పిమ్మట ఇతను రసయోగి రాధికాప్రసాద్ మహారాజ్ మార్గదర్శకంలో బృందావనం లోని రాధాదేవిని ఉపాసించాడు. రాధాదేవి ఇతనికి దివ్యదర్శనాన్ని అనుగ్రహించడమేకాక షడాక్షరీ మంత్రాన్ని ఉపదేశించింది. ఇతడు ఈ దేవతను వజ్రవైరోచనీ రూపంలో ఆరాధించసాగాడు. ఈ దేవతను స్తుతిస్తూ ఇతడు ఐంద్రీ సాహస్రి అనే స్తుతికావ్యాన్ని రచించాడు[2]. ఇతడు గుంటూరులో స్వయంసిద్ధ కాళీపీఠాన్ని స్థాపించి ఆధ్యాత్మిక ప్రచారానికి దోహదం చేశాడు.

సన్యాసాశ్రమం[మార్చు]

తమిళనాడుకు చెందిన కుర్తాళంలోని సిద్ధేశ్వరీ పీఠం వ్యవస్థాపకుడైన మౌనస్వామి అభీష్టం మేరకు అనాటి పీఠాధిపతి శివచిదానంద భారతి ఇతనికి సన్యాసదీక్షను ఇచ్చి సిద్ధేశ్వరానంద భారతి అని నామకరణం చేశాడు. అంతే కాకుండా తన తదనంతరం ఇతడిని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠానికి అధిపతిగా ప్రకటించాడు. శివచిదానంద భారతి సిద్ధి పొందిన తర్వాత ఇతడు 2002, డిసెంబరు 19న దత్తజయంతి నాడు కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు.

అవధానాలు[మార్చు]

ఇతడు 16 సంవత్సరాల ప్రాయంలో 1952లో మొట్టమొదటి అష్టావధానాన్ని గుంటూరు జిల్లా కొప్పరం గ్రామంలో నిర్వహించాడు. అప్పటినుండి సుమారు 12 సంవత్సరాలు అనగా 1964 వరకు 200కు పైగా అవధానాలను ఆంధ్రదేశంలోను, ఆంధ్రేతర ప్రాంతాలలోను విజయవంతంగా చేశాడు. ఇతని అవధానాలలో సమస్య, వర్ణన, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, ఆశువు, ఆకాశపురాణము, అప్రస్తుత ప్రసంగము, న్యస్తాక్షరి అనే అంశాలు ఉండేవి. ఇతని అవధానాలలోని పూరణలు కొన్ని మచ్చుకు క్రింద చదవండి.

 • సమస్య: అర్చన చేసె రాత్రి సమయమ్ముల భక్తుడు భాను బింబమున్

పూరణ:

తేర్చిన తేనెయంచుఁ బ్రియదేవిని ముద్దిడ సిగ్గుదొంతరల్
పేర్చిన ఆమె మోమరుణబింబము పోలికనయ్యె నంత నా
నేర్చినవాఁడు భక్తిసరణిన్ పలుగాటుల కింశుకంబులన్
అర్చన చేసె రాత్రిసమయమ్ముల భక్తుడు భానుబింబమున్

 • సమస్య: దివ్వె వెలుంగుచుండినగదిన్ నలువంకల నిండె చీకటుల్

పూరణ:

ఇవ్విధి మోముద్రిప్పి హృదయేశ్వరి! కోపము చేపెదేల? యే
పువ్వులు తాల్పబోక విరబోసితివేల వినీలకైశికన్
నువ్వు వెలుంగు వెన్నెలవు నా ప్రియ నీ ముఖచంద్రబింబమన్
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండె చీఁకటుల్

 • సమస్య:రావణ కుంభకర్ణులకు రాముఁడు పుట్టె గుణాభిరాముడై

పూరణ:

ద్రావిడులంచు కాదు మరి తానొక ఆర్యుఁడనంచుఁగాదు లో
కావళి హింసపెట్టిన మహాకలుషాత్ములఁటంచు నంగనా
జీవితముల్ వినాశనము చేసిన దుష్టులఁటంచు మృత్యువై
రావణ కుంభకర్ణులకు, రాముఁడుపుట్టె గుణాభిరాముఁడై

 • దత్తపది : ధర్మరాజు - భీముడు - అర్జునుడు - నకులుడు - సహదేవుడు అనే పేర్లతో రామాయణార్థంలో పద్యం.

