Jump to content

ప్లేటో

వికీపీడియా నుండి
పాశ్చాత్య తత్వశాస్త్రం
ప్రాచీన తత్వశాస్త్రం
Plato
పేరు: Plato (Πλάτων)
జననం: సిర్కా 428 - 427 క్రీ.పూ., ఏథెన్స్
మరణం: సిర్కా 348 - 347 క్రీ.పూ., ఏథెన్స్
సిద్ధాంతం / సంప్రదాయం: ప్లేటో తత్త్వములు
ముఖ్య వ్యాపకాలు: రెటరిక్, కళలు, సాహిత్యం, ఎపిస్టెమాలజీ, న్యాయం, వర్చూ, రాజకీయాలు, విద్య, కుటుంబం, మిలిటరిజం
ప్రముఖ తత్వం: ప్లాటోనిక్ రియలిజం
ప్రభావితం చేసినవారు: సోక్రటీసు, హోమర్, హెసియాడ్, అరిస్టోఫేన్స్, అయిసోప్, ప్రొటాగొరాస్, పర్మనైడులు, పైథాగొరాస్, హెరాక్లిటస్, ఆర్ఫానిజం
ప్రభావితమైనవారు: అరిస్టాటిల్, నియోప్లాటోనిజం, సిసిరో, ప్లూటార్చ్, స్టోయిసిజం, అన్‌సెల్మ్, డెస్‌క్రేట్స్, హొబ్బెస్, లీబ్‌నిజ్, మిల్, స్కోపెన్‌హార్, నీట్జ్‌షే, హీడెగ్గర్, అరెండ్‌ట్, గడామర్, అనేక ఇతర పాశ్చాత్య తత్వవేత్తలు, మత శాస్త్రవేత్తలు

సోక్రటీసు శిష్యులలో అగ్రగణ్యుడు ప్లేటో (గ్రీకు భాషలో "విశాలమైన భుజములు కలవాడు" అని అర్థము) క్రీ.పూ. 427లో ఏథెన్స్ లోని ఒక భాగ్యవంతుల కుటుంబంలో జన్మించాడు. గొప్ప గ్రీకు తత్త్వజ్ఞుల త్రయము (సోక్రటీసు, ప్లేటో, ఆరిస్టాటిల్) లో రెండవ వాడైన ప్లేటో, ఆరిస్టాటిల్ తో కలసి పాశ్చాత్య సంస్కృతికి పునాదులు నిర్మించాడు. సోక్రటీసుతో పరిచయం అయ్యాక అతని మేథానైశిత్యానికి ముగ్దుడై తత్వశాస్త్రం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇతర శిష్యులతో కలిసి సోక్రటీసు వెంట అతని తత్వ చర్చలు వింటూ ఏథెన్స్ వీధులలో తిరిగేవాడు. క్రీ.పూ. 399లో సోక్రటీసు మరణం తర్వాత అతని భావాలను ప్రపంచానికి చాటిచెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

దేశాటన

[మార్చు]

ఏథెన్స్ లోని సోక్రటీసు వ్యతిరేక వాతావరణం కారణంగా మెగరా నగరంలోని యూక్లిడ్ ఇంటిలో ఆశ్రయం పొందాడు. తర్వాత సుమారు 12 సంవత్సరాలు ఇటలీ, సిసిలీ, ఈజిప్టు దేశాలలో పర్యటించి విజ్ఞానార్జన చేసాడు. ఆనాటి సుప్రసిద్ధ తాత్వికులను కలుసుకొని తత్వ రహస్యాలనూ, అయా దేశాల జీవన స్థితిగతులు, సంస్కృతి, వైజ్ఞానిక విశేషాలను తెలుసుకున్నాడు.

అకాడమీ

[మార్చు]
ప్లాటో - సోక్రటీసు, ద స్కూల్ ఆఫ్ ఏథెన్స్.

ప్లేటోకి అకాడమస్ అనే ప్రాంతంలో విశాలమైన ఉద్యానవనం, పెద్ద ఇల్లు ఉండేవి. అక్కడ ఒక విద్యాలయాన్ని స్థాపించి ప్రధానంగా రాజకీయ శాస్త్రాన్ని, గణితం, తర్కం, ఖగోళాది శాస్త్రాలనూ బోధించేవాడు. దానికి ఆ స్థలం పేరుమీదుగా అకాడమీ అనే పేరు స్థిరపడిపోయింది. ప్లేటో తన అకాడమీలో స్త్రీలకు పురుషులతో సమాన స్థానాన్ని కల్పించాడు. అకాడమీ పేరు దేశదేశాలలో మారుమోగింది. దేశవిదేశాల రాజులు రాజ్యాంగ సమస్యలపై ప్లేటో సలహాలను కోరేవారు. ప్లేటో మరణం తర్వాత కూడా అకాడమీ మరో ఎనిమిదిన్నర శతాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా విరాజిల్లింది.

