బర్గుండి రాజ్యం

బర్గుండి రాజ్యం అనేది మధ్యయుగాలలో చారిత్రక బర్గుండి ప్రాంతంలో కేంద్రీకృతమైన వివిధ వరుస రాజ్యాలకు ఇవ్వబడిన పేరు. చారిత్రక బర్గుండి ప్రధాన భూభాగం ఫ్రాన్సు, స్విట్జర్లాండు మధ్య సరిహద్దు ప్రాంతంతో ముడిపడి ఉంది. జెనీవా లియోను వంటి ప్రధాన ఆధునిక నగరాలను కలిగి ఉంది.
ఒక రాజకీయ సంస్థగా, బర్గుండి విభిన్న సరిహద్దులతో అనేక రూపాలలో ఉనికిలో ఉంది. 9వ శతాబ్దంలో, ఇది ఎగువ మరియు దిగువ బర్గుండి మరియు ప్రొవెన్స్‌గా విభజించబడింది. ఈ సంస్థలలో రెండింటిని, మొదటిది 6వ శతాబ్దం నాటికి మరియు రెండవది 11వ శతాబ్దం నాటికి స్థాపించబడినవి, బర్గుండి రాజ్యం అని పిలిచేవారు. ఈ రాజ్యానికి తర్వాతి వారసులలో ప్రొవెన్స్ రాజ్యం, బర్గుండి డచీ మరియు బర్గుండి కౌంటీ ఉన్నాయి.
బర్గండియన్ల రాజ్యం (411–534)
[మార్చు]
బర్గండికి ఆ పేరు బోర్న్‌హోం ద్వీపంలో ఉద్భవించి ఉండవచ్చని భావించే బర్గండియన్లు అనే జర్మనీ తెగ పేరు మీదుగా వచ్చింది. ఆ ద్వీపం పేరు పాత నార్సు భాషలో 'బుర్గుండార్‌హోల్మ్ర్' ("బర్గండియన్ల ద్వీపం"). బర్గండియను అనే పేరు "పర్వత ప్రాంతవాసులకు" ఒక సాధారణ జర్మనీ పేరు కూడా అయి ఉండవచ్చు. కాబట్టి ఇది ఒకటి కంటే ఎక్కువ సంబంధం లేని తెగల పేరు అయి ఉండవచ్చు. మధ్య రైన్ నది వద్ద వారి మొదటిగా నమోదు చేయబడిన ప్రదేశం నుండి, వారు దక్షిణంగా రోమను గాల్ లోకి వలస వెళ్లి, నేటి పశ్చిమ స్విట్జర్లాండు. ఈశాన్య ఫ్రాన్సులో ఉన్న సపాడియా భూభాగంలో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ఆ తర్వాత తమ రాజ్యాన్ని మరింత దక్షిణంగా రోన్ లోయ వరకు విస్తరించి బర్గండియన్ల ఒక అనాగరిక రాజ్యాన్ని స్థాపించారు.
బర్గండియన్ల మొదటిగా నమోదు చేయబడిన అయితే చారిత్రాత్మకంగా ధృవీకరించబడని రాజు గ్యుకి (గెబికా), ఇతను 4వ శతాబ్దం చివరలో నివసించాడు. 406లో రైన్ నదిని దాటడం సందర్భంగా, బర్గండియన్లు మధ్య రైన్ నది వెంబడి ఉన్న రోమన్ ప్రావిన్సు జెర్మానియా సెకుండాలో ఫోడెరాటిగా స్థిరపడ్డారు. సుమారు 430లో వారి రాజు గంతరు పొరుగున ఉన్న గాలియా బెల్జికా మీద అనేక దండయాత్రలు ప్రారంభించినప్పుడు వారి పరిస్థితి మరింత దిగజారింది. ఇది 436లో ఫ్లేవియసు ఏటియసు ఆధ్వర్యంలోని సంయుక్త రోమను, హూనికు దళాల చేతిలో వోర్మ్సు సమీపంలో (మధ్యయుగ నిబెలుంగెన్‌లీడు పద్యానికి కేంద్రం) ఘోర పరాజయానికి దారితీసింది.