పూరణ:

దాశరథి శాంతనిధి దయాధర్మరాజు
భీముఁ డాహవస్ఫూర్తి గంభీరమూర్తి
ఘనతరయశోర్జునుండు నయ్యినకులుండు
కపటదుస్సహదేవాది గర్వహారి

 • వర్ణన: శరత్కాలము - ఆకాశము

పూరణ:

శారద నీరదాంబరము చక్కఁగఁ దెల్లఁగ నారదేందు క
ర్పూర సుధా ప్రపూర హిమ పూర తుషార పటీర హీర దిం
డీర మనోజ్ఞకాంతి ప్రకటీకృతమై యలరారుచున్న ఆ
కారముతో వెలుంగు ననఁగాఁ బలుకం దగు పృచ్ఛకాగ్రణీ!

సాహితీరూపకాలు[మార్చు]

ఇతడు 30కి పైగా వివిధరకాలైన సాహితీరూపకాలకు రూపకల్పన చేయడమేగాక వాటిలో ప్రముఖ పాత్రలను నిర్వహించేవాడు. భువనవిజయములో తిమ్మరుసు పాత్రను, త్రైలోక్యవిజయము, త్రిభువన విజయములలో శ్రీనాథుని పాత్రను అనేక పర్యాయాలు పోషించాడు. ఇంద్రసభలో దేవగురువు బృహస్పతి పాత్రను పోషించాడు. ఇతడు అమెరికా సందర్శించినప్పుడు అక్కడ న్యూయార్క్, పిట్స్‌బర్గ్, న్యూజెర్సీ, డెట్రాయిట్, డెన్వర్, చికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ మొదలైన చోట్ల భువనవిజయం, ఇంద్రసభ మొదలైన సాహిత్యరూపకాలను ప్రదర్శించాడు.

రచనలు[మార్చు]

ఇతని ఈ క్రింది రచనలు ప్రచురితమయ్యాయి. వీటిలో కొన్ని ఇతడు సిద్దేశ్వరానంద భారతిగా మారిన తరువాత వ్రాసినవి.

 1. ఆంధ్రభాగవత విమర్శ[3] (సిద్ధాంతగ్రంథము)
 2. శివసాహస్రి
 3. హరసహస్రము
 4. గంధర్వగీతి
 5. రమణీప్రియదూతిక
 6. రసవాహిని
 7. రసగంగ
 8. అంబికా సాహస్రి
 9. ఐంద్రీ సాహస్రి
 10. కవిబ్రహ్మ
 11. ఆనందయోగిని
 12. కావ్యకంఠ జీవితచరిత్ర
 13. వందేమాతరం
 14. సంస్కృతి
 15. ఒక విద్యార్థి ఉద్యమం
 16. తాంత్రిక ప్రపంచం
 17. దేవీశక్తి
 18. హనుమంతుడు
 19. కవితామహేంద్రజాలం[4]
 20. నాగ సాధన
 21. భైరవ సాధన
 22. ప్రత్యంగిర సాధన
 23. శ్రీ లలితాదేవి చరిత్ర
 24. కుర్తాళ యోగులు
 25. వజ్ర భాగవతం
 26. బృందావన భాగవతం
 27. బృందావన యోగులు
 28. హిమాలయ యోగులతో మౌనస్వామి మొదలైనవి.

సారస్వతసేవ[మార్చు]

ఇతడు గుంటూరులో శ్రీనాథపీఠాన్ని స్థాపించి ఆ సంస్థకు అధ్యక్షుడిగా పనిచేశాడు. శ్రీనాథపీఠం ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను చేపట్టాడు. అనేక గ్రంథాలను ప్రచురించాడు.

బిరుదులు, పురస్కారాలు[మార్చు]

ఇతనికి అవధాని శేఖర, ఆశుకవి కేసరి, కవితా సుధాకర, సరస్వతీ కంఠాభరణ, సాహితీసార్వభౌమ, రూపక సమ్రాట్ మొదలైన బిరుదులు ఉన్నాయి. ఇతడు కనకాభిషేకము, సువర్ణ ఘంటా కంకణము, కవి గండపెండేరము మొదలైన సత్కారాలను ఎన్నో పొందాడు.

మూలాలు[మార్చు]

 1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 407–412. {{cite book}}: |access-date= requires |url= (help)
 2. "గురూస్ ఫీట్ జాలస్థలిలో సిద్ధేశ్వరానందభారతి వివరాలు". Archived from the original on 2016-09-19. Retrieved 2016-09-13.
 3. ప్రసాదరాయ, కులపతి. ఆంధ్ర భాగవత విమర్శ (ప్రథమ ed.). గుంటూరు: ప్రసాదరాయకులపతి. p. 403. Retrieved 13 September 2016.
 4. ప్రసాదరాయ, కులపతి (1998). కవితా మహేంద్రజాలమ్‌ (ప్రథమ ed.). హైదరాబాదు: డాక్టర్ ప్రసాదరాయకులపతి షష్టిపూర్తి అభినందన సమితి. p. 238. Retrieved 13 September 2016.