డైలాగ్స్

[మార్చు]

సోక్రటీసు ను ప్రధాన పాత్రధారిగా చేసుకుని ప్లేటో చేసిన తత్వ రచన డైలాగ్స్. తనలోని, సోక్రటీసులోని తాత్విక భావాలను ఈ గ్రంధంలో విపులీకరించాడు.

రిపబ్లిక్

[మార్చు]

ప్లేటో భావుకుడు, స్వాప్నికుడు, ఆదర్శవాది. తన ఆదర్శాలను, భావాలను, స్వప్నాలను క్రోడీకరించి చేసిన రచన రిపబ్లిక్. ఈ గ్రంధంలో ఆదర్శ రాజ్యం ఎలా ఉండాలో, ఆదర్శ పాలకులు ఎలా ఉండాలో వివరంగా వర్ణించాడు. ఈ ఆదర్శ రాజ్యము, ఒక నమూనా రాజ్యము గా ఉండాలని ప్లేటో భావించాడు. రాజకీయ వేత్తల అవినీతి, అసమర్ధతలను ప్లేటో ను ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తను కల్పించాయి. ఇందులో ప్రజలను, మానవుని ప్రధాన గుణాలైన ఇచ్చ(Appetite), ధీరత్వము (Spirit), (Reason) హేతువులను ఆధారం చేసుకొని మూడు వర్గాలుగా విభజించాడు. వారు 1) పరిసర ప్రభావాలకు అతీతమై ఇంద్రియ నిగ్రహం కలిగినవారు 2) పరిసర ప్రభావాలకి క్షోభ చెంది ఉద్వేగంతో ధైర్యంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేవారు 3) పరిసర ప్రభావాలకి లొంగిపోయేవారు. ప్లేటో అభిప్రాయంలో మూడవ రకంవారు పరిపాలనకి అనర్హలు. వీరు ఆహారోత్పత్తి, ఇతర వస్తూత్పత్తి చేసి ఇతర రెండు వర్గాల నిత్యజీవిత అవసరాలను తీర్చాలి. రెండవ వర్గం వారు ధైర్యసాహసాలతో రాజ్యాన్ని శత్రువులనుంచి కాపాడాలి. మొదటి వర్గానికి చెందినవారు ఇంద్రియ నిగ్రహం కలిగి విజ్ఞానవంతులైన ధార్మికులు. ఈ ధార్మిక ప్రభువు (Philosopher kings) లే రాజ్యపాలనకు అర్హులు. ప్లేటో అభిప్రాయంలో విజ్ఞానవంతులే పరిపాలకులు కావాలి లేదా పరిపాలకులు విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాకాని నాడు ప్రస్తుత రాజ్యాలకు వాటి దోషాలనుంచి విముక్తి లభించదని ప్లేటో ప్రగాఢ విశ్వాసం. ఈ విధమైన శ్రమ విభజనను (Division of labor) ను ఆధారం చెసుకొని ప్లేటో వర్గాలను సూచించాడు.

పరిపాలకులు నిరవధికంగా రాజ్య కార్యకలాపాలలో న్నిమగ్నులవటానికి ప్లేటో ఒక పధకాన్ని సూచించాడు. దీని ప్రకారం పరిపాలకులకు కుటుంబము, వ్యక్తిగత ఆస్థి ఉండవు. కుటుంబము, ఆస్థిపాస్తులు స్వార్ధానికి దారితీస్తాయని, పరిపాలకులలో బందుప్రీతి, అవినీతి ఏర్పడతాయని ప్లేటో భావించాడు. అయితే మూడవ వర్గానికి ఇవి వుండవచ్చును. సంపదను అందరు రాజ్య శ్రేయస్సుకోసం ఉపయోగించాలి.ప్రతివ్యక్తి సుఖదుఃఖాలను రాజ్యంలో అందరూ పంచుకోవాలి. వ్యవసాయదారులు పంటను పండించి రాజ్యపాలను, రక్షణ బాధయతలను స్వీకరించిన పరిపాలకులను, సైనికులను పోషించాలి. అందువల్ల సైనికులు, పరిపాలకులు వారి పనులలో కాలాన్ని పూర్తిగా నిమగ్నం చేయగలుగుతారు.

