Jump to content

బాద్షాహీ మసీదు

వికీపీడియా నుండి
ముందు నుంచి బాద్షాహీ మసీదు

బాద్షాహీ మసీదు ( పంజాబీ, Urdu: بادشاہی مسجد , లేదా "ఇంపీరియల్ మసీదు") అన్నది పాకిస్తాన్‌కు చెందిన పంజాబ్ ప్రావిన్సుకు రాజధాని ఐన లాహోర్ నగరంలో నెలకొన్న మొఘల్ కాలానికి చెందిన మసీదు.[1] ఈ మసీదు లాహోర్ కోటకు పశ్చిమాన కోటగోడల్లోపలి నగర భాగపు (వాల్డ్ సిటీ ఆఫ్ లాహోర్‌గా పేరొందింది) శివార్లలో ఉంది[2] లాహోర్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఒకటిగా దీన్ని పలువురు పరిగణిస్తారు.[3]

బాద్షాహి మసీదును ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నిర్మించాడు. 1971లో ప్రారంభమైన ఈ మసీదు నిర్మాణం 1673 వరకు రెండేళ్ల పాటు కొనసాగింది. ఈ మసీదు మొఘల్ నిర్మాణ శైలికి ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. బయటి భాగాన్ని పాలరాయి పొదిగి చెక్కిన ఎర్ర ఇసుకరాయితో అలంకరించారు. ఇది మొఘల్ కాలానికి చెందిన అతిపెద్ద మసీదు. అలానే నేడు పాకిస్తాన్‌లోకెల్లా రెండవ అతిపెద్ద మసీదు .[4] మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, ఈ మసీదును సిక్కు సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యం ఒక సైనిక శిబిరంగా ఉపయోగించాయి. ప్రస్తుత కాలంలో పాకిస్తాన్‌లోని అత్యంత ప్రాచుర్యం పొందిన సాంస్కృతిక ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది.

ప్రదేశం

[మార్చు]
బాద్షాహి మసీదు లాహోర్ కోట నుండి హజురి బాగ్ వ్యాప్తంగా ఉంది.
బాద్షాహి మసీదు చెక్కిన పాలరాతి నిర్మాణానికి, విస్తృతమైన ప్లాస్టర్‌వర్క్‌కు ప్రసిద్ధి చెందింది, వీటిని మసీదు లోపలి భాగంలో ఉపయోగించారు.

ఈ మసీదు పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో కోటగోడల్లోపలి నగర ప్రాంతానికి ఆనుకొని ఉంది. మసీదు ప్రవేశ ద్వారం దీర్ఘచతురస్రాకారంలో ఉండే హజురి బాగ్ పడమటి వైపున ఉండి, లాహోర్ కోటకున్న ఆలంగిరి గేట్ ఎదురుగా ఉంటుంది. ఈ ఆలంగిరి గేట్ అన్నది హజూరి బాగ్‌కి తూర్పు వైపున ఉంది. ఈ మసీదు లాహోర్‌కి ఉన్న పదమూడు గేట్లలో ఒకటైన రోష్నాయ్ గేట్ పక్కన ఉంది. ఈ రోష్నాయ్ గేట్ అన్నది హజూరి బాగ్‌కి దక్షిణ భాగంలో ఉంది. [5]

మసీదు ప్రవేశద్వారం దగ్గర కవి ముహమ్మద్ ఇక్బాల్ సమాధి ఉంది. ఇతన్ని బ్రిటిష్ ఇండియాకు చెందిన ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ను ఏర్పరచడానికి దారితీసిన పాకిస్తాన్ ఉద్యమానికి వ్యవస్థాపకునిగా పాకిస్తాన్‌లో విస్తృతంగా గౌరవిస్తారు.[6] మసీదు ప్రవేశద్వారం సమీపంలో మసీదు సంరక్షణకు, పునరుద్ధరణకు విశిష్ట కృషి చేసిన సర్ సికందర్ హయత్ ఖాన్ సమాధి కూడా ఉంది.[7]