443 నుండి, మిగిలిన బర్గండియన్లు మళ్ళీ ఫోడెరాటిగా సపాడియా ప్రాంతంలో, రోమను మాక్సిమా సెక్వానోరం ప్రావిన్సులో (ఆధునిక పశ్చిమ స్విట్జర్లాండు, ఈశాన్య ఫ్రాన్సు) స్థిరపడ్డారు. రోన్ నది వెంబడి తమ రాజ్యాన్ని విస్తరించడానికి వారు చేసిన ప్రయత్నాలు దక్షిణాన ఉన్న విసిగోతికు రాజ్యంతో వారికి సంఘర్షణకు దారితీశాయి. 476లో పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత, రాజు గుండోబాదు, థియోడెరికు ది గ్రేట్ నుండి ఎదురైన ముప్పును ఎదుర్కోవడానికి శక్తివంతమైన ఫ్రాంక్ రాజు క్లోవిస్ I తో పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత, అతను 'లెక్స్ బర్గుండియోనం' అనే ప్రాచీన జర్మనీ చట్టాల సంహిత ఆధారంగా బర్గుండియన్ల ఆక్రమణలను వ్యవస్థీకరించగలిగాడు.
వారి పూర్వ ఫ్రాంకు మిత్రుల నుండే దాడికి గురైనప్పుడు ఆ రాజ్యం పతనం ప్రారంభమైంది. 523ల 1వ క్లోవిసు కుమారులైన వారు తమ తల్లి క్లోటిల్డు ప్రేరేపణతో బర్గుండియను భూభాగాల మీద దండయాత్ర చేశారు. క్లోటిల్డు తండ్రి, బర్గుండి రాజు 2వ చిల్పెరికుని గుండోబాదు చంపేశాడు. 532లో ఆటున్ వద్ద బర్గుండియన్లు ఫ్రాంకుల చేతిలో నిర్ణయాత్మకంగా ఓడిపోయారు. ఆ తర్వాత రాజు గోడోమారు చంపబడ్డాడు. 534లో బర్గుండియను భూభాగాలు ఫ్రాంకిషు సామ్రాజ్యంలో విలీనం చేయబడ్డాయి.
మెరోవింజియను బర్గుండి (534–751)
[మార్చు]
ఇక మీద స్వతంత్ర బర్గుండియను రాజ్యం లేనప్పటికీ బర్గుండి, ఆస్ట్రేషియా, న్యూస్ట్రియాలతో పాటు, ఫ్రాంకిషు సామ్రాజ్యపు ప్రధాన భూభాగాన్ని నిర్వచించిన మూడు ముఖ్యమైన రాజ్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.[1] 561 మరియు 592 మధ్య, అలాగే 639, 737 మధ్య, ఫ్రాంకిషు మెరోవింజియను రాజవంశంకు చెందిన పలువురు పాలకులు "బర్గుండి రాజు" అనే బిరుదును ఉపయోగించారు.
కరోలింజియన్ బర్గుండి (751–879)
[మార్చు]షార్లమాగు సామ్రాజ్యాన్ని అతని తక్షణ కరోలింజియను వారసులు విభజించడం వల్ల స్వల్పకాలిక మధ్య ఫ్రాన్సియా రాజ్యం ఏర్పడింది. ఇది 843 వెర్డను ఒప్పందం తర్వాత సృష్టించబడింది. ఇందులో ఉత్తర సముద్రం నుండి దక్షిణ ఇటలీ వరకు ఉన్న భూభాగాలు ఉండేవి. దీనిని చక్రవర్తి 1వ లోథైరు పాలించాడు. పూర్వ బర్గుండియను భూభాగాల వాయువ్య భాగం పశ్చిమ ఫ్రాన్సియా రాజ్యంలో బర్గుండి డచీగా చేర్చబడింది. దీని రాజధాని డిజోనులో ఉండేది.