ప్లేటో అధికారంలో ఉన్న వ్యక్తికి కుటుంబం ఉండకూడదంటాడు. కుటుంబం వలన స్వార్ధం చేకూరుతుందంటాడు. ప్లేటో ఆదర్స రాజ్యంలో శిశువు జన్మించగానే ప్రభుత్వం శిశు సంక్షేమశాఖ ఆ శిశువు పోషణ భారాన్ని వహిస్తుంది. ఈ పద్దతి ప్రకారం సంతతిని తల్లి తండ్రులు, తల్లితండ్రులను సంతతి గుర్తిస్తారు. పరిపాలకులకు తమ సంతతి ఎవరో తెలియనందువల్ల వారు ప్రజలందరిని ఆదరంతో చూస్తారని ప్లేటో అభిప్రాయము. ప్లేటో రెపబ్లిక్ లో చూపించిన కమ్యూనిజానికి, ఆధునిక్ కమ్యూనిజానికి చాలా వ్యత్యాసాలున్నాయి.ప్లేటో ఇందులో సూచించన విద్యా విధానం క్రమబద్దమైనది. ప్రగతిశీలకమైనది. బాల్య దశలో విజ్ఞాన సముపార్జన కన్నా ప్రపంచం గురుంచి, తోటి మానవులను గురుంచి ఒక దృక్పధాన్ని ఏర్పరచుకోవటం అవసరం. యౌవనదశలో విద్యకు భౌతిక, వైజ్ఞానిక విషయాలలో సంబంధం ఉంటుంది. సంగీత సాహిత్యాలు బుద్దిని వికసింపజేయటానికి, వ్యాయామం దేహబలాన్ని వృద్ది చేయటానికి ఉపయోగిస్తాయి. చివరిదశ అయిన వయోజన దశలో సాధారణ విద్య, వృత్తి విద్యలను నేర్పుతారు. వ్యక్తి తన అభిరుచులు, శక్తి, సామర్ధ్యాలను బట్టి యుక్తమైన వృత్తిని అనుసరించటానికి విద్య ఉపయోగపడాలి అని ప్లేటో అభిప్రాయము.

ప్లేటో ఆదర్స రాజ్యము విజ్ఞానయుతమైన నిరంకుశ పాలనను ఏర్పాటుచేస్తుంది. ప్లేటో అభిప్రాయంలో రాజనీతి ఒక కళ. రాజనీతిని ప్లేటో వైద్యంతో పోల్చాడు. వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన వ్యక్తి రోగవిశ్లేషణకు ఏవిధంగా అర్హుడౌతాడో అదేవిధంగా తత్త్వవేత్త మాత్రమే రాజ్యాధికారానికి అర్హుడు అని ప్లేటో నిశ్చితమైన అభిప్రాయము. ప్లేటో ఆదర్శ రాజ్యంలో చట్టాలకు స్థానం లేదు. అంతేకాక ప్రజాభిప్రాయం కూడా ఉండదు.

ప్లేటో దార్శనీకములు

[మార్చు]

రామణీయక విచారణ

[మార్చు]

ప్లేటో ప్రతిపాదించిన జ్ఞాన స్వరూపాన్ని బట్టి ఆధ్యాత్మికమనీ, భౌతికమనీ రెండు జగత్తులున్నాయి. భౌతిక జగత్తుకు ఆధ్యాత్మిక జగత్తు మూలం. భౌతిక జగత్తు వ్యక్తికము, సాపేక్షము, ఇంద్రియగోచరము. అభిప్రాయానికి విషయము. పరిణామి, నశ్వరము. విరుద్ధగుణభూయిష్టము. ఆధ్యాత్మిక జగత్తు అలా కాదు. స్వయంభువు. సంపూర్ణము. వివేకానికి విషయం. అతీంద్రియం. పరిణామ రహితం. పారమార్ధికం. నిత్యం.

ఈ విభాగాన్ని బట్టి రామణీయకము అనేది కూడా రెండు రకాలు. 1. అలౌకిక రామణీయకము 2. లౌకిక రామణీయకం.