నేపథ్యం

[మార్చు]

ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ తాను కొత్తగా నిర్మించబోయే రాచ మసీదు కోసం లాహోర్‌ను ఎంచుకున్నాడు. ఔరంగజేబు తన మునుపటి చక్రవర్తుల మాదిరిగా కాకుండా, శిల్పం వంటి కళల పోషకుడు కాదు. అందుకు బదులుగా అతున తన పాలనా కాలంలో వివిధ సైనిక విజయాలపై దృష్టిపెట్టి మొఘల్ రాజ్యాన్ని 30 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించాడు. [8]

మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీపై తన దండయాత్రకు జ్ఞాపకార్థంగా ఔరంగజేబు ఈ మసీదు నిర్మించాడు. అయితే మసీదు నిర్మాణం వల్ల ముఘల్ ఖజానాకు భారమై, ముఘల్ రాష్ట్రాన్ని బలహీనపరిచింది.[4] మసీదు ప్రాముఖ్యతకు సంకేతంగా దీనిని నేరుగా లాహోర్ కోట, దాని ఆలంగిరి గేట్లను (ఆలంగిరి గేట్‌ని, మసీదునీ ఔరంగజేబు ఒకే సమయంలో నిర్మించాడు) ఆనుకునేలా నిర్మించారు.  

చరిత్ర

[మార్చు]

నిర్మాణం

[మార్చు]
బాద్షాహీ మసీదులో హజూరీ బాగ్‌, లాహోర్ కోటలకు సరిగ్గా ఎదురుగా ఉన్న ప్రత్యేకమైన మార్గం ఇది.

ఈ మసీదు నిర్మాణానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1671 ఆదేశించాడు, దీని నిర్మాణాన్ని చక్రవర్తికి సోదర సమానుడు (ఔరంగజేబు తండ్రికి పెంపుడు కొడుకు), లాహోర్ గవర్నర్ ముజాఫర్ హుస్సేన్ (ఇతనికే ఫిదై ఖాన్ కోకా అని మరోపేరు) పర్యవేక్షించాడు. [9] ఔరంగజేబు తాను మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీపై చేసిన సైనిక కార్యక్రమాలు, దండయాత్రల జ్ఞాపకార్థం ఈ మసీదును నిర్మించారు.[4] రెండేళ్ల పాటు నిర్మాణ పనులు జరుపుకన్న ఈ మసీదు 1673లో ప్రారంభమైంది.

సిక్కు శకం

[మార్చు]
రంజిత్ సింగ్ సమాధి (తెలుపు భవనం): 1848లో మసీదు పక్కన నిర్మించిన సిక్కు మందిరం.

1799 జూలై 7న, లాహోర్ నగరం రంజిత్ సింగ్, అతని సిక్కు సైన్యం నియంత్రణలోకి వచ్చింది.[10] నగరం స్వాధీనం చేసుకున్న తరువాత, మహారాజా రంజిత్ సింగ్ బాద్షా మసీదుకున్న విస్తారమైన ప్రాంగణాన్ని తన సైన్యానికి చెందిన గుర్రాలను పెట్టడానికి అశ్వశాలగా, దానిలోని 80 హుజ్రాలు (ప్రాంగణం చుట్టూ ఉన్న చిన్న అధ్యయన గదులు) తన సైనికులకు క్వార్టర్స్‌గా, సైన్యానికి చెందిన ఆయుధ సామాగ్రిని ఉంచే ప్రదేశంగా ఉపయోగించాడు.[11] 1818లో, అతను మసీదు ఎదురుగా ఉన్న హజూరీ బాగ్‌లో ఒక పాలరాతి ప్రాసాదాన్ని నిర్మించాడు, దీనిని హజూరి బాగ్ బరదారీ అని పిలుస్తారు. [12] దీనిని అతను తన అధికారిక రాజసభగా ఉపయోగించాడు. [13] బహదారీ నిర్మాణానికి పాలరాయి స్లాబ్‌లను లాహోర్‌లోని ఇతర స్మారక చిహ్నాల నుండి సిక్కులు కొల్లగొట్టి ఉండవచ్చు. [14]