855లో తన మరణానికి కొద్దికాలం ముందు 1వ లోథైరు తన రాజ్యాన్ని తన ముగ్గురు కుమారులకు మూడు భాగాలుగా విభజించాడు: లోథారింగియా, ఇటలీ రాజ్యం, దిగువ బర్గుండి, ప్రోవెన్సు ప్రాంతాలు. చివరివి చిన్న కుమారుడికి ఇవ్వబడ్డాయి. అందుకే ఆయన ప్రోవెన్సు చార్లెసుగా పిలువబడ్డాడు. ఈ విభజన మరిన్ని సంఘర్షణలకు దారితీసింది. ఎందుకంటే పశ్చిమ ఫ్రాన్సియా, తూర్పు ఫ్రాన్సియాలను పరిపాలించిన పెద్ద కరోలింజియన్లు తమను తాము మధ్య ఫ్రాన్సియా నిజమైన వారసులుగా భావించారు. ప్రోవెన్సు పాలకుడైన చార్లెసు పరిపాలన చేయడానికి చాలా చిన్నవాడు కావడంతో అసలు అధికారం రీజెంటు అయిన వియెన్నే కౌంటు 2వ గిరార్టు చేతిలో ఉండేది. ఆయన భార్య చక్రవర్తి 1వ లోథరు తోటికోడలు. గిరార్టు ఒక సమర్థుడైన రీజెంటు, ఆయన వాలెన్సు వరకు దాడులు చేసిన వైకింగుల నుండి రాజ్యాన్ని రక్షించాడు. చార్లెసు మామ, పశ్చిమ ఫ్రాన్సియాకు చెందిన చార్లెసు ది బాల్డు, ఆర్లెసు కౌంటు నుండి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి అందిన తర్వాత 861లో ప్రోవెన్సులో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన మాకోను వరకు ప్రోవెన్సు మీద దండెత్తాడు. కానీ రీమ్సుకు చెందిన హింకుమారు చేత నిలువరించబడ్డాడు.
858లో కౌంటు గిరార్టు ఒక ఏర్పాటు చేశాడు. దాని ప్రకారం ప్రొవెన్సు రాజు చార్లెసు వారసులు లేకుండా మరణిస్తే, ప్రొవెన్సు రాజ్యం లోథరింగియాను పరిపాలిస్తున్న చార్లెసు అన్న అయిన 2వ లోథైరుకి తిరిగి చెందుతుంది. 863లో చార్లెసు మరణించినప్పుడు ఆయన పెద్ద సోదరుడు 2వ లూయిసు ప్రొవెన్సును తన కోసం క్లెయిం చేసుకున్నాడు. కాబట్టి ఆ రాజ్యం మిగిలిన ఇద్దరు సోదరుల మధ్య విభజించబడింది: 2వ లోథైరుకి లియోను, వియెను, గ్రెనోబులు బిషప్రికులు లభించాయి. వీటిని గిరార్టు పరిపాలించాడు;2వ లూయిసుకి ఆర్లెసు, ఐక్స్-ఎన్-ప్రొవెన్సు, ఎంబ్రూను లభించాయి.
2వ లోథైరు మరణానంతరం 870 నాటి మీర్సెను ఒప్పందం ప్రకారం పూర్వ మధ్య ఫ్రాన్సియా ఉత్తర భాగాన్ని తూర్పు ఫ్రాన్సియా రాజు లూయిసు ది జర్మనుకు, ప్రొవెన్సు రాజు చార్లెసు దక్షిణ భూములను పశ్చిమ ఫ్రాన్సియా రాజు చార్లెసు ది బాల్డుకు కేటాయించారు.
బోసోనిడు - వెల్ఫు బర్గుండి (879–1033)
[మార్చు]
877లో చార్లెసు ది బాల్డు పదవీచ్యుతి తర్వాత, రెండు సంవత్సరాల తర్వాత అతని కుమారుడు లూయిస్ ది స్టామరరు మరణించిన పిమ్మట, ఫ్రాంకిషు ప్రభువు బోసో ఆఫ్ ప్రొవెన్సు 879లో వియెనులో తనను తాను "బర్గుండి, ప్రొవెన్సు రాజు"గా ప్రకటించుకున్నాడు. ఈ రాజ్యం బోసో మరణించే వరకు అంటే 887 వరకు కొనసాగింది. మరుసటి సంవత్సరం వెల్ఫు వంశానికి చెందిన 1వ రుడాల్ఫు ఆఫ్ బర్గుండి, జెనీవా సరస్సు కేంద్రంగా, తరువాత ఫ్రాంచె-కోమ్టేగా మారిన బెసాన్‌కాను చుట్టుపక్కల భూములతో తన సొంత ఎగువ బర్గుండి రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇంతలో బోసో చిన్న కుమారుడు లూయిసు తర్వాత లూయిసు ది బ్లైండుగా ప్రసిద్ధి చెందాడు. 890లో వాలెన్సులో దిగువ బర్గుండికి రాజు అయ్యాడు. 933లో రుడాల్ఫు కుమారుడు వారసుడైన 2వ రుడాల్ఫు దిగువ బర్గుండిని స్వాధీనం చేసుకుని ఆ రెండు రాజ్యాలను విలీనం చేసి ఒకే బర్గుండి రాజ్యంగా ఏర్పరిచాడు.