అలౌకిక రామణీయకం ఏకైకం, స్వయంభువు, సంపూర్ణము, అతీంద్రియము, వివేకైక విషయం. మారేది కాదు. సాపేక్షం కాదు. నిత్యం. ఇది సత్యం, ధర్మం మొదలైన భావాలకంటె భిన్నమై స్వతంత్రంగా ఉంటుంది. దీనిలో తరతమ భావాలుండవు. ఇది స్వయంభువు. అనగా మనఃకల్పితం కాదు. దేశకాలబద్ధమూ కాదు. ఇది భతికం కాదు అనగా ఇది ఆకృతిలో కాని, రూపంలోకాని, వాచంలో కాని లేదు. అందువల్ల ఇంద్రిఅయగోచరం కాదు. ఇది అతీద్రియం. రామణీయకం వివేకానీకి విషయం. అంటే వివేకానికొక్కదానికే గోచరిస్తుంది. ఇది నిరుసాధికం (Non hypothetical). ఇది ఒకప్పుడు తరిగేది కాదు, మరొకప్పుడు పెరిగేది కాదు. రామణీయకం ధర్మం మీదకాని సత్యం మీద కాని మరొకభావం మీద కాని ఆధారపడటం లేదు. ఇది కేవలం నిరపేక్షము. స్వయం ప్రకాశము.

లౌకిక రామణీయకం ప్లేటో మత ప్రకారము మరు రెండు రకాలు. 1. ప్రకృతిసిద్ధ రామణీయకం 2. మానవకల్పిత రామణీయకం. ప్రకృతిసిద్ధ రామణీయకం అలౌకిక రామణీయకానికి అనుకరణం. ఈఅనుకృతికి కల్పిత రామణీయకం అనుకృతి. అయితే లౌకిక రామణీయ లక్షణ మేమిటి? ఇది 1. వ్యక్తికము. 2. సాపేక్షము 3. ఇంద్రియగోచరము 4. అభిప్రాయానికి విషయము. 5. పరిణామి. 6. అనశ్వరము 7. విరుద్ధగుణభూయిష్టము. 8.అసంపూర్ణము. 9 అవివేకము 10. సోపాధికము.

ఈ లౌకిక రామణీయకం అనేకము. రమణీయ భవనాలు, రమణీయ విగ్రహాలు, రమణీయ గానం, రమణీయకావ్యం, రమణీయ చిత్రం ఇలా అనేకంగా ఉంటుంది. ఇందులో తరతమభావాలున్నాయి. ఇది పరిణామి. సత్యం, ధర్మం, వికారం మొదలైనవాటికి కూడా ఇందులో ప్రసక్తి ఉంటుంది. దీనికి ప్రయోజనకతా ప్రయోజకత లున్నాయి. ఈ రామణీయకం నశ్వరం.

మానవకల్పిత రామాణీయానికి కూడా ఇవే లక్షణాలు. అయితే ప్రకృతి సిద్ధరామణీయకం దీనికంటే ఉత్తమం. ఎందుకంటె ప్రకృతిసిద్ధ రామణీయకం యద్ధర్ధతరం, ప్రయోజనకారి. ఇది అనుకృతికి అనుకృతి. అందువల్ల ఇది అవివేక ఉద్భోధకం త్యాజ్యం అని ప్లేటో నిషేధిస్తాడు.

అయితే ఏవి రామణీయక వస్తువులు ? రామణీయకం అంటె ఏమిటి? వివేకం, కలిగినవారిని వివేకవంతులంటున్నాము. అలాగే రామణీయకం కలుగి ఉన్న వస్తువులను రామణీయ వస్తువులంటున్నాము. అయితే ఏమిటి ఈ రామణీయకం? దేనిని రామణీయకం అంటున్నాము? అందమైన కన్య రామణీయకం అనవచ్చును. కాని కన్య ఒక్కటేనా రామణీయకం? అశ్వాలు, గోవులు, వీణలు, భాండాలు, రామణీయకాలు కావా? రామణీయర్ధాలు చాలా ఉన్నాయి. కాని వీనిలో తరతమ భావాలున్నాయి. రమణీయకాంతలతోనూ, అశ్వాలతోనూ పోల్చినప్పుడు భాండాలు రమణీయకం కాదు. అత్యంత రామణీయమైన కోతిని మానవునితో పోల్చినప్పుడు వికారంగా ఉంటుంది. కాంతలను దేవకన్యలతో పోల్చినప్పుడు చాలా వికృతంగా ఉంటాయి. ఇంతకు అసలు ప్రశ్న లానే ఉంది - ఏది పారమార్ధిక రామణీయకం? దేని ఉనికి వల్ల వస్తువులు రామణీయకాలవుతున్నాయి?