1841 లో జరిగిన మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధంలో, రంజిత్ సింగ్ కుమారుడు షేర్ సింగ్, మసీదుకున్న పెద్ద మినార్లను జాంబూరాలు లేదా లైట్ గన్స్ పెట్టడానికి ఉపయోగించాడు. వీటితో లాహోర్ కోటలో ఆశ్రయం పొందిన చాంద్ కౌర్ మద్దతుదారులపై బాంబు దాడులు చేశాడు. ఈ బాంబు దాడుల్లో ఒకదానిలో, కోటకు చెందిన దివాన్-ఎ-ఆమ్ (ప్రజా దర్బారు) ధ్వంసమైంది. కాని తరువాత బ్రిటిష్ కాలంలో పునర్నిర్మించారు.[15] ఈ సమయంలో, షేర్ సింగ్ సైన్యంలో పనిచేస్తున్న ఫ్రెంచ్ అశ్వికదళ అధికారి హెన్రీ డి లా రౌచే, [16] బాద్షాహీ మసీదు నుంచి లాహోర్ కోటకు తీసుకుపోయే ఒక సొరంగాన్ని తాత్కాలికంగా గన్‌పౌడర్‌ నిల్వ చేయడానికి ఉపయోగించాడు.[17]

రంజిత్ సింగ్ జ్ఞాపకార్థం 1848లో రంజిత్ సింగ్ సమాధిని మసీదును ఆనుకుని దాని పక్కనే నిర్మించారు.

బ్రిటిష్ పాలన

[మార్చు]
నగరంలో సిక్ఖు పాలన తర్వాత బాద్షాహీ మసీదు శిథిలావస్థకు చేరుకుంది

1849లో బ్రిటిష్ వారు సిక్కు సామ్రాజ్యం నుంచి లాహోర్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్రిటీష్ పరిపాలనా కాలంలోనూ, ఈ మసీదుని, దాని ప్రక్కనే ఉన్న కోటను సైనిక శిబిరంగా వాడడం కొనసాగించారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు తరువాత బాద్షాహీ మసీదు విస్తారమైన ప్రాంగణం చుట్టుగోడలలో ఉన్న 80 చిన్న గదులను బ్రిటీష్ వారు సైనికులు బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుకునే వీలు ఇవ్వకూడదనే ఉద్దేశంతో పడగొట్టారు. తద్వారా వాటిని బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించకుండా నిరోధించారు. వీటి స్థానంలో డలాన్స్ అని పిలిచే తోరణాలను నిర్మించారు.[18]

మసీదును సైనిక శిబిరంగా ఉపయోగించడం మీద ముస్లింల ఆగ్రహం పెరుగుతున్నందున బ్రిటీష్ ప్రభుత్వం 1952లో బాద్షాహీ మసీదు అథారిటీని ఏర్పాటుచేసింది. ఈ సంస్థ బాధ్యతలు మసీదు పునరుద్ధరణ పనులను పర్యవేక్షించి, మతపరమైన ఆరాధనా స్థలంగా పున:స్థాపిడం. అప్పటి నుండి, బాద్షాహి మసీదు అథారిటీ పర్యవేక్షణలో కొద్దికొద్దిగా మరమ్మతులు జరిగాయి. ఈ భవనాన్ని అప్పటి భారత వైస్రాయ్ అయిన జాన్ లారెన్స్ అధికారికంగా ముస్లిం సమాజానికి అప్పగించారు. [19] ఆపైన భవనాన్ని మసీదుగా పున:స్థాపించారు.

