Jump to content

ఫూలన్ దేవి

వికీపీడియా నుండి
ఫూలన్ దేవి
దస్త్రం:Phoolan Devi Book.jpg
జననం(1963-08-10)1963 ఆగస్టు 10
మరణం2001 జూలై 25(2001-07-25) (వయసు 37)
వృత్తిబందిపోటు,రాజకీయ నాయకురాలు
జీవిత భాగస్వామికుట్టిలాల్, విక్రమ్, ఉమ్మేద్ సింగ్

ఫూలన్ దేవి భారతదేశంలో పేరుగాంచిన బందిపోటు రాణి. ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరాన, ఒక మారుమూల గ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్‌ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుంచి ఫూలన్‌ దేవి పశువులు కాచింది. యమునా నదిలో ఈదింది. పడవలు నడిపింది. పాముల్నిపట్టింది. బరువులు మోసింది. పొలం పనులు చేసింది. భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలనూ, దాష్టీకాలనూ చూసింది. చమార్‌, జాతవ్‌, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్నీ, అశక్తతలనూ అర్థం చేసుకుంది.

పదకొండేళ్ళ వయసులోనే బాల్య వివాహానికి గురై ముఫ్పై అయిదేళ్ళ వయసున్న భర్త లైంగిక హింసలనూ ఎదుర్కొంది. తండ్రి కున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్న నాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. అవహేళనలకు పోలీసుల తప్పుడు కేసులు, దెబ్బలు, సామూహిక అత్యాచారాలను, బందిపోట్ల కిడ్నాపులకు, లైంగిక దాడులకు గురయింది. అడవుల్లో చంబల్‌ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారినా బాధిత స్ర్తీలు, పేదలకు ఆర్థిక సాయం చేసి, ధైర్యాన్నిచ్చి, కర్కోటకులైన అగ్రకుల ఠాకూర్లపై ప్రతీకారం నెరవేర్చుకునే తిరుగుబాటుదారుగా ఫూలన్‌దేవి మారింది.

మగ, కుల దురహంకార ఠాకూర్లకేగాక, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికీ ఫూలన్‌ దేవి పెద్ద సవాలుగా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, అర్జున్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమూ ఫూలన్‌దేవితో చర్చలకు పూనుకున్నాయి. ఫూలన్‌దేవి 1983లో షరతులు విధించి తన సహాచరులతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఎనిమిదేళ్ళకే విడుదల చేస్తామని ఇచ్చన మాట తప్పిన ప్రభుత్వాలు, ఫూలన్‌ దేవిని గ్వాలియర్‌, తీహార్‌ జైళ్ళలో పదకొండేళ్ళు ఖైదు చేశాయి. తర్వాత ఫూలన్‌ దేవి 34వ ఏట 1998లో ఉత్తప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నుంచి పార్లమెంటు సభ్యరాలిగా ఎన్నికయ్యారు. తన 37వ ఏట 2001 జూలై 25న పార్లమెంటు మధ్యాహ్న భోజన విరామంలో ఫూలన్‌దేవి ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లింది. అక్కడ ఇంటి బయట గుర్తు తెలియని ముసుగు మనుషుల తుపాకీ కాల్పుల్లో ఫూలన్‌దేవి హత్యకు గురయ్యారు. 1981లో బెహ్మాయ్‌ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకుగాను ఫూలన్‌ దేవి హత్య జరిగి ఉండవచ్చని చాలామంది భావించారు.

ఆమె జీవిత చరిత్ర ఆధారంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. అదే విధంగా బాండిట్ క్వీన్ సినిమా కూడా వచ్చింది.

బయటి లింకులు

[మార్చు]