ఔచుతి (యోగ్యత) ఉంటే, రాయికూడా రామణీయకమే అనవచ్చును. ఈలెక్కలో అనౌచితి వికృతి అన్నమాట. కాబట్టి ఔచితిఉన్నప్పుడే ఏ వస్తువైనా రమణేయం అవుతుంది. ఔచితి వల్ల వస్తువులు రమణీయకాలు అవుతాయా? లేక రమణీయాలవల్లే కనిపించేటట్లు చేస్తుందా? లేకా ఈ రెండు పనులూ చేయదా? స్వబావానుసరంగా ఉన్నాదానికంటే వస్తువులను ఔచితి ఎక్కువ రమణీయాలు చేస్తుందంటే అది ఒక విధమైన రామణీయక అభాసమేకాని రామణీయకం కాదు. అది విచారయము కాదు. అందువల్ల ఔచితి వల్ల రమణీయవస్తువులు రమణీయంగా ఉన్నాయి అనటానికి వీలులేదు. ఔచితి వస్తువులను యధార్ధం గాని, అభాసికంగాను రమణీయం చేస్తుందని అంటే, అవి వివిధ ఆచారాలు, జీవితపధాలు మొదలైన యధార్ధరమణీయవస్తువులను రమణీయాలని అన్ని కాలాలలోనూ అందరుమానవులూ భావించకపోవచ్చును. కాబట్టి ఔచితి వస్తువులను యద్ధర్ధంగాను, అభాసింకంగాను రమణీయం చేయజాలదు.

మరి వినియోగ పడే వస్తువులను రమణీయాలందామా? ఆపక్షంలో వివ్నియోగమే రమణీయక మౌతుంది. ఎందుకంటె, గ్రుడ్డికన్నును రమణీయమనలేము. అలాగే రోగగ్రస్తమై పనిపాటలకు వినియోగపడని శరీరంకాని, పరుగెత్తలేని గుర్రాలుకాని రమణీయాలనము. ఇలాగే సంస్థలు, జీవితపధాలు, వినియోగపడినప్పుడే రమణీయాలంటాము. వినియోగపడనిదైతే వికారం అంటున్నాము.అలాగే దుష్కృతాలకు వినియోగపడే వస్తువులను రమణీయాలంటున్నామా? లేదు. కేవలం సద్వినియోగ సామర్ధ్యమే రామణీయకం అంటున్నాము. సామర్ధ్యము, వినియోగము ఉండి ప్రయోజనము లేదు, అది శ్రేయస్కరం కావాలి. దానికి తోడ్పడాలి. అప్పుడే అల్లంటి వస్తువు రమణీయమౌతుంది. అది లాభదాయకత్వం అయి ఉండాలి. అయితే లాభదాయక మనేది ఏదో ఒక శ్రేయస్సు కలిగించాలి. అప్పుడు అది ధర్మానికి కారణం కావాలి. ధర్మ కార్యం అవుతుంది. ఆ పక్షంలో రామణీయకం కారణమై ధర్మం కార్యమౌతుంది. కారణము కార్యము కాదు. కార్యము కారణము కాదు. కాబట్టి రామణీయకం ధార్మికమూ కాదు. ధార్మికమైనది రమణీయము కాదు. కాగా ధర్మానికి కారణమైన లాభదాయకత్వం కాని, వినియోగత్వం కాని, సామర్ధ్యంకాని రామణీయకం కాదు.

అలాకాక చక్షువు ద్వారా, కర్ణము ద్వారా కని సుఖం, లేక సంతోషం కలిగించే వస్తువును రామణీయకం అందామా? అంటే బాధ లున్నాయా? ఉంటే అవి ఏమిటి? రమణీయపురుషులు రంగులు నమూనాలు, చిత్రాలు, విగ్రహాలు చూచినప్పుడు మనకు సుఖం , సంతోషం కలుగుతున్నది. అందువల్ల చక్షుష్కరం ద్వారా సంతోషం లేక సుఖం కలిగించే దానిని రామణీయకం అందామా? చెవిద్వారా సుఖం కలిగించేవి ఉన్నవి. ఇలాగే తత్తిమా ఇంద్రియముల ద్వారా కలుగుతున్న సుఖంలో తారతమ్యాలు ఉన్నాయి. దీనిని బట్టి ఒకటి తేలుతున్నది. దృశ్య తారమణీయాలు, శ్రవ్యతారమణీయాలు రామణీయక మంటున్నామంటే సుఖం కలిగిస్తున్నవి కాబట్టి రామణీయకం అనటం లేదు. తత్తిమా సుఖకరాలనుంచి వేరుపరిచె ప్రత్యేక లక్షణ మేదో ఒకటి ఉండాలి.

ఈ పర్యావలోకనంతో ఏమొ తేలింది? రామణీయకం అంటే ఔచితి కాదు, ప్రయోజనం కాదు. సామర్ధ్యం కాదు. ప్రయోజన సామర్ధ్యం అంతకన్నా కాదు. ధర్మం అసలే కాదు. సుఖ సంతోషాలు కావు.అయితే రామణీయకం అంటే ఏది కాదో చెప్పడం జరిగింది కాని, ఏమిటో నిర్వచించటం జరగలేదు. కాబట్టి ప్లేటోకి రామణీయకం అంటే ఏమిటో తేలలేదు. కాని అది పొరపాటు. ఆతనికి రామణీయకం అంటే ఏదో ఒక నిర్దిష్ట అభిప్రాయం ఉంది.