ఏప్రిల్ 1919లో, జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా 25 వేల నుంచి 35 వేల దాకా సిక్ఖు, ముస్లిం, హిందూ నిరసనకారుల గుంపు మసీదు ప్రాంగణంలో గుమిగూడింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో గాంధీ పంపిన ప్రసంగాన్ని ఖలీఫా షుజా-ఉద్-దిన్ చదివాడు.[20] [21]

సికందర్ హయత్ ఖాన్ ఈ మసీదుకు అవసరమైన మరమ్మతుల కోసం నిధులు పోగుచేయడంతో, వాటిని వినియోగించి 1939 నుంచి మరమ్మతు పనులు మరింత విస్తృతంగా చేయసాగారు.[22] ఈ పునర్నిర్మాణాన్ని ఆర్కిటెక్ట్ నవాబ్ ఆలం యార్ జంగ్ బహదూర్ పర్యవేక్షించాడు.[23] మసీదును పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేయించి దాని పునర్వైభవానికి పాటుబడ్డ హయాత్ ఖాన్‌ మరణానంతరం అతని భౌతిక కాయాన్ని ఆ గౌరవంతో మసీదు సమీపంలోని హజూరీ బాగ్‌లో సమాధి చేశారు.

పాకిస్తాన్ ఏర్పాటు అనంతరం

[మార్చు]
రంజాన్ మాసంలో ఈ మసీదును ఎక్కువగా వాడతారు.

పాకిస్తాన్ ఏర్పాటు తరువాత 1939లో ప్రారంభమైన మసీదు పునరుద్ధరణ పనులు కొనసాగాయి. మొత్తం రూ.48 కోట్ల వ్యయంతో 1960లో ఈ పనులు పూర్తయ్యాయి. [23]

1974 ఫిబ్రవరి 22న లాహోర్‌లో జరిగిన 2వ ఇస్లామిక్ సమ్మేళనం సందర్భంగా, ముస్లిం దేశాల అధిపతులు బాద్షాహి మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేశారు. పాకిస్తాన్‌కు చెందిన జుల్ఫికర్ అలీ భుట్టో , సౌదీ అరేబియాకు చెందిన ఫైసల్, ముయమ్మర్ గడాఫీ, యాసర్ అరాఫత్, కువైట్‌కు చెందిన సబా III అల్-సలీమ్ అల్-సబా, తదితరులు ప్రార్థనలు చేసినవారిలో ఉన్నారు. ప్రార్థనలకు అప్పటి మసీదు మౌలానా అబ్దుల్ ఖాదిర్ ఆజాద్, ఆయన వెంట మసీదు ఖతీబ్ నాయకత్వం వహించారు. [24]

1993లో, బాద్షాహీ మసీదు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం హోదాకు తాత్కాలిక జాబితాలో చేరింది.[25] 2000లో ప్రధాన ప్రార్థన మందిరంలో పాలరాతి ప్రాంతాన్ని మరమ్మతులు చేశారు. 2008లో మసీదుకున్న పెద్ద ప్రాంగణంలో ఎర్ర ఇసుకరాయి పలకలను మార్చే పనులు ప్రారంభించారు. భారత దేశంలోని రాజస్థాన్‌లో జైపూర్ సమీపంలో వందల ఏళ్ళ క్రితం ముఘలులు ఎక్కడ నుండి తెచ్చి ఆ ప్రాంగణంలో మొదట ఏర్పాటుచేశారో, అక్కడి నుంచే ఎర్ర ఇసుకరాయిని ఉపయోగించి పనులు చేశారు.[26][27]

చిత్రమాలిక

[మార్చు]

మరిన్ని ఆకరాలు

[మార్చు]
  • అషర్, కేథరీన్ బి., ఆర్కిటెక్చర్ ఆఫ్ మొఘల్ ఇండియా: ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా కేంబ్రిడ్జ్: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1992.
  • చుగ్తాయ్, ఎం.ఏ, బాద్షాహి మసీదు, లాహోర్: లాహోర్, 1972.
  • గ్యాస్కోయిగిన్, బాంబర్, ది గ్రేట్ మొఘల్స్, న్యూయార్క్: హార్పర్ & రో, 1971.
  • కోచ్, ఎబ్బా, మొఘల్ ఆర్కిటెక్చర్, మ్యూనిచ్: ప్రెస్టెల్-వెర్లాగ్, 1992.

