బన్సీలాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బన్సీలాల్ లేఘా

భారత రక్షణ మంత్రి
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ

రైల్వే మంత్రి
ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ


వ్యక్తిగత వివరాలు

బన్సీలాల్ లెఘా (26 ఆగష్టు 1927 - 28 మార్చి 2006) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి, భారత మాజీ రక్షణ మంత్రి. చాలామంది అతన్ని ఆధునిక హర్యానా వాస్తుశిల్పిగా భావిస్తారు. [1] బన్సీలాల్ తో పాటు హర్యానాలోని ప్రధాన రాజకీయ కుటుంబాలుగా ఏర్పడిన దేవీలాల్, భజన్ లాల్ లను కలిపి ఈ ముగ్గురినీ హర్యానా లాల్ త్రయం అంటారు. [2]

బన్సీలాల్ 1967 లో తొలిసారి తోషం హర్యానా రాష్ట్ర శాసనసభకు నుంచి ఎన్నికయ్యాడు. మొత్తం ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. హర్యానా ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశాడు: 1968–75, 1986-87, 1996–99. 1975 -1977 మధ్య నున్న అత్యవసర పరిస్థితి కాలంలో బన్సీలాల్‌ను మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి, ఆమె కుమారుడు సంజయ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పరిగణించేవారు. [3]

అతను 1975 డిసెంబరు నుండి 1977 మార్చి వరకు భారత రక్షణ మంత్రిగా పనిచేశాడు. 1975 లో కేంద్ర ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా కొంతకాలం పనిచేశాడు. రైల్వే, రవాణా శాఖలను కూడా కొంత కాలం పాటు నిర్వహించాడు.

1996 లో కాంగ్రెసు పార్టీ నుండి విడిపోయి హర్యానా వికాస్ పార్టీని స్థాపించాడు. 2004 లో తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరాడు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడంలో తోడ్పడ్డాడు. [4]

తొలి జీవితం[మార్చు]

బన్సీలాల్ 1927 ఆగస్టు 26 న చౌధరి మోహర్ సింగ్, విద్యా దేవి లకు జన్మించాడు. [5] వీరు హిందూ జాట్ కులస్థులు. [6] బ్రిటిషు పంజాబ్‌లో (ఇప్పుడు హర్యానా) భివానీ జిల్లాలోని గోలాఘర్ గ్రామంలో అతను జన్మించాడు. అతను ఆర్ట్స్‌లో BA చేసి, తరువాత జలంధర్ లోని పంజాబ్ యూనివర్సిటీ లా కాలేజీలో లా డిగ్రీ చేసాడు. [7]

లాల్‌కు సురేంద్ర సింగ్, రణబీర్ సింగ్ మహేంద్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. [8]

రాజకీయ జీవితం[మార్చు]

  • లాల్ 1943 నుండి 1944 వరకు లోహారు రాష్ట్రంలో పర్జా మండల కార్యదర్శిగా ఉన్నాడు.
  • లాల్ 1957 నుండి 1958 వరకు భివానీలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను 1959 నుండి 1962 వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ, హిసార్‌కు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సభ్యుడయ్యాడు.
  • అతను 1958 - 1962 మధ్య పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు.
  • అతను హర్యానా ముఖ్యమంత్రి : 1968 నుండి 1975 (కాంగ్రెస్), 1985 నుండి 1987 (కాంగ్రెస్). 1996 నుండి 1999 వరకు హర్యానా వికాస్ పార్టీతో.
  • అతను 1975 డిసెంబరు నుండి 1977 మార్చి వరకు భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు.
  • అతను పార్లమెంటు కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, 1980-82, అంచనాల కమిటీ, 1982-84 కు ఛైర్మన్ కూడా.
  • అతను 1984 డిసెంబరు 31 న రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో రైల్వే మంత్రి అయ్యాడు. తరువాత రవాణా మంత్రి అయ్యాడు.
  • అతను తోషమ్ (1967, 1972, 1986 బై-పోల్, 1991, 1996) నుండి ఐదుసార్లు హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అతను 1986 లో 80,000 పైచిలుకు ఓట్లతో సీటు గెలిచిన కొద్ది నెలలకే, 1987 లో దేవీలాల్ ప్రభంజనంలో తోషమ్ నుండి ఓడిపోయాడు. శాసనసభ ఎన్నికల్లో అది అతని ఏకైన ఓటమి. [9]
  • అతను 1960 నుండి 1966 వరకు, 1976 నుండి 1980 వరకు రాజ్యసభ సభ్యుడు. అతను మూడుసార్లు భివానీ నుండి లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు: 1980 నుండి 1984, 1985 నుండి 1986 వరకు, 1989 నుండి 1991 వరకు. అతను 1977 లో జనతా తరంగంలో భివానీ నుండి ఓడిపోయాడు.
  • 1996 లో కాంగ్రెస్‌తో విడిపోయిన తర్వాత, బన్సీలాల్ హర్యానా వికాస్ పార్టీని స్థాపించాడు. మద్యనిషేధానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారంతో అదే సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి పార్టీ వచ్చింది.
  • కాలక్రమంలో : రాజ్యసభ MP (1960-1966), హర్యానా MLA (1967-1975), రాజ్యసభ (1976-1980 కానీ భివానీ లోక్ సభ ఎన్నికల్లో 1977 లో ఓడిపోయారు), 1980-1984, 1984-1986 నుండి లోక్ సభ MP, హర్యానా MLA 1986- 1987, 1987 లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు, 1989-1991 మధ్య లోక్‌సభ సభ్యునిగా, 1991-1996 వరకు, 1996 నుండి 2000 వరకు హర్యానా ఎమ్మెల్యేగా పనిచేసాడు.