అతని మతం ప్రకారం రామణీయకం భౌతిక పదార్థం కాదు. అది కేవలం ఒక భావం. ఈ భావం స్వతత్రం. ఇది మానవ కల్పితమూ కాదు, ఈశ్వర కల్పితము కాదు. ఇది జీవాత్మ కాదు, పరమాత్మ కాదు. నిత్యము, తారతమ్యనిరహితము, స్వయంభువు అయిన భావం. దీనినే ప్లేటో సింపోజియం లో ఇలా నిర్వచించాడు. ఈ రామణీయకం నిత్యం. దీనికి ఆద్యంతాలు లేవు. ఇది ఉత్పన్నం కాదు. నష్టం అంతకన్నా కాదు. ఈ రామణీయకం ఒక విధంగా రమణీయమై మరొకవిధంగా వికారంగా కనిపించేది కాదు. ఈ రామణీయకం ద్రష్టలమీద ఆధారపడి లేదు. ఈ రామణీయకం ముక్కు కాదు, ముఖం కాదు. రక్తమాంసాలతో కూడిన శరీరం కాదు. వాక్కు కాదు, విద్యా గ్రహణం కాదు. దాని సత్తా ప్రాణిలో కాని, పృధ్విలో కాని, ఆకాశంలో కాని లేదు. దాని కేవల సత్తా ఏకైకమై తనలో తాను ఉంటుంది. ఈ రామణీయకంయొక్క లక్షణాలను పొంది వున్న వస్తువులు రమణీయాలవుతున్నవి. ఇలాంటి వస్తువులు పుడుతూ గిడుతు ఉంటాయి. అయితే పారమార్ధికమైన రామణీయకంమాత్రం తరగదు, పెరగదు, వికారం లేక పరిణితి అంతకన్నా పొందదు.

అయితే ఇలాంటి పారమార్ధిక రామణీయకం నుంచి లౌకిక రామణీయకం ఎలా అవతరిస్తుందో ప్లేతో వివరణ ఇలా ఉంది. భావం ఈశ్వరాభివ్యక్తము అని ఈతని అభిప్రాయము. దీనికి భౌతిక ప్రపంచంలో అనేక అభాసా లున్నాయి. ఉదాహరణకు గృహం తీసుకుందాము.గృహభావం ఈశ్వరాభివ్యక్తం. ఈ భావాన్ని అనుసరించి వాస్తుజ్ఞడు ప్రయోజనం కోసం గృహం నిర్మిస్తున్నాడు. చిత్రకారుడు భౌతిక గృహాన్ని అనుసరించి గృహచిత్రం గీస్తున్నాడు. ఇక్కడొక విసేషమున్నది. వాస్తుజ్ఞడు వాస్తు నియమాలనుసరించే మాత్రమే నిర్మిస్తాడు. చిత్రకారుడు అలాకాదు. ఇతర వృత్తుల వారి చిత్రాలను కూడా సృష్టిస్తున్నాడు. చిత్రకారుడు ఇలా పలు రకాలను సృష్టిస్తున్నాడు. ఇలాంటి పని కష్టమనిపించవచ్చును. కాని అతి సులువుగా ఇదే పనిని అద్దం ఉపయోగించి సృష్టించవచ్చును. అయితె ఇలా సృష్టమైనవన్నీ అభాసలే. కవి, చిత్రకారుడు ఈ అభాసలనే తయారుచేస్తారు. ఇలా మూడు రకాల సృష్టులు కనిపిస్తున్నాయి. 1. ఈశ్వరాభివ్యక్తమైన గృహభావదికం. 2. వృత్తికార సృష్టి అయిన గృహాధికం. 3. కళాస్రష్ట సృష్తి అయిన గృహ చిత్రాదికం. మొదటిది యధార్ధం. రెండవది మొదటిదానికి అభాసం. మూడోది రెండవదానికి అనుకరణం.