మూలాలు

[మార్చు]
  1. "Lahore's iconic mosque stood witness to two historic moments where tolerance gave way to brutality".
  2. "Badshahi Mosque". Ualberta.ca. Archived from the original on 3 డిసెంబరు 2014. Retrieved 2 January 2014.
  3. "Holiday tourism: Hundreds throng Lahore Fort, Badshahi Masjid - The Express Tribune" (in అమెరికన్ ఇంగ్లీష్). 9 October 2014. Retrieved 10 September 2016.
  4. 4.0 4.1 4.2 Meri, Joseph (31 October 2005). Medieval Islamic Civilization: An Encyclopedia. Routledge. p. 91.
  5. Waheed ud Din, p.14
  6. Waheed Ud Din, p.15
  7. IH Malik Sikandar Hayat Khan: A Biography Islamabad: NIHCR, 1984. p 127
  8. "Badshahi Mosque, Lahore". Archived from the original on 28 ఆగస్టు 2016. Retrieved 24 August 2016.
  9. Meri, p.91
  10. "Welcome to the Sikh Encyclopedia". Thesikhencyclopedia.com. 14 ఏప్రిల్ 2012. Archived from the original on 30 డిసెంబరు 2013. Retrieved 2 జనవరి 2014.
  11. Sidhwa, Bapsi (1 January 2005). "City of Sin and Splendour: Writings on Lahore". Penguin Books India. Retrieved 10 December 2016 – via Google Books.
  12. Tikekar, p. 74
  13. Khullar, K. K. (1980). Maharaja Ranjit Singh. Hem Publishers. p. 7. Retrieved 12 July 2010.
  14. Marshall, Sir John Hubert (1906). Archaeological Survey of India. Office of the Superintendent of Government Printing.
  15. "De La Roche, Henri Francois Stanislaus". allaboutsikhs.com. Archived from the original on 27 December 2010. Retrieved 10 January 2014.
  16. "De La Roche, Henri Francois Stanislaus". allaboutsikhs.com. Archived from the original on 27 December 2010. Retrieved 10 January 2014.
  17. Grey, C. (1993). European Adventures of Northern India. Asian Educational Services. pp. 343–. ISBN 978-81-206-0853-5.
  18. Development of mosque Architecture in Pakistan by Ahmad Nabi Khan, p.114
  19. "Political and Military Situation from 1839 to 1857". Archived from the original on 10 సెప్టెంబరు 2017. Retrieved 31 డిసెంబరు 2019.
  20. Lloyd, Nick (30 September 2011). The Amritsar Massacre: The Untold Story of One Fateful Day. I.B.Tauris.
  21. Note: Reports on the Punjab Disturbances April 1919 gives a figure of 25,000
  22. Omer Tarin, Sir Sikandar Hyat Khan and the Renovation of the Badshahi Mosque, Lahore: An Historical Survey, in Pakistan Historical Digest Vol 2, No 4, Lahore, 1995, pp. 21-29
  23. 23.0 23.1 "Badshahi Mosque (built 1672–74)". Retrieved 2013-05-16.
  24. "Report on Islamic Summit, 1974 Pakistan, Lahore, February 22–24, 1974", Islamabad: Department of Films and Publications, Ministry of Information and Broadcasting, Auqaf and Haj, Government of Pakistan, 1974 (p. 332)
  25. UNESCO World Heritage Centre. "Badshahi Mosque, Lahore – UNESCO World Heritage Centre". Whc.unesco.org. Retrieved 2014-01-02.
  26. "Badshahi Mosque Re-flooring". Archpresspk.com. Archived from the original on 2012-04-01. Retrieved 2014-01-02.
  27. "Badshahi Mosque". Retrieved 2013-05-16.

నోట్స్

[మార్చు]

బాహ్య లింకులు

[మార్చు]