బర్గుండి-ఆర్లెసు రాజ్యం (1033 తర్వాత)
[మార్చు]
బర్గుండి రాజ్యం 1032 వరకు స్వతంత్రంగా ఉనికిలో ఉంది. అయినప్పటికీ దాని చక్రవర్తుల అధికారం వాస్తవానికి జెనీవా సరస్సు ప్రాంతానికి మించి విస్తరించలేదు. 1032లో ఇది పవిత్ర రోమను సామ్రాజ్యంలో కాన్ఫ్రాడు ఆధ్వర్యంలో విలీనం చేయబడింది. అతను దాని కిరీటాన్ని రెండుసార్లు స్వీకరించాడు, మొదట ఫిబ్రవరి 1033లో పేయర్ను అబ్బేలో, ఆ తర్వాత బ్లోయిసుకు చెందిన 2వ ఓడో నుండి వచ్చిన సవాలును తిప్పికొట్టిన తర్వాత 1 ఆగస్టు 1034న జెనీవా కేథడ్రలులో. ఆ తర్వాత బర్గుండి, జర్మనీ రాజ్యం మరియు ఇటలీ రాజ్యంతో పాటు మధ్యయుగ సామ్రాజ్యంలో మూడు రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. 12వ శతాబ్దం నుండి, ఇది ఆర్లెస్ రాజ్యం అని కూడా పిలువబడింది.
ఈ రాజ్యం వారసుల మధ్య విభజించబడటం వల్ల, లేదా దౌత్యం మరియు రాజవంశ వివాహాల ద్వారా భూభాగాలు కోల్పోవడం మరియు సంపాదించడం వల్ల క్రమంగా ముక్కలైంది. చక్రవర్తులు సాధారణంగా దాని పరిపాలనను నిర్లక్ష్యం చేశారు, అయినప్పటికీ 1వ ఫ్రెడరికు 4వ చార్లెసు ఇద్దరూ వరుసగా 1178 - 1365లో ఆర్లెసులో బర్గుండి పట్టాభిషేక వేడుకను నిర్వహించారు. ఫ్రెడరికు 1157లో బెసానుకానులో ఒక సామ్రాజ్య సభను కూడా ఏర్పాటు చేశాడు. ఇది సామ్రాజ్యంలో 'రెగ్నమ్ బర్గుండియే' ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
వాల్వా పునరుద్ధరణ ప్రయత్నం
[మార్చు]
15వ శతాబ్దం చివరలో బర్గుండి డ్యూకు అయిన చార్లెసు ది బోల్డు, తన భూభాగాలను (బర్గుండి డచీ, ఫ్రాంచె-కోమ్టే, బర్గుండియను నెదర్లాండ్సు) కలిపి, తనను తాను రాజుగా చేసుకుని, పునరుద్ధరించబడిన బర్గుండి రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ప్రాజెక్టును రూపొందించాడు. చార్లెసు, చక్రవర్తి 3వ ఫ్రెడరికు చర్చలు జరిపారు. ఇవి ట్రియరులో పట్టాభిషేక కార్యక్రమానికి దారితీసే అవకాశం ఉండేది. డ్యూకు వైఖరి మీద అసంతృప్తి కారణంగా చక్రవర్తి సెప్టెంబరు 1473లో రాత్రికి రాత్రే పారిపోవడంతో ప్రణాళిక వేసిన కార్యక్రమం జరగలేదు. 1477లో నాన్సీ యుద్ధంలో చార్లెసు ఓటమి, మరణంతో ఈ డచీ ఒక స్వతంత్ర రాజ్యంగా అంతమైంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- బర్గుండి చరిత్ర
- బర్గుండి రాజుల జాబితా
- బర్గుండియను రాజ్యం
మూలాలు
[మార్చు]- ↑ Rolf Grosse (2014). Du royaume franc aux origines de la France et de l'Allemagne 800–1214. Presses Universitaires du Septentrion.