అందువల్ల కళాసృష్టి అనుకరణం సత్యాన్ని అనుకరించటం లేదు. కేవలం అభాసాన్ని అనుకరిస్తున్నది. అనుకరణం రెండు విధాలు 1. దివ్యము 2. మానవము. ఈశ్వరసృష్టి దివ్యము. మనుజుడు చేసే సృష్టి మానవం. దివ్యసృష్టి భౌతిక వస్తువులను అపేక్షించదు. మానవసృష్టి భతిక వస్తువుల సంయోగంతో జరుగుతుంది. దివ్యమూ మానవమూ అయిన సృష్టి తిరిగి రెండు విధాలు. 1. యధార్ధం. 2. అయధార్ధం. ప్రకృత సిద్ధవస్తువులు, భూ సముద్రాలు, తరులతాదులు, పశు పక్ష్యాదులు యధార్ధ దివ్యసృష్టిలోనివి. స్వప్నాలు, వెలుగువల్ల ఏర్పడే నీడలు, మణిదర్పనాదులనుండి గోచరించే ప్రతిబింబాలు అయధార్ధ దివ్యసృష్టిలోనివి. గృహారామాదికములు యధార్ధ మానవసృష్టిలోనివి.

యధార్ధ దివ్యసృష్టి తిరిగి సదృశ్యము, అసదృశ్యము అని రెండు విధానాలు. ఈ సదృశ్య సృష్టిలోని ప్రతిబింబాలు బింబం ఏనిష్పత్తిలో, ఏరంగులో, ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. అసదృశ్య సృష్టిలో అలాకాదు. ఉదాహరణకు శిల్పి చెక్కే బృహద్విగృహమే తీసుకుందాము. ఈ విగ్రహము అవయవాలు ప్రకృతి సిద్ధంగా ఉండే పరిమాణంలో ఉండవు. అలా ఉండకపోగా ప్రకృతిసిద్ధమూర్తి అవయవాలు ఏనిష్పత్తిలో ఉంటాయో ఆనిష్పాత్తిలోనైనా ఉండవు. విగ్రహం క్రింద నిలిచి తల పైకెత్తి చూస్తే ప్రకృతిసిద్ధ నిష్పత్తి కనిపించేటట్లుగా అవయవపరిణామం ఉంటుంది. అంటే విగ్రహశీర్షభాగం ప్రకృతిలో ఉన్న నిష్పత్తికంటే అధికంగా ఉంటుంది. ఇది అసదృశ్యం. ఈ అసదృశ్యం రెండు రకాలు 1. ఉపకరణోత్పన్నమనీ 2. అత్మోత్పన్నమనీ. తూలికావీణాదులు మొదటి రకానివి. తన్నుతానే ఉపకరణంగా వాడుకొని చేసే సృష్టి నాట్యం. ఈ నాట్యం మరలా తెలిసి చేసేది, తెలియకుండా చేసేది.

మొత్తంమీద అనుకరణం ఇన్నిపోలికలు పోతున్నది. ఇలాంటి అనుకరణంవల్ల ఏర్పడుతున్న కళాసృష్టిలో వినియోగానికి వచ్చేది ఏమీలేదు. ఈసృష్టిలో అనేకవిషయాలు ప్రసక్తాలవుతాయి. పురాదికవర్ణనలు, వైద్యం, సత్పరిపాలనం, జీవిత పరమార్ధం మొదలైనవి వర్ణితము లౌతాయి. అవి పురాదుల నిర్మాణానికి, రోగచికిత్సకు, జీవితలక్ష్యానికి తోడ్పడవు. కాబట్టి కవిచిత్రకారాది కళాస్రష్టలంతా పుణ్యాదిక ప్రతిబింబాలను అనుకరించేవారేకాని సత్యం చెప్పలేరు.

బాగోగులు దేనివల్ల ఏర్పడుతున్నవో తెలియకుండానే చిత్రకారాదులు అనుకరిస్తున్నారు. దీనినిబట్టి అజ్ఞానంలో మునిగితేలే ప్రజాసామాన్యానికి మంచిదానివలె కనిపించేదానినే వారనుకరిస్తున్నా రనుకోవాలి. ఈ అనుకరణం ఒక విధమైన క్రీడ, లేక ఆట. ఈ అనుకరణం మనలోని అభిప్రాయానికి విషయమౌతున్నదేకాని, వివేకానికి మాత్రం కాదు. అనుకృతి నిజంగా అనుకృతిగా ఉంటే అది వివేకానికి విషయం కాదు, బుద్ధికీ విషయం కాదు. అభిప్రాయానికి మాత్రమే. అంతే కాదు. ఈ అనుకృతి వీక్షణ శ్రవణములకు మాత్రమే విషయమౌతున్నది. ఈఅనుకృతికి యధార్ధం, లేక శివంకరమైన లక్ష్యం లేదు.