ఎమర్జెన్సీ సమయంలో పాత్ర[మార్చు]

1975 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు లాల్ వెలుగులోకి వచ్చాడు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీకి, ఆమె కుమారుడు సంజయ్ గాంధీకీ విశ్వాసపాత్రంగా ఉండేవాడు. విసి శుక్లా, ఓం మెహతా తదితరులతో పాటు సంజయ్ గాంధీ చుట్టూ ఉండే అనుచరుల్లో భాగంగా ఉండేవాడు. దీనిని 'ఎమర్జెన్సీ కాకస్' అని పిలుస్తారు. సంజయ్ గాంధీ నేతృత్వంలో జరిగిన అనేక దుందుడుకు పనులకు ఈ సమూహానిదే బాధ్యత అని అంటారు. [10]

అతను 1975 డిసెంబరు 21 నుండి 1977 మార్చి 24 వరకు రక్షణ మంత్రిగా పనిచేసాడు. 1975 డిసెంబరు 1 నుండి 1975 డిసెంబర్ 20 వరకు కేంద్ర ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా ఉన్నాడు. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షా విచారణ కమిషన్, వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాల్ తన అధికారాన్ని తరచుగా దుర్వినియోగం చేసినట్లు గుర్తించింది. [11]

బన్సీలాల్ 2006 మార్చి 28 న, 78 సంవత్సరాల వయసులో, న్యూఢిల్లీలో అనారోగ్యంతో మరణించాడు. [12]

పురస్కారాలు, గౌరవాలు[మార్చు]

  • 1972 లో, కురుక్షేత్ర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లా, హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డిగ్రీలను ప్రదానం చేశాయి.
  • 2008 లో, అతని జ్ఞాపకార్థం జూయి కాలువకు బన్సీలాల్ కాలువ అని పేరు పెట్టారు. [13]
  • 2014 లో, అతని జ్ఞాపకార్థం భివానీలో చౌదరి బన్సీలాల్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 

  1. "Bansi Lal dead".
  2. "Bansi Lal RIP".
  3. "Bansi Lal RIP".
  4. "Bansi Lal RIP".
  5. http://rajyasabha.nic.in/rsnew/pre_member/1952_2003/b.pdf
  6. Mahendra Singh Rana (2006). India Votes: Lok Sabha & Vidhan Sabha Elections 2001-2005. Sarup & Sons. p. 234. ISBN 978-81-7625-647-6.
  7. "Former Haryana CM Bansi Lal dead".
  8. "Bansi Lal, R.I.P."
  9. "Bansi Lal family making bid to regain traditional seat".
  10. "Why I Supported Emergency | Outlook India Magazine".
  11. "Emergency villains who got away".
  12. "Hooda holds rally in memory of Bansi Lal". The Indian Express. 22 December 2008. Retrieved 2016-04-11.
  13. "Hooda holds rally in memory of Bansi Lal". The Indian Express. 22 December 2008. Retrieved 2016-04-11.

వెలుపలి లంకెలు[మార్చు]