బలరామయ్య గుమ్మళ్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బలరామయ్య గుమ్మళ్ల
Balaramaiah.png
జననంబలరామయ్య గుమ్మళ్ల
జూన్ 1, 1953
మాదమాల, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
నివాసంమాదమాల, శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తిరిటైర్డ్ కలెక్టర్ మరియు రంగస్థల నటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిసుగుణశీల (చిత్తూరు జిల్లా పూడి పంచాయితీ సర్పంచ్)
పిల్లలుసృజన (సివిల్స్‌లో 44వ ర్యాంకర్, ఐఎఎస్‌ అధికారి), చార్వాక్ (బీటెక్, ఎంబిఎ)
తల్లిదండ్రులు
  • చంద్రప్పనాయుడు (తండ్రి)
  • ఆదిలక్ష్మమ్మ (తల్లి)

గుమ్మళ్ల బలరామయ్య రిటైర్డ్ కలెక్టర్ మరియు రంగస్థల నటుడు, దర్శకుడు. దేవాదాయ శాఖ కమిషనర్‌గా పనిచేశారు.[1]

జననం[మార్చు]

బలరామయ్య 1953, జూన్ 1న చంద్రప్పనాయుడు, ఆదిలక్ష్మమ్మ దంపతులకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని మాదమాల అనే పల్లెలో జన్మించాడు.

విద్యాభ్యాసం[మార్చు]

ప్రాథమిక విద్యను తన మేనమామగారి ఊరైన పూడిలో చదివాడు. ఉన్నత పాఠశాల చదువుకోసం శ్రీకాళహస్తికి వచ్చి చదువుతోపాటు, మిగిలిన రంగాల్లో ప్రతిభ కనపరచాడు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల చిన్నతనం నుంచే మక్కువ పుట్టింది. ఒక దశ దాటిన తర్వాత కళలపై అభిరుచి పెరిగింది. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. కళలను సాధనచేయడం మొదలుపెట్టారు. ఉన్నత పాఠశాల చదువు పూర్తికాగానే...శ్రీకాళహస్తిలోనే కళాశాల చదువు మొదలైంది. జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే ఇంగ్లీషు మీడియం అవసరం అని ఆయన ఆనాడే గుర్తించారు. ఆ ఊర్లో ఇంగీషు మీడియం లేదు. కానీ, ఆయన మాత్రం ఇంగ్లీషు మీడియం చేరిపోయి, తను సొతంగా తిరుపతినుంచి పుస్తకాలు తెచ్చుకొని చదువుకునేవారు. శ్రీకాళహస్తిలోని సన్నిధివీధిలో ఉన్న వాసుదేవ మాస్టారుగారి శిష్యరికంలో చదువుకుంటూ బి.ఎ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తర్వాత తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ చదివారు. పుస్తకాలు కొని చదివేందుకు కూడా ఆర్థికంగా స్తోమతలేని కుటుంబ నేపథ్యం. మేనమామలు ఒకవైపు తమ పాట్లు తాము పడుతూనే... అల్లుడి చదువులకు సమస్తం సమకూరుస్తూ ఉండేవారు. ఈ ఎగుడుదిగుడుల మధ్య పి.జి డిగ్రీ పూర్తిచేశారు.

ఉద్యోగం[మార్చు]

రెండేళ్లు ఖాళీగా ఉన్న తరువాత ఉద్యోగం వచ్చింది. అందులో అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్ స్థాయికి వెళ్లారు. గ్రూప్ 4 ఉద్యోగిగానే జరిగిందిగానీ..పోను పోను పోటీ పరీక్షలు మిగతా పదోన్నతులు పొందడంలో ఆయనకు విద్యపట్ల ఉన్న అనురక్తి, అభినివేశం, జ్ఞానం ఉపకరించాయి. గ్రూప్ 4 ఉద్యోగంతో జీవితం స్థిరపడిపోయిందనే భావనలేకుండా గ్రూప్ 2కు ప్రయత్నించి నెగ్గారు. ఉద్యోగంలో కేడర్ పెరిగింది. ఈ విజయ యాత్ర అంతటితో ఆగకుండా తర్వాత గ్రూప్ 1 లోను విజయం సాధించారు. ఇలా ఒక్కోమెట్టు ఎక్కుతూ చివరికి ఐ.ఎ.ఎస్. అధికారి హోదాతో ఆగారు.