కళ అవివేకవతి. ఈ అవివేకమే అనుకృతికి అనంతవస్తువైవిధ్యం ప్రసరిస్తున్నది. వివేకవంతము, ప్రశాంతము, ఉత్తమమైన వృత్త్తము ఎప్పుడూ ఒకటిగా సమంగా ఉంటుంది. ఇలాంటిది అనుకరణకు దుష్కరం. ఒకవేళ అనుకృతమైనా ఆస్వాదించటం కష్టం. అందులో నానావిధమైన మనస్తత్వం కలిగిన జనసందోహం నాటకశాలలో సమావేశమైనప్పుడు మరీ కష్టము.

కష్టాలు వచ్చినప్పుడు బావురుమని ఏడ్చి శోకవిముక్తి పొందాలన్న స్వాభావిక వాంచ మనలో ఉంటుంది. అయితే ఇది వివేకానికి కట్టుబడి అణిగిఉంటుంది. ఈవాంచే కవులవల్ల తుష్టహృష్ట మౌతుంది. ఈవాంచ వివేకం వల్ల సముచితశిక్షణ పొందకపోవటం వల్ల కాని, కలుగుతున్న దుఃఖం మరొకనిదికదా అన్న సానుభూతి వల్లకాని పొంగిపొర్లటానికి అవకాశ మేర్పడుతుంది. ఇతరుడు వచ్చి తన మంచితనం, తనకు వచ్చిన కష్టాలు చెప్పుకున్నప్పుడు అతనిని ప్రశంసిస్తూ జాలిపడడంలో అవమానకరమైనది ఏమీ లేదని సామాజికుడు అపోహపడుతున్నాడు. ఈ సుఖం ఒక లాభం అనుకుంటున్నాడు. వౌముఖ్యం అవలంభించి ఈ సుఖాన్ని కావ్యాన్ని ఎందుకు కోల్పావలని అనుంటున్నాడు. ఇతరుల అనర్ధకాల"వల్ల కొంత అనర్ధం తనకు కూడా సంక్రమిస్తుదన్న పరామర్సం కొంత మందికి కూడా కలగటం లేదు.

ఇదే హాస్యానికి కూడా వర్తిస్తుంది. కొన్ని చతురోక్తులు నీకు నీవు కూడా విసరడానికి సిగ్గు పడతావు. అయినా వాతినే రంగ భూమినుంచో, మరొకరినోటినుంచో విన్నప్పుడు వినోదిస్తావు. వాటి అసభ్యతను అసహ్యించుకోవు. ఇదంతా సానుభుతి ఉన్నప్పుడే జరుగుతుంది. మానవుని తత్వంలోనే యీ హాసం వాసనా రూపంగా ఉంది. అయితే ఇతరులు యేమనుకుంటరో అని మనం నవ్వం. ఈవిధంగా వాసన వివేకానికి లోనై లోలోనే ఉండిపోతుంది. ఈవాసన నాటకశాలలో దోహదం పొంది నీకు తెలియకుండానే విదూషకుడు అయిపోతాము.

ఇచ్చా సుఖదుఃఖవిశిష్టమైన రతిక్రోదాదులు మానవుని ప్రతి వ్యాపారంలోనూ అవినాభావసంబంధం కలిగి ఉంటాయి. కవిత్వం, కళ ఈ ఆవేశాలను మాలిన్యాలను ఆణిచివేయడానికి బదులుగా దోహదమిచ్చి పెంపొందిస్తాయి. వీటిని అదుపులో ఉంచక స్వేచ్చావిహారం చేయనిస్తాయి. మానవజాతి అభ్యుదయం పొదాలంటే ఈఆవేశాలను అదుపులో పెట్టాలి. కాబట్టి దేవతాస్తోత్రాలు ఉత్తమ పురుషుల ప్రశంసలు తప్ప మరెలాంటి కవిత్వాన్ని రాజ్యంలోనికి అడుగుపెట్టనీకూడదు. అడుగుపెట్టనిస్తే రాజ్యంలో పెత్తనం చేసేవి సుఖద్ఃఖాలే కాని నీతినియమాలు, వివేకం కావు.

కాబట్టి కవిత్వం సత్య సాధకంగా పరిగణించడానికి వీలులేదు. ఆత్మసిద్ధి పొందగోరువాడు దాని టక్కులకు మోసపోరాదు.

మరణం

[మార్చు]

క్రీ.పూ. 347లో ఒక స్నేహితుని ఇంటికి వివాహ విందుకు హాజరై విశ్రాంతి తీసుకుంటూ శాశ్వతంగా కన్ను మూసాడు.

ఇవీ చూడండి

[మార్చు]

పాద పీఠికలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లేటో&oldid=4137068" నుండి వెలికితీశారు