కళ, సామాజిక రంగాలు[మార్చు]

సుమారు మూడున్నర దశాబ్దాలకు మునుపు. ఆ మారుమూల పల్లెల్లో –అంటే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశుడు కొలువైన ఊరికి కొంత దూరంలోని పూడి అనే పల్లెలో కుల కట్టుబాట్లు జాస్తిగానే ఉంటాయని... వాటిని ఛేదించి, చదువు తనకు నేర్పన సమాజం అంటే ఏమిటో.. విలువలు అంటే ఏమిటో తన ఊరిలోనే ప్రతిష్ఠిస్తూ దళితుల్ని, వెనుకబడ్డ వర్గాల వారిని అందరిని ఒక కట్టుగా.. జట్టుగా.. కలుపుకొని సుమారు నలభైమందితో కలిసి డ్రామా ఆడాడంటే.. ఆరోజులకు అది ఓ సామాజిక విప్లవం. తనకు ఇష్టమైన కళల మీద దృష్టిపెట్టారు. మిత్రుల్ని పోగేసుకొని నాటకాలు సాధన చేసేవారు.

అటు కళారంగంలో, ఇటు సామాజిక సేవారంగంలో మరియు ఆటలు, సాహిత్యం ఇలా పలురంగాలలో ఆయన ప్రతిభ కనబరిచారు. ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్సటీలో పిజి చదువుతున్న రోజుల్లో ఆయన దృష్టి సాహిత్య రంగంవైపు మళ్లింది. అలాగే సాహిత్యానికి అనుబంధమైన సంగీతరంగంలో కూడా ఆయన పట్టుసాధించారు. సంగీతంలో ఆయన పట్టు ఎంతటిదంటే ఓ పాట వింటే ఏ రాగం అనేది ఆయన ఇట్టే చెప్పేయగలరు. సంగీత జ్ఞాననంతో ఆయన అటు గ్రామాల్లో నాటకాలు వేయడంతోబాటు, కొన్ని నాటకాలను, పుస్తకాలను కూడా రాశారు. దుర్యోధనుడి ఏకపాత్రభినయం ప్రధానాంశంగా తీసుకొని ’సుయోధన సార్వభౌమ’, ‘అశ్వత్థామ’, ‘డబ్బు డబ్బు’ వంటి ఏకపాత్రాభినయాలు రచించారు.[2] డబ్బు డబ్బు అనేది బీనాదేవి నవల ఆధారంగా రూపొందిన ఏకపాత్రభినయం. తిరుపతి వేంకటకవులు రచించిన రంగస్థల నాటకాల్లోంచి కొన్ని ఘట్టాలను తీసుకొని సుయోధన సార్వభౌమ, అశ్వత్థామలను సృష్టించారు.

బలరామయ్యకు పచ్చదనంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. తాను ఎక్కడ పనిచేసినా అక్కడ పచ్చగా ఉండాలని కోరుకునేవారు. దీంతో ఆయన ఎక్కువగా చెట్లు నాటడంపై దృష్టి సారించేవారు. ఆయన ప్రేరణతోనే గ్రామంలోని వారంతా కలిసి ‘స్పందన’ అనే సంస్థను 2005లో స్థాపించారు. దీనికి బలరామయ్య గౌరవాధ్యక్షులు. యువకులంతా కలిసి ఊళ్లో ఆయన ప్రోద్బలంతో 1991లోనే 2000 మొక్కలను నాటించారు.

పెరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో గ్రామాల్లో పలు ఆటలు, వంటలు వంటివి కనుమరుగైపోతున్నాయని, వాటిని సజీవంగా ఉండేలా చేయాలని ఆయన ఎంతగానో తహతహలాడేవారు. గ్రామంలో ఉన్న వారందరిని పోగుచేసి ఆటలు ఆడించేవారు. జిల్లా స్థాయిలో కూడా ఆటల పోటీలను నిర్వహించేవారు.

నటనపై ఆయనకు ఆసక్తి ఉన్నాకూడా ఆయన రంగస్థలంవైపే మొగ్గుచూపారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటకాల ద్వారా ఉన్న తృప్తి సినిమా ద్వారా ఉండదని ఆయన నమ్మకం. దీంతో ఆయన గ్రామంలో నాటకాలువేయడం వైపు దృష్టి సారించారు. సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకటిచేసి నాటకాలు వేయించారు. సుమారు నలభైమంది నటులతో కూడిన శ్రీ కృష్ణరాయబారం నాటకాన్ని ఊళ్లో వేయంచారు. ఈ నాటకంలో ఆయన దుర్యోధనుని పాత్ర పోషించారు. ఈ పాత్ర అప్పట్లో రామారావుని పోలిఉండేదని ఊరివారంతా ఎంతో మెచ్చుకున్నారు. ఆయన నటనను గమనించి దాసరి నారామణరావు గారు కూడా సినిమి అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చిన నో చెప్పగలిగారు. సినిమా రంగంలోకి ఒకసారి ప్రవేశించిన తర్వాత మనలోని మంచి హరించుకుపోతుందని ఆయన అనుకునేవారు. ఆకాలంనాటి రంగస్థల నటులైన గూడూరు సావిత్రి వంటి వారితో కూడా కలిసి ఆయన నాటకాలు వేశారు. కొమ్మనాపల్లి గణపతిరావు ‘జగన్నాధ రధచక్రాలు’ నాటికను బాగా ప్రదర్శించేవారు. ఒంగోలులో ఎన్టీఆర్ పరిషత్తు ఏర్పాటులో, శ్రీకాళహస్తిలో కళాపరిషత్తు అభివృద్ధిలో తనవంతు కృషి చేశారు.

తాను చేస్తున్న విధి నిర్వాహణలో ఎంత తలమునకలై ఉన్నాకూడా పిల్లలను ఆయన ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. ఆయన కుమార్తె సృజన సివిల్స్ ఫలితాల్లో 44వ ర్యాంకు సాధించింది.[3]

ఒక అధికారిగా శ్రీకాళహస్తి సమీపంగా ఉండే గ్రామాలలో గుడుల నిర్మాణానికి ప్రభుత్వపరంగా తాను చేయగలిగిన సహాయం చేసేవారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఉపకార్యనిర్వాహణాధికారిగా నిర్వహించిన బాధ్యతలను ఆయన ఆధ్యాత్మిక సేవా ప్రస్థానంలో కీలకమైనవి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పనిచేసే సమయంలో పలు సంస్కరణలకు నడుంకట్టారు. బ్రేక్ దర్శనాల వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా తగు చర్యలు తీసుకున్నారు. తిరుమలలో ఉండే చిన్నచిన్న షాపులను తొలగించి, వారికి శాశ్వత సరిష్కారాన్ని సూచించడంలో ఆయన ఎంతో కృషిచేశారు.

మూలాలు[మార్చు]

  1. సాక్షి. "ఆచరించాం... అనుసరించారు..." Retrieved 1 June 2017.
  2. సరసభారతి ఉయ్యూరు. "'రంగస్థలం' కోసమే జీవితం అంకితం". sarasabharati-vuyyuru.com. Retrieved 1 June 2017.
  3. సాక్షి. "ఒకరికొకరు". Retrieved 1 